సత్యం .. శివం .. సుందరం
“సత్యమేవ జయతే” అంటూ ముండకోపనిషత్తు .. “సత్యం మాత్రమే జయిస్తుంది” కనుక “ఎవరికైతే జయం కావాలో .. వారంతా కూడా సత్యంలోనే జీవించాలి” అని గొప్ప సందేశం ఇచ్చింది.
“జయ- విజయులు” విష్ణుమూర్తి యొక్క నిజస్థానమైన “వైకుంఠం” యొక్క ద్వారపాలకులు. “వైకుంఠం” అంటే “కుంఠితం లేనిది”. “నేను”, “నాది ” అన్న కుంఠితాలు లేని “వైకుంఠం” మన అంతరంగంలోనే కొలువై వుంది. దానిని చేరుకోవాలంటే మనం “ఉచ్ఛ్వాస”, “నిశ్వాస” అనే జయ విజయుల యొక్క అనుమతి తీసుకోవాలి !
“జయ-విజయులు” అనే ఉచ్ఛ్వాస-నిశ్వాసలతో చెలిమిచేయడమే “శ్వాస మీద ధ్యాస” ధ్యాన విధి విధానం!
అందుకే యోగి వేమన “ముక్కులోని గాలి .. ముక్తికి మరి దారయా” అంటూ అసలైన ముక్తిమార్గ సందేశాన్నిచ్చారు !
మన శరీరంలో వున్న “ముక్కు” అనే అవయవం ఊర్థ్వలోకాలకు ప్రవేశద్వారం అయితే .. “నోరు” అనే అవయవం నిమ్నలోకాలకు ప్రవేశం ద్వారం లాంటిది. సత్యం తెలిసినప్పుడే మన నోటినుంచి ప్రయోజనకరమైన మరి శాస్త్రీయమైన పలుకులు వస్తాయి ; అసత్యంలో ఉన్నప్పుడు నోటినుంచి అప్రయోజనకరమైన అశాస్త్రీయమైన పలుకులు వస్తాయి. అవి పరస్పర శ్రేయోదాయకంగా, మంగళకరంగా వుంటాయి కనుక సత్యంతో కూడిన పలుకులే శివరూపాలు మరి సుందర రూపాలు. “సత్యం” .. “శివం” .. “సుందరం ” లోని అంతరార్థాలు ఇవే !
అసత్యంతో కూడిన పలుకులు ఒక్కోసారి విజయాన్ని పొందినట్లు కనిపించినా .. అదంతా తాత్కలికమే ! వాటికి ఎలాంటి ప్రామాణిక విలువా ఉండదు. ఆ మాటలను మాట్లాడేవారు చనిపోయాక సూక్ష్మలోకాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడి న్యాయనిర్ణేతలను ఎదుర్కొని ఎంతో దుఃఖం చెందాల్సివస్తుంది.
వందకు వందశాతం ఒకానొక బుద్ధునిలా సత్యంలో జీవించి అనుభవ పూర్వకంగా సత్యాన్ని తెలుసుకున్న ఆత్మ “నీది ” .. “నాది ” .. “నువ్వు” .. “నేను” అన్న కుంఠితాల నుంచీ, జనన మరణ చక్రం నుంచీ, విముక్తి చెంది సత్యలోకంలో స్థితమై ఉంటుంది. “అవసరం” అనుకున్నప్పుడు మాత్రం తన స్వంత ఇచ్ఛప్రకారం తగిన గర్భాన్ని ఎన్నుకుని అత్యంత ఎరుకతో మళ్ళీ భూమ్మీద పుట్టి .. కారణలోకాలకు చెందిన ఉత్తమ ఆత్మలతో కూడి లోకకల్యాణ కార్యక్రమాలను చేస్తూ వుంటుంది.
ఆవిధంగా సదా లోకకల్యాణ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవారు పిరమిడ్ మాస్టర్స్ ! వారు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా వారికి అన్నింటా జయమే .. విజయమే !