“సత్యయుగ కాంతి కార్యకర్తలు”
1947, నవంబర్ 11వ తేదీన నిజామాబాద్ జిల్లా “బోధన్” లో నేను జన్మించాను.
“మన జన్మను మనమే ఎంచుకుంటాం” అన్న ఆత్మప్రణాళికలో భాగంగానే నేను.. నా తల్లిదండ్రులనూ మరి నేను పుట్టవలసిన ప్రదేశాన్నీ ఎంచుకుని మరీ భిన్న సంస్కృతుల మేళవింపుతో కూడిన “బోధన్” పట్టణంలో పుట్టాను!
మా అమ్మ “సావిత్రమ్మ” గారి సంరక్షణలో పెరుగుతూ.. నా అన్నగారైనా “వేణువినోద్” గారి సహకారంతో నేను సంగీతం పట్ల అభిరుచిని పొందాను.
1963 నుంచి 1970 వరకు సికింద్రాబాద్ లో “శ్రీ T.S. చంద్రశేఖరన్” గారి దగ్గర వేణువు; 1975 నుంచి 1978 వరకు కర్నూలు లో “పద్మభూషణ్ డా|| శ్రీ పాద పినాకపాణి” గారి దగ్గర ఉన్నత స్థాయి కర్నాటక సంగీతం నేర్చుకున్నాను.
నా ప్రాధమిక మరి మాధ్యమిక పాఠశాల విద్యాభ్యాసం బోధన్‌లోనూ, మరి ఉన్నత పాఠశాల, B.Sc డిగ్రీ చదువులు సికింద్రాబాద్లలోనూ పూర్తిచేసుకున్న తరువాత నేను.. 1966-1970 సంవత్సరాలలో B.Sc అగ్రికల్చర్ .. 1970-1974 సంవత్సరాలలో M.Sc అగ్రికల్చర్ పూర్తిచేశాను.
అదే సమయంలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉన్న “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR” లో ఒక సంవత్సరం పాటు “రీసెర్చ్ ఫెలో” గా పనిచేశాను.
1970 లో ఒక సంవత్సరం పాటు “ఇన్‌కమ్‌టాక్స్ ఇన్స్పెక్టర్”గా తెనాలి లో పనిచేశాను.
ఆ తరువాత “కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్” లో 1975 సంవత్సరం నుంచి1992 సంవత్సరం వరకు ‘సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్’ గా.. ‘సీనియర్ అగ్రోనమిస్ట్’ గా.. ‘రీజియనల్ మార్కెటింగ్ ఆఫీసర్’ గా .. మొత్తం మీద సుమారు పద్దెనిమిది సంవత్సరాలపాటు ఆ కంపెనీలో పనిచేశాను.
అయితే ఈ భౌతిక జీవితం, ఈ ప్రాపంచిక చదువులతో పాటు నాకు చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మికతపట్ల చాల ఉత్సుకత వుండేది. చిన్నప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి “శాంతినికేతన్” గురించి విన్నప్పుడల్లా నా ఒళ్ళు పులకరించి పోయేది. నేను నా ఎనిమిదేళ్ళ వయస్సులో మొట్టమొదట చదివిన పుస్తకం మహాత్మా గాంధీ గారి “మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్”.
అలాగే పదేళ్ళ వయస్సులో విశ్వనాధ సత్యనారాయణ గారి “వేయిపడగలు” .. పదిహేనేళ్ళ వయస్సు లో పండిత సర్వేపల్లి రాధకృష్ణన్ గారు వ్రాసిన “ఇండియన్ ఫిలాసఫీ” రెండు సంపూర్ణ సంపుటాలను చదివాను!
ఆ తరువాత పది సంవత్సరాలలో ఇంగ్లీష్ సాహిత్యం ఎంతో చదివాను: ఛాసర్, షేక్స్పియర్, మిల్టన్ ల నుంచి మొదలుపెట్టి డికెన్స్ వరకు .. టాల్‌స్టాయ్, డోస్టోవిస్కీల నుంచి మొదలుపెట్టి రవీంద్రుడి ‘గీతాంజలి’ వరకు కొన్ని వందల సాహిత్యపరమైన ఇంగ్లీష్ పుస్తకాలను చదివి తెలుగులో చలం, శ్రీ శ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, అడవి బాపిరాజు మొదలైన వారు రచించిన పుస్తకాలను విస్తారంగా చదివాను. కొద్దిగా హిందీ పుస్తకాలు కూడా చదివాను.
చదువుతో పాటు నా సంగీతసాధన, ఆటలూ పాటలూ ఉద్యోగం, సంసారం .. అందరిలా అతి సాధారణంగా గడిచిపోతున్నా కూడా .. నాలో ఏదో తపన నన్ను ప్రశాంతంగా వుండనిచ్చేది కాదు. “ఏదో చెయ్యాలి” అనిపించేది కానీ .. ” ఆ చెయ్యాల్సింది ఏమిటో” తెలిసేది కాదు! అన్నీ వున్నా ఏదో వెలితి .. అంతా అయోమయం!
అనేకానేక పుస్తకాలు చదివి కొద్దిగా “జ్ఞానయోగి” అయ్యాను; సంగీతం నేర్చుకుని కొద్దిగా “నాదయోగి” అయ్యాను; మంచి పనులు చేస్తూ కొద్దిగా “కర్మయోగి” అయ్యాను.
1976 సంవత్సరం వరకు ఆ ‘మంత్రం’ అనీ ఈ ‘ఆసనం’ అనీ .. కొన్ని నేర్చుకున్నాను కానీ నాలోని అయోమయం మాత్రం తగ్గలేదు. అంతా అపసవ్యంగా తోచేది! 1976 సంవత్సరం తరువాత కర్నూలు మిత్రుడు శ్రీ రామచెన్నారెడ్డి ద్వారా “ఆనాపానసతి” ధ్యానం నేర్చుకున్నాక అంతా సవ్యంగా మారిపోయింది!
అప్పటి వరకు నా జీవితం కుర్చీలో .. ముందుకూ వెనుకకూ వంగి అటూ ఇటూ అయోమయం ఊగుతూ ఉన్నవాడిని .. తరువాత అదే కుర్చీలో రిలాక్స్డ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను!!
ధ్యానం చెయ్యకముందు ఇల్లు కట్టుకుంటాం .. పెళ్ళాం వుంటుంది .. మొగుడువుంటాడు .. పిల్లలు వుంటారు .. “అన్నీ బావుంటాయి” కానీ .. “ఏమిటో బాగోదు”! కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో .. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రం గురించి అవగాహన చేసుకుంటామో .. అప్పుడు “అన్నీ బావుండటం” అన్నది నిజంగా ప్రారంభం అవుతుంది!
కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటిటంటే ప్రాపంచిక చదువులు అందరికీ తప్పనిసరిగా కానీ దానికన్న తప్పనిసరి “ఆధ్యాత్మిక విద్య”! ఆధ్యాత్మిక విద్యతో కూడిన జీవితాలే పరిపూర్ణంగా ఉంటాయి కనుక నేను కూడా జ్ఞానపరంగా ’ఆధ్యాత్మికత’ అన్నది క్షుణ్ణంగా తెలుసుకుని .. మరి అభ్యాసపరంగా ’ధ్యానం’ అన్నదీ తప్పనిసరి అనుభవంలోకి తెచ్చుకున్నాకే పరిపూర్ణంగా జీవిస్తూవచ్చాను.
1979 చివరాఖరిలో టిబెట్ మహాయోగి డా|| లోబ్సాంగ్ రాంపా వ్రాసిన విజ్ఞానదాయకమైన పుస్తకం ”You Forever” ను నేను చదవడం జరిగింది. దివ్యచక్షువు గురించీ, సూక్ష్మశరీరయానం గురించీ, అకాశిక్ రికార్డు ల గురించీ, మరి మరణానంతర జీవితం గురించీ వారు తమ స్వానుభవాలను తిరుగులేని విధంగా అందించి నన్ను ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడి లా మలిచారు.
వారి నుంచి అపారమైన పరలోక జ్ఞానాన్ని అందుకున్న నేను ఒక ఆత్మవిజ్ఞాన శాస్త్రజ్ఞుడినై “ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే వుంటుంది” అన్న సత్యాన్ని తెలుసుకున్నాను.!
‘మనలో ఎంత అభివృద్ధి కనిపిస్తుందో ప్రపంచంలో కూడా అంతే అభివృద్ధి మనకు సహజంగానే కనపడుతుంది” అన్న అవగాహనను పొందాను.
‘మనలో ఆనందంగా వుంటే .. అందరూ ఆనందగానే వుంటారు. కనుక మన దృక్పథాన్ని శాస్త్రీయంగా ఉండేట్లు సరిచేసుకుంటూ .. సృష్టిలో వున్న ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తీకరణలపట్ల గౌరవ భావంతో మెలిగితే చాలు” అన్న దివ్యత్వపు అవగాహనను పొందాను.
ఇదంతా తెలుసుకున్న మరు నిమిషంలోనే నాలోని ఆవేదనా భారంతో మెలిగితే చాలు” అన్న దివ్యత్వపు అవగాహనను పొందాను.
ఇదంతా తెలుసుకున్నా మరు నిమిషంలోనే నాలోని అవేదనా భారం అంతా తగ్గిపోయి నా జన్మలక్ష్యం ఏమిటో నాకే అర్థం! అయ్యింది! దాంతో నేను నా ఉద్యోగ ధర్మాన్ని నైపుణ్యంగా నిర్వర్తిస్తూనే .. ఎక్కడెక్కడ పనిచేస్తున్నానో అక్కడక్కడ అందరికీ ధ్యానాన్నీ మరి నేను తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్నీ, దుఃఖ నివారణోపాయాలనూ చెప్తూ వచ్చాను.
ప్రతి ఒక్కరికీ నా స్నేహహస్తాన్ని అందిస్తూ .. “ధ్యానం చేయవోయ్ .. శ్వాస మీద ధ్యాస పెట్టవోయ్!” అనేవాడిని. ” నీకు స్కూటర్ నడపడం నేర్పిస్తాను, ధ్యానం చెయ్యి” .. “నీకు టేబుల్ టెన్నిస్ ఆడడం నేర్పిస్తాను, ధ్యానం చెయ్యి” అంటూ ధ్యానం నేర్పించేందుకు ’లంచం’ ఇస్తూ ఒక్కొక్కరినీ పట్టుకుని ధ్యానంలోకి లాగాను!
అలా ఒక్కొక్కరికీ ధ్యానం నేర్పిస్తూ మొదలైన నా ధ్యానప్రచారోద్యమం .. ఇంతవరకూ “చేస్తే చెయ్యి .. లేకపోతే చావు” అన్న నా పరమగురువు శ్రీ సదానంద యోగి గారి అజ్ఞానుసారమే జరుగుతోంది!
సర్వదుఃఖాలకూ మూలకారణం అయిన మాంసాహార భక్షణ ను మరి జీవహింసను ప్రోత్సహించే సకల మానవాళిని నిరోధించాలి. అప్పుడే ఉత్తమ సమాజం రూపొందించబడి ఈ భూమి పై సకల శాంతి సౌభాగ్యాలూ విస్తారంగా వెల్లివిరుస్తాయి! “సత్యయుగ కాంతి కార్యకర్తలు” గా చరిత్రలో ఇంతవరకూ ఎంతో మంది ఈ భూమి మీదకు వచ్చారు!
అందరిపట్లా స్నేహపాత్రులై వుంటూ .. కరుణను కురిపించే ఈ సత్యయుగ కాంతి కార్యకర్తలకు “ధ్యానమహాచక్రం-VII ” అహింసా – శాకాహార మహాయజ్ఞం, విజయవాడ సందర్భంగా శతకోటీ ధ్యా నాభివందనాలు!!