యోగం – పునర్జన్మ
“ఈ ప్రపంచంలో మూడు రకాల మనుష్యులు ఉంటారు. ‘యోగులు కానివారు’ ‘యోగులు అయినవారు’ ‘యోగభ్రష్ఠులు’
“యోగులు కాని వారు సుఖదుఃఖాలతో కూడిన జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటే .. యోగులు అయినవారు తమ చిట్టచివరి శ్వాస వరకు కూడా మానావమానాలకు చెందిన పరీక్షలను ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి ఎప్పుడు ఏ పరీక్ష ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. కనుక చాలా ఎరుకతో ఉండాలి. కాస్త ఎరుక తప్పిందా .. ఇక యోగభ్రష్టులు కాక తప్పదు.
“ప్రపంచం అంతా కూడా ఏదోవిధంగా వారిని కించపరుస్తూనే ఉంటుంది. అది సహజం! కానీ .. యోగం ద్వారా పొందిన ప్రజ్ఞలో వాళ్ళు స్థితం అయ్యి మానావమానాలను ఎలాంటి సంఘర్షణ లేకుండా సమదృష్టితో స్వీకరించాలి. లేకపోతే వాళ్ళు పొందిన ప్రజ్ఞకు విలువ ఉండదు. స్థితప్రజ్ఞుల్లా మారేంతవరకు ఆఖరిశ్వాసలో కూడా యోగభ్రష్టులుగా మారే అవకాశాలు పొంచుకుని ఉంటాయి.
“ఎవడో దారినపోయే దానయ్య వచ్చి నానా మాటలు తిట్టిపోస్తాడు .. చలించకూడదు, ‘భార్య’ మొహం మీద పేడ నీళ్ళు జల్లుతుంది .. అయినా భరించాలి.
“క్రికెట్ భాషలో చెప్పాలి అంటే ‘నాటవుట్ బ్యాట్స్‌మెన్’లా ఉండాలి. గూగ్లీలు .. లెగ్ కటర్స్ .. యార్కర్లు .. బౌన్సర్లు రూపంలో తొంబయి తొమ్మిది బంతులను ఎదుర్కొని వాటితో బౌండరీలూ, సిక్సర్లూ బాది బాది .. వందో బాల్‌కు తడబడి ‘క్యాచ్’ ఇచ్చాడా, సెంచరీ చెయ్యి జారిపోతుంది. ఇక ప్యాడ్స్ విప్పేసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవాల్సిందే!
“మళ్ళీ ఆడాలంటే ఇంకొక మ్యాచ్‌లో అవకాశం వచ్చేవరకు వేచి ఉండాల్సిందే! అప్పుడు అసలు జట్టులో ఛాన్స్ వస్తుందో లేదో కూడా తెలియదు.” “అలాగే ఒకానొక యోగి జీవితంకూడా మరి అంతే! యోగి అయినవాడు కూడా మానవమానాల రూపంలో వచ్చే పరీక్షలను ప్రతిక్షణం ఎదుర్కుంటూనే ఉండాలి. అలా ఎదుర్కోలేక చతికిలబడితే యోగభ్రష్టత్వం పొందుతాడు.
” ‘అలాంటి వాళ్ళంతా ఏమవుతారు?’ అని ఆడిగిన అర్జునుడితో శ్రీకృష్ణుడు .. ‘వాళ్ళంతా సంపన్నులయిన వారి ఇళ్ళల్లో యోగుల ఇళ్ళల్లో జన్మించి .. అక్కడి నుంచి తమ యోగాన్ని కొనసాగిస్తారు’ అని తెలియజేస్తాడు.
” ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున| మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే|| (భ||గీ|| 8-16)
“అర్జునా! బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకాలన్నీ కూడా పునరావృత్తములు; కానీ నేను ఉన్నస్థితి (ఆత్మస్థితి)కి చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదు.”
“కనుక నేను ‘ఆత్మస్వరూపుడను’ అని గుర్తించుకుని ఆ ప్రకారంగా స్థితప్రజ్ఞత్వంలో జీవించిన వాడికి ఇక మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి రావలసిన అవసరం ఉండదు.
“అలా స్థిత ప్రజ్ఞుడిలా సత్యలోకాన్ని చేరుకున్న వాళ్ళు కనీసం ఒక్కడినైనా తనంతటివాడిగా తయారుచేయాలని అనుకుంటే మాత్రం స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చి ఆ పనిలో నిమగ్నమవుతారు.
“శ్రీకృష్ణుడు కేవలం విదురుడిని, ఉద్ధవుడిని, రుక్మిణిని మరి అర్జునుడిని తనంతటి వాళ్ళుగా చేయాడానికే ఒక యుగకర్తగా ద్వాపరయుగంలో ఈ భూమిమీద జన్మ తీసుకున్నాడు. అన్ని సందర్భాలలో కూడా ముఖంపై చిరునవ్వు చెదరనీయకుండా ఒకానొక స్థితప్రజ్ఞుడిలా మానావమానాలను ఎదుర్కొంటూనే అతడు జీవితాన్ని ఒక ‘లీల’గా గడిపి తాను వచ్చిన పనిని పూర్తి చేసుకున్నాడు.
“కృష్ణుడిలాగే మనమంతా కూడా జీవితాన్ని ఒక చక్కటి ‘లీల’లాంటి ఆటలా ఆడి ‘నాటవుట్’గా నిలిచిపోవాలి!”