యోగపరంపర
ఆత్మ పరిణామక్రమంలో భాగంగా ఒకానొక పూర్ణాత్మ నుంచి అంశాత్మ శకలాలు గా విడివడిన మనం .. ఈ భూమి మీద అనేకానేక జీవరాసులుగా రకరకాల జన్మలు తీసుకుంటూంటాం. ఈ క్రమంలో రకరకాల అనుభవాలను గడిస్తూ .. చిట్టచివరిదశగా ” ఉత్కృష్టమైన మానవ జన్మ ” ను పొందుతాం.
అంశాత్మశకలాలుగా మనం రకరకాల చైతన్యస్థాయిలను అనుభవిస్తూ చేసే ఈ ప్రయాణంలో క్రిందిస్థాయి జన్మలు తీసుకున్నప్పుడు .. ” సామూహిక ఆత్మస్థితి ” లోనే ఆయా జన్మల యొక్క అనుభవాలను గడిస్తాం.
ఆ తరువాత ” వ్యక్తిగతమైన అనుభవాలు ” పొందడానికి ఉన్నతమైన మానవజన్మలోకి వస్తాం. అక్కడ మనకు ” మాట, ఆలోచన .. మనస్సు, భావన ” అన్న లక్షణాలు అలవడి .. వాటికి సంబంధించిన రకరకాల కర్మలను చేస్తూ .. కర్మసిద్ధాంతానికి అనుగుణంగా కర్మఫలితాలను పొందుతూ ఉంటాం ; అంటే సామూహిక ఆత్మస్థాయి లో లేని కర్మసిద్ధాంతం .. మనకు వ్యక్తిగత అనుభవాల కోసం తీసుకున్న మానవ జన్మనుంచే పనిచెయ్యడం మొదలవుతుంది.
అప్పటినుంచి ఇక కర్మసిద్ధాంతాన్ని అనుసరించి మన ఆత్మ రకరకాల మానవశరీరాల్లో జన్మలను తీసుకుంటూ వుంటుంది. ఈ క్రమంలో ఎంతెంతో అనుభవజ్ఞానాన్ని పొందుతూన్న ఆత్మ .. నిరంతర పరిణామదిశగా మరింత పరిణితిని సాధించి .. తాను కూడా ఇంకొక ” పూర్ణాత్మ ” గా రూపుదిద్దుకుంటుంది. దీనినే ” జన్మపరంపర ” అంటాం.
” బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ” అంటూ శ్రీకృష్ణులవారు కూడా ” జన్మ పరంపరలోని చివరి దశల్లోనే మనం జ్ఞానవంతులం అవుతూంటాం ” అని భగవద్గీత లో తెలియజేసారు.
” జన్మపరంపర ” లోని మొట్టమొదటి జన్మల్లో మనకు జ్ఞానం యొక్క అవసరం అంతగా ఉండదు ! చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటూన్నట్లు .. ఆ స్థితిలో మనం మన శరీరంతో ఆడుకుంటూ ఉంటాం ! కేవలం మన శరీరం కోసమే మనం జీవిస్తూ .. తినడం, త్రాగడం, పడుకోవడం, పెళ్ళిచేసుకోవడం, పిల్లల్ని కనడం .. మళ్ళీ వాళ్ళు చావకుండా వాళ్ళ కోసం పోరాటం .. ఇలాంటివన్నీ చేస్తూంటాం !
ఇలా ఆ స్థితిలో మనం కేవలం మన భౌతిక అస్తిత్వం కోసమే ఎన్నెన్నో జన్మలను తీసుకుంటూంటాం .. మరి ప్రతి ఒక్క భౌతిక జన్మ తర్వాత కూడా చనిపోతూ .. ” పురోగమన సిద్ధాంతం ” ప్రకారం మళ్ళీ మళ్ళీ అనేకానేక చోట్ల పుడుతూంటాం ! ఇదంతా కూడా మన ” జన్మపరంపర ” లోని ప్రారంభదశలో వున్న ” తమోగుణం ” తో కూడిన జన్మపరంపరలోని స్థితులు.
ఇలా వందో .. రెండువందలో జన్మలు తీసుకున్న తరువాత మనం ” నేను కేవలం ఇడ్లీ – సాంబారు తినడానికో, లేక కోళ్ళూ మేకలూ మరి రొయ్యలూ తినడానికో పుట్టలేదు ” అని తెలుసుకుంటాం !
అప్పటినుంచి ” నేను కూడా ప్రజల్లో గుర్తింపు పొందాలి ; నేను ఒక రారాజును కావాలి ; నేను అందరిలో ప్రప్రధముడిలాగా ఉండాలి .. మరి నా తరువాతే అందరూ వుండాలి ; అందరూ నా కాళ్ళకే మ్రొక్కాలి .. ప్రక్కవాళ్ళ కాళ్ళకు మ్రొక్కకూడదు ” అన్న ” అహంకార వాంఛలు ” మనలో మొదలవుతాయి.
ఆ వాంఛలకు తగినట్లు మనం అనేకానేక జన్మల్లో .. అనేకానేక శరీరాలు తీసుకుని ఇతరులపై ఆధిపత్యాన్ని పొందే పోరాటం చేస్తూ .. పుడుతూంటాం .. మళ్ళీ చస్తూంటాం ! ఇదంతా కూడా మన జన్మపరంపర లోని ” రజోగుణం ” తో కూడిన దశలు.
ఈ విధంగా తమోగుణ, రజోగుణ దశలతో కూడిన జన్మపరంపర లలో మన ఆత్మ .. తన ఇచ్ఛా – స్వేచ్ఛల ఆధారంగా కొన్ని వందల జన్మలు తీసుకుంటూ .. ఎన్నో బాధలూ, కష్టాలూ అనుభవించిన తరువాత .. ” సత్వగుణం ” లోకి ప్రవేశిస్తుంది.
అలా సత్వగుణ దశలోకి ప్రవేశించిన మన ఆత్మ ” అసలు నేనెవరు ” .. ” ఇలా ఈ బాధలను మళ్ళీ మళ్ళీ ఎందుకు అనుభవిస్తున్నాను ?” .. ” ఇక ఈ బాధలు అనుభవించకూడదు అంటే నేను ఏం చేయ్యాలి ? ” అన్న ఆత్మసత్య పరిశోధన కు అంకురార్పణ చేసుకుంటుంది.
ఇలాంటి ” సత్వగుణ స్థితి ” లోనే మన ఆత్మకు జ్ఞానం యొక్క అవసరం వుంటుంది .. మరి మన ” యోగపరంపర ” అక్కడి నుంచే మొదలవుతుంది.
” యోగపరంపర “
యోగపరంపర లో .. ” భక్తియోగం “, ” కర్మయోగం “, ” ధ్యానయోగం ” మరి ” జ్ఞానయోగం ” అన్న నాలుగు దశలు వుంటాయి.
” భక్తియోగం ” అంటే అందరూ చెప్పుకునేట్లు గుళ్ళూ గోపురాలూ తిరుగుతూ టెంకాయలు కొట్టి దేవుడి ముందు కోరికల చిట్టాలు విప్పడం కాదు, ” స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ” అని శాస్త్రంలో సుస్పష్టంగా చెప్పబడినట్లు ” భక్తి ” అంటే ” మన స్వస్వరూపం ఏమిటో ముందుగా తెలుసుకుని .. దానితో ఏకమై ఉండటం “.
మనం అలా భక్తితో కూడుకుని మన స్వస్వరూపంతో ఏకమయ్యాక .. యోగపరంపరలోని ” కర్మయోగం “, ” ధ్యానయోగం ” మరి ” జ్ఞానయోగం ” అన్న దశల్లోకి క్రమక్రమంగా ప్రవేశిస్తూ ఆ యా దశల్లోని సంపూర్ణజ్ఞానాన్ని పొందుతూ ఆత్మ పరిణితి దిశగా సాగిపోతూంటాం.
ఈ పరిణామక్రమంలో మనం .. ” కర్మయోగంలోని మొదటిదశ ” లో కొన్ని జన్మలు .. తరువాత ” జ్ఞానయోగంలోని మొదటిదశ ” లో కొన్నిజన్మలు .. ఆ తరువాత ” ధ్యానయోగం ” లో కొన్ని జన్మలను తీసుకుంటూ .. ఎంతెంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతూంటాం.
ఆత్మశకలాలుగా మనం అలా పొందిన అనుభవజ్ఞానం తో కొంతవరకు పరణితి చెందిన ఆత్మగా మారి .. ” జ్ఞానయోగం లోని రెండవ దశ ” లో ఆ తరువాత ” కర్మయోగంలోని రెండవ దశ ” లో మన చిట్టచివరి జన్మలను తీసుకుంటాం. ఇక్కడితో మన ఆత్మ శకలం యొక్క జన్మపరంపర పూర్తిఅయిపోయి .. తానుకూడా అనుభవజ్ఞానంతో పండిపోయిన మరొక ” పరిపూర్ణ పూర్ణాత్మ ” గా వికసిస్తుంది. ఆ ” శిఖరాగ్ర స్థితి ” కి ప్రతి ఒక్కరూ చేరుకోవాలంటే .. వారు ” యోగపరంపర ” అనే మెట్లను తప్పక ఎక్కాల్సి వుంటుంది.
“కర్మయోగం -1”
” యోగపరంపర ” లోని కర్మయోగం – 1 లో A, B, C ,D, అనే నాలుగు స్థితులు వున్నాయి :
A స్థితి లో : ” మనం ఎవ్వరికీ మంచి చేయకపోయినా ఫరవాలేదు కానీ చెడు మాత్రం చేయవద్దు ; ఏ ప్రాణినీ హింసించవద్దు, ఎవ్వరితోనూ ద్వేషభావంతో ఉండవద్దు ” అని తెలుసుకునే అభ్యాసంతో మనకు కొన్ని జన్మలు గడిచిపోతాయి.
B స్థితిలో : ” ప్రక్కవాడికి కూడా మంచి చెయ్యడానికి పూనుకోవాలి .. మరి అలా చేస్తే నాకు కూడా మంచే జరుగుతుంది. మనం ఇతరులకు ఎంత మంచి చేస్తే .. మనకు అంతకంటే రెట్టింపు మంచి జరుగుతుంది. కాబట్టి అందరికీ అన్నదానం చేద్దాం, వస్త్రదానం చేద్దాం .. సంఘం గురించి మనం ఆలోచిస్తే మన గురించి సంఘం కూడా ఆలోచిస్తుంది .. ఇక అప్పుడు మనం ఇంకా బాగా జీవించవచ్చు ” .. అని తెలుసుకునే అభ్యాసంతో మరి కొన్ని జన్మలు గడిచిపోతాయి.
C స్థితిలో : ” ఫలితాన్ని ఆశించకుండా మంచి కర్మలు చేస్తూ, చేస్తూ వుంటే .. ‘ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ’ అని భగవద్గీతలో శ్రీ కృష్ణులవారు చెప్పినట్లు .. కర్మఫలితాలు వాటంతట అవే వచ్చి చేరుతూంటాయి ” అని తెలుసుకునే అభ్యాసంతో మనసా వాచా కర్మణా శుభకర్మలు చేస్తూ ఇంకా కొన్ని జన్మలు గడిచిపోతాయి.
D స్థితి లో : ” కర్మఫలత్యాగమే కాదు .. అసలు ‘ నేను ’ అన్న కర్తృత్వపు భావన కూడా లేకుండా స్వీయ అవగాహనా మేరకు శుభకర్మలను నిరంతరం చేస్తూ ఉండడమే ఉత్తమమైన స్థితి ” అని అవగాహన చేసుకుని .. ఇక నిమిత్తమాత్రంగా కర్మలు చేస్తూ మరిన్ని జన్మలు గడిచిపోతాయి.
” జ్ఞానయోగం -1 “
ఇలా ” కర్మయోగం మొదటిభాగం ” లోని నాలుగు స్థితిలో మనం అనేకానేక ఆత్మ అనుభవాలను పొందిన తరువాత ” జ్ఞానయోగం – మొదటిదశ ” కు చేరుకుంటాం.
ఇక్కడ ” మనం కేవలం మానవశరీర ధారులమేకాదు .. ఆత్మస్వరూపులం కూడా ! ఈ సృష్టిలో మన భౌతికపరమైన కంటికి కనిపించే కేవలం కొన్ని దృశ్యాలు మాత్రమే కాకుండా ఇంకా మనకు గ్రాహ్యమైన విజ్ఞానానికీ మరి మనకు తెలిసిన విజ్ఞానశాస్త్రానికీ అంతుబట్టని అనేకానేక ఇతర దృశ్యాలూ మరి లోకాలు కూడా వున్నాయి ” అని తెలుసుకుంటాం.
ఇక్కడే మనం .. ప్రవచనాలను వినడం, ” బైబిల్ యొక్క, భగవద్గీత యొక్క సారాంశాలను తెలుసుకోవడం ” లాంటి ప్రక్రియలను మొదలుపెడతాం. ఇదంతా కూడా జ్ఞానయోగం లోని మొదటి దశ మరి ఇందులో కూడా A, B, C ,D, అని నాలుగు స్థితులు వుంటాయి.
A – శ్రవణం -1 .. B – మననం -1
C – నిధిధ్యాసన -1 .. D – ఆత్మసాక్షాత్కారం -1
A – శ్రవణం -1 : ఈ స్థితిలో మనం ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేకానేక విషయాలను శ్రద్ధగా వింటాం. ఎక్కడో జరిగే జీసస్ క్రైస్ట్ సువార్తలనూ, మరెక్కడో జరిగే గీతాజ్ఞాన యజ్ఞాలలో చెప్పే ప్రవచనాలనూ లేదా పిరమిడ్ సామూహిక ధ్యానశిక్షణా శిబిరాల్లో చెప్పే విషయాలనూ శ్రద్ధగా వింటూంటాం. అంతకు ముందు జన్మల్లో మన మనస్సుకు పట్టని ఒకానొక ” జ్ఞాన పిపాస ” అప్పుడు మొదలై .. ” మనం క్రొత్త విషయాలను వినాలి ” అనిపిస్తూంటుంది. అలా కొన్ని జన్మలను మనం కేవలం వింటూనే గడిపేస్తాం.
B – మననం -1 : ఇక అక్కడి నుంచి విన్నదంతా ” మననం ” చేసుకోవడం మొదలుపెడతాం : ” నిజమే ! దేవుని రాజ్యం మనలోనే ఉందని జీసస్ క్రైస్ట్ .. చెప్పాడు కదా ! మరి ఆ దేవుని రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశించాలి ? ” అంటూ పదే పదే మననం చేసుకుంటూ అలా ప్రవేశించే దారి కోసం ఎన్నెన్నో జన్మలు రకరకాల ప్రయత్నాలు చేస్తాం.
” తే త్వం భూంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి : .. అంటూ ” విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తరువాత కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తూంటావు ” అని శ్రీకృష్ణపరమాత్ములవారు భగవద్గీత లో అర్జునుడికి వివరించారు. అది విని మనం కూడా .. ” ఓహో ! అయితే నేను స్వర్గలోకాలకు వెళ్ళి కూడా అర్జునుడిలాగే మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తూన్నానా ? మరి దీనికి ఏమిటి కారణం ? ” అని మననం చేసుకుంటూ ఉంటాం. అలా కొన్ని జన్మలు గడిపేస్తాం.
C – నిధిధ్యాసన -1 : ఆ తరువాత ” నా భౌతిక శరీరం ఇక్కడే ఈ భౌతికతలం మీదే నశించిపోయినా నేను మాత్రం శాశ్వతమైన ఆత్మ రూపంలో వుంటూ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్తూనే వుంటాను ” అన్న సత్యాన్ని తెలుసుకుని ఇక ఆత్మపరంగా జీవించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాం.
” రేపో, ఎల్లుండో నేను చనిపోయి వేరే లోకాలకు వెళ్ళిపోయినా సరే .. అక్కడ కూడా నేను హాయిగా బ్రతుకుతాను. అక్కడ వున్న జీసస్ క్రైస్ట్, శ్రీకృష్ణుడు, అల్లా, రాముడు వంటి ఉన్నత ఆత్మలతో కలిసి నేను ఆనందంగా వుంటాను ” అన్న ” నిధిధ్యాసన ” తో కొన్ని జన్మలను గడిపేస్తాము.
D – ఆత్మసాక్షాత్కారం -1 : నిధిధ్యాసన -1 తో కూడి ఆత్మపరంగా జీవిస్తూ .. నిజ జీవితంలో జరిగే ప్రతిఒక్క సంఘటన పట్ల ఒక సాక్షి లా ఉండటమే .. ” ఆత్మ సాక్షాత్కారం -1 “. పుట్టే వాళ్ళు పుడుతూంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతూంటారు ; పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతూంటాయి, విడిపోయేవాళ్ళు విడిపోతూంటారు ; మరి బాధపడేవాళ్ళు బాధపడుతూంటారు, ఆనందించే వాళ్ళు ఆనందిస్తూంటారు .. కానీ మనం మాత్రం ” కేవలం ఒక సాక్షి ” లా వాటన్నింటినీ గమనిస్తూ .. జీసస్, శ్రీకృష్ణుడు మరి శ్రీరాముడి యొక్క జ్ఞానంతో జీవిస్తూంటాం.
కలిమిలేముల్లో, జయాపజయాల్లో, చీకటి వెలుగుల్లో .. ఇలా ప్రతిఒక్క విషయంలో కూడా మనం ఆత్మ యొక్క సాక్షీతత్వంతో ఉండగలగడమే .. ” ఆత్మసాక్షాత్కారం – 1 “.
విశ్వవిఖ్యాత సాహితీవేత్త విలియమ్ షేక్స్‌స్పియర్ .. ” All the world is a stage ; we are all mere actors ; we strut and fume ; we do our part and depart ” అని సెలవిచ్చినట్లు .. మనం కూడా ” ఓహో ! నేను ‘ భర్త ’ గా వున్నాను కనుక అలా నటించాలి .. నేను ‘ భార్య ’ గా ఉన్నాను కనుక భార్యపాత్రను పోషించాలి .. అంతేకానీ నేను నిజమైన భర్తను కానీ నిజమైన భార్యను కానీ కాను ” అన్న సత్యాన్ని తెలుసుకుని ఆ విధమైన నాటకీయ భావనతో జీవిస్తాం.
” భజగోవిందం ” అన్న చిన్ని కావ్యంలో శ్రీ ఆదిశంకరా చార్యుల వారు కూడా .. ” కస్త్యం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ సర్వం అసారం విశ్వం త్యక్త్వా స్వప్నవిచారం ” .. ” అయ్యా ఎవరు నువ్వు ? ఎవరు నేను ? ఎవరు తల్లి ? ఎవరు తండ్రి ? ఇదంతా కూడా ఒక ‘ కల ’ కాబట్టి కలను కలలాగే ఆస్వాదించు ” అంటూ సూటిగా తెలియజేసారు.
ఇంత గొప్ప ఆత్మాసాక్షాత్కార స్థితి అన్నది ” జ్ఞానయోగం యొక్క మొదటి భాగానికి ” పరాకాష్ట .. మరి ఇలాంటి సాక్షీతత్వం తో కూడిన ఆత్మజ్ఞానంతో మనం కొన్ని జన్మలను తీసుకుంటాం. అక్కడి నుంచి మనం ” ధ్యానయోగం ” లోకి ప్రవేశిస్తాం.
అయితే ఇక్కడ మనం తెలుసుకొవాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే .. ప్రతి ఒక్కదశలోని వివిధ స్థితుల్లో కూడా మన ఆత్మ తన ” స్వ – ఇచ్ఛ ” ప్రకారం మరి తన శక్తియుక్తుల ప్రకారం కొన్ని వందల జన్మలు తీసుకోవచ్చు .. లేదా కొన్ని మౌలికమైన జన్మల్లోనే అన్ని స్థితులనూ దాటగాలగవచ్చు ..
“ధ్యానయోగం”
ఇలా అనేకానేక జన్మలు అయిపోయిన తరువాత మనం యోగపరంపరలోని ” ధ్యానయోగం ” లోకి ప్రవేశిస్తాం.
” ఇన్ని జన్మలుగా నేను ఎన్నెన్నో ఆత్మసత్యాలను విన్నాను, మననం చేసుకున్నాను, నిధిధ్యాసన చేసాను మరి ఆత్మ సాక్షాత్కారం గురించి అవగాహన కూడా పొందాను. ఇక ఇప్పుడు క్షణమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేను విన్న కృష్ణుడు, జీసస్, రాముడు, బుద్ధుడు, మహావీరుడు వంటి గొప్ప గొప్ప మాస్టర్లను ప్రత్యక్షంగా మరి అనుభవపూర్వకంగా కలవాలి ” అన్న విశిష్ట తపన మనలో మొదలవుతుంది
కఠోపనిషత్తు లో .. ” చనిపోయిన తరువాత అసలు మనషి ఏమవుతాడో నేను స్వయంగా తెలుసుకోవాలి ” అని కేవలం పదకొండేళ్ళ బాలుడైన ” నచికేతుడు ” పట్టుపట్టినట్లు .. మనలో కూడా ఒక మహాపట్టుదల మొదలవుతుంది .. మరి అందుకు అనువైన మార్గాలను మనం వెతకడం మొదలుపెడతాం. అక్కడే ” ధ్యానయోగం ” అన్నది మనకు ఒక చక్కటి రాజమార్గాన్ని చూపిస్తుంది.
కర్మయోగం కంటే, జ్ఞానయోగం కంటే కూడా ” ధ్యానయోగం ” ఎంతో ఉన్నతమైంది కనుకనే దానిని మనం ” రాజయోగం ” అంటే ” King of the Yogas ” అంటాం ! ఒక్కసారి గనుక ఈ ఉత్కృష్టమైన సాధనా మార్గం మనకు దొరికిందా .. ఇక మనం .. ” మహారాజరహదారి ” మీద మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టేసినట్లే !
ఇక్కడ నుంచి మనం కేవలం ఆత్మ ప్రవచనాలను మాత్రమే వింటూ కూర్చోకుండా .. రెండు కళ్ళూ మూసేసుకుని ” శ్వాస మిద ధ్యాస ” ఉంచుతూ .. ” ధ్యానయోగం ” లోకి ప్రవేశిస్తాం.
” దేవుని రాజ్యం లోపలేవుంది కాబట్టి .. నీ లోపలికి నువ్వు తక్షణం వెళ్ళు ” అన్నారు జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రతిరోజూ ఎవరి వయస్సు ఎంత వుంటుందో .. అంతసేపు మన ఆత్మను బయటి ప్రపంచంలో ఉన్న ప్రాపంచిక విషయాల నుంచి మళ్ళించి .. దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టాలి .. అక్కడ ఉన్న విశ్వశక్తిప్రవాహం లో మునిగితేలాలి.
నోరు మూసేసుకుని .. కళ్ళుమూసేసుకుని .. చేతులూ కాళ్ళూ కట్టేసుకుని .. మన ఇంట్లో మనం హాయిగా కూర్చుని మన దివ్యచక్షువును మనమే ఉత్తేజితం చేసుకుంటాం. అనేకానేక లోకాలలో వున్న బుద్ధుడు, జీసస్, కృష్ణుడు, రాముడు వంటి మహనీయులందరినీ దర్శించుకుంటాం ; విశ్వమయప్రాణశక్తి ద్వారా మన భౌతికశరీరం నుంచి బయటికి వచ్చి సూక్ష్మశరీరంతో విశ్వంలో వున్న ఇతర లోకాలన్నింటిలో తిరుగుతూ .. ఇంకా ఇంకా రకరకాల శరీరాలను గురించి తెలుసుకుంటాం.
భౌతిక శరీరానికి క్రమం తప్పకుండా స్నానం చేయించినట్లే .. ఆత్మను కూడా ” ధ్యానం ” అనే ” బాత్ రూమ్ ” లో కూర్చోబెట్టి ” కాస్మిక్ ఎనర్జీ ” అనే ” షవర్ బాత్ ” లో స్నానం చేయించాలి. ఆ విశ్వమయప్రాణశక్తితో నిండిన మన శరీరంలో ” దివ్యచక్షువు ” ఉత్తేజితం అవుతుంది. టిబెట్ మహాయోగి లోబ్‌సాంగ్ రాంపా గారు ఈ దివ్యచక్షువును గురించి ” Third Eye ” అనే గ్రంథంలో విస్తారంగా వివరించారు.
మనం పండితులమైనా, సామాన్యులమైనా .. పాపులమైనా, పరమ నికృష్టులమైనా .. మరి ఎలాంటి స్థితిలో వున్నా సరే .. తక్షణం ధ్యానయోగానికి ఉపక్రమించాల్సిందే ! ప్రాపంచిక జీవితంలో మనం బస్ కండక్టర్‌లమే కావచ్చు, MLA లు కావచ్చు, ప్రధాన మంత్రులు లేక దేశాధ్యక్షులు కావచ్చు మరి డాక్టర్లు లేదా యాక్టర్లు కావచ్చు .. కానీ ప్రతిరోజూ కనీసం ఒక గంటసేపైనా ధ్యాన సాధనలో జీవించకపోతే .. ఇలా ఆత్మ సత్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే .. మన జీవితం నిరర్ధకం అయిపోతుంది !
తిండీ నిద్రలు మానేసి .. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి .. గంటలు గంటలు వ్యాపారం చేసి డబ్బునూ ఆస్తిపాస్తులనూ ఎలా సంపాదిస్తామో .. అలాగే శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తే .. మనం ఒక్కొక్కటిగా ఆత్మసంపదలన్నీ కూడగట్టుకుంటూ ఋషులం అవుతాం.
ఇదంతా కూడా ” ధ్యానయోగం ” అనబడుతుంది .. మరి ఇందులో ABC అన్న మూడు స్థితులు ఉంటాయి.
A – శ్వాస మీద ధ్యాస .. B నాడీమండల శుద్ధి .. C- దివ్యచక్షువు ఆవిర్భావం
A – శ్వాస మీద ధ్యాస : ప్రతిరోజూ నియమిత వేళ ప్రకారం హాయిగా ఒకచోట స్థిరసుఖఆసనంలో కూర్చుని, కాళ్ళు రెండూ ‘ క్రాస్ ’ చేసుకుని, చేతులు రెండూ కలుపుకుని వ్రేళ్ళల్లో వ్రేళ్ళు వుంచుకుని, కళ్ళు రెండూ మూసివేసి, అతి సహజంగా జరుగుతోన్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకధారగా గమనించాలి. క్రింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు జారగిలబడి కూర్చోవచ్చు. ఏ మంత్ర జపం చేయవలసిన పనిలేదు .. మరి ఏ దేవతారూపాన్ని కానీ ఊహించుకోవలసిన అవసరం లేదు.
అలా మనకు సుఖంగా స్థిరంగా వున్న ఆసనంలో కూర్చుని .. సహజంగా జరుగుతోన్న మన శ్వాసను గమనిస్తూ, గమనిస్తూ ఉంటుంటే .. క్రమక్రమంగా మనం ఆలోచనా రహిత స్థితిలోకి చేరుకుంటాం.
B నాడీమండల శుద్ధి : ఆలోచనారహితమైన శూన్యమనోస్థితిలోకి మనం చేరుకున్న తరువాత .. విశ్వంలో నుంచి అపారమైన ప్రాణశక్తిప్రవాహం మనలోకి రావడాన్ని మనం గమనిస్తాం. అలా బ్రహ్మరంధ్రంగుండా మన శరీరంలోపలికి వస్తూన్న ప్రాణశక్తి .. నాడీమండలాన్ని శుద్ధిచేస్తూ నాడీమండలంలో నిక్షిప్తమైవున్న అనేకానేక జన్మలయొక్క కర్మలకు సంబంధించిన మచ్చలను కడిగివేస్తూ వుంటుంది.
ఆ స్థితిలో మనకు భరించరాని నొప్పులు కలుగవచ్చు. నొప్పులకు భయపడి మనం ధ్యానం మానేస్తే .. కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ” పురిటి నొప్పులు శుభసూచకం ” అనుకుంటేనే ” శిశూదయం ” జరిగినట్లు .. నాడీమండల శుద్ధి జరిగేటప్పుడు కలిగే నొప్పులను కూడా శుభసూచకం అనుకుని భరిస్తూ ఉంటే .. క్రమక్రమంగా ” దివ్యచక్షువు ” యొక్క మహా ఆవిర్భావం జరుగుతుంది.
C- దివ్యచక్షువు ఆవిర్భావం : ఈ స్థితిలో మనం మన దివ్యచక్షువు ద్వారా అనేకానేక లోకాలను చూడగలుగుతాం. లోయలు, జలపాతాలు, ప్రకృతి యొక్క అందమైన దృశ్యాలు మామూలు చర్మచక్షువులతో ఎన్నడూ చూడలేనంత సుస్పష్టంగా మన ఫాలభాగంలో చూడగలుగుతాం.
ఏ దివ్యచక్షువునైతే శ్రీకృష్ణుడు .. సంజయుడికి ప్రసాదించి కురుక్షేత్రంలో జరుగుతోన్న మహాభారత యుద్ధాన్ని .. ధృతరాష్ట్రుడికి ” రన్నింగ్ కామెంట్రీ ” ఇప్పించాడో .. ఏ దివ్యచక్షువు ద్వారా చూసి మహాకవి వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించాడో .. ఏ దివ్యచక్షువు ద్వారా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం తెలుసుకుని లోకానికి చాటాడో .. మరి ఏ దివ్యచక్షువు ద్వారా భగవాన్ గౌతమబుద్ధుడు తన గత జన్మలన్నీ చూసుకుని దివ్యజ్ఞానప్రకాశాన్ని పొందాడో .. అలాంటి దివ్యచక్షువుని మనమంతా కూడా .. హాయిగా మన ఇంట్లోనే కూర్చుని కొద్దిసేపు ధ్యానసాధన చేసి పొందగలం అన్నది పరమసత్యం. ఇదే విషయాన్ని భగవద్గీత లో ..
” బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున
తాన్యహం వేద స్సర్వాణి న త్వం వేత్ధ పరంతప || “
అంటూ శ్రీకృష్ణ పరమాత్ములవారు కూడా ” అర్జునా ! నువ్వూ, నేనూ ఎన్నో జన్మలు ఎత్తాం ; నాకు నా జన్మలతో పాటు నీ జన్మలు కూడా తెలుసు కానీ .. నీకు ఏమి తెలియదు ” అని చెప్పారు.
ధ్యానసాధన ద్వారానే శ్రీకృష్ణుడు తన దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని తన జన్మలతో పాటు అర్జునుడి జన్మలను కూడా చూసాడు. ప్రయత్నం చేస్తే అర్జునుడు కూడా తన జన్మలను చూసుకోవచ్చు .. మరి మనం కూడా మన జన్మలను భేషుగ్గా చూసుకోవచ్చు.
ఎప్పుడయితే మన దివ్యచక్షువు ఉత్తేజితం కావడం మొదలవుతుందో అప్పుడు మనం దివ్యదృష్టిని కూడా పొందుతూ .. సృష్టిరచనా విన్యాసాన్ని ఎంతో స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం .. భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా సినిమా రీళ్ళలాగ మన కళ్ళముందు చూస్తూ .. మనం ” Seer ” అంటే ” ఋషి “లా మారిపోతాం. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తమ కాలజ్ఞానాన్ని ఈ విధంగానే లోకానికి అందించారు.
ప్రతి ఒక్క మనిషి కూడా తప్పక ” ఋషి ” కావాల్సిందే ! మరి ఋషిగా పరిణామం చెందేంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే ! జీసస్ క్రైస్ట్ మహాఋషి అయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్టుడు బ్రహ్మర్షులు అయ్యారు. మనం కూడా ” మరి వాళ్ళను భజించుకుంటూ కూర్చోవాలా లేక వాళ్ళలాగా సాధనచెయ్యాలా ? ” అన్నది తేల్చుకోవాల్సింది మనమే ! మనల్ని ఋషులుగా మరెవ్వరూ మార్చలేరు కనుక మనకు మనంగా ధ్యానయోగ సాధన చేసి ఋషులుగా ఎదగాలి.
ఇలా ధ్యానసాధన ద్వారా మనం మొదట ” యోగి ” గా మారి .. దివ్యచక్షువు అనుభవాలను పొందడం ద్వారా ” ఋషి ” గా ఉన్నతీకరించడమే .. ధ్యానయోగం యొక్క పరాకాష్ట.
ఇలా కొన్ని జన్మలు గడిచాక మన దివ్యచక్షువు పరిపక్వ అయిపోయాక మనం ” జ్ఞానయోగం యొక్క రెండవ దశ ” లోకి ప్రవేశిస్తాం.
“జ్ఞానయోగం – 2”
జ్ఞానయోగం యొక్క రెండవ దశలో మనం జీసస్ క్రైస్ట్‌ని ప్రత్యక్షంగా కలుసుకుంటాం, గౌతమబుద్ధుడిని ప్రత్యక్షంగా కలుసుకుంటాం, వర్ధమాన మహావీరుడిని కూడా కలుసుకుంటాం. అక్కడ మళ్ళీ ” శ్రవణం -2 ” లోకి ప్రవేశించి ఆయా మాస్టర్లు చెప్పేవి శ్రద్ధగా వింటాం. జ్ఞానయోగం యొక్క మొదటి దశలో మనం ప్రాపంచిక గురువులు దేవుళ్ళ గురించి చెప్పే జ్ఞానాన్ని వింటే .. జ్ఞానయోగం యొక్క రెండవదశలో మనం సాక్షాత్తు ఆ ” దేవుళ్ళనే ” కలిసి ప్రత్యక్షంగా వాళ్ళ ముఖతః సందేశాలను అందుకుంటాం.
ఆ తరువాత ” మననం – 2 ” లో ప్రవేశించి ఆ సందేశాలను మననం చేసుకుంటూ ” ఓహో ! జీసస్ నిన్న ధ్యానంలో నాకు ప్రత్యక్షంగా కనపడి నన్ను ధ్యానప్రచారం చెయ్యమని చెప్పాడు కదా ! గౌతమబుద్ధుడు .. నాతో మాట్లాడుతూ ‘ మధ్యేమార్గం లో సరియైన విధంగా జీవించు ’ అన్నాడు కదా ! మరి నేను ఆ పనులు చెయ్యాలి కదా ” అని మననం చేసుకుంటూ ఉంటాం.
ఆ తరువాత ” నిధిధ్యాసన -2 ” లో గొప్ప గొప్ప మాస్టర్ల ద్వారా తెలుసుకున్న సత్యాలను ధైర్యంగా మన జీవితంలో ఆచరింపజేయడానికి పునుకుంటాం.
జీసస్ క్రైస్ట్ ఒకసారి సముద్రం ఒడ్డున వెళుతూ వుంటే .. సముద్రంలో చేపలు పడుతూన్న బెస్తవాడొకడు కనిపించాడు. జీసస్ అతని దగ్గరికి వెళ్ళి ” ఏం చేస్తున్నావ్ ? ” అని అడిగాడు. ” చేపలు పడుతున్నాను ” అన్నడు ఆ బెస్తవాడు.
” ఓహో ! చేపలు పడుతున్నావా ? నేను నీకు మనుష్యులను పట్టే విద్యను నేర్పిస్తాను .. నాతో పాటు వస్తావా ? ” అడిగాడు జీసస్.
ఆ బెస్తవాడు క్షణం కూడా ఆలోచించకుండా .. ” అలాగాండి ? ! మరి వచ్చేస్తాను !! ” అంటూ చేపలు పట్టడం తక్షణం మానేసి .. జీసస్ క్రైస్ట్ వెంట వెళ్ళిపోయాడు .. మరి కాలక్రమంలో అతని ముఖ్యశిష్యుడు సెయింట్ పీటర్ గా మారి చరితార్ధుడయ్యాడు. అలా బెస్తవాడిలా చేసే ధైర్యం మనకు కూడా ఉండటమే .. నిధిధ్యాసన.
ఏ గౌతమబుద్ధుడో మనకు ధ్యానంలో కనపడి ” అందరికీ ధ్యానం గురించి నేర్పించు ” అన్నప్పుడు మనం కూడా ఇంకేం ఆలోచించకుండా ఆ పని చేస్తూనే వుండాలి.
ఇలా మనం కొన్ని జన్మలు ” నిధిధ్యాసన -2 ” లో వున్న తరువాత .. ” ఆత్మసాక్షాత్కారం – 2 ” అన్న యదార్ధ స్థితికి చేరుకుంటాం. ఉన్నతలోకాలకు చెందిన గొప్ప గొప్ప మాస్టర్లు ఇచ్చే ప్రత్యక్షజ్ఞానంతో కర్మలు చేస్తూ సాక్షీతత్వానికి పరాకాష్టగా నిలుస్తూ .. సంపూర్ణ బంధరాహిత్య స్థితిలో ఈ భూగ్రహం పై కేవలం ” దేహయాత్ర ” లే కాకుండా ఆత్మయాత్రలను కూడా చేస్తూంటాం. జ్ఞానయోగం యొక్క రెండవ దశలో ఇది పరాకాష్ట. మరి ఇక్కడి నుంచి మనం ” కర్మయోగం -2 ” లోకి ప్రవేశిస్తాం.
మనం ధ్యానం చేస్తోంటే అది చూసేవాళ్ళు ” ధ్యానం అంటే ఏమీ తెలియని వాళ్ళకు ” కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడమే ” అనుకుంటారు కానీ .. లోపల జరిగే మహా అద్భుతాలు వాళ్ళకు ఎంతమాత్రం తెలియదు.
“కర్మయోగం -2”
కర్మయోగం మొదటిదశలో మనం నలుగురికీ ఉపయోగపడే చెట్లునాటడం, రోడ్లువేయడం, న్యాయం కోసం పోరాడటం, అన్నదానాలు చేయడం వంటి ప్రాపంచిక లోకానికి పనికి వచ్చే కర్మలను మాత్రమే చేస్తే .. కర్మయోగం రెండవ దశ లో మనం ఈ లోకంతో పాటు అనేకానేక ఇతర లోకాలకు కూడా మంచి జరిగే ” ధ్యానదానం ” వంటి ఉన్నతోన్నతమైన పనులు చేస్తాం.
గౌతమబుద్ధుడు తన జ్ఞానయోగం యొక్క రెండవ దశ ను పూర్తి చేసుకుని దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందిన వెంటనే చెసిన పని ” ధ్యాన దానమే ” .. ఆయన తన దివ్యచక్షువు ద్వారా తన గురువులు మరి తన స్నేహితులు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాక అందులో కొందరు గురువులు కాలం చేసేసారని గుర్తించి ” ఇక మిగిలి వున్న వాళ్ళకు నేను తెలుసుకున్న ధ్యానం తక్షణం నేర్పించాలి ” అని తన స్నేహితులను వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకు ధ్యానవిద్యను అందించాడు.
కర్మల్లోకెల్లా అత్యున్నతమైన కర్మ .. ఇలా ” ధ్యానదానం ” ద్వారా ఇతరుల ఆత్మలను జాగృతం చేయడమే ; ఈ లోకంలోనే కాదు ఈ సృష్టిలో వున్న అనేకానేక ఇతర లోకాల్లో కూడా ధ్యానప్రచారాన్ని మించిన కర్మ ఇంకొకటి లేదు ! ఈ కర్మను చేపట్టిన వాడు తన జన్మపరంపరలోని ఆఖరి జన్మల్లో ఉన్నవాడు మరి అతనికి ఇక మరుజన్మ అన్నది వుండనే ఉండదు.
అతడు ఇక ఈ భూలోకానికి మళ్ళీ తిరిగిరావల్సిన అవసరం ఉండదు కనుక అతడు ” పూర్ణాత్మ స్వరూపం ” గా ఉన్నతలోకాల్లో వెలుగుతూ సదా ముక్త స్థితిలో వుంటాడు. అందుకే జీసస్ క్రైస్ట్ ” He will not come again ” అని చెప్పారు. ఒక గౌతమబుద్ధుని లాగానో జీసస్ క్రైస్ట్‌లాగానో, ఒక శ్రీకృష్ణునిలాగానో మరి ఒక వర్ధమాన మహావీరుని లాగానో ప్రతిక్షణం ఆనందంగా ముక్తస్థితిలో జీవించగలిగితేనే గానీ మన ప్రస్తుత జన్మ ఇక చిట్టచివరి జన్మ కాజాలదు.
అన్నదానం, గోదానం, భూదానం వంటి అనేకానేక దానాలు చేసే ” ప్రాపంచిక మంచిపనులు ” చెయ్యడం నుంచి .. సంపూర్ణ ఆత్మసాక్షాత్కార స్థితిలో ఉంటూ ” నువ్వు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకో “, ” నువ్వు జీవుడు కాదు దేవుడు అని తెలుసుకో ” అని అందరికీ చెబుతూ ప్రతి ఒక్కరికీ ధ్యానం నేర్పిస్తూ .. వారిని ధ్యానంలో కూర్చోబెట్టే ” ఆధ్యాత్మిక మంచి పనులు ” చేయగలిగే ” ధ్యానప్రచారకర్మ ” చేయడం వరకు మన జన్మపరంపర మరి యోగపరంపర కొనసాగుతూనే ఉంటుంది.
” ధ్యానప్రచార కర్మ ” అనే ఈ అత్యుత్తమమైన చివరి దశే .. ప్రాపంచిక లోకంతో పాటు ఆధ్యాత్మిక లోకాలన్నింటిలో కూడా మనల్ని తరింపచేసే అత్యుత్తమమైన కర్మ.
ఈ భూమి మీద మనకు ఏది ఎంపిక చేసుకోవడానికైనా సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. భగవద్గీత లో ” ఉద్ధరేదాత్మ నాత్మానం ” అని జగద్గురువు శ్రీ కృష్ణులవారు చెప్పినట్లు కానీ .. ” అప్పో దీపో భవ ” అని గౌతమబుద్ధుడు తన చిట్టచివరి సందేశం ఇచ్చినట్లు కానీ .. ఇక్కడ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి .. మరి ఎవరి హోమ్‌వర్కు వాళ్ళే చేసుకోవాలి ; దీనికి ఒక్కొక్కరికి ఎన్ని జన్మలైనా పట్టవచ్చు లేదా తమ ఆత్మశక్తిని అనుసరించి కొన్ని జన్మల్లోనే అనేక స్థితులను కూడా దాటవచ్చు.
పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ” యోగపరంపర ” లోని దశలన్నింటినీ గత అనేక జన్మలుగా దాటేసి .. నిరంతరం ధ్యానప్రచారం చేస్తూ .. ప్రస్తుతం ” కర్మయోగం యొక్క రెండవదశ ” అనే చివరి ఉత్కృష్టమైన దశలో ఉన్నారు. ఈ భూమిమీద జన్మతీసుకున్న ప్రతిఒక్కరూ చెయ్యాల్సిన ఉన్నతమైన కర్మ అదే .. మరి అటువంటి ధ్యానప్రచార కర్మను చేసే జీవితమే దివ్యమైన జీవితం.
కర్మయోగం -1 = A B C D
జ్ఞానయోగం -1 = శ్రవణం 1 + మననం 1 + నిధిధ్యాసన 1 + ఆత్మాసాక్షాత్కారం -1
ధ్యానయోగం =A B C = ఆనాపానసతి + కాయానుపస్సన + విపస్సన
జ్ఞానయోగం -2 = A B C D = శ్రవణం 2 + మననం 2 + నిధిధ్యాసన 2 + ఆత్మాసాక్షాత్కారం 2
కర్మయోగం 2 = ధ్యానం నేర్పించడం + శాకాహార ప్రచారం
” యోగపరంపర ” = ధ్యానయోగం + జ్ఞానయోగం 2 + కర్మయోగం 2
కర్మయోగం-1 + జ్ఞానయోగం-1