సంధ్యా వందనం

 

ప్రొద్దున్నే సూర్యోదయానికి వందనం.

సాయంత్రం సూర్యాస్తమయానికి వందనం.

అయితే, సూర్యుడు ఉదయించనూ ఉదయించడు; సూర్యుడు అస్తమించనూ అస్తమించడు,

ఉదయం … సూర్యుడు కనపడని లోకాల నుంచి కనపడే లోకాలకు వస్తాడు.

సాయంత్రం … సూర్యుడు కనపడే లోకాల నుంచి కనిపించని లోకాలకు వెళతాడు.

వాస్తవానికి సూర్యుడు కదలడు.

కానీ భూమే కదులుతోంది; మనమే కదులుతున్నాం.

ప్రొద్దున్నే, భౌతిక సూర్యుణ్ణి కానని లోకాల నుంచి సూర్యుణ్ణి కనే లోకాలకు వస్తున్నాం.

ప్రొద్దున్నే మనమే, సూర్యుణ్ణి కనని దిశల్లో నుంచి సూర్యుణ్ణి కనే దిశలలోనికి వస్తున్నాం.

కనుక – ప్రాతఃకాలంలో ఆ సూర్యునికి జోహార్లు కాదు.

మనకు మనమే జోహార్లు చెప్పుకోవాలి.

సాయంసంధ్యలో సూర్యుణ్ణి కనే దిశలోంచి

సూర్యుణ్ణి కనని దిశల్లోకి మళ్ళీ మనం మరలుతున్నాం.

సూర్యుడు కనుమరుగు కావటం లేదు.

మనమే కనుమరుగు వేపు మళ్ళుతున్నాం.

వాస్తవానికి,

సూర్యుడు అంటే ఆత్మసూర్యుడు.

సూర్యతేజం అంటే ఆత్మతేజం.

రాత్రి నిద్రపోతున్నప్పుడు మనం శరీర తేజం నుంచి ఆత్మ తేజం వైపు మళ్ళుతున్నాం.

ప్రొద్దున్న నిద్ర లేచినప్పుడు ఆత్మ తేజం నుంచి శరీర తేజంలోకి ప్రవేశిస్తున్నాం.

ఈ రెండు సమయాలే వాస్తవానికి సంధ్యా సమయాలు.

ఆ సంధ్యా సమయాలలో ఎరుక లో వుండడమే సంధ్యావందనం మంటే.

వేకువ సంధ్యా సమయంలో ధ్యానంలో వుండటం మూలాన ఆత్మ తేజం శరీర తేజంలో సజావుగా ప్రవేశిస్తుంది.

అప్పుడు, కేవలం దేహం గా కాక దేహాత్మ గా మనం విరాజిల్లుతాం.

నిద్రపోయే సంధ్యాసమయంలో మనం ధ్యానం చేస్తూ నిద్రపోవటంతో ఆత్మ తేజం అన్నది దేహ తేజం నుంచి సజావుగా నిష్క్రమిస్తుంది.

ఆ స్థితిలో ధ్యానం అభ్యాసం చేస్తే చక్కటి సూక్ష్మశరీర యానాలు జరుగుతాయి.

ఆత్మ లోకాలు సువిదితమవుతాయి; ప్రస్ఫుటమవుతాయి.

నిద్రపోయేటప్పుడూ శ్వాస మీద ధ్యాస.

నిద్ర్ర నుంచి లేచేటప్పుడూ శ్వాస మీద ధ్యాస.

రాత్రి … శరీర – ఆత్మ సంధ్య వేళలో సంధ్యావందనం.

వేకువ … ఆత్మ – శరీర సంధ్య వేళల్లో సంధ్యావందనం.

అనునిత్య సంధ్యావందనం ద్వారానే జీవితంలో జయం.