త్రితత్వం
“మిత్రులు” అంటే మిత్రత్వం కలిగిఉన్నవారు; “స్వాములు” అంటే స్వామిత్వంలో ఉన్నవారు; “దేవుళ్ళు” అంటే దైవత్వంలో ఉన్నావారు.
ఈ మూడు విషయాలు.. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కి ” త్రిమూర్తులు”.
మనం మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అనే మహాదేవాలయం లో మూడు విగ్రహాలను త్రిమూర్తులుగా ప్రతిష్ఠించాము. అవే ‘మిత్రత్వం’ అనే విగ్రహం.. ‘స్వామిత్వం’ అనే విగ్రహం.. ‘దైవత్వం’ అనే విగ్రహం. కనుక ఈ మూడు తత్వాలూ మనకు ఆరాధ్యదైవాలు.
మనం మిత్రత్వాన్ని ఆరాధించే వాళ్ళం..మిత్రత్వాన్ని సాధన చేసేవాళ్ళం.. మిత్రత్వాన్ని నెరపేవాళ్ళం..మిత్రత్వాన్ని అభ్యాసం చేసేవాళ్ళం.. మిత్రత్వాన్ని అందరికీ చూపించేవాళ్ళం ..మిత్రత్వాన్ని అందరికీ బోధించేవాళ్ళం.. మరి మిత్రత్వాన్ని అందరికీ నేర్పించేవాళ్ళం.
మనం స్వామిత్వాన్ని ఆరాధించే వాళ్ళం. స్వామిత్వాన్ని ప్రబోధించే వాళ్ళం.. స్వామిత్వాన్ని విశ్లేషించే వాళ్ళం.. స్వామిత్వాన్ని వివరించేవాళ్ళం.. స్వామిత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళం.. స్వామిత్వాన్ని ప్రసారం చేసేవాళ్ళం.. మరి స్వామిత్వాన్ని జీవించేవాళ్ళం.
అలాగే మనం మన దైవత్వాన్ని ఆరాధించేవాళ్ళం.. ప్రక్కవాళ్ళ దైవత్వాన్ని ఆరాధించేవాళ్ళం.. మన దైవత్వాన్ని మనం తెలుసుకునే వాళ్ళం.. ప్రక్కవాళ్ళ దైవత్వాన్ని తెలుసుకునే వాళ్ళం.. మన దైవత్వాన్ని ప్రభోధించే వాళ్ళం .. ప్రకటించే వాళ్ళం, ప్రచారం చేసేవాళ్ళం, ప్రసారం చేసేవాళ్ళం. మరి జీవించే వాళ్ళం.
అందుకే మనం .. “మై డియర్ ఫ్రెండ్స్..మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్” అని మన ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ.. ప్రపంచమంతా ధ్యానం నేర్పిస్తాం. ప్రపంచమంతా ధ్యానవిద్య నేర్పిస్తాం. ప్రజలందరినీ “ధ్యానంలో కూర్చోండి” అంటాం.
“మిత్రులు” అంటే మిత్రత్వం మూర్తీభవించిన వారు. “స్వాములు” స్వామిత్వానికి ప్రతీకలు .. మరి “దేవుళ్ళు” అంటే దైవత్వంలో ఉన్నవారు.
పరలోకాలలో ఉన్నప్పుడు మనం మౌలికంగా ఈ మూడింటి యొక్క స్వరూపం. అయితే ఈ భూలోకానికి వచ్చినప్పుడు కొద్దిగా మర్చిపోయాం! తిరిగి మళ్ళీ మన “స్వరూపం”తో అంటే.. ఈ “త్రిమూర్తిత్వం” తో అనుసంధానం చెంది ఇహలోకంలో మళ్ళీ మిత్రులం కావాలి, స్వాములం కావాలి, మరి దేవుళ్ళం కావాలి.
చిన్నతనంలో నేను అందరిలోని మిత్రత్వాన్నీ ఆరాధించేవాణ్ణి .. మరి వారితో మిత్రత్వాన్ని కోరుకునే వాడిని. అయితే అప్పుట్లో నాకు ధ్యానం మరి ఆత్మజ్ఞానం లేదు కనుక ‘స్వామిత్వం’, ‘దైవత్వం’ అనేవి అర్థమయ్యేవి కాలేదు. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా స్వామిత్వం నాకు అర్థమయ్యింది .. అలాగే అందరి స్వామిత్వమూ అర్థమయ్యింది .. నా దైవత్వం నాకు అర్థమయ్యింది, అలాగే అందరి దైవత్వమూ అర్థమయ్యింది; అప్పుడు నా మిత్రత్వం అన్నది చిలువలు పలువలుగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ఈనాడు ఈ విధంగా విశ్వవ్యాప్తం .. అయింది.
పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా మౌలికంగా ఒకానొక చక్కటి పువ్వు. మిత్రత్వంతో కూడుకున్న పువ్వు. కానీ అతనికి ధ్యానం, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మిత్రత్వం పోగొట్టుకోవడంతో పెద్దవాడయ్యాక వాడికి అందరూ శత్రువులే మిగులుతారు. ఇక జీవితాంతం భీరువులా బ్రతుకుతాడు .. స్వామిత్వం లేకుండా బ్రతుకుతాడు. “నా చేతుల్లో ఏమీ లేదు” అనుకుని దీనంగా బ్రతుకుతాడు. తన చేతుల్లోనే అంతా ఉండగా ” నా చేతుల్లో ఏమీ లేదు ” అనుకుంటున్నాడంటే వాడు ” తన స్వామిత్వం తాను కోల్పోయాడు” అన్నమాట.
“నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను .. అలాగే ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సదా సృష్టించుకుంటున్నారు” అన్న కీలకమైన అవగాహన పేరే “స్వామిత్వం”.
” ‘అన్యాయం, విషాదం అన్నవి ఉన్నాయి’ అని మీరు ఎంత ప్రగాఢంగా నమ్మితే వాస్తవానికి అంత అజ్ఞానం మీకు ఉందన్నమాట ” అంటారు మహాజ్ఞాని రిఛార్డ్ బాక్!
” ఇంత అన్యాయం జరుగుతోంది, ఇంత హీనస్థితిలో ఉన్నాం ” అని మనం ఎంతగా అనుకుంటున్నామో అంతగా మనకు ఆత్మజ్ఞానం లుప్తమై ఉన్నదన్నమాట!
” మన జీవిత నాటకానికి మనమే రచయితలం. మన జన్మకు మనమే కారకులం .. మరి మన సృష్టికీ, మన స్థితికీ, మన లయకూ మనమే కారుకులం! ప్రతి జన్మ ఒకానొక సృష్టి, ప్రతి జన్మ ఒకానొక స్థితి, ప్రతి మరణం ఒకానొక లయం. పుట్టటం సృష్టి, పెరగటం స్థితి, చనిపోవటం లయం కనుక ఆ సృష్ఠి లయ కారకులం మనమే ” అన్న “స్వామిత్వం” తెలుసుకున్నప్పుడు.. మనకు ఆ జ్ఞానం వచ్చినప్పుడు .. మనకు ఎంత ముక్తివస్తుందో చెప్పనలవి కాదు.
” ఎవరి కర్మలకు వారే బాధ్యులు “, ” ఎవరి కర్మలకు వాళ్ళే సృష్టికర్తలు ” అన్నదే “స్వామిత్వం” యొక్క మౌలిక అవగాహన.
ఇకపోతే ” నువ్వు అసలు శరీరమే కాదు; ఆత్మ పదార్థానివి; నువ్వు శాశ్వతమైన అనంతమైన ఆత్మవు. నేను కూడా అదే. నేనొక దైవాన్ని. నువ్వొక దైవానివి” అన్నదే “దైవత్వం” యొక్క మౌలికమైన అవగాహన. ఈ మౌలికమైన అవగాహనలను మనం ఆరాధిస్తున్న వాళ్ళం కాబట్టే పిరమిడ్ మాస్టర్లం అందరం సదా “త్రిమూర్తితత్త్వం” లో ఉంటాం.
“మిత్రత్వం”, “స్వామిత్వం” మరి దైవత్వం”.. గురించి మనం మన ధ్యానాభ్యాసంలో మాత్రమే తెలుసుకుంటాం. ధ్యానం మనం ఎంతగా చేస్తామో అంతగా మనలో మిత్రత్వ తత్వం విజృంభణ చెంది, అంతగా మనలో మన స్వామిత్వం ప్రకటితమై, అంతగా మనలోని దైవత్వం మన అవగాహనకు వస్తుంది. ధ్యానం అన్నది మహా మౌలికం.
ధ్యానం చేస్తే తత్ఫలితాలు. ధ్యానం చేయకపోతే తత్ఫలితాలు. భోజనం చేస్తే ఓ విధమైన ఫలితం .. భోజనం చేయకపోతే మరో విధమైన ఫలిత. మిత్రత్వం చేస్తే ఓ విధమైన ఫలితం .. చేయకపోతే మరో విధమైనఫలితం. కనుక ఇది అంతా కారణ- కార్య సంబంధంతో జరుగుతూ వుంటుంది.
ధ్యానమూలం ఇదం మిత్రత్వం! ధ్యానమూలం ఇదం స్వామిత్వం! ధ్యానమూలం ఇదం దైవత్వం!
త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆదిశక్తి తల్లి అయినట్లే ఈ మూడింటికీ కూడా తల్లి.. “ధ్యానం”. ధ్యానం అనేది “ఆదిశక్తి” మనం పురణాలు విన్నాం.. కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. అయితే ధ్యానం చేసాక అర్థం చేసుకున్నామనిపిస్తుంది.
ఇదంతా సాధనాశాస్త్రం. కేవలం “సిద్ధాంతశాస్త్రం” కాదు. “మిత్రత్వం” అనేది థియరీ కాదు.. ప్రాక్టికల్ కోర్సు. ప్రాణికోటితో మిత్రత్వం నెరపాలి. “స్వామిత్వం” అనేది మనలో మనం నిరూపించుకోవాలి. కనుక “ధ్యానం” అనేది ప్రాక్టికల్ కోర్సు. సిద్ధాంత అవగాహన బీజమాత్రం; అయితే.. అభ్యాసం అనేది ప్రబంధమాత్రంగా వుండాలి.
“నువ్వు సరిగ్గా పాడటం లేదోయ్.. శ్రుతిలో లేదోయ్” అంటూ శ్రుతిలో ఉందో లేదో ఒక్క నిమిషంలో చెప్పేస్తాం త్రిమూర్తితత్వం మూర్తీభవించితేనే జీవితం ‘శ్రుతి’ లో, ‘లయ’ లో ఉంటుంది.
2,500 సంవత్సరాల క్రిందట గౌతమబుద్ధుడు “నేను మళ్ళీ వస్తాను.. మైత్రేయ బుద్ధుడిలా” అని సమస్త మానవాళికి మాట ఇచ్చాడు. “మైత్రి” అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చాడో దీన్నీ బట్టి తెలుసుకోవచ్చు. మనం అంతా భూమండలంలో ఉన్నాం కనుక భూమండలంలో వున్న ప్రాణికోటి అంతా కూడా పరస్పర మిత్రులే!
భూమండలంలో ఎన్ని ఛాలెంజ్‌లు ఉంటాయో ఎన్ని సమస్యలు వుంటాయో శరీరధారణ చేసినప్పటి నుంచి ఏమవుతుందో, ఎలా ఉంటుందో.. అంతా తెలిసివచ్చినవాళ్ళే అందరూ! ఏమీ తెలియకుండా వచ్చినవాళ్ళు ఎవ్వరూ లేరు! అందరూ ఇష్టంతోనే పుట్టారు, పుడుతూనే ఉంటారు. ఏ పనిచేసినా ఎవ్వరు ఎక్కడ ఇష్టాస్వేచ్ఛతో ఉంటారు కనుక దీనిపేరు “స్వామిత్వం”.
“స్వామి” అంటే గెడ్డం పెట్టుకునేవాళ్ళు కాదు. ప్రతిఒక్కడూ స్వామియే, ప్రతి ప్రాణీ స్వామియే. “స్వామి” కాకుండా ఏ ప్రాణీ ఎక్కడా, సృష్టిలోనూ లేదు.
ఒకడు మౌనంగా ఉందామనుకుంటాడు. ఇంకొకరికి ఊరికే మాట్లాడటం ఇష్టం. తెలిసినా, తెలియకపోయినా వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రక్కవాళ్ళు విన్నా వినకపోయినా, వాడిమాటలే వాడికి ఎంతో ఆనందాన్నిస్తూంటుంది! మనం ఒక విషాద భరితమైన సినిమా చూడటానికి వెళ్తాము.. అలాంటి సినిమాలో హీరోయిన్ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది.
అలాంటి సినిమా చూడటానికి అందరూ ఏడుపు చూడటానికి వెళ్తారు! అది వాళ్ళకు ఇష్టం! హీరోయిన్ కష్టాలు పడుతూంటే చూసి ఏడుస్తూంటారు. మరునాడు వెళ్ళి మళ్ళీ ఏడుస్తారు. “ఏదవటానికి ఎందుకువెళ్ళాలి సినిమాకి?” అంటే ..అది మనకు బాగుంది కనుక డబ్బులు పెట్టి మరీ ఏడవటానికి వెళ్తాం సినిమాకి లేకపోతే ఎన్నో T.V. సీరియల్స్‌లో అత్తా కోడలు .. కొట్టుకుంటూ ఉంటారు. ఎంత ఇష్టమో మనకు చూడటానికి!
వీటిద్వారా అంతర్లీనంగా ఉన్న జీవితం యొక్క నాటకీయతత్వాన్ని తెలుసుకుంటూ, ఇక్కడ ఉంటూనే, నిర్వాణస్థితిని పొందాలి. ఈ లోకంలో రాజకీయంగా తాత్కాలిక శత్రుత్వం వుంది. అది కూడా మనం ఏరికోరి తెచ్చుకున్నదే పై లోకాలనుంచి! ఎందుకంటే కొద్దికాలం కోసం జరిగే ఆ ఘర్షణలు మరి రాపిడి .. ఒకానొక ఆత్మ వికాసానికి దోహదకారి అవుతుంది.
“మన ఇహలోక ధ్యేయం ఎలా ఉండాలి?” అంటే పై లోకాలలో ఎలా మిత్రత్వం ఉందో, క్రింది లోకంలో కూడా అలాగే ఉండాలి! ఆ మిత్రత్వాన్ని దించాలి ఇక్కడికి .. అదే ఆత్మజ్ఞానం, అదే ధ్యానం, అదే సహృదయత్వం.
“మిత్రత్వం” అనేది ఈ రోజు ఈ ప్రపంచంలో మృగ్యమైపోయింది, లుప్తమై పోయింది, అదృశ్యమై పోయింది. దాంతో అందరూ ఏడుస్తున్నారు. తాము ఏడుస్తూ అందరినీ ఏడ్పిస్తున్నారు.
గౌతమబుద్ధుడు “అన్ని చోట్లా దుఃఖం వుంది” అన్న ఆర్యసత్యాన్ని కనుగొన్నప్పుడు “అది మిత్రత్వం ఎక్కడా లేకపోవడం వల్ల వచ్చింది” అని కూడా తెలుసుకున్నాడు. రాజు ప్రజలకు మిత్రుడు కాదు .. ప్రజలు రాజుకి మిత్రులు కారు .. మగ వాళ్ళు ఆడవాళ్ళకు మిత్రులు కారు.. ఆడవాళ్ళకు మగవాళ్ళు మిత్రులు కారు. అంతా శత్రుత్వంగా ఉంది .. దానివల్ల దుఃఖం వచ్చింది. అంతా ఆరాచకం, టెర్రరిజం, కౌరవులు పాండవుల పట్ల టెర్రరిజం. రావణాసురుడు సీత పట్ల .. టెర్రరిజం, మానవులు జంతువులు పట్ల చూపించే టెర్రరిజం! ఈ మిత్రత్వం అనేది లుప్తమై పోవడానికి కారణం మన దైవత్వాన్నీ మన అనంత ఆత్మతత్వాన్నీ, మనం మరిచిపోవడమే.
తర్వాత మన స్వామిత్వాన్ని కూడా మరిచిపోయి “నా జీవితం నా చేతుల్లో లేదేమో.. పైవాడి చేతిలో ఉందేమో” అనుకుంటూ నిర్వీర్యస్థితిలో ఉన్నాము. మన దైవత్వాన్ని మరిచాం. దాంతో మన స్వామిత్వం పల్టీలు కొట్టింది. ఇప్పుడు మళ్ళీ “మై డియర్ ఫ్రెండ్స్.. మై డియర్ మాస్టర్స్.. అండ్ మై డియర్ గాడ్స్” అనే ఈ మూడు సంబోధనల ద్వారా, ధ్యానకేంద్రాల కృషి ద్వారా.. మన ధ్యానప్రచారం ద్వారా, మన సకల కార్యక్రమాల ద్వారా.. మనం భూమి మీద త్రిమూర్తితత్వాన్ని తిరిగి స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నాం.
డియర్ ఫ్రెండ్స్! డియర్ మాస్టర్స్! డియర్ గాడ్స్! ధ్యానం ద్వారా మనం మిత్రత్వాన్ని తిరిగి రాబట్టు కుంటాము. మన స్వామిత్వాన్ని తిరిగి కలిగించు కుంటాము.. మన దైవత్వం తిరిగి కలిగించుకుంటాం.
కొంతమంది అడుగుతూంతారు. “మేం ఎందుకు రావాలండీ ధ్యానంలోకి? మాకేం అవసరం ఉందండీ? దానివల్ల లాభాలు ఏమిటండీ? అది లేకపోతే మాకు వచ్చిన నష్టం ఏమిటండీ? మేమంతా.. బాగున్నాం కదా! అంటారు.
భవిష్యత్తులో రోగాలు రాకుండా ఉండటం కోసం ‘టీకాలు’ వేసుకున్నారు కదా! అలాగే సుఖంలో ఉన్నప్పుడే భవిష్యత్తులో దుఃఖం రాకుండా ఉండేందుకు వర్తమానంలో ధ్యానసాధన మొదలుపెట్టాలి. అప్పుడే భవిష్యత్తులో మన సుఖం చెక్కుచెదరకుండా ఉంటుంది.
అన్నమాచార్యుల వారు “నానాటి బ్రతుకు నాటకం” అంటూ “బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చావు అన్న నాలుగు రోజుల బ్రతుకే నాటకం” అన్నారు.
నేను ఒకప్పుడు పిల్లవాడిని.. అప్పుడు ఆ నాటకాలు వేసాను. గోలీలు ఆడాను. ఇప్పుడు ఈ నాటకం వేస్తున్నాను.. ధ్యాన ప్రవచనాలు చేస్తూ! రేపు మూలపడుకుంటాను.. పోవలసిన సమయం వస్తుంది .. పోతాను. పై లోకాల్లోకి వెళితే అక్కడ “భలే నాటకం వేశావోయ్! బాగా చేసావు! మమ్మల్ని రంజింపచేసావు! నీ స్వామిత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు! నీ దైవత్వాన్ని నువ్వు చక్కగా ప్రకటించుకున్నావు! నీ మిత్రత్వాన్ని నువ్వు మా భేషుగ్గా పండించావ్” అని నాకు ఖచ్చితంగా కితాబులిస్తారు.
లేకపోతే “ఏమిటయ్యా అలా దరిద్రంగా యాక్టింగ్ చేశావు? అంతా మర్చిపోయావేమిటి? నీ గురించి నువ్వు ఎందుకు ధ్యానం చేయలేదు? నువ్వు రోజూ ఇంటి నుంచి ఆఫీస్‌కు పోయే దారిలో ‘పిరమిడ్ ధ్యానకేంద్రం’ ఉండింది కదా. దానిలోపలికి నువ్వెందుకు పోలేదు? నీకు పాంప్లెట్‌లు కూడా ఇచ్చాను. ఎందుకు ధ్యానం చేయలేదు? ఛ ఛ.. ఏమిటయ్యా జన్మంతా వ్యర్థం చేసేసావు” అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తారు.
“ఏమిటో..అయిపోయింది సార్! ఇంకొక ఛాన్స్ ఇప్పిస్తారా! ఇంకో జన్మ తీసుకుంటాను” అంటే ..ఎవరిస్తారు ఛాన్సు మనకు?
కనుక డియర్ ఫ్రెండ్స్! డియర్ మాస్టర్స్! డియర్ గాడ్స్! “ప్రియమిత్రులారా” అన్నప్పుడు మిత్రత్వయోగం, “ప్రియ మాస్టార్లారా” అన్నప్పుడు జ్ఞానయోగం, “ప్రియ దేవుళ్ళారా” అన్నప్పుడు ధ్యానయోగం!
ధ్యానంలోనే “నేను శరీరం కాదు ఆత్మ. నేను ఏదో కేవలం మానవమాత్రుడను కాను, నేను విరాట్ స్వరూపుడును” అని తెలుసుకుంటాం.
సరదాగ ప్రకృతిలో విహార యాత్రల కోసం.. రామేశ్వరం, “మానసరోవరం”, “కైలాసపర్వతం”, హిమాలయాలు” వెళ్ళవచ్చు కానీ దైవత్వం తెలుసుకోవాలంటే మాత్రం ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేయాలి: ఆ ధ్యానం నుంచి తిరిగి మనం మన దైవత్వాన్ని గుర్తు తెచ్చుకోవాలి .. స్వామిత్వాన్ని తిరిగి పొందాలి .. ఆ యొక్క లోకకళ్యాణకరమైన మిత్రత్వాన్ని తిరిగి కలిగించుకోవాలి.