తక్షణ కర్తవ్యం – కర్తవ్యనిష్టుడు
తత్ + క్షణం = తక్షణం; “తక్షణం” అంటే “ప్రస్తుత క్షణం” అన్నమాట
“కర్తవ్యం” అంటే “అనివార్యంగా చేయవలసినది”.
ప్రతిక్షణంలోనూ “చేయగలిగినవి” ఎప్పుడూ ఎన్నో ఉంటాయి; కానీ, “చేయవలసింది” వాటిల్లో ఎప్పుడూ ఒక్కటే.
వర్తమానంలో చేయగలిగిన అనేక వాటిల్లో అనివార్యంగా చేయవలసిన దానిని క్షణంలో గుర్తించి మరి మరుక్షణంలో అ పనిలో సంపూర్ణంగా నిమగ్నం అయివున్నవాడే “సరియైన కర్తవ్యనిష్ఠుడు”
“తక్షణ కర్తవ్యం” అంటే – “ఈ వర్తమాన క్షణంలో చేయవలసిన పని”అన్నమాట. మన, మరి ఇతరుల మానసిక పరిస్థితులు కానీ, బయటి వాతావరణ పరిస్థితులు కానీ, క్షణక్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి; అలా నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండే ప్రతి క్షణంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ, తగిన కర్తవ్యనిష్టను కలిగి ఉండాలి.
“నడిచేటప్పుడు నడవాలి, తింటున్నప్పుడు తినాలి” అని ఓ సందర్భంలో బుద్ధుడు చెప్పాడు ..
అంటే, చేతిలో ఉన్న పనిని వదిలి మనస్సు ఒక క్షణమైనా “పరధ్యాస” లో ఉండరాదు.
- దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారానే మన ‘వర్తమాన – ధ్యాస’స్థితమవుతుంది
- ‘పరధ్యాస’రహిత స్థితే ‘వర్తమాన–ధ్యాస స్థితి’
- వర్తమాన – ధ్యాస వున్నవాడే నిత్యజాగరూకుడు
- నిత్యజాగరూకుడే తక్షణ కర్తవ్య నిష్టుడు కాగలడు
- తక్షణ కర్తవ్య నిష్టుడే అద్భుత ప్రగతిని సాధించగలడు