పుష్కరాలు – జీవనదులు
“పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జీవనదులకు వచ్చే పుష్కరాలు కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఆ సమయంలో దివ్యాత్మలైన పుష్కర దేవుళ్ళు ఆ యా జీవనదుల్లో మునిగి తమ తమ దివ్యశక్తి తరంగాలతో వాటికి మరింత జీవం పోస్తారు.
“‘ఆ సమయంలో ప్రజలు కూడా ఆ జీవనదుల్లో మునిగితే వారికి పుణ్యశక్తి విశేషంగా సంప్రాప్తిస్తుంది’ అని శాస్త్రం చెబుతోంది! కాబట్టి పన్నెండేళ్ళపాటు పుష్కరాలకోసం ఎదురు చూసేవాళ్ళంతా కూడా పుష్కరాలు రాగానే ఆ జీవనదుల్లో మునిగి ‘ పుణ్యం ’ సంపాదించాలని ఆరాటపడతారు. ఇందులో అశాస్త్రీయం ఏమీ లేదు.
“ఉన్న సమస్యంతా కూడా పుణ్యం కోసం నదుల్లో మునిగి .. బయటకు రాగానే మూగజంతువులను చంపి కోసుకుని తింటూ శరీరాన్ని పాపపంకిలం చేసుకుని మళ్ళీ పాపాలను మూటగట్టుకోవడంలోనే వుంది!
“‘ఆధ్యాత్మికత’ యొక్క మౌలిక సూత్రం అయిన ‘అహింసా పరమో ధర్మః’ అన్న ధర్మాన్ని ఆచరించినప్పుడే మనకు మిగతా కార్యక్రమాలను ఆచరించడానికి అర్హత వస్తుంది; కాబట్టి సత్యధర్మాచరణల ద్వారా మనలో ఉన్న అశాస్త్రీయతను ‘సశాస్త్రీయం’ చేసుకుంటూ సవ్యంగా జీవించాలి.
“అప్పుడే మనం చేసే ‘ పుణ్య ’ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రసమ్మతం అవుతాయి! ”
“ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే .. ముందుగా ఆ చెపుతున్న వ్యక్తులంతా కూడా గొప్పవాళ్ళుగా మారాలి! తమ తమ వ్యక్తిగత జివితాలను గొప్పగా మలచుకోవాలి. వికృతంగా ఉన్న తమ ఆలోచనావిధానాన్ని ప్రకృతం చేసుకోవాలి.
“ధ్యానం ద్వారా మనస్సును దుక్కిదున్ని దానిలోంచి కలుపు మొక్కలవంటి ఆలోచనలను ఏరిపారవేయాలి. త్రికరణ శుద్ధితో పరస్పర ప్రయోజనకరమైన ఆలోచనలను ఆ మనస్సులో నాటి సాగుచేసి .. కర్మఫలితాల రూపంలో చక్కటి ఫలసాయాన్ని పొంది ఆనందంగా జీవించాలి”
“జీవితంలో ఏ రోజుకారోజే మనం సరిక్రొత్తగా జీవించాలి! ప్రతి క్షణాన్నీ వైవిధ్యభరితంగా గడుపుతూ ప్రయోగాలు చెయ్యాలి! భోజనంలో క్రొత్త క్రొత్త రుచులనూ .. మరి సంగీతంలో క్రొత్త క్రొత్త రాగాలనూ .. సృష్టించాలి. ప్రతిరోజూ ఏదో ఒక క్రొత్త కూని రాగాన్ని పాడుతూ ఉండాలి.
“ఎవరో ఒక క్రొత్త మనిషికి ప్రతిరోజూ ధ్యానం నేర్పించి .. ఏదో ఒక క్రొత్త పుస్తకాన్ని చదివి ఆకళింపు చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న వేలకొలది భాషలలోంచి ఏదో ఒక క్రొత్త భాషను నేర్చుకుని అందులో సంభాషించడానికి ప్రయత్నించాలి.
“ఇలా ప్రతిక్షణం ఆత్మచైతన్యపు ఎరుకతో జీవితంలో క్రొత్తదనాన్ని సృష్టించుకుంటూ ఉల్లాసంగా జీవించడానికే మనం అనేకానేక నక్షత్రలోకాల నుంచి ప్రత్యేకంగా ఈ భూలోకానికి తరలివచ్చాం!
“ఈ సత్యాన్ని తెలుసుకుని .. గ్రుడ్డి నమ్మకాలతో కూడిన పాతచింతకాయ పచ్చడి లాంటి ఆలొచనా విధానం నుంచి విముక్తి చెంది .. నిత్యనూతనంగా ఆలోచించడం మొదలుపెట్టాలి.
“జీవితంలో ఇలా క్రొత్తక్రొత్త ప్రయోగాలు చేస్తూ వైవిధ్యభరితంగా జీవించాలంటే ధ్యానాన్ని మించిన రాజమార్గం ఇంకొకటి లేదు “