పిరమిడాయణం
“రఘుపతి రాఘవ రాజారాం; పతీత పావన సీతారాం ;
ఈశ్వర్ అల్లా తేరేనాం ; సబ్‌కో సన్మతి దే భగవాన్.”
ప్రఖ్యాతి గాంచిన ఈ పాటను వింటూనే జ్ఞప్తికి వచ్చేది గాంధీజీ.
గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రుడైనవాడు రాముడు.
కారణం … రాముడు, గాంధీ ఇరువురూ ఒకే గూటికి చెందిన పక్షులు … విశుద్ధ చక్రానికి ప్రతీకలు.
తామిరువురూ సహస్రారానికి చెందినవారైనా
విశుద్ధానికి ప్రతిబింబాలుగా విలసిల్లేందుకు ఈ జన్మను తీసుకున్నవారు.
ఓ శాస్త్రాన్ని ఎంతగానో అభ్యసించిన మేధావి,
చిన్నపిల్లలకు ఆ శాస్త్రాన్ని వారి స్థాయికి తగినట్లు అద్భుతంగా బోధించిన విధంగా వారిరువురూ వారి వారి కార్యక్రమాలను అతి చక్కగా చేసి చూపారు.
“విశుద్ధ చక్రం” అంటే విపరీతమైన శుద్ధతను కలిగి వుండటం అన్నమాట. . . అంటే వ్యవహారిక ధర్మానుసారం పరిపూర్ణంగా ప్రవర్తించటం అన్నమాట.
పాంచభౌతిక జ్ఞానం మాత్రమే కలిగి వుండే సాధారణ ప్రజానీకానికి
అత్యంత ఆదర్శవంతులుగా కనిపించేవారు విశుద్ధం వారు మాత్రమే.
ఆ పైన వున్న ఆజ్ఞ, సహస్రార స్థాయిలలో ప్రవర్తించే వ్యక్తుల శైలి, ఔన్నత్యం వారికి అర్థం కావు.
వరుస క్రమంలో …
మూల, స్వాధిష్టాన, మణిపూరక చక్రాలు అశుభాన్నీ,
అనాహత, విశుద్ధ చక్రాలు శుభాన్నీ,
ఆజ్ఞా చక్రం ఆత్మజ్ఞానాన్నీ,
సహస్రారం చక్రాతీత స్వభావాన్నీ … సూచించి శుభాశుభాలకు అతీతమైన సత్యానుసంధానాన్ని ప్రదర్శించాయి.
అందుకే …
పాంచభౌతికమైన గడిచిన కాలానికి
“రామాయణం
శ్రీరాముని కథ
పితృవాక్య పరిపాలను”
వంటివి ఆదర్శాలై నిలిస్తే …
ఆత్మజ్ఞానమయమై నిలిచే రానున్న కాలానికి
“పిరమిడాయణం
పిరమిడ్ మాస్టర్ల కథ
సత్యవాక్ పరిసాధన”
వంటివి మైలురాళ్ళై నిలుస్తాయి.
నూతన యుగ ఆధ్యాత్మిక పరిశోధకులే పిరమిడ్ మాస్టర్లు
వీరంతా తప్పొప్పులకు అతీతమైన పితృవాక్య పరిపాలనకు చరమగీతం పాడి.
ప్రహ్లాదుడి బాటలో సత్యానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు.
కనుకనే …
“సత్యం శరణం గచ్ఛామి”
“సత్యవాక్యం శరణం గచ్ఛామి”
“సత్యవాక్ పరిసాధన శరణం గచ్ఛామి”
ఇవే పిరమిడాయణం నినాదాలు.