శక్తి వినిమయ విధి విధానం. ‘E’ – కాన్సెప్ట్
“శక్తి … అంటే Energy అన్నది .. Existence .. Evolution .. Experiment .. Experience .. Expression .. Enlightenment .. Enjoyment .. అనే ఏడుసార్లు రూపాల్లో మన జీవితాలను సుసంపన్నం చేస్తూ ఉంటుంది.”
1. Existence .. అస్తిత్వం .. ఉనికి :
“ఈ సువిశాల విశ్వంలో ఉన్న అనేకానేక లోకాలకు చెందిన మనం అంతా కూడా ప్రస్తుతం ఈ భూగ్రహం మీద జన్మలు తీసుకున్న సర్వశక్తివంతులమైన శుద్ధ చైతన్య స్వరూపాలం” అన్న మన ఉనికినీ .. మన అస్తిత్వాన్నీ .. మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి.
2. Evolution .. పరిణామక్రమం :
అనేకానేక నక్షత్ర లోకాలూ, గ్రహ ఉపగ్రహ కక్ష్యలతో పాటు, సౌరమండలాలూ, మరెన్నో వింతలూ, విడ్డూరాలతో నిండి ఉన్న మన సువిశాల విశ్వం .. పరిణామక్రమంలో భాగంగా నిరంతరం మార్పును ఆహ్వానిస్తూ .. పురోగతి దిశలో సాగుతూ ఉంటుంది.
అలాగే విశ్వజీవులమైన మనం కూడా .. ప్రతి క్షణం మన జీవితంలో జరిగే మార్పులను ఆత్మపూర్వకంగా ఆహ్వానిస్తూ వుండాలి.
ఒక పిండం .. బాలుడిగా, యవ్వనస్థుడిగా, మధ్యవయస్కుడిగా మరి వృద్ధుడిగా .. ఇలా అనేక విధాలుగా అభివృద్ధి చెందినట్లే .. ఒక ఆత్మ కూడా అనేకానేక అనుభవాల జ్ఞానంతో .. శైశవాత్మగా .. బాలాత్మగా .. యవనాత్మగా .. వృద్ధాత్మగా .. మహాత్మగా మరి పూర్ణాత్మగా ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అప్పుడే మన ఆత్మకు పురోగతి ఉంటుంది.
3. Experiment .. ప్రయోగాలు :
ప్రయోగాలు చేస్తూంటేనే మనకు క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తూంటాయి! ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటూన్న వస్తువులూ, సౌకర్యాలూ మరి టెక్నాలజీ అంతా కూడా ఇలా మనం ప్రయోగాల ద్వారా పొందినవే. ఇదంతా భౌతిక ప్రపంచానికి చెందినది!
అయితే .. విశ్వలోక జీవులం అయిన మనం భౌతిక పరమైన ప్రయోగాలతో పాటు ఆధ్యాత్మిక పరమైన ప్రయోగాలను కూడా చేస్తూనే వుండాలి. దివ్యచక్షువు, సూక్ష్మశరీరాలతో శాస్త్రీయమైన ధ్యాన ప్రయోగాలు చేసి ఉన్నతలోక జ్ఞానాన్ని పొందాలి!
4. Experiences .. అనుభవాలు :
రకరకాల భౌతిక, మరి ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్ర ప్రయోగాల ద్వారా మనం విస్తారంగా అనుభవాలను గడిస్తాం! ఆ అనుభవాల సారాంశం ఆధారంగా .. ‘మంచి-చెడు’ .. ‘చేయవలసినవి – చేయకూడనివి’ .. ‘సరియైనవి-సరికానివి’ అన్న విషయాలకు సంబంధించిన ‘జ్ఞానాన్ని’ పొందుతాం!
5. Expressions .. అభివ్యక్తీకరణలు:
రకరకాల ప్రయోగాలు చేసి అనుభవం లోకి తెచ్చుకున్న జ్ఞానాన్ని మనం సరియైన రీతిలో వ్యక్తీకరణ చేయగలగాలి! అప్పుడే అది పదిమందికి ఉపయోగపడే సిద్ధాంతంగా రూపొందుతుంది. శాస్త్రీయమైన మరి సందర్భోచిత్తమైన ఆలోచనలూ, మాటలూ, చేతలూ మరి పుస్తక ప్రచురణలూ ఈ కోవకే చెందుతాయి.
6. Enlightenment .. దివ్యజ్ఞానప్రకాశం:
అనేకానేక రకాల ప్రయోగాలు చేసి పొందిన అనుభవ జ్ఞానం వల్ల మనలోని చైతన్యం అనంతంగా విస్తరించి .. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ‘ఏకత్వం’ అంతా మనకు అనుభూతికి వస్తుంది. అనంతకాలంగా ప్రయాణం సాగిస్తోన్న ఆత్మ స్వరూపులమైన మనకు ‘చావు’ అన్నది లేనే లేదు అన్న సత్యం అనుభవంతో అవగాహనకు వస్తుంది.
7. Enjoyment .. ఆనందం:
” ‘సత్యం’ అన్నది అనుభవంలోకి వచ్చాక ఇక అర్థం పర్థం లేని భయాలూ, ఆందోళనలూ, అజ్ఞానాలూ మరి మూర్ఖత్వాలూ అనబడే సకల దుఃఖాల నుంచి మనం విముక్తలం అవుతాం! ప్రతి క్షణం అత్యంత ఎరుకతో జీవించడంలో వున్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ .. శక్తివంతంగా, రసవంతంగా మరి జ్ఞానవంతంగా మన జీవితాన్ని పండుగలా చేసుకుంటాం!!”
పత్రీజీ అందించిన ఈ “శక్తి పూర్వకమైన” సందేశాన్ని మంత్రముగ్ధులై విన్న ముంబయి పిరమిడ్ మాస్టర్లు .. ఎంతో ఆనందించారు!!