“తప్పుపట్టడం .. అన్నింటికన్నా పెద్ద తప్పు”
ప్రపంచంలో రకరకాల మనుష్యులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు. మానవ శరీరంలో ప్రవేశించి “పది జన్మలు” తీసుకున్నవాళ్ళు ఉన్నారు. “ఇరవై జన్మలు” తీసుకున్న వాళ్ళు ఉన్నారు. “వంద జన్మలు” తీసుకున్నవాళ్ళు ఉన్నారు. “ఐదు వందల జన్మలు” తీసుకున్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి స్వభావాలూ ఒకే రకంగా ఉండవు. మొట్టమొదటలో “తమోగుణ ప్రధాని” గా వస్తాడు మానవుడు. కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఆ గుణం మారిపోతూ, మారిపోతూ “రజోగుణ ప్రధాని”గా తయారవుతాడు. ఆ తర్వాత మెల్లిగా, మెల్లిగా మారుతూ మారుతూ “సత్వగుణ ప్రధాని”గా వస్తాడు. ఆ తర్వాత ఇంకా మెల్లిగా మెల్లిగా మారుతూ “నిర్గుణి” అయిపోతాడు. అంటే రకరకాల గుణ సంచయాలలో కూడి ఉన్నారు మానవులు. మరి రకరకాల ఈ మానవుల కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? “ఒకే రకంగా ఉంటాయా?” అంటే, ఉండవు. రకరకాల గుణ సంచయాలు గల మానవుల బహిర్ కార్యకలాపాలు కూడా ఆ యా గుణాలకు తగిన విధంగానే ఉంటాయి, మరి రకరకాలుగా ఉంటాయి. ఒకరి కార్యకలాపాలు ఇంకొకరితో, మరొకరి కార్యకలాపాలతో ఏకం కాజాలవు. అది అసంభవం. ఒకానొక తమోగుణ ప్రధాని అయినవాడి కార్యకలాపాలు ఆ గుణానికి సంబంధించినవిగా పూర్తిగా ఆ గుణానికే అంకితమై, ఆ గుణానికే ప్రతిరూపమై, ఆ గుణానికే ఛాయ అయి ఉంటాయి. అలాగే ఒకే రజోగుణ ప్రధాని అయినవాడి కార్యకలాపాలు ఒకానొక తమోగుణ ప్రధాని అయినవాడితో ఒకేవిధంగా ఉండజాలవు. అది అసంభవం. ఎలా ఉంటాయి? ఏ వంట తింటే చేతికి ఆ వాసనే కలుగుతుంది. టమోటా వంట చేసుకుని తింటే చేతికి ‘కాకరకాయ’ వాసన వస్తుందా? అలాగే మనం అంతరంగా ఏ గుణం కలిగి ఉంటామో మన బహిర్ కార్యకలాపాలు కూడా ఆ గుణానికి సంబంధించినవిగానే ఉంటాయి. అంతేకానీ, వేరే గుణానికి సంబంధించినవిగా ఉండవు. అది అసంభవం, అసహజం. అలా ఉండవు. అలాగే, ఒకానొక రజోగుణ ప్రధాని అయినవాడి కార్యకలాపాలు ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలుగా ఉండజాలవు. సత్వగుణ ప్రధాని చక్కటి సంగీతం వింటాడు .. చక్కగా భజనలు చేస్తాడు. లేకపోతే చక్కగా ఆటపాటలలో ఉంటాడు. రజోగుణ ప్రధాని పాలిటిక్స్‌లో ఉంటాడు. వాడికి అదే కావాలి. అలాగే ఒకానొక సాత్విక గుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒకానొక నిర్గుణి యొక్క కార్యకలాపాలలాగా ఉండవు. నిర్గుణ ప్రధాని అయినవాడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం గురించే మాట్లాడుతూ ఉంటాడు. కేవలం సత్వగుణ ప్రధానమైన కార్యకలాపాలలో, సంగీతంలో, భజనలలో, ఆటపాటలలో, ఫైన్ ఆర్ట్స్‌లలో నిర్గుణ ప్రధానులు అయినవారు అధికంగా ఉండరు. కనుక చెప్పేది ఏమిటంటే మానవుడు బహిర్ కార్యకలాపాలలో, కార్యక్షేత్రాలలో, కర్మక్షేత్రాలలో వారి వారి అంతర్ గుణాల ద్వారా నిస్సహాయ బందీలు; అంతర్ గుణాలు ఎలా ఉంటాయో వారి బహిర్ కార్యాలు కూడా అచ్చుగా, “పోతపోసినట్లుగా” అలాగే ఉంటాయి. Your deeds are natural shadows of your gunas. మీ కార్యకలాపాలు మీ స్వధర్మం యొక్క మూసపోసిన పరిఛాయలు. మీ అంతర్ గుణం ఒక రకంగానూ, బహిర్ కార్యం ఒక రకంగానూ ఉండటం అసంభవం. ఈ “గుణం” అనేది అంత త్వరగా మారుతుందా?? మారదు!! ఎంతో మెల్లి మెల్లిగా మారుతూ ఉంటుంది. కనుక ఎవరి కార్యకలాపాలను కూడా నిందించటానికి ఎంత మాత్రం అర్హత లేనివాళ్ళం మనం. ఎందుకంటే చిన్నపాపలాంటి ఆత్మ అలానే నడుస్తుంది. కొన్ని జన్మలే ఎత్తారు; “యాభై జన్మలు” ఎత్తలేదు.అంచేత అలానే ఉంటారు. ఐదు జన్మలకు ఏ ఏ స్వభావాలు ఉంటాయో అవే ఉంటాయి. యాభై జన్మలకు ఏ ఏ గుణగణాలు ఉంటాయో వారికి ఆ గుణాలే ఉంటాయి. అలాగే ఓ “వెయ్యి జన్మలు” అప్పటికే తీసుకున్నవారు ఏ ఏ పనులు చేయాలో ఆ పనులే చేస్తారు. కనుక, ‘తప్పు’ ఎక్కడ ఉంది? ‘తప్పు’ అనేది లేనే లేదు! “తప్పు పట్టడం” అన్నదే అన్నింటికన్నా పెద్ద తప్పు. కనుక ప్రతి మానవుడూ కొన్ని జన్మల్లో తమోగుణిగా పుట్టాల్సిందే. మరికొన్ని జన్మలు రజోగుణ పరంగా ఉండాల్సిందే. మరికొన్ని జన్మలు సత్వగుణంగా ఉండవలసిందే. చివరగా నిర్గుణంగా అయి తీరుతాడు. కనుక ఎవ్వరినీ తప్పు పట్టవలసిన పనిలేదు. “Judge ye not” అన్నాడు “జీసస్ క్రైస్ట్”. ఒకానొక ప్రాస్టిట్యూట్‌ని రాళ్ళతో కొట్టబోతూంటే “మీలో తప్పు చేయనివాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రమే రాళ్ళతో కొట్టండి” అన్నాడు. అప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ రాళ్ళు క్రింద పడేశారు. ఎవరి స్థాయిలలో వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు; ఒప్పులు కూడా చేస్తూ ఉంటారు. కనుక ఎవ్వరినీ తప్పులు పట్టే సమర్థత లేనివాళ్ళం మనం. అలాగే ఎవ్వరి చేష్టలను కూడా నిందించకూడదు. ఎవ్వరి చేష్టలనూ నిందించ అర్హత లేనివాళ్ళమే అందరమూ .. ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో అయినా సరే!