సరస్వతీ పుత్రులు
మనం అంతా కూడా “సరస్వతీ పుత్రులం” ! “సరస్వతీ దేవి ” అంటే ” జ్ఞాన సంపద “. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరీ నదులు కంటికి కనిపించినట్లు ” సరస్వతీ నది ” కంటికి కనిపించదు ! అలాగే డబ్బు-దస్కం, ఆస్తులూ-అంతస్థులు వంటివి ఒక రూపంగా కంటికి కనిపిస్తే ” జ్ఞానం ” అన్నది కంటికి కనిపించని మహాసంపద !
కంటికి కనిపించని “సరస్వతీ జ్ఞానాన్ని” మనకు విశేషంగా తెలియజేసే “ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రం”. కంటికి కనిపించే ఈ లోకపు జ్ఞానాన్ని తెలియజేసే విద్యను “పరావిద్య” అయితే .. కంటికి కనిపించని నక్షత్రలోకాల గురించీ, గెలాక్సీల గురించీ, గ్రహాంతర జీవితాల గురించి మనకు తెలియజేసేది “అపరా విద్య” !
కైలాసపురిలో వున్న ఈ “శ్రీ సరస్వతీ సభా వేదిక” కంటికి కనపడని “అపరావిద్య” గురించి ఈ ప్రపంచానికి బోధిస్తోంది.
కఠోపనిషత్తులో “నచికేతుడి” వృత్తాంతం మనకు అపరావిద్య యొక్క విశిష్ఠతను తెలియజేస్తుంది. యమధర్మరాజు నచికేతుడికి రాజ్యాలూ, బోలెడు సంపదలూ ఇస్తానన్నాడు. ” అవన్నీ వద్దు కానీ .. మనిషి చనిపోయిన తరువాత ఏమవుతుందో తెలియజేసే సరస్వతీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు ” అని నచికేతుడు ప్రాధేయపడ్డాడు.
నచికేతుడు తలపండిన ముసలివాడేమీ కాడు .. పదహారేళ్ళ వయస్సున్న నవయవ్వన బాలుడు ! మనం కూడా నచికేతుడిలాగా చిన్నతనం నుంచే అపరావిద్యలో నిష్ణాతులం కావాలి. ఆ సరస్వతినీ జ్ఞానాన్ని అందుకోవడానికి తహతహలాడాలి. పదహారేళ్ళ యువకుడు సరస్వతీ జ్ఞానం కోసం యమధర్మరాజునే నిలదీసినప్పుడు మనమెందుకు ఖాళీగా కూర్చోవాలి? ! ఆ అపరావిద్య సమాచారాన్ని అందుకునేంతవరకు ” నచికేతుడు పట్టిన పట్టు “లా తపన పడుతూనే వుండాలి.
“సరస్వతీ జ్ఞానం” పొందడం అంటే తగిన స్వాధ్యాయయోగం చేస్తూ మేధస్సును పెంచుకోవడం. ముక్కంటిలా తగిన ధ్యానం చేసి దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని కోటానుకోట్ల లోకాలను దర్శించడం !
పిరమిడ్ మాస్టర్లంతా సరస్వతీ పుత్రులుగానే కాకుండా అద్భుతమైన “పిరమిడ్ పుత్రులు”గా కూడా విరాజిల్లుతూ వున్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ” పిరమిడ్ ” అన్న మహావరం గ్రహాంతరవాసులనుంచి ఇవ్వబడింది. అందుకే పిరమిడ్ మాస్టర్లందరూ తమ తమ స్వగృహాల్లో చిన్నవో, పెద్దవో పిరమిడ్లతో అనుసంధానం అయి వుంటారు. తమ తమ కాలనీల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ధ్యాన పిరమిడ్లను నిర్మిస్తూ ఆయా ప్రదేశాలను శక్తిక్షేత్రాల్లా మలుస్తున్నారు.
ఇలా భూమిని శక్తిక్షేత్రంలా మలిచే ప్రక్రియ మరింత వేగవంతం కావాలి ! మహా యోగి కబీర్ చెప్పినట్లు ” రేపు చెయ్యాల్సిన పనులను ఈ రోజే చెయ్యాలి ; ఈ రోజు చెయ్యాల్సిన పనులను ఇప్పుడే చేసేయ్యాలి “. రేపు ఏం జరుగబోతోందో మనకు తెలియదు కనుక చెయ్యాల్సినవన్నీ ఇప్పుడే చేసెయ్యాలి ! ధ్యానం కానీ .. పిరమిడ్ నిర్మాణం కానీ వెంటనే చేసెయ్యాలి !