ఉపనయనం .. బ్రహ్మోపదేశం

 

ప్రపంచంలో అతి కష్టమైనది .. ఆత్మానుభవం ! ఆ తరువాత పిల్లల ప్రశిక్షణ ! ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గాన్ని కోరుకున్నట్లు, తాము ఎవరో తమకే తెలియని వాళ్ళు, పిల్లలను ఎలా పెంచగలరు? తనను తాను తెలుసుకున్న తరువాతే, నిజానికి పెళ్ళి చేసుకోవాలి ! వారే పిల్లల్ని కనిపెంచాలి ! ఆత్మజ్ఞానం లేని వాళ్ళు పిల్లల్ని కనవచ్చు; కానీ వాళ్ళను పెంచే సామర్థ్యం మాత్రం వారికి ఉండదు. పూర్వపు రోజుల్లో గురుకులాల్లో పిల్లలందరూ పెరిగినట్లు, ఈ రోజుల్లో కూడా అలాగే జరగాలి.

ఏ ప్రాణి అయినా మరొక ప్రాణిని పుట్టించగలగడం అన్నది ఆ ప్రాణియొక్క గొప్పదనం ఎంతమాత్రం కాదు ! అది ప్రకృతి సహజంగానే జరుగుతూ వుంటుంది! అయితే, ” పిల్లల పెంపకం ” అనేది కేవలం శరీరాల పెంపకం కాదు; మేధా సంపన్నత్వం సమకూరాలి ” అంటే అది పూర్ణ ఆత్మ వికాసులైన తల్లిదండ్రుల వల్లనే ఆ పెంపకం సాధ్యం.

మేధస్సు యొక్క పూర్ణ వికాసం అన్నది ఆత్మానుభవం ద్వారానే మొదలవుతుంది. ఆత్మ విజ్ఞానంలో నిష్ణాతులయినప్పుడే అది పరిపూర్ణం అవుతుంది .. మరి ఈ సిద్ధాంతాన్ని 2500 సం||లకు పూర్వమే సోక్రటీస్ మహాత్ముడు విశేషంగా ప్రవచించాడు. ” పిల్లల ప్రశిక్షణ ” అన్నది ఆయన యొక్క అతి ముఖ్యమైన పాఠ్యాంశం.

బ్రహ్మజ్ఞానంలో చరించే వాళ్ళే బ్రహ్మచారులు. హిందూ ధర్మంలో ” బ్రహ్మచర్యాశ్రమం తరువాతే గృహస్థాశ్రమం ” అన్నది ధర్మంగా నియమించబడింది. నేటి బాలురే రేపటి పౌరులు; శిశుత్వం పోయి బాల్యత్వం వస్తూనే .. ఆ బాలబాలికలకు, ” ఉపనయన కార్యక్రమం ” నిర్వహించడమే హిందూధర్మంలో ప్రధానాంశం.

“ఉపనయనం” అంటే, “మూడవకన్నుThird Eye .. “దివ్యదృష్టి”, “దివ్యశ్రవణం”, “దివ్యయానం” మొదలైనవన్నీ దీని క్రిందికే వస్తాయి. తరువాత “బ్రహ్మోపదేశం” చేస్తారు. అంటే “తత్త్వమసి”, “నువ్వేదేవుడు”, “అహంబ్రహ్మాస్మి” .. “నేను దేవుడు” .. అన్నవి ప్రబోధిస్తారు. మూడవకన్ను అన్నది ధ్యానాభ్యాసం ద్వారానే అంకురిస్తుంది. ధ్యానయోగం అంటే చిత్తవృత్తి నిరోధం. ఇది కేవలం ఆనాపానసతి లేక “శ్వాస మీద ధ్యాస” ద్వారానే సాధ్యం.

శిశుత్వం పోయి బాల్యత్వం వస్తూనే బాల బాలికలందరకూ ప్రప్రధమంగా బ్రహ్మోపదేశం చేసి ధ్యానాభ్యాస తీరును వారి జీవితంలో ప్రవేశపెడతారు. ఆ ఏడు సంవత్సరాలలో వారు పూర్తిగా బ్రహ్మజ్ఞానులుగా విలసిల్లుతూ  ‘బ్రహ్మచారి’/ ‘బ్రహ్మచారిణులు’ గా అవుతారు! యువావస్థలో ప్రవేశిస్తూనే శక్తి సామర్థ్యాలు వస్తాయి కనుక గృహస్థాశ్రమానికి హాయిగా వెంటనే వెళ్ళవచ్చు. బాలాత్మస్థితి ప్రారంభంలోనే .. బ్రహ్మోపదేశం, ఉపనయన కార్యక్రమం ద్వారా ధ్యానాభ్యాసంతో పాటు ప్రాపంచిక జ్ఞానాభ్యాసం కూడా జరిగి, యువ వయస్సులో ప్రవేశించే తరుణానికి పూర్తి బ్రహ్మచారులై, బ్రహ్మచారిణులై దేహధారుడ్యంతో పాటు, ఆత్మధారుడ్యం కూడా సంపూర్ణంగా కలిగి వుంటారు.

అలాంటి వారు వెంటనే గృహస్థాశ్రమం స్వీకరించి, నూతన శిశువులను ప్రకృతి ఒడిలోంచి లాగి, వారి శరీర పోషణ సక్రమంగా చూసుకుంటూ, వారు బాల వయస్సులోకి రాగానే వారి ఆత్మోన్నతికి కూడా కారణభూతులౌతారు. ఈ విధంగా “పిల్లల ప్రశిక్షణ” అన్నది సరియైన విధంగా జరుగుతుంది.

ఆత్మవిద్య గ్రహించి ఉన్నవాళ్ళే, ఆత్మానుభవం ఉన్నవాళ్ళే, అనేకానేక లోకవిద్యలను అతి సులభంగా వశం చేసుకోగలరు! నేర్చుకున్న లోక విద్యలను తమ తమ జీవిత ప్రౌఢదశల్లో, తమ తమ వృద్ధ దశల్లో లోక కళ్యాణప్రదంగా వినియోగించగలరు. ఆత్మవిద్యలో ప్రవేశం లేని మూర్ఖులు తమ ప్రాపంచిక విద్యలను లోక వినాశనం కోసమే వినియోగిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా గతంలో జరిగిన దౌర్జన్యాలూ, దోపిడీలూ, మారణహోమాలూ .. ప్రస్తుతం జరుగుతూన్న దౌర్జన్యాలూ, దోపిడీలూ, మారణహోమాలూ .. భవిష్యత్‌లో జరగబోయే దౌర్జన్యాలూ, దోపిడీలూ, మారణహోమాలూ .. ఇవి అన్నీ కూడా ” పిల్లల ప్రశిక్షణ ” అన్నది సరిగ్గా లేనందు వల్లనే మరి పుట్టుకతో స్వచ్ఛంగా ఉండే పిల్లలు అధ్వాన్నంగా పెంచబడి స్వార్థమైన పెద్దలుగా మారినందు వల్లనే !

ప్రకృతి ఒడిలోంచి వచ్చిన ప్రతి శిశువు కూడా స్వచ్ఛమైనదే మరి అత్యంత శుద్ధమైనదే! కానీ వారు మూర్ఖపు తల్లిదండ్రుల చేతుల్లో .. మూర్ఖపు సంఘం యొక్క అజ్ఞాన వాతావరణంలో .. పెరిగి తమ తల్లిదండ్రులను పోలిన, మూర్ఖుల్లా తామూ తయారవుతున్నారు. కాబట్టి పిల్లల సరియైన ప్రశిక్షణా కార్యక్రమంలో ఉండే కొన్ని అంశాలను పరిశీలిద్దాం:

  • శిశు అవస్థలో ఉన్నప్పుడు సరియైన ఆహారం ఇవ్వాలి; అంటే కేవలం శాకాహారం మాత్రమే అలవాటు చేయాలి.
  • తల్లి ఎప్పుడూ శిశువును వదిలి ఉండరాదు! విధిలేని పరిస్థితుల్లో తప్ప, శిశువులు తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి!
  • బాల్యావ్యస్థలో ప్రవేశిస్తూనే నూతన బాలబాలికలకు బ్రహ్మజ్ఞానం ప్రబోధించాలి! వారిచేత ధ్యానాభ్యాసం చేయించాలి మరి వారి ధ్యానానుభవాలను శ్రద్ధతో ఆలకించాలి!
  • బాల్యావ్యస్థలో బ్రహ్మజ్ఞానంతోపాటు అనేకానేక లోక విద్యలను కూడా ప్రారంభం చేయించాలి.
  • బాలబాలికలను “బాలబాలికలుగా” చూడకూడదు! వారు కూడా ఎన్నో జన్మల నుంచి ఎన్నో అనుభవాలు పొందిన ఎందరో మహాత్ములై ఉండవచ్చు. కొద్ది మంది బాలబాలికలే ప్రప్రథమ మానవ జన్మల్లో ఉండినవారు వుంటారు. కనుక చిన్నపిల్లలతో వ్యవహరిస్తున్నప్పుడు, పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరిస్తామో అలానే వ్యవహరించాలి! వాళ్ళ ఇష్టాయిష్టాలు ప్రత్యేకంగా తెలుసుకోవాలి కానీ మన ఇష్టాయిష్టాలు వాళ్ళపై ఎంత మాత్రమూ రుద్దకూడదు.
  • పిల్లలను నిర్భయులుగా చేయడం పెద్దవాళ్ళ ప్రథమ కర్తవ్యం! వారిని సర్వవిద్యా పారంగతులుగా, సకల కళాకోవిదులుగా చేయడం పరంపరగా పూర్ణ ఉద్దేశ్యం.
  • నేటి పాఠశాలలు అన్నీ నాటి గురుకులాలుగా తయారవ్వాలి! నాటి గురుకులాలలో ధ్యానం, ఆత్మజ్ఞానం, గురుసేవ .. అన్నవి ప్రథమస్థానాన్ని ఆక్రమించుకుని ఉండేవి. నేటి స్కూళ్ళల్లో కూడా అవన్నీ తిరిగి ఆ స్థానాన్ని ఆక్రమించాలి.
  • పిల్లలు కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తూంటారు. ప్రశ్నలకు సరియైన సమాధానాలు తెలిస్తే ఇవ్వాలి; తెలియకపోతే తెలిసిన వాళ్ళదగ్గరకు వాళ్ళను పంపించాలి. అంతేకానీ వాళ్ళ జ్ఞానపిపాస మీద మూర్ఖంగా నీళ్ళు చల్లకూడదు!
  • పిల్లల్లో “పోటీతత్వం” తో పాటు “పోటీలేని తత్వం” కూడా సరిసమానంగా వృద్ధి చెందించాలి!
  • మానవ జీవితం లేక ఏ ప్రాణి జీవితమైనా ఎప్పుడూ ఏకాంతమే కనుక పిల్లల్ని ఏకాంతంగా అప్పుడప్పుడూ వదిలివేయాలి.

రాబోయే ప్రపంచ ఏకత్వానికి చిన్న పిల్లలలో చిన్నప్పుడే బీజం వేయాలంటే ప్రతి తల్లీ – తండ్రీ కూడా ప్రకృతిపరమైన నిజమైన తల్లీ – తండ్రిగా మారిన రోజు ఈ భువి .. దివిగా మారిపోతుంది!