పిరమిడ్ నిర్మాణాలు .. భూగ్రహానికి చెందిన అద్భుతమైన శక్తిక్షేత్రాలు
ధ్యానశక్తినీ, పిరమిడ్ శక్తినీ ప్రపంచానికి పంచుతూన్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క ప్రస్తుత ప్రధాన కర్తవ్యం భూగ్రహాన్ని అంతా కూడా పిరమిడ్ శక్తితో నింపడమే!
అనేకరకాల కట్టడాలూ సుందర భవనాలూ, కళ్ళు త్రిప్పుకోలేనంత అద్భుత నిర్మాణాలూ ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా వున్నాయి కానీ .. వాటన్నింటికంటే కూడా పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత వుంది. చాలా మంది “పిరమిడ్ నిర్మాణాలు అన్నవి కేవలం ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు సంబందించిన ఆనవాళ్ళు మాత్రమే” అనుకుంటారు కానీ “అవి సమస్త భూగ్రహానికి చెందిన అత్యద్భుతమైన శక్తిక్షేత్రాలు” అని వారికి తెలియదు.
కొందరు అజ్ఞానులు “అవి కేవలం శవాలను భద్రపరచే ప్రదేశాలు” అని కూడా అపోహ పడుతూంటారు. అయితే, ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే .. పిరమిడ్ అన్నది వేల సంవత్సరాల క్రితం మానవతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్రలోకవాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తిక్షేత్రం. ఆనాటి అవసరాలకు అనుగుణంగా భూమిని శక్తిక్షేత్రంగా మలచడానికి ఈ పిరమిడ్‌లు నిర్మించబడ్డాయి.
“సిరియస్ నక్షత్రలోకవాసులు” ఆనాటి ఈజిప్ట్ నాగరికతలకు చెందిన అట్లాంటియన్లకు తమ మేధోపరమైన సహకారాన్ని అందిస్తూ ఈజిప్ట్ దేశం లోని కైరో నగరంలో 450′ X 450′ అడుగుల నిర్మాణం కొలతలతో ప్రపంచంలో కెల్లా ఎత్తైన గ్రేట్ గిజా పిరమిడ్‌ను నిర్మించారు.
అతీంద్రియ శక్తులైన లెవిటేషన్, టెలిపతి, టెలికైనెసిస్ వంటి మరెన్నో విద్యల యొక్క సంయుక్త వినియోగంతో వారు ఆ బృహత్ నిర్మాణాలను పూర్తిచేశారు. ముఖ్యంగా పిరమిడ్ కోణం అత్యంత నిర్దిష్టమైన జామెట్రికల్ కొలతలతో కూడుకుని ఉండి .. సరిగ్గా పిరమిడ్ మధ్యభాగంలో ఉన్న అగ్నితో అనుసంధానం అయివుంటుంది.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ పిరమిడ్స్ కట్టడాల ద్వారా భూమికి కలుగుతున్న మంచిని గ్రహించడం జరిగింది. పిరమిడ్ శక్తికి సంబంధించిన ప్రయోగపూర్వకమైన ప్రామాణిక గ్రంధాలు పరిశీలించి అనేకానేక ప్రయోగాలను అనుభవపూర్వకంగా నిర్వహించి ధ్యానంతో పాటు, పిరమిడ్ నిర్మాణాలను కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది.
ఆ కృషి ఫలితంగానే గత ఇరవై సంవత్సరాలలో కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పదివేలకు పైగా చిన్నా-పెద్దా పిరమిడ్‌లనూ మరి దేశవ్యాప్తంగా వందలాది పిరమిడ్‌లను నిర్మించుకోవడం జరిగింది!
వేల సంవత్సరాల క్రితం “గ్రేట్ గిజా పిరమిడ్” నిర్మాణంలో పాల్గొన్న అట్లాంటిక్ నాగరికతకు చెందిన వారే నేటి పిరమిడ్ మాస్టర్లు కనుక మన ఉద్యమానికి “పిరమిడ్” అన్నది సంకేతంగా ఇవ్వబడింది.
ఈ విశ్వరహస్యం వల్లనే మన “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” ఒక్కటే ఇప్పటివరకు అనేకసార్లు ఈజిప్ట్ దేశానికి వందలాది మంది పిరమిడ్ మాస్టర్లతో ధ్యానయాత్రలను జరిపింది. ఈజిప్ట్ ప్రభుత్వ అనుమతులతో ఎవ్వరూ చేపట్టని విధంగా గ్రేట్ గిజా పిరమిడ్‌లోని కింగ్స్ ఛేంబర్ మరి క్వీన్ ఛేంబర్‌లో పౌర్ణమి సామూహిక ధ్యానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరిగే శక్తిపాతం కేవలం అనుభవైకవేద్యమే కానీ ఒకరు చెప్తే తెలిసేది కాదు.
శక్తిపాతానికి అక్షయ పాత్రలాంటి గిజా పిరమిడ్ మనం కట్టిన ప్రతి ఒక్క పిరమిడ్‌కు తన అనంతశక్తిని అందిస్తూనే వుంది. అత్యంత శాస్త్రీయమైన పిరమిడ్ శీర్షాలు అన్నీ కూడా ఆ శక్తిని గ్రహించి అందులో ధ్యానం చేసుకునే వారిని స్వస్థత పరుస్తూ భూమిని శక్తివంతం చేస్తున్నాయి.
“పిరమిడ్ లో ధ్యానం” ఎన్నో రెట్లు శక్తివంతంగా వుంటుంది. కనుకనే, పిరమిడ్ ధ్యానులు పిరమిడ్‌లో ధ్యానం చేసుకుని శారీరక స్వస్థతనూ, మానసిక ప్రశాంతనూ మరి ఆత్మపరమైన ఉన్నతినీ పొందుతున్నారు. పూర్వం మునులు, ఋషులు ధ్యానశక్తికోసం అడువులకో, కొండకోనలకో వెళ్ళి ధ్యానం చేసుకునేవారు. సకారాత్మక కాలుష్యంతో నిండివున్న ఈ జనారణ్యంలో వాళ్ళకు ధ్యానశక్తి లభించేది కాదు.
ఇప్పుడు ఈ విధమైన శక్తిక్షేత్రాలను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల ఎవ్వరూ కూడా తమ తమ ఇళ్ళను వదిలి అడవులకు పోవలసిన అవసరం లేకుండానే చక్కగా సంసారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ భౌతికజీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే .. రోజులో కాస్సేపు పిరమిడ్‌లో ధ్యానం చేసుకుని శక్తివంతులుగా మారుతున్నారు.
“పిరమిడ్‌లో ధ్యానం” ద్వారా ఉన్నత తలాల మాస్టర్లతో చాలా తక్కువ సమయంలోనే మనం అనుసంధానం కాగలుగుతాము. అక్కడ వారు అందిస్తోన్న జ్ఞానంతో ఇక్కడి జీవితాలను పండించుకుంటూ భౌతిక జీవితాన్నీ .. మరి ఆధ్యాత్మిక జీవితాన్నీ .. ఏకకాలంలో అత్యంత మనోహరంగా అనుభవిస్తూ సంసారంలోనే నిర్వాణం పొందగలుగుతాం.