“శ్రద్ధావాన్ లభతే జ్ఞానం”

 

“గురుబ్రహ్మ .. గురువిష్ణుః .. గురుర్దేవో మహేశ్వరహః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ .. తస్మై శ్రీ గురువేనమః”

మిత్రులారా!

ఈ రోజు గురుపౌర్ణమి. మనం గురువులకు కృతజ్ఞతలు తెలుపుకునే రోజు! అందరికీ ప్రప్రధమ గురువు తల్లి, రెండవ గురువు తండ్రి. తల్లి మృదువుగా వుంటే, తండ్రి మొరటుగా, కఠోరంగా వుంటాడు. తల్లి మృదువుగా లాలించాలి. తండ్రి కఠోరంగా బోధించాలి. మృదువుగా మాత్రమే బోధన చేస్తే పిల్లలో ఎదుగుదల సంపూర్ణంగా వుండదు.

గురుపౌర్ణమి సందర్భంగా మనం మన గురువులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. మనకు చిన్నప్పటినుంచి ఎవరెవరు ఏమేం నేర్పించారో వారందరూ గురువులే. వారందరినీ మన మనోఫలకం మీదకు గుర్తుతెచ్చుకుని తల్లి, తండ్రితో సహా .. అందరి గురువులకూ కృతజ్ఞతలు తెలపాలి. సంవత్సరానికి ఒకరోజు .. అలా చెయ్యాలి. అదే “గురుపౌర్ణమి” అంటే.

గురువులకే పరమగురువు శ్రీ వేదవ్యాసులవారు! అందుకే వారి పేరు మీద “వ్యాసపౌర్ణమి” అని మనం పండుగ చేసుకుంటున్నాం. ‘వ్యాస‘ అంటే వ్యాపించి వుండడం. ఎవరు ఎంత కృతజ్ఞతతో వుంటారో వారి చైతన్యం అంతగా వ్యాపిస్తుంది. విశేషమైన కృతజ్ఞత గలవారు కనుక ఆయన చైతన్యం విశేషంగా వ్యాపించింది. అందుకే వేదవ్యాసులవారు మనకు గురువులలో అగ్రగణ్యులు.

ఎందరెందరి నుంచో ఎన్నెన్నో నేర్చుకుంటాం. ఒక చెట్టునుంచి నేర్చుకుంటాం.. ఒక జంతువు నుంచి నేర్చుకుంటాం.. ఒక చేప నుంచి నేర్చుకుంటాం .. ఒక చీమ నుంచి నేర్చుకుంటాం.. ఒక భ్రమరం నుంచి నేర్చుకుంటాం .. ఎన్నెన్నో. నేర్చుకునే తపన వుంటే ఎంతైనా నేర్చుకోగలం. ఎన్ని నేర్చుకోవాలి? జీవితంలో ఎలా నడవాలో నేర్చుకోవాలి, ఎలా కూర్చోవాలో నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎలా వంట చేయాలో నేర్చుకోవాలి, ఎలా తినాలో నేర్చుకోవాలి .. ఎన్ని వున్నాయో.

 

“ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు”

 

మనకు ప్రత్యక్ష గురువులు వుంటారు; పరోక్ష గురువులూ వుంటారు. ప్రత్యక్ష గురువులు కొందరే వుంటారు; పరోక్ష గురువులు అనేకానేకం వుంటారు. ప్రత్యక్ష గురువులు కొట్టి, తిట్టి, బ్రతిమాలి, తినిపించి నేర్పిస్తారు. కొట్టారనీ, తిట్టారనీ అలిగి వెళ్ళిపోతే ఏమీ నేర్చుకోలేం. అన్నీ భరించగలిగినప్పుడే నేర్చుకోగలం.

నేను .. మహాత్యాగాంధీ గారి ద్వారా ‘సత్యం‘ గురించి తెలుసుకున్నాను. విలియం షేక్ స్పియర్ ద్వారా ‘ఇంగ్లీష్‘ నేర్చుకున్నాను. గొప్ప గొప్ప క్రికెట్ ఆటగాళ్ళను చూసి క్రికెట్ నేర్చుకున్నాను. జర్మన్ గురువు గారి నుంచి .. జర్మన్ భాష నేర్చుకున్నాను. యోగా టీచర్ దగ్గర నుంచి యోగా నేర్చుకున్నాను. కొన్నివేల పుస్తకాలు చదవి వేలాది పరోక్ష గురువుల ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను. ఎందరో గురువుల దగ్గర నేర్చుకున్న సారమే ఈ ‘నేను‘.

మిత్రులారా, మనం ఈ రోజు ప్రత్యక్ష మరి పరోక్ష గురువులందరికీ మన కృతజ్ఞతలు చెప్పుకునే రోజు. అందుకే “గురుర్దేవో” అన్నాం. అంటే గురువే దైవం.

మనం అందరం కూడా ఎంతో మందికి గురువులం మనం కూడా ఎన్నో విషయాలు ఎందరికోనేర్పించాం, మనం కూడా కొంతమందికి ప్రత్యక్ష గురువులం .. మరి వందలాది వేలాదిమందికి పరోక్ష గురువులం.

 

“గురి యే గురువు”

 

ఒకరోజు ఒకాయన రమణమహర్షి దగ్గరికి వెళ్ళి “గురువు అంటే ఎవరు?” అని అడిగాడు.

రమణమహర్షి “గురువు అంటే ‘ఎవరు‘ కాదు, ‘ఏమిటి‘ అని అడగాలి” అన్నారు.

ఆయన మళ్ళీ “గురువు అంటే ఏమిటి?” అని అడిగాడు.

“గురియే గురువు” అన్నారు రమణ మహర్షి! “గురి” అన్న తత్వమే “గురువు”

మన “గురి”యే దైవం. గురుర్దేవో .. మహేశ్వరహః; “ఈశ్వర” అంటే పాలన “మహా” .. అంటే విశేషంగా. మన గురి ద్వారా మన జీవితం విశేషంగా పావనం చేయబడుతుంది.

“సంగీతం మీద గురిపెట్టాను” కనుక సంగీతజ్ఞుడిని అయ్యాను. ” నా జ్ఞానం మీద గురి వుంచారు” కనుక మీరు జ్ఞానులు అయ్యారు. “శ్వాస మీద గురి వుంచారు” కనుక మీరు ధ్యానులు అయ్యారు.

గురియే గురువు

“గురి” అన్న తెలుగు పదానికి సరిసమానమైన సంస్కృతపదం “శ్రద్ధ”.

భగవద్గీతలో శ్రీ వేదవ్యాసులవారు “శ్రద్ధవాన్ లభతే జ్ఞానం” అన్నారు.. “శ్రద్ధ కలిగివున్నప్పుడే జ్ఞానం లభిస్తుంది” అని అర్థం.

గౌతమబుద్ధుడు చివరిరోజు చివరిక్షణాలు .. చనిపోతున్నప్పుడు ఆనందుడు ఏడ్చాడు. “స్వామి! మీరు పోతే మమ్మల్ని చూసేది ఎవరు?” అని వలవలా ఏడ్చాడు. అప్పుడు బుద్ధుడు “నిన్ను నువ్వే పరిపాలించుకో”, “అప్పో దీపో భవ’ అన్నాడు.

రమణమహర్షి .. “గురి యే గురువు” అనీ ..

బుద్ధుడు .. “అప్పో దీపో భవ” అనీ ..

శ్రీ వ్యాసులవారు .. “ఉద్ధరేత్ ఆత్మనాత్మానాం”, “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” అనీ .. నొక్కివక్కాణించారు.

శ్రీకృష్ణుడు ” కౌరవులకు ఎంతో నేర్పిద్దాం” అనుకున్నాడు. కానీ కౌరవులు నేర్చుకున్నారా? లేదు. ఎందుకంటే వారికి శ్రద్ధలేదు కనుక, పాండవులకు శ్రద్ద వుంది అందుకే పాండువులకు శ్రీకృష్ణుడు గురువు అయ్యాడు.