ప్రకృతి మాత .. మూడు స్థితుల బిడ్డలు

 

ఈ సృష్టిలో మూడు స్థితులలో మానవులు ఉంటారు. తల్లిలాంటి ప్రకృతి .. తన బిడ్డలయిన ఈ మూడు తరహాల మానవులను ప్రేమిస్తూనే వుంటుంది .. అయితే, ఆ బిడ్డలు చేసే పనులపట్ల ఆ తల్లి ప్రేమ ప్రదర్శనలో కొంత వైవిధ్యం వుంటుంది.

మొదటి స్థితి బిడ్డలు: వీరు పూర్తి హింసామార్గంలో జీవిస్తూన్నా సరే .. వారు చేసే ఆగడాలను ప్రకృతిమాత సహిస్తుంది! సాగినంత వరకు “మా అంతటి వారు లేరు” అని వాళ్ళు అనుకున్నంత కాలం బాగానే వుంటుంది. కానీ ఏ జన్మ కర్మఫలితమో అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ తల్లి ఆ హింసాత్ములకు సహాయం చెయ్యదు సరికదా వారి నుంచి తన మొహం కాస్త త్రిప్పేసుకుంటుంది కూడా!

రెండవ స్థితి బిడ్డలు: వీరు “అహింసా పరమో ధర్మః”అన్న సిద్ధాంతాన్ని ‘తు.చ.’ తప్పకుండా ఆచరిస్తూ ఇతర జీవులకు హింస కలిగించకుండా తమ బ్రతుకేదో తాము గడుపుతూ వుంటారు. ఇలాంటివాళ్ళు ఎదురయినప్పుడు ప్రకృతిమాత చక్కగా పలుకరించి .. వారిని వెయ్యేళ్ళు జీవించమని ఆశీర్వదిస్తుంది.

మూడవ స్థితి బిడ్డలు: వీరు ధ్యాన సాధన ద్వారా తమను తాము తెలుసుకుని, విశ్వప్రణాళికలో తమ వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఆ దిశగా ప్రయాణిస్తూ సమస్త ప్రాణికోటి యొక్క రక్షణ/ఉద్ధరణ కోసం లోకకల్యాణ కార్యక్రమాలను చేపడుతూ అహర్నిశలు శ్రమిస్తూంటారు. ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించే వీరిని చూసి ప్రకృతి మాత పులకరించిపోతూ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తుంది!