ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి

 

“మనం మన ఇంటి నుంచి స్కూల్‌కి వచ్చినట్లు పైలోకాల నుంచి ఈ భూమండలానికి వచ్చాం!

“స్కూల్‌లో ‘ఇది నా బెంచీ’, ‘ఇది నా కుర్చీ’, ‘ఇది నా రూమ్’ అంటే కుదరదు. అవన్నీ మా ఇంటికి తీసుకుని వెళ్తాను అంటే కుదురుతుందా? ఇక్కడ కూడా అంతే! ‘ఇది నా ఇల్లు’, ‘ఇది నా బంగళా’, ‘ఇది నా ఆస్తి’ అంటే కుదరదు. అసలు మన శరీరమే మనది కానప్పుడు .. ఇవన్నీ మనవి అంటే ఎలా? స్కూల్‌లో కేవలం పాఠాలు నేర్చుకుని వెళ్ళినట్లే .. ఈ భూమండలం మీద కూడా మనం కొన్ని అనుభవజ్ఞాన పాఠాలను నేర్చుకుని .. చనిపోయి .. మళ్ళీ మన స్వీయ లోకాలకు వెళ్ళిపోవాలి.

“ఇక్కడ ఈ భూమండలం మీద మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు .. ఒద్దికగా సహనంగా ఉండడం .. తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం.. సుఖదుఃఖాలను సమంగా చూడడం .. మానావమానాలకు చెదరకుండా ఉండడం! ఇక్కడ ఇదే మన సిలబస్! ఏసుప్రభువు కూడా ఇక్కడ ఈ పాఠాలను నేర్చుకోవడానికే వచ్చాడు. శరీరంలో మేకులు దిగుతూన్నా .. చిరునవ్వుతో భరించడాన్ని నేర్చుకోవడానికి వచ్చాడు. భీష్ముడు అంపశయ్య మీద వున్నా కూడా ఏ మాత్రం కంప్లైంట్ లేకుండా .. విష్ణు సహస్రనామాన్ని బోధించడం అనే పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చాడు!

“పైన లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం ఇలా లెక్కలేనన్ని ‘లోకాలు’ అంటే ‘డైమెన్షన్స్’ ఉన్నాయి. ఈ లోకాలన్నింటికీ భూలోకమే స్కూల్ కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికీ తమవైన పాఠాలు ఉంటాయి. పాఠాలు లేకుండా ఇక్కడ ఎవ్వరూ ఉండరు.

“ఇక్కడ.. ‘ప్రజలందరూ శాకాహారులు అయి తీరాలి .. యోగులుగా అయి తీరాలి!’ అన్నదే నా పాఠం.

“పాఠాలు వేరువేరుగా ఉన్నా అందరికీ సత్యం ఒక్కటే! ఏ జీవినీ చంపకూడదు, ఏ చేపనూ పట్టుకోకూడదు, ఏ పక్షినీ బంధించకూడదు. ఇక్కడ ఎవరైనా హింసలో జీవిస్తున్నారు అంటే వాళ్ళసలు ఇంకా పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టలేదన్నమాట! ఎక్కడ ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే .. బుద్ధుళ్ళుగా జీవించాలి. యోగులుగా ఉండాలి.

“ప్రస్తుతం ఇక్కడ మీరు శ్రద్ధగా ధ్యానం చెయ్యడం అనే పాఠం నేర్చుకుంటున్నారు. ‘శ్రద్ధగా, ఒక్కమాట కూడా అటూ, ఇటూ పోకుండా మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించడం’ అనే పాఠాన్ని నేను నేర్చుకుంటున్నాను. మీరు శ్రద్ధగా మనస్సు అటూ ఇటూ పోకుండా ‘వినడం’ అనే పాఠాన్ని నేర్చుకుంటున్నారు. ఇది ఈ క్షణంలో మన కర్తవ్యం!

“ఇలా ప్రతి పరిస్థితిలోనూ ‘పాఠాలు నేర్చుకోవడం’ అన్న కర్తవ్యం ఉంటూనే ఉంటుంది. ఒకానొక బస్సులో కూర్చున్నప్పుడు ఎవరైనా పెద్దావిడ వస్తే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా లేచి మన సీటు ఇవ్వాలి. అక్కడ మనం ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్న పాఠం నేర్చుకోవాలి! ఆ క్షణంలో ఆ పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది.

“అలాగే అన్నం వృధా చేయకపోవడం, నీరు వృధా చేయకపోవడం .. ఇవన్నీ పాఠాలే మనకు! అవి నేర్చుకోకపోతే వాటిని నేర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే! ఇవన్నీ కూడా ధర్మసూక్ష్మాలు. చాలా పర్‌ఫెక్ట్‌గ  ఉంటాయి!
‘మనుష్యాణం సహస్రేషు .. కశ్చిత్ యతతి సిద్ధయే’ అంటూ భగవద్గీత శ్లోకంలో శ్రీ కృష్ణుల వారు ‘వేలకొద్దీ మనుష్యుల్లో కొంతమందే పర్‌ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వారిలో కొంతమందే పర్‌ఫెక్ట్ అవుతారు’ అని చెప్పారు!

“అలా పర్‌ఫెక్ట్ అయిన వారినే నేను పిరమిడ్ మాస్టర్స్ అంటాను. పిరమిడ్ మాస్టర్స్ ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయరు; ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చుపెట్టరు; ఒక మాట కూడా వృధాగా మాట్లాడరు. అందుకే వాళ్ళంతా కూడా ఈ భూమి మీద వున్న పర్‌ఫెక్ట్ మాస్టర్స్!