“సాలోకం నుంచి సాయుజ్యం వరకు”

 

“సాయుజ్యం”

ఏదేని ఒక విద్యా అభ్యాసక్రమంలో ఉన్నాయి నాలుగు దశలు

మొదటిదశ “సాలోకం” .. రెండవదశ “సారూప్యం”

మూడవదశ “సామీప్యం” .. నాలుగవదశ “సాయుజ్యం”

ధ్యానయోగ అభ్యాసం అన్నది కూడా

సాలోకంతో మొదలై సాయుజ్యంతో సమాప్తం అవుతుంది

“సా” = “ఆ”  “ఆ” అంటే ఆ శ్వాస”

“సాలోకం” అంటే ” ఆ శ్వాస యొక్క లోకంలో”

“సారూప్యం” అంటే “ఆ శ్వాస యొక్క రూపంలో”

“సామీప్యం” అంటే “ఆ శ్వాస తోటి పూర్ణ ఐక్యతలో వుండడం”

“శ్వాసయే గురువు”

శ్వాసలోకంలో కొన్నాళ్ళు .. శ్వాస రూపురేఖల అవగాహనలతో కొన్నాళ్ళు ..

మరి శ్వాసకు అత్యంత సమీపంలో కొన్నాళ్ళు గడిపి

చివరికి శ్వాసతో ఏకం కావడం .. అంటే శ్వాసలో “సాయుజ్యం” కావడం

“శ్వాస” అనబడే “గురువు” తో ఏకం కావడం

శ్వాసయే మనకు “అసలు సిసలైన గురువు” కనుక

“అందువలన అసలు సిసలు గురువుగారికి ప్రణామాలు”

“తస్మై శ్రీ గురవే నమః”

“గురుర్‌బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”

“గురుసాంగత్యం”

గురులోకంలో ఉండడానికి సంకల్పించుకున్నప్పుడు “సాలోకం”

గురుచరిత్రను అధ్యయనం చెయ్య ప్రారంభించడం “సారూప్యం”

గురువుకు అత్యంత సమీపంలో ఉండడం “సామీప్యం”

క్రమక్రమంగా ముందుకు సాగుతూ గురువుతో ఏకం కావడం “సాయుజ్యం”

“గురుర్‌బ్రహ్మా” .. శ్వాసయే మూల ప్రాణచైతన్యశక్తికి ప్రతీక..

మరి ఆ మూలప్రాణచైతన్యశక్తే సృష్టికి మూలం

“గురుర్విష్ణుః” .. శ్వాసయే భౌతిక మరి ఆధ్యాత్మిక స్థిరత్వానికి మూలం

“గురుర్దేవో మహేశ్వరః .. శ్వాసయే సకల రుగ్మతల అంతర్ధానానికీ మరి

సకల అవలక్షణాల లయానికీ మూలం

“ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస”

“ముక్కులోని గాలి ముక్తికి మరి దారి” .. అన్నారు యోగి వేమన

“కాయపుటూపిరిలో గని ఉన్నది” .. అన్నారు అన్నమాచార్యులవారు

“ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు” అని కూడా వారు అన్నారు

“ఆనాపానసతి” .. “అప్పో దీపో భవ” .. అన్నారు గౌతమబుద్ధుడు

“ప్రాణాయామం, ప్రత్యాహారం” .. అన్నారు పతంజలి మహర్షి

ఆదిశంకరాచార్యుల వారు కూడా అదే ప్రవచించారు

“PSSM మూల సిద్ధాంతం”

ఒకానొక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మిత్రుడు కాగలడు

ఒకానొక వ్యక్తి ఇంకొక వ్యక్తికి శత్రువు కాగలడు

ఒకానొక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తటస్థుడు కాగలడు

ఒకానొక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కేవలం “స్ఫూర్తిదాత ” కాగలడు

అంతేకానీ .. ఏ వ్యక్తీ .. ఎవ్వరికీ .. ఎన్నటికీ “గురువు” మాత్రం కాజాలడు

“గురుసాంగత్యం” అంటే “శ్వాసానుసంధానం” సాధించడమే

“శ్వాసధార” తో సాయుజ్యం సాధించినప్పుడు .. “అదే మనం” అయినప్పుడు

పరంపరగా.. పర్యవసానంగా

ఆ “బ్రహ్మాత్మ” యే మనం అయినప్పుడు

“అహం బ్రహ్మాస్మి” అన్నది మనకు సంపూర్ణంగా సువిదితమవుతుంది

“గురువుకు శతకోటి వందనాలు”

“శ్వాస మీద ధ్యాస” అన్నది సర్వ రోగ హారిణి

“శ్వాస మీద ధ్యాస” అన్నది సకల రోగ నివారిణి

“శ్వాస మీద ధ్యాస” అన్నది సత్య జ్ఞాన ప్రదాయిని

“శ్వాస గురువు” కు శతకోటి వందనాలు