పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం
“యోగం”
” యోగం ” అంటే “కలయిక”.
“యుంజతే ఇతి యోగః” అని పెద్దలు చెప్పినట్లు .. ఏదైనా ఒకటి మరికదానిని కలిస్తే అది “యోగం” అవుతుంది.
ఒక స్త్రీ, మరొక పురుషుడు పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి వుంటే దానిని “వివాహయోగం” మరి “సంసారయోగం” అంటాం. ఏదేని ఒక వాహనాన్ని మనం స్వంతం చేసుకుని దానితో కలిసివుంటే “వాహనయోగం” అనీ .. మరి మన అభిరుచికి తగిన గృహాన్ని నిర్మించుకుని అందులో నివసిస్తూంటే “గృహయోగం” అనీ వింటూంటాం !
“యోగం” అనేది సుఖానికి దారి ! మరి తద్విరుద్ధమైనది దుఃఖానికి దారి !
“యోగం” అన్నది ఎక్కడ వుండదో అక్కడ “వియోగం” వుంటుంది .. మరి అది దుఃఖానికి దారి అని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్న అనేకరకాలైన యోగాలలో .. మన జీవితానికి ఎంతో అవసరమైన అతి ముఖ్యమైన కొన్ని యోగాలను గురించి తెలుసుకుందాం :
“హఠయోగం”
“హఠయోగం” అంటే మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండటం. అనేక రకాల ఆసనాల్లో, ముద్రల్లో, మన శరీరంతో మనం ఏకమై ఉండటమే హఠయోగం ! హఠయోగం వల్ల శరీరానికి ఉన్న తమోగుణం వదిలిపోయి, మన శరీరానికి ఎన్నో లాభాలు చేకూరి శరీరం చురుకుగా మరి ఆరోగ్యవంతంగా కాంతులీనుతూవుంటుంది.
“నాదయోగం”
“నాదయోగం” అంటే .. చక్కటి సంగీతంతో మనం ఏకమైపోవడం .. మరి సంగీత రసాస్వాదంలో లీనమైపోవడం !
“జ్ఞానయోగం”
“జ్ఞానయోగం” అంటే .. మహత్తరమైన ఆత్మజ్ఞాన పుస్తకాలలో వుండే జ్ఞానంతో ఏకమై ఉండడం! భగవద్గీత కానీ, పతంజలి యోగా సూత్రాలు కానీ చదువుతూన్నప్పుడు లేదా ఇతరుల ద్వారా వింటూన్నప్పుడు అందులోని జ్ఞానంతో మనం పూర్తిగా సమ్మళితమై వుంటే .. అదే జ్ఞానయోగం !
“కర్మయోగం”
“కర్మయోగం” అంటే మనం చేసే కర్మలతో మనం పూర్తిగా ఏకమై వుండడం. ఒకానొక విద్యార్థి చదువుకుంటున్నప్పుడు చదువుతోనే ఏకమై ఉండాలి .. మరి భోజనం చేసేటప్పుడు ఆ ప్రక్రియతోనే ఏకమై ఉండాలి. ఏదైనా నేర్చుకునేటప్పుడు నేర్చుకునే ప్రక్రియతో ఏకమై .. ఆ యా క్రియలతో, కర్మలతో పూర్తిగా లీనమై వుండటమే “కర్మయోగం”. “యోగః కర్మసు కౌశలం” అని భగవద్గీత లో శ్రీ కృష్ణపరమాత్మ అన్నారు కనుక .. చేసే కర్మలలో ఏకమై .. మన పూర్తి కౌశలాన్ని చూపించడమే .. ” కర్మయోగం “.
“భక్తియోగం”
“స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే “
“స్వస్వరూపానుసంధానమే ‘ భక్తి ’ అనబడుతుంది”
“భక్తియోగం” అంటే పూజలు చేస్తూ ఉండటమే కాదు ! సకలచరాచరసృష్టితో ఏకమై వుండటమే భక్తి. భక్తియోగం అన్నది మనిషి యొక్క ఆత్మపరిణామక్రమంలో చరమదశ ! ఆ చరమదశకు రావాలంటే మిగతా యోగాలు అన్నింటినీ మనం క్రమక్రమంగా సాధన చేసి .. మనం సిద్ధులం అవ్వాలి. అప్పుడే “నేనే అంతా ” అన్న భక్తి స్వరూపం యొక్క విశ్వరూపం మనకు తెలుస్తుంది.
అంతేకానీ గుడిలో గంట కొడ్తూ, హారతి ఇస్తూ .. నైవేద్యాలు సమర్పిస్తూ పూజల పేరిట రకరకాల పూలను చెట్లనుంచి బలవంతంగా త్రుంపి “దేవుడిని” అలంకరిస్తూ .. దాంతో ఏకమై వుండటం .. “భక్తియోగం” ఎప్పటికీ కాజాలదు !
“రాజయోగం”
యోగాలన్నింటిలోనూ ముఖ్యమైంది “రాజయోగం” రాజయోగంలో మనం మన యొక్క అంతరంగంలో నిక్షిప్తం అయివున్న మన స్వంత ఉత్కృష్టమైన అతీంద్రియ శక్తులతో ఏకమైవుంటాం ! మన దివ్యచక్షువుతో మనం ఏకమైవుంటాం. మన సూక్ష్మశరీరం, కారణశరీరంతోపాటు ఇతర శరీరాలతో మనం ఏకమైవుంటాం !
భౌతిక శరీరంతో ఏకమై వుండటం “హఠయోగం”; మరి మన సూక్ష్మశరీరం, కారణశరీరం, మహాకారణ శరీరాలతో ఏకమైవుండి వాటికి సంబంధించిన ఉన్నతమైన లోకాలలో మనం విహరిస్తూ వుండటమే “రాజయోగం”.
భారతదేశ స్వాతంత్ర్యం అనగానే మనకు “మహాత్మగాంధీ” స్ఫురించినట్లు .. ధ్యానం, రాజయోగం అనగానే మనకు ” పతంజలి మహర్షి ” స్ఫురిస్తారు. కనుక పతంజలి వారు చెప్పిన అష్టాంగ రాజయోగ మార్గం మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం.
” పతంజలి మహర్షి .. అష్టాంగ రాజయోగమార్గం”
“అష్టాంగం” అంటే .. ఎనిమిది అంగాలు ! అవి వరుసగా ‘ యమం ’ .. ‘ నియమం ’ .. ‘ ఆసనం ’ .. ‘ ప్రాణాయామం ’ .. ‘ ప్రత్యాహారం ’ .. ‘ ధారణ ’ .. ‘ ధ్యానం ’ .. ‘ సమాధి ’.
అయితే ఆచరణయోగ్యమైన శాస్త్ర విధానాన్ని అనుసరించి పతంజలి వారి అష్టాంగమార్గ క్రమాన్ని కొంత స్వల్ప మార్పుతో ” పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం ” గా రూపొందించడం అయ్యింది. దీని ప్రకారం మొట్టమొదటి ” ఆసనం ” .. రెండవది ” ప్రాణాయమం ” .. మూడవది ” ప్రత్యాహారం ” .. నాలుగవది ” ధారణ ” .. ఐదవది ” ధ్యానం ” .. ఆరవది ” సమాధి ” .. ఏడవది ” యమం ” .. ఎనిమిదవది ” నియమం “.
“పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం” లోని ఈ క్రొత్త పంథా అత్యంత శాస్త్రీయంగా మరి ప్రతిఒక్కరికీ ఆచరణ సాధ్యంగా వుంటుంది.
“మన దగ్గర దుర్గుణాలు వుంటే మనం ధ్యానం చేయకూడదు ; రాజయోగం చేయకూడదు” అనేది చాలా మందికి వున్న అపోహ .. మరి అది ఎంతో హాస్యాస్పదమైన విషయం. మనిషి ఏ స్థితిలో వున్నాసరే .. ఎలాంటి హీన చరిత్రను కలిగి వున్నా సరే .. అతడు వెంటనే రాజయోగానికి ఉపక్రమించాలి. రోగి కాని వాడికి డాక్టర్ అవసరం మరి ఔషధం అవసరం లేనట్లే .. మన దగ్గర సుగుణాలు వుంటే రాజయోగం అభ్యాసం చెయ్యాల్సిన అవసరమే లేదు !
కనుక అవలక్షణాలు అన్నీ వున్నవాడే తక్షణం రాజయోగం మొదలుపెట్టాలి .. మరి ధ్యానయోగంలో సిద్ధహస్తుడైన తరువాత వాడికి యమ, నియమాలు వాటంతట అవే సంక్రమించి అతడిని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడిగా నిలబెడతాయి ! కనుక మనం “పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం” గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం !
“ఆసనం”
ప్రప్రధమంగా, మొట్టమొదట్లో మనం చేపట్టవలసింది “ఆసనం”.
పతంజలి వారు .. “స్థిర సుఖ ఆసనం ” అన్నారు. ఏ ఆసనమైనా చక్కగా, స్థిరంగా వుండాలి .. మరి అది చాలా సుఖంగా వుండాలి ! అరగంట, రెండు గంటలసేపైనా మనం చక్కగా కూర్చోగలిగి వుండాలి .. దీనినే ” ఆసనసిద్ధి ” అంటాం. ఈ ఆసనసిద్ధి అనేది చాలామందికి వెంటనే రాదు .. సాధన చేస్తూంటే మెల్లి మెల్లిగా వస్తుంది ! కనీసం మూడు గంటలైనా ఏ మాత్రం కదలకుండా ఏదో ఒక ఆసనంలో వుండగలిగితే దానిని “ఆసనజయం ” అంటారు.
“ప్రాణాయామం”
” ప్రాణాయామం ” అంటే “శ్వాస మీద ధ్యాస ” కూర్చున్న తర్వాత చక్కగా చేతులు కలిపి పట్టుకోవాలి ; కళ్ళు రెండూ మూసుకోవాలి ; అతి సహజంగా జరుగుతోన్న మన శ్వాస మీద ధ్యాసను ఉంచాలి !
ఇలా హాయిగా ఏ మాత్రం ఘర్షణ అన్నది లేకుండా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండడాన్ని ” సుఖమయ ప్రాణాయామం ” అంటాం. ఇందులో ‘ కుంభకం ’ అంటే గట్టిగా గాలిని లోపల బిగపట్టడం అన్నది ఉండదు. అలాగే ‘ రేచకం ’ మరి ‘ పూరకం ’ లు కూడా వుండవు ; ‘ పూరకం ’ అంటే బలవంతంగా శ్వాసను పీల్చడం ; ‘ రేచకం ’ అంటే బలవంతంగా శ్వాసను బయటకు నెట్టడం ; ఈ సుఖమయ ప్రాణాయామాన్నే గౌతమ బుద్ధుడు ” ఆనాపానసతి ” అన్నాడు.
“ఆన” అంటే ఉచ్ఛ్వాస .. “అపాన” అంటే నిశ్వాస .. “సతి” అంటే కూడుకుని ఉండటం. సహజంగా జరిగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం హాయిగా కూడుకుని ఉంటాం కనుక “సుఖమయ ప్రాణాయామం” అన్నా.. “ఆనాపానసతి ” అన్నా .. హాయిగా ” శ్వస మీద ధ్యాస ” ఉంచడమే !
“ప్రత్యాహారం”
మూడవది .. “ప్రత్యాహారం” ; ప్రత్యాహారం అంటే ప్రతి + ఆహారం ; “ప్రతి ” అంటే “Opposite” కనుక “ప్రత్యాహారం ” అంటే “వేరే ఆహారం ” అన్నమాట !
ఇంద్రియాలను లోపలకు మళ్ళించటమే “ప్రత్యాహారం”.
ఎప్పుడైతే మనం చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు క్రమక్రమంగా అప్రయోజనకరమైన ఆలోచనలన్నీ మన నుంచి దూరంగా అయిపోయి .. మానసిక నిర్విషయస్థితికి వచ్చినప్పుడు .. మనం నిశ్చలస్థితికి చేరుకుని మన అంతర్ ప్రపంచంలో వున్న విషయాలను చూడగలుగుతాం ! మరి వాటిని వినగలుగుతాం ! దీనినే ” ప్రత్యాహారం ” అంటాం.
ఇలా మనం లోపలి విషయాలను శ్రద్ధగా గమనిస్తూ వున్నప్పుడు మనకు రకరకాల అనుభవాలు వస్తూంటాయి. శ్రద్ధతో అభ్యాసం చేస్తూ వుంటే ” ప్రత్యాహార స్థితి “కి తొందరగా చేరుకుంటాం.
“ధారణ “
నాలుగవది .. “ధారణ” : ప్రత్యాహారం ద్వారా మనం అంతర్ విషయాలను చూస్తూ వాటిపై ఏకాగ్రతను పెంచుకోవడమే .. ” ధారణ “. అంతర్ విషయాలను ఏకాగ్రంగా చూస్తూ వుండగా మన అంతరేంద్రియాలు ఉత్తేజితమై మనం ఏం చూడగలుగుతున్నామో .. మరి అక్కడ మనకు ఏ రకమైన అనుభూతులు కలుగుతున్నాయో .. వాటిని మనం పూర్తి ఏకాగ్రతతో గమనించడమే “ధారణ”
“ధ్యానం”
అయిదవది : “ధ్యానం” . ధారణ చేస్తూ, చేస్తూ వుంటే కొన్ని రోజులకు “ధ్యానం” మొదలవుతుంది.
ధ్యానం అంటే .. ధీ + యానం. “ధీ” అంటే “సూక్ష్మశరీరాది సముదాయం ” మరి “యానం” అంటే “ప్రయాణం”. ధ్యానంలో మనం మన సూక్ష్మశరీరాది సముదాయాలతో కూడి ఉన్నతలోకాలకు ప్రయాణం చేస్తాం ! అలా ప్రయాణం చేసే సమయంలో మన సూక్ష్మశరీరంలో, కారణశరీరంలో, ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంలో విశేషమైన అనుభవాలు మొదలవుతాయి.
అలా విహరిస్తూన్నప్పుడు మనకు ఎన్నెన్నో లోకాలలోని జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. గత జన్మల సమాచారంతో పాటు చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో వున్నారో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అని వాళ్ళను కలిసి మనం తెలుసుకుంటాం.
“సమాధి”
ఆరవది : “సమాధి” .. ఎన్నెన్నో జన్మల నుంచి మనలో నిండివున్న ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరికే స్థితినే ” సమాధి ” అంటారు.
“నేను ఎవరు ? ” .. “ఎక్కడ నుంచి వచ్చాను ? ” .. “ఎందుకోసం వచ్చాను ? ” .. “చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను ? ” .. “అసలు సృష్టి యొక్క రహస్యం ఏమిటి ? ” .. ఇలా మాయామయమైన భౌతిక ప్రపంచంలో మనకు లభించని అనేకానేక ప్రశ్నలన్నింటికీ ధ్యానంలో జరిగే సూక్ష్మశరీరయాత్రల ద్వారా మనకు సమాధానాలు లభిస్తాయి !
ఈ స్థితిలో మనకు కొన్ని ప్రశ్నలకు వెంటనే సంతృప్తికరమైన సమాధానాలు దొరుకుతాయి .. మరికొన్ని ప్రశ్నలకు జవాబులు వెంటనే దొరకవు మరి అలాంటి సంశయాత్మకమైన స్థితిని “సవికల్ప సమాధి ” అంటాం.
ఇక .. “నిర్వికల్ప సమాధి ” .. అంటే ఏ మాత్రం సంశయాలు లేని సంశయ రహితమైన స్థితి ! అన్ని విషయాల్లో కూడా, అన్ని సందేహాలకూ కూడా సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం మరి ఆత్మజ్ఞానం హస్తగతమైన నిశ్చలస్థితే .. “నిర్వికల్ప సమాధి !!”
ప్రతిరోజూ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ధ్యానాదుల ద్వారా మన భౌతిక, మానసిక మరి ఆత్మపరమైన సందేహాలకు సమాధానాలన్నీ దొరకడం మొదలై సమాధిస్థితి రోజు రోజుకూ పెరుగుతుంది. ఈ విధంగానే బుద్ధుడు .. పతంజలి మహర్షి .. శ్రీకృష్ణుడు .. జీసస్క్రైస్ట్ .. మహమ్మద్ .. షిరిడీ సాయిబాబా .. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు.
“యమం”
ఇక ఆత్మజ్ఞానులం అయిన తరువాత మనం అత్యంత సహజంగా ఆచరించేవే “యమం ” మరి “నియమం ” !
జ్ఞాని అయినవాడే యమ నియమాలతో కూడిన జీవిత విలువల పట్ల అప్రమత్తంగా వుంటాడు. యమాలు అయిదు :
1. సత్యం 2. అహింస 3. బ్రహ్మచర్యం 4. అస్తేయం 5. అపరిగ్రహం.
“సత్యం ” లో వుండడం అంటే “ఆత్మ ” గురించే పలకడం ; మనసా వాచా కర్మణా అహింసలో జీవించడమే “అహింస ” ; సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మపదార్థమే అన్న అవగాహనతో చరిస్తూ వుండడమే “బ్రహ్మచర్యం ” పాటించడం ; అలాగే ఇతరుల సంపదను ఆశించకపోవడమే అస్తేయాన్ని పాటించడం అంటే ; మనకు అనవసరమైంది, కొంచెం మోతాదులోనైనా సరే ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకుండా వుండడమే అపరిగ్రహం పాటించడం.
ఈ సిద్ధాంతాలన్నిటి మీద చక్కటి మౌలిక ఆధ్యాత్మిక అవగాహన తెచ్చుకోవడమే “యమం” అంటే. అప్పుడే మన దైనందిక జీవితంలో సరి అయిన ” నియమాలు” చోటు చేసుకుంటాయి.
” నియమాలు”
నియమాలు అయిదు : 1. శౌచం 2. సంతోషం 3. తపస్సు 4. స్వాధ్యాయం 5. ఈశ్వరప్రణిధానం.
శౌచం : మన మాటలు, చేతులు, మన వృత్తి, మన జీవిత విధానం, మన ఆలోచనా సరళి .. అన్నీ కూడా ఏ విధమైన కల్మషం లేకుండా చాలా పరిశుద్ధంగా శక్తివంతంగా వుండటమే “శౌచం ” అంటే !
సంతోషం : కలిమిలేముల్లో, శీతోష్ణాల్లో, సుఖదుఃఖాల్లో, మానావమానాల్లో, జయాపజయాల్లో, జననమరణాల్లో .. అన్ని పరిస్థితుల్లో కూడా మనం సమత్వపుస్థితిలో అలరారుతూ కర్మసిద్ధాంతాన్ని అనుసరించి సంతోషంగా వుంటూ జ్ఞానుల్లా విలసిల్లడం !
స్వాధ్యాయం : ఆధ్యాత్మిక గ్రంధాలు అంటే బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మరి భగవద్గీతలతో పాటు ఇంకా నవీన యుగానికి చెందిన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను ఎక్కువగా చదువుతూ ఎక్కువ విజ్ఞానాని సంపాదించుకోవాలి.
తపస్సు : అంటే మనల్ని మనం తగ్గించుకోవడం ; తిండి, నిద్ర క్రమక్రమంగా తగ్గించేసుకుంటూ ఒకానొక నాటికి వాటిని కూడా పూర్తిగా తీసివేయడం. ఆత్మపరిణామక్రమంలోని అత్యున్నతమైన ఏ స్థితికి అయితే మనం చేరాలో .. ఆ స్థితికి ఆహార పరంగా, నిద్ర పరంగా చేరటాన్నే ” తపస్సు ” అంటాం.
ఈశ్వరప్రణిధానం : “అంతా దైవమే, అంతా ఈశ్వరమయమే .. అంతా ఆత్మపదార్థమే ” .. అని తెలుసుకున్న స్థితి మరి అందులో జీవించే స్థితి .. ఈశ్వరప్రణిధానం, ఇలా పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగసాధన ద్వారా మాత్రమే మనకు యమ నియమాలు పూర్తిగా వంటపడతాయి .. మరి ప్రతిక్షణం మనం వాటితో కూడి సహజంగా జీవించగలుగుతాం !
” పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం”
పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం ద్వారా అజ్ఞానం నశించి ఆత్మజ్ఞానం సంతరించుకుని మన దైనందిన జీవితం శాస్త్రీయంగా తీర్చిదిద్దబడుతుంది.
అప్పుడే మనకు శరీరపరంగా ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతి, బుద్ధికి కుశలత, దీర్ఘమైన ఆయుష్షు, చక్కటి సాంఘిక స్ఫూర్తి, ఆర్థిక లాభం అన్నీ కలుగుతాయి.
యోగి కాని వాడు రోగిగా మారి క్రమక్రమంగా క్షీణిస్తూంటాడు. మరి యోగి అయినవాడే నిజమైన భోగి కాగలడు ! యోగం ద్వారా రోగం పోయి భోగం వస్తుంది కనుక యోగీశ్వరుడే భోగీశ్వరుడు !
“పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం” అన్నది లోకకళ్యాణం కోసం వున్న ఏకైక దివ్యమార్గం కనుక ప్రతిమనిషి కూడా ధ్యానయోగం చేసి ముందు ధ్యాని కావాలి ; ఆ తరువాత యోగి కావాలి ; క్రమంగా ఋషి కావాలి ; తరువాత రాజర్షి కావాలి ; చివరికి బ్రహ్మర్షి కావాలి ;
ఏది కావాలంటే అది సాధించగల శక్తి మనలో అపారంగా వుంది. కనుక .. మన అనంతమైన శక్తిని మనం నిత్య శ్రేయస్సు కోసం వినియోగించుకుంటే .. మనం చక్కగా ధర్మార్థ కామమోక్షాదులలో విలసిల్లుతూ వుంటాం ! మనల్ని చూసి మన కుటుంబ సభ్యులు మన మిత్రులు మరి మన చుట్టుప్రక్కల జనులు కూడా ఇంకా చక్కగా వుంటారు !!