స్వర్ణాంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి కల కంటోంది – అదే స్వర్ణాంధ్రప్రదేశ్.
నేటి కలలే రేపటి వాస్తవాలకు మూల బీజాలు అవుతాయి.
కలలు అనేవి కల్లలు కావు.
భవిష్యత్తు లో మనకు కావాల్సిన వాటిని కావల్సిన విధంగా మనం స్వయంగా తీర్చిదిద్దుకునే సుత్తీ కొడవళ్ళే నేడు మనం కనే కలలు.
అయితే, కేవలం చక్కటి కలలు కంటే, కేవలం కలలు మాత్రం కంటూనే వుంటూంటే ఏమి లాభం లేదు.
రాష్ట్రం స్వర్ణసదృశం కావాలంటే దానికి ఏది కావాలో అది చెయ్యాలి.
రాష్ట్రం అంటే మట్టి కాదు ప్రజలు;
దేశంలోని ప్రజలు మట్టికొడుతూ వుంటే దేశం కూడా మట్టి కొడుతూనే వుంటుంది.
ప్రజలు అయోగ్యులైతే రాష్ట్రం అయోమయంగా వుంటుంది.
ప్రజలు యోగ్యులుగా వుంటేనే రాష్ట్రం స్వర్ణతుల్యమవుతుంది.
యోగ్యత అన్నది యోగ పరిచయం ద్వారా అంకురించి, క్రమక్రమంగా, పటిష్ఠ యోగసాధన ద్వారా పుష్పించి, ఫలిస్తుంది.
భౌతికపరమైన శాస్త్రవిజ్ఞానంతో మాత్రమే అయితే యోగ్యత అన్నది ఎప్పటికీ సిద్ధించదు. కేవలం భౌతిక పరమైన విజ్ఞానంతో యోగ్యత అన్నది గగన కుసుమమే.
మరి ఆధ్యాత్మికపరమైన శాస్త్ర అభ్యాసం ద్వారానే, యోగానుష్టానం ద్వారానే ప్రజలు యోగ్యులై విలసిల్లేది. ఒక్కమాటలో చెప్పాలంటే ధ్యానాంధ్రప్రదేశ్ కాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టి అన్నది గాలిలో పెట్టిన దీపం; పేక మేడ; ఆకాశ హర్మ్యం; మృగతృష్ణ.
ధ్యానాంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ విధిగా, తప్పనిసరిగా రోజుకు కనీసం గంటైనా ఆనాపానసతి ధ్యానంలో నిమగ్నం అవడం నేర్చుకోవాలి.
ఒక్కటే ఒక్క ధ్యాన రీతి …
అదే వాయు పుత్రుడు కావడం – అదే మారుతీ పుత్రుడు కావడం, అదే పవన పుత్రుడు కావడం – అదే హంస పుత్రుడు కావడం.
అదే శ్వాస మీద ధ్యాస, అదే ఆనాపానసతి, అదే సుఖమయ ప్రాణాయామం. అదే కుంభక రహితమైన కేవల పూరక రేచకాత్మకం.
మొదట అందరూ హింసను వదలిపెట్టేయాలి. ఎవ్వరికీ మరొకరిని హింసించే హక్కు లేదు.
అహింసో పరమో ధర్మః అన్నాడు కదా గౌతమ బుద్ధుడు 2500 సం|| క్రిందటే. అయినా బుద్ధి ఇంకా రాలేదు, ఆంధ్రప్రజలకూ మరి ప్రపంచ ప్రజలకూ …
బుద్ధుడు పుట్టిన దేశంలోనే బుద్ధి లేదు ఎవరికీ ; అదేం చోద్యమో ; అదేం విచిత్రమో.
అహింసాత్మకం + హంసాత్మకం = స్వర్ణాంధ్రప్రదేశ్.