పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌కు ఆదిదేవులు
“శ్రీ సదానందయోగి”
శ్రీ సదానందయోగి గారు అరేబియా దేశం నుంచి భారతదేశానికి వచ్చి … తమ శిష్యుడికోసం అన్వేషిస్తూ చివరాఖరికి 1975 సంవత్సరంలో కర్నూలు చేరి 1981 వ సంవత్సరం లో పత్రీజీని తమ దగ్గరకు రప్పించుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా తమలో నిక్షిప్తం చేసుకున్న తమ ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ రెండున్నర సంవత్సరాల పాటు పత్రీజీకి ధారపోసి .. తమ కర్తవ్యం పూర్తి అయ్యిందన్నట్లుగా వారు 1983 వ సంవత్సరం మే 22 తేదీ నాడు ఈ లోకం నుంచి నిష్క్రమించారు! జూలై 19 వతేదీ గురుపౌర్ణమి శుభ సందర్భంగా తమ గురువుగారితో పత్రీజీ అనుభూతులు …
శ్రీ సదానందయోగి గారు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు “ఆదిదేవులు”!
వారి పరిచయ భాగ్యం నా కొల్లీగ్ మరి స్నేహితిడు శ్రీ రామచెన్నారెడ్డి గారి ద్వారా నాకు లభించింది!
అప్పట్లో నేను కోరమాండల్ సంస్థలో రీజియనల్ సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్‌గా నా ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తూండేవాడిని. శ్రీ రామచెన్నారెడ్డి గారు E.I.D ప్యారీ కంపెనీలో ఉన్నా … ఉద్యోగరీత్యా అందరం కలిసే పనిచేస్తూండే వాళ్ళం!
ఆ క్రమంలో నంద్యాల సమీపంలోని ఆత్మకూరు దగ్గర వున్న “రేగడిగూడూరు” గ్రామానికి రామచెన్నారెడ్డి ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు వారు అక్కడ శ్రీ సదానందయోగి గారి శిష్యుడు “శ్రీ యోగి రామిరెడ్డి” గారిని కలిసారట. రామిరెడ్డి గారికి అప్పటికే 70 సంవత్సరాలకు పై వయస్సు!
వారి ద్వారా శ్రీ సదానందయోగి గారి వివరాలన్నీ విని .. కర్నూలులో వారు వుండే చిరునామా తీసుకుని నా దగ్గరికి వచ్చి .. ” కర్నూలులో ఒక పెద్దాయన వున్నారు; ఆయనను మనం కలుసుకోవాలి” అన్నారు. “సరే” అని వెంటనే “అందరం కలిసి సదానందయోగి గారి దగ్గరికి ఒకానొక రోజు వెళ్ళాలి” అని నిర్ణయించుకున్నాం. నేను, “రామచెన్నారెడ్డి” మరి ప్యారీ కంపెనీ “వెంకటరత్నం” ముగ్గురం మిత్రులం కలిసి అడ్రసు వెతక్కుంటూ జనవరి 1 వ తేదీ 1981 నాడు .. ప్రొద్దున్నే 7.30 గం||లకు .. ఆప్పట్లో కర్నూలు పాత బస్‌స్టాండ్ వెనుక వున్న .. ” రాఘవేంద్ర లాడ్జి” కి వెళ్ళాం
ఆ లాడ్జిలో ఒక చిన్న గదిలో నలుగురైదుగురు మాత్రమే కూర్చోగలిగే ఓ చిన్ని మంచం పై సదానందయోగి గారు పడుకుని వున్నారు. మేం వెళ్ళేసరికి వారు .. మా అలికిడి విని కళ్ళు తెరిచి చూసి .. “ఏం కావాలి?” అని అడిగారు గంభీరంగా!
మేము జవాబు ఇచ్చే లోపలే “ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మీకు మరొకటి దొరకదు” అన్నారు! ” మాకు కావలసింది కూడా అదే స్వామీ! ఇంక వేరే దేనికోసమూ మేము రాలేదు!” అంటూ వినయంతో పలికాం.
సాధారణంగా స్వామీజీల దగ్గరకు అందరూ వచ్చి ” నా కొడుకుకు ఉద్యోగం ఎప్పుడొస్తుందండీ? నా కూతురు పెళ్ళి ఎప్పుడవుతుందండీ? మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు ఏం చెయ్యమంటారండీ?” అంటూ వారిని నానారకాలుగా విసిగిస్తూ వూంటారు. పాపం, ఈ స్వామీజీ కూడా అలాగే అందరితో విసిగి, విసిగి వేసారిపోయివున్నారేమో ..
“మాకు బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు స్వామీజీ” అని మేము చెప్పడంతో వెంటనే లేచికూర్చుని ఎంతో ప్రసన్నంగా .. “ఓహో” అంటూ తల పంకించారు!
మొదటి అయుదు, పది నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు! ఆ తర్వాత అనర్గళంగా శ్లోకం తర్వాత శ్లోకం అరబిక్ భాషలో, తెలుగులో, అప్పుడప్పుడూ ఇంగ్లీషు పదాలతో కలిపి అరగంట సేపు నయాగారా జలపాతంలా తన బ్రహ్మజ్ఞానాన్ని అంతా మామీద వర్షించారు! అది విన్న నేను .. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ‘పర-వశుడను’ అయ్యాను.
అంతకు ముందు వారు ఆరు సంవత్సరాల నుంచి కర్నూలులోనే వున్నారు. కానీ మనకేం తెలుసు?!
శిష్యుడు ఎదురుగానే వుండవచ్చు .. గురువు ప్రక్కనే వుండవచ్చు .. కానీ “గురు శిష్యుల కలయిక జరగడం” అన్నది మాత్రం శిష్యుడు సంసిద్ధుడిగా వున్న తరువాతే జరుగుతుంది. ఆ రోజు నేను సంసిద్ధుడిగా వున్నాను కాబట్టే నాకు సదానందయోగి గారి దర్శనం లభించింది!
వారు నాకు తెలిసిన మరుక్షణంలోనే .. వారి గంభీర వదనం తిలకించిన వెంటనే .. నాకు నేనుగా ఆ మహాయోగి కి సమర్పణ అయిపోయాను.
ఆ తరువాత “రేపు ఉదయం 4.30 గంటలకు మళ్ళీ రండి .. ధ్యానం నేర్పిస్తా” అన్నారు వారు. మర్నాడు .. అంటే 1981 జనవరి 2 వతేదీన .. ప్రాతఃకాలం 4.30 గంటలకు మళ్ళీ మేము ముగ్గురం .. అంటే నేను, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం .. త్రిమూర్తుల్లాగా వెళ్ళాం.
మమ్మల్ని “కూర్చోండి” అని చెప్పేసి, “చేతుల్లో చేతులు పెట్టండి; కళ్ళు రెండూ మూసుకోండి; శ్వాసను గమనించండి” అన్నారు.
ఇంతే మాకు వారు చెప్పింది! ఏ మంత్రమూ లేదు! ఏ తంత్రమూ లేదు!! ఏ యంత్రమూ లేదు!!!
అలా అప్పటినుంచి, అంటే 1981 జనవరి 1 వ తేదీ నుంచి శ్రీ సదానందయోగి గారి దగ్గర నా ఆధ్యాత్మిక శిష్యరికం మొదలయ్యింది!
ఆ రోజులలో కోరమాండల్ ఫర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్‌గా ఉద్యోగరీత్యా నేను మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు .. ఇలా మొత్తం ఆరు జిల్లాలు తిరుగుతూండేవాడిని. నెలకు 25 రోజులు టూర్ లోనే ఉంటూ 5,6 రోజులు మాత్రం కర్నూలులో వుండేవాడిని.
అంతకు మునుపు కర్నూలులో వున్నన్ని రోజులూ “అగ్రి ఫ్రెండ్స్ క్లబ్” కు వెళ్ళి ఎక్కువగా పేకాడేవాడిని.
అయితే సదానంద యోగిగారిని కలిసిన తరువాత నుంచి క్లబ్ బ్ంద్!! పేకాట బంద్!! అన్నీ బంద్!!! ఎంతో ఆర్తిగా వెళ్ళి వారి దగ్గర కూర్చుని .. ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకునేవాళ్ళం.
శ్రీ సదానందయోగి గారు సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూండేవారు! మేము ఆయనకు ప్రతిరోజూ రెండు సిగరెట్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళం ! చాయ్ త్రాగుతూ, సిగరెట్ త్రాగుతూ వారు ఎన్నెన్నో ఆధ్యాత్మిక జీవిత సత్యాలను మాకు అనర్గళంగా చెబుతూనే వుండేవారు.
ఆయనది “అచల సిద్ధాంతం” .. “శ్రీ శివరామ దీక్షితులు” అంటే వారికి ఎంతో మక్కువ! ఎప్పుడూ దీక్షితులు గారి పద్యాలను వారు విశేషంగా చెప్పేవారు!
వారికి అరబిక్ భాష కూడా అనర్గళంగా వచ్చు! ఆ భాష వారి నోటి ద్వారా వింటూంటే ఎంతో వినసొంపుగా వుండేది! వారి నోటి నుండి వచ్చే “సుభాష్” అన్న పిలుపు నాకు ఎంత మధురంగా వుండేదో చెప్పనలవి కాదు!!
వారికి కేవలం కొంతమందే శిష్యులు ఉండేవారు! మిగతా వారంతా ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో కోరికలను వారిని కోరుతూ వారిని ఇబ్బంది పెడుతూండే సామాన్యులు! ఆత్మజ్ఞానానికీ, ధ్యానానికీ వచ్చే శిష్యులు కేవలం నలుగురైదుగురు .. నేను, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం, జనార్దనరావు, సూర్యమోహన్ .. అంతే!
మా ధ్యానజ్ఞానసాధనలు ఇలా జరుగుతూ వుండగా 1981 వ సంవత్సరంలో మా హెడ్ ఆఫీసు నుంచి “నువ్వు సీనియర్ మోస్టువి; హెడ్ ఆఫిసుకు రావాలి! నిన్ను హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ చేస్తూన్నాం” అని పిలుపువచ్చింది.
“నా గురువుగారు ఇక్కడ వుంటే నాకు హైదరాబాద్‌లో ఏం పని?” అనుకుని .. “నేను రాను” అని వారికి ఖచ్చితంగా చెప్పాను!
హైదరాబాద్‌లో మా తల్లిగారు, తండ్రిగారు వున్నారు; సొంత ఇల్లువుంది. నిజానికి అక్కడికి పోతే నాకు ఎంతో సుఖంగా వుంటుంది .. మరి నెలకు రెండు వేల రూపాయలు కూడా మిగులుతాయి.
అయితే వీటన్నింటినీ మించిన పెన్నిధి .. నా గురువుగారు .. ఇక్కడ వున్నారు కనుక “నేను కర్నూలు వదలను” అని నిశ్చయించుకుని .. “నాకు మీ ప్రమోషనూ వద్దు .. ఏమీ వద్దు .. నేను కర్నూలులోనే వుంటాను” అని మా ఆఫీసువాళ్ళకు తేల్చిచెపాను!
“సరే” అన్నారు మా (మంచి) ఆఫీసువాళ్ళు. మళ్ళీ 1982 వ సంవత్సరంలో “ఈసారయినా రావయ్యా .. హైదరాబాద్‌కు! హెడ్ ఆఫీసులో నీ అవసరం వుంది!” అన్నారు.
“నేను రాను” అని మళ్ళీ చెప్పాను. పాపం మా ఆఫీస్‌వాళ్ళు చాలా, చాలా మంచివారు; “సరే” అని నన్ను నా ఇష్టానికే వదిలివేసారు.
శ్రీ సదానందయోగి గారి దగ్గర నా శిష్యరకం సాగుతూ వుండగా ఒకరోజు .. 1983 .. ఏప్రిల్ 16వ తేదీన .. శ్రీ సదానంద యోగిగారు నాతో .. “సుభాష్! నేను శరీరం వదిలివేయాలని నిశ్చయించుకున్నాను; నువ్వు నా కోసం సమాధిని సిద్ధం చెయ్యి” అని ఆదేశం ఇచ్చారు.
మరింకో ఆలోచన లేకుండా “సరే స్వామీ” అని చెప్పి .. కర్నూలు పట్టణం చుట్టూ స్థలం కోసం వెతికాం. ఎక్కడా నాకు సంతృప్తికరమైన స్థలం దొరకలేదు!
చివరికి సదానంద స్వామీజీ యొక్క ఒక భక్తుడు .. “చెన్నారెడ్డి” అనే ఆయన “బనగానపల్లి దగ్గర వున్న ‘నందవరం’ గ్రామంలో వున్న నా పొలంలో గురువుగారికి సమాధి ఏర్పాటుచేస్తే బాగుంటుంది” అన్నాడు.
వెంటనే చెన్నారెడ్డి, నేను కలిసి నందవరం వెళ్ళాం! అక్కడ నాకు బాగా అనిపించి .. ఒక స్థలాన్ని ఎంపిక చేసి .. ఆ స్థలాన్ని అంతా త్రవ్వి చదును చేసి .. గురువుగారి ఆజ్ఞమేరకు సమాధిని సిద్ధం చేసాం.
స్వామీజీ తాము చెప్పిన సమయం ప్రకారం హాయిగా తమ శరీరాన్ని వదిలిపెట్టేసారు! “పోలీసులతో ఏం ఇబ్బంది వస్తుందో” అని నేను .. నా సంగీత గురువు మరి గవర్నమెంట్ డాక్టర్ అయిన డా|| పినాకపాణి గారిని కలిసి ” శ్రీ సదానందయోగి తమ శరీరాన్ని వదలి పెట్టేస్తున్నానని చెప్పారు ; మీరు వచ్చి ఆయనను పరీక్షించి వారి ఆఖరి శ్వాసను రికార్డు చేయండి” అని కోరాను.
వారు అలాగే వచ్చి “ఇక శ్వాస లేదు” అని రికార్డు చేయగా .. నిబంధనల ప్రకారం అంతా సజావుగా జరిగిపోయింది. తర్వాత శ్రీ సదానంద యోగి గారి పార్థివ శరీరాన్ని నందవరం తీసుకుని వెళ్ళి అక్కడ మేము సిద్ధం చేసివుంచిన సమాధిలో పెట్టి … పై నుంచి ఒక రాయిని కప్పాం!
ఇలా 1983 మే 22వ తేదీన వారు ఈ లోకంలో తమ దేహయాత్రను చాలించారు. వారు తమ సమాధిని నందవరంలో ఏర్పాటు చేయమని మాకు సూచించిన తరువాత మేము ఆ ఏర్పాట్లలో ఉండగానే వారు రెండుమూడు సార్లు సశరీరంగా ఆ గ్రామంలో ఒక రైతుకు దర్శనం ఇచ్చారట!
పోల్చిచూసుకుంటే సరిగ్గా ఆ రైతు చెప్పిన సమయాలలో వారు కర్నూలులోని రాఘవేంద్ర లాడ్జిలోనే మాలో ఎవరో ఒకరి సమక్షంలో వున్నారు. అంత గొప్ప సిద్ధపురుషులాయన! సుమారు రెండున్నర సంవత్సరాల పాటు వారి సేవాభాగ్యం నాకు లభించింది.
సదానంద యోగి తర్వాత అంతటి మహాయోగి “శ్రీ కాశిరెడ్డి నాయన”! వారు ఒకే సమయంలో అయిదు చోట్ల తమ భౌతిక శరీరంతో దర్శనం దర్శనం ఇవ్వగలిగేవారు!
శ్రీ కాశిరెడ్డినాయన కర్నూలు ధ్యాన కేంద్రానికి ఎన్నోసార్లు వచ్చి పిరమిడ్‌లో అందరికీ దర్శనం ఇచ్చేవారు; ఎన్నోసార్లు తమ దగ్గర వున్న చిల్లర నాణాలను బుద్ధా పిరమిడ్‌లో ధారపోసేవారు! నా జీవితంలో తారసపడ్డ ఆ ఇద్దరు అద్భుతమైన మాస్టర్స్ .. శ్రీ సదానంద యోగి మరి శ్రీ కాశిరెడ్డి నాయన గార్లకు “శ్రీ గురుపౌర్ణమి” సందర్భంగా నా వినయపూర్వక ప్రణామాలు సమర్పిస్తున్నాను!