సహనమే .. ప్రగతి
“సహనం” అన్నది గొప్ప ప్రగతి సూత్రం
“సహనం” అంటే ఎంత కష్టం అయినా శాంతంగా భరించడం
“సహనం” అంటే ఎంత అయిష్టం అయినా శాంతంగా భరించడం
కర్మ సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళకు సహనం సహజంగానే అబ్బుతుంది
“మన వల్లే మన కష్టాలు .. మన వల్లే మన సమస్యలు” అని తెలుసుకున్నప్పుడు
సహజంగానే మనలో సహనం ఉద్భవిస్తుంది
ప్రాపంచిక విద్యలను నేర్చుకుంటూన్నప్పుడు ..
ప్రాపంచిక కళలలో మరి క్రీడలలో రాణించాలన్నప్పుడు ..
సహనంతో కూడిన సాధన మరి ఎంతో అవసరం
ధీరులు చివరి వరకు సహనం కోల్పోకుండా విజయులు అవుతూంటారు
ఆధ్యాత్మికంగా కూడా ధ్యానసాధన చేయాలంటే మరి ఎంతో “సహనం” అవసరం
ధ్యానసాధన మొదలైనప్పుడు
చుట్టుప్రక్కల వారి నుంచి ఎన్నో వ్యతిరేక భావనలను ఎదుర్కోవాల్సి వస్తుంది
లింగ-శరీరంలో నిక్షిప్తమై ఉన్న హాలాహలం బయటికి వస్తుంది
అన్నింటినీ సహనంతో భరించాలి
మరి ఇల్లు అలుకగానే పండుగ కాదుకదా!
భీరువులు అసహనం కారణంగా సాధనను వదిలిపెట్టేసి యోగభ్రష్టులు అవుతూంటారు
మరి వారు అవిజయులుగా మిగిలిపోతారు
ఎంతో సహనం ఉంటేకానీ యోగభ్రష్టత్వం నుంచి తప్పించుకోజాలం
“సంసారంలో ఉంటూనే నిర్వాణం పొందాలి” అంటే
హిమాలయాల అంత సహనం ఉండాలి!
అన్ని కష్టనష్టాలలోనూ ఎంతగానో ఓర్చుకుంటూ
జీవితలక్ష్యానికి, జీవితాంతం, సంపూర్ణంగా అంకితం కావడమే “సహనం”
సహనాన్ని షిరిడీ సాయినాధుడు “సబూరి” అన్నాడు
షిరిడీ సాయి ఎప్పుడూ “శ్రద్ధ”, “సబూరి” అంటూండేవారు
ప్రతి అవమానంలోనూ, ప్రతి అపహాస్యంలోనూ, ప్రతి ఓటమిలోనూ
ప్రతి అడ్డంకిలోనూ, మరి సంఘర్షణలోనూ సహనాన్ని పాటించాలి
శ్రీకృష్ణుడు శిశుపాలుని పట్ల నూటికి తొంభైతొమ్మిది సార్లు సహనాన్ని పాటించాడు
రామాయణంలో సీతారాముల సహనం, సుగ్రీవుడి సహనం
మహాభారతంలో పాండవుల సహనం మానవాళికి విశిష్టమైన ఉదాహరణలు
అరణ్యవాసం చేయడానికీ, అజ్ఞాతవాసం చేయడానికీ
మరి ఎంతటి సహనం ఉండాలి!
సంపూర్ణ సహనంలో జీవించేవాడే ఒకానొక “మాస్టర్” అవుతాడు
“ధ్యానం” అన్నది మనకు ఎంతో సహనాన్ని నేర్పిస్తుంది
“ధ్యానప్రచారం” అన్నది ఇంకా ఎంతో, ఎంతో సహనాన్ని అందిస్తుంది
ధ్యానప్రచార దీక్షాబద్ధులైన పిరమిడ్ మాస్టర్లందరూ పోతపోసిన సహనమూర్తులు!
పిరమిడ్ మాస్టర్లందరూ “సహనం”లో చక్రవర్తులు
గత ఇరవైఅయిదు యేళ్ళుగా
ఎంతో సహనంతో దేశమంతా రాత్రనక పగలనక, అవిరామంగా,
ధ్యానప్రచారం చేస్తూన్న పిరమిడ్ మాస్టర్లందరికీ
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ రజతోత్సవాల సందర్భంగా
విశేష అభినందనలు!
keep it up..
For the rest of this Life-Time..
My dear Masters!!