స్వర్గజీవన సూత్రాలు
“వాస్తవ మూలం ఇదం స్వర్గం”
ఎవరైనా గానీ … ఎప్పుడైనా గానీ … ఎక్కడైనా గానీ … వాస్తవంలో జీవించవలె.
వాస్తవంలో జీవించాలి. అదే మనం చెయ్యవలసింది.
అవాస్తవంలో స్వర్గం ఎక్కడ ? వాస్తవంలో దుఃఖం ఎక్కడ?
వాస్తవంలో జీవిస్తేనే స్వర్గం. అవాస్తవంలో ఉంటేనే నరకం.
ఇదే మొట్టమొదటి స్వర్గజీవన సూత్రం. అంటే సరియైన విధంగా జీవించే సూత్రం.
“సర్వం ఖల్విదం బ్రహ్మ”
ఈ ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. ఈ ఉన్నదంతా చైతన్య పదార్థమే.
వాస్తవానికి మనం అందరమూ భగవత్ పదార్థం.
వాస్తవానికి మనం అంతా మూలసృష్టికి సంబంధించిన ఆత్మపదార్థం.
మనం ఎల్లప్పుడూ ఆత్మపదార్ధంగానే జీవించవలె.
ఇదే రెండవ స్వర్గజీవన సూత్రం . . .
“ఈశ్వరప్రణిధానం”
ప్రతి ప్రాణీ ఒకానొక భగవంతం.
సకల ప్రాణికోటి పట్ల సదా ప్రణామ భావన . . . కలిగి వుండవలె.
సకల జీవరాశి పట్లా, అన్నివేళలా, ‘మమాత్మా’ భావన కలిగి వుండవలె.
ఇదే మూడవ స్వర్గజీవన సూత్రం …
“ధ్యాన మూలం ఇదం జగత్”
ఈ జ్ఞానమంతా … ధ్యాన పదార్ధంలో మాత్రమే అనుభవైకవేద్యం.
మనం భగవత్ పదార్ధాలమై వున్నా ధ్యాన పదార్ధంగా లేనప్పుడు మనకు ఎరుకలోకి రాము.
ధ్యాన పదార్ధంలోకి రానంతవరకు భగవత్ పదార్ధానికి తాను భగవత్ పదార్ధం అని తెలీదు.
మనం విశేషంగా ధ్యానమూర్తులం అవ్వవలె.
ఇదే నాల్గవ స్వర్గజీవన సూత్రం …
” శ్వాస మూలం ఇదం జగత్ “
బీజం వృక్షానికి మూలం … ధ్యానానికి శ్వాస మూలం …
ఇదీ అయిదవ స్వర్గజీవన సూత్రం.
స్వర్గం కావాలనుకునేవారు “వాస్తవం” కోసం తమస్సు ను వీడి తపస్సు ను చేపట్టవలె.
“ఆధ్యాత్మిక” అన్నదే తపస్సు. ” ధ్యానం” ద్వారానే ఆధ్యాత్మికత.
ధ్యానం “శ్వాస” మూలంగా మాత్రమే సంభవం.
ఆ శ్వాస మన అందరి దగ్గరా వుంది ఇక దాని దగ్గర మనం వుందాం.