స్వయంభూ జ్యోతిర్లింగాలు

 

మనం అంతా కూడా “సృష్టికర్తలు” అయిన బ్రహ్మదేవుళ్ళం !

బ్రహ్మదేవుడి పని ఎప్పుడూ క్రొత్త క్రొత్తవి సృష్టిస్తూ .. అంటే create చేస్తూ ఉండడం ! మన పని కూడా అంతే ! మన సృజనాత్మకతతో ప్రతిక్షణం క్రొత్తక్రొత్తవి సృష్టిస్తూ .. అవసరం అనుకున్నప్పుడు మనల్ని కూడా మనం క్రొత్తగా మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాం ! అయితే ఇలా క్రొత్త వాటిని సృష్టించే క్రమంలో వచ్చే ఫలితాలన్నీ మనమే భుజించాల్సి ఉంటుంది. “CREATE” అనే పదంలోనే ” EAT “అనే పదం ఇమిడి ఉంది కనుక ” ఎవరి వాస్తవానికి వారే కారకులు”.

WHAT YOU CREATE IS WHAT YOU EAT

శోకం – ఆహ్లాదం .. కోపం – దుఃఖం .. ఆనందం – బ్రహ్మానందం .. భోగం – వైభోగం .. ఇలా ఏదైనా సరే మనం ఏదీ సృష్టిస్తే .. దానిని మనమే అనుభవించాల్సి వుంటుంది. మన సృష్టి మనదే .. మన ఫలితం మనదే ! దీనినే ” లింగ సృష్టి ” అంటారు.

“లింగం” అంటే “ప్రాణమయ శరీరం”, “జ్యోతి” అంటే ” ఆత్మ ” ! సత్యలోకంలో ఆత్మజ్యోతుల్లా వెలుగుతూన్న మనం .. అవసరరార్ధం ఒకానొక లింగ స్వరూపమైన ప్రాణమయ శరీరాన్ని సృష్టించుకుని స్వయం భూ జ్యోతిర్లింగ స్వరూపాల్లా అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చాం ! అక్కడి ఆనందమే .. ఇక్కడికి తెచ్చుకున్నాం !

కానీ ఇక్కడికి వచ్చాక రజ్జుసర్పభ్రాంతితో కూడిన భ్రమలో పడి ఇదంతా మర్చిపోయాం ! లేనిది ఉన్నట్లుగా .. ఉన్నది లేనట్లుగా భ్రమ చెందుతూ మనలోని బ్రహ్మతత్త్వాన్ని మర్చిపోయి శివపూజలూ, విష్ణుస్తోత్రాలూ చదువుకుంటూ పొద్దుపుచ్చుతున్నాం ! పూజలు చేసి చేసి పూజారుల్లా, స్తోత్రాలు చదివి చదివి పండితుల్లా కాగలమేమో కానీ సృష్టికర్తల్లా మరి సహసృష్టికర్తల్లా ఎన్నటికీ కాలేము ! “పుట్టేముందు ఒకలా ఉన్న వాళ్ళం పుట్టిన తరువాత మరోలా ఎలా ఉంటాం?” అన్న సత్యం మరచి పోయిన పరమాత్మ స్వరూపాలమైన మనం తక్షణం ధ్యానజ్ఞాన సాధనలు చేసి మనలోని జ్యోతిర్లింగాలను పునఃసృష్టిచేసుకోవాలి.