గురువులకే మహా గురువు శ్రీ ఋషి ప్రభాకర్ జీ
“నా చిన్నతనంలో ‘ ఋషులు ’ అన్న పదం నాకు చాలా బాగా నచ్చేది. అయితే అందరిలాగానే ‘ ఋషులు ఎక్కడో హిమాలయాలలో వుంటారు ’ అనుకునేవాడిని. అయితే, నా జీవితంలో మొట్టమొదటిసారి ‘ ఋషి ’ పేరుతో ‘ శ్రీ ప్రభాకర్ జీ ’ గారి పేరు వుండడం నాకు చాలా గొప్పగా అనిపించేది.”
” ఋషి ప్రభాకర్ జీ మనందరి జీవితాలను ప్రభావితం చేసి, మనందరికీ ‘ సిద్ధ సమాధి యోగ ’ ప్రక్రియను అందించారు. ఋషి గారు ఇక్కడి ప్రాంతం వారు అయినప్పటికీ .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది జీవితాలను ఉద్ధరించి, వారి జీవితాలలో ఎన్ని జ్యోతులు వెలిగించారో మనందరికీ తెలుసు. వాడవాడలా, ఊరూరా, ప్రతి ఇంటిలో శ్రీ ఋషిప్రభాకర్ జీ కొలువైవున్నారు ! ప్రతి ఒక్కరి ఆత్మోద్ధరణకు వారు అనంతమైన కృషి సలిపారు.
” ‘ఆధ్యాత్మికత’ అంటే ఏమిటి? ” లివింగ్ విత్ నేచర్ ” అంటే ఏమిటి? .. ” సాత్విక భోజనం ” అంటే ఏమిటి? ” .. ” అందరూ కలిసి వసుధైక కుటుంబకంగా జీవించడం ఎలా? ” అన్న విషయాలపట్ల అందరిలో ఒక అవగాహనా పూర్వకమైన వెలుగు వెలిగించారు ఋషి ప్రభాకర్ జీ !
” అంతటి మహాజ్యోతి .. ‘ భూలోకంలో చెప్పవలసింది అంతా చెప్పాను ; నా కర్తవ్యం అయిపోయింది ; ఇక మిగిలిన వారు తమ వంతు కర్తవ్యాలను తాము చెయ్యాలి ’ అని చెప్పి తమను తాము నిష్క్రమింపచేసుకున్నారు. “
ఇది సంతోషకర విషయం ; ఇక్కడ దుఃఖించడానికి ఏమీ లేదు ! ఒక గొప్ప మాస్టర్ తన ‘ మిషన్ ’ను విజయవంతంగా ముగించుకుని, ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు. సృష్టిలో కోటానుకోట్ల లోకాలు వున్నాయి .. కోటానుకోట్ల సమస్యలు వున్నాయి. ప్రతి ఒక్క లోకానికీ ఒక్కో సమస్య వుంది. ఒక్కొక్క లోకానికి సమస్య వచ్చినప్పుడు ..
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ ||
.. అని గీతాకారుడు చెప్పినట్లు .. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఋషులు అక్కడకు వెళ్ళి, వారితో సహజీవనాన్ని సాగించి .. అక్కడ ఆ సమస్యకు పరిష్కారమార్గం కనుగొని పరిష్కారం చూపిస్తారు. దేనిని అభివృద్ధి పరచాలో దానిని అభివృద్ధి పరచి .. దేనిని తీసివేయాలో దానిని తొలగించి .. దేనిని కలపాలో దానిని జతచేసి తమ మిషన్ను ముగించుకుంటారు.”
ప్రతి లోకంలోనూ పరమాత్మలు అందరూ ఇలా దిగుతూనే వుంటారు .. అందరికీ బోధించడానికి .. ‘ ఇది ఇలా వుండాలి ’ .. ‘ ఇది అలాగే చెయ్యాలి ’ .. ‘ ఇక్కడ ఇలానే నడుచుకోవాలి ’ .. ‘ అక్కడ అలానే మాట్లాడాలి ’ అని అన్నింటినీ బోధిస్తారు. అలా ఋషి ప్రభాకర్ గారు తమ జీవితాన్ని ముగించారు.
“ఈ లోకానికి వచ్చి ‘ ఇలా చేసుకోవాలి నాయనా ! ’ అని చెప్పి, చేసి చూపించారు. ఒక గొప్ప గురువుల బృందాన్ని ఆయన తయారు చేసి గురువులకే మహాగురువు అయ్యారు. గురువులకే గురువు అయిన వారిని మనం కలవడం ఒక గొప్ప విషయం.”
” సుమారు 15 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చి ఋషి ప్రభాకర్జీ ని నేను కలిశాను. వారు కూడా 8 మే, 2009న బుద్ధ పూర్ణిమ సందర్భంగా పిరమిడ్ వ్యాలీకి వచ్చి తమ సందేశాన్ని అందించారు.
“ప్రతి ఒక్కరూ బుద్ధత్వాన్ని పొందాలి ; ఆధ్యాత్మికమైన సామాజిక జీవితాన్ని జీవించాలి. మనం ధ్యానం చేయగా .. ధ్యానం చేయగా .. కళ్ళు తెరిచే వుంటాం, మాట్లాడుతూ వుంటాం, కానీ సహజ సమాధి – స్థితిలో వుంటాం ..”