“పూజలూ మరి భజనలూ ముక్తి మార్గాలు కాజాలవు”
పూజలూ, భజనలూ తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి ..
వాటికి మానసిక ఆనందానికి మాత్రమే భజనలను ఉపయోగించుకుంటే ఫరవాలేదు కానీ
పూజలూ, భజనలూ “ముక్తిమార్గాలు” ఎన్నటికీ కాజాలవు
సనాతన గ్రంథాల కేవల పారాయణల వల్ల లాభం ఏమీ ఉండదు
జపమాలలు త్రిప్పడం వల్ల, మంత్రోచ్ఛారణల వల్ల
అమూల్యమైన సమయం నిరుపయోగం అవుతుందే తప్ప
దుఃఖవిముక్తి ఎంతమాత్రం కలుగదు మరి నిర్వాణం ప్రాప్తించదు!
అదేవిధంగా అమితంగా ఉపవాసాలు ఉండడం,
పడిపడి గురు పాదపూజలు చేయడం అన్నవి పూర్ణ మూర్ఖతలు!
సంసారం వదిలి “సన్యాస దీక్ష తీసుకోవడం” అన్నది
ధర్మానికీ, సత్యానికీ, ఆనందానికీ దూరంగా పోవడమే!
శుష్క తర్కవాదాలు, మతాభిమానాలు అన్నవి .. మిడిమిడి జ్ఞానుల వ్యర్థవేదనలు!
సర్వ దేశ కాల పరిస్థితులలోనూ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన
పరమజ్ఞానసూత్రం ఒక్కటే .. ‘ఉద్ధరేదాత్మనాత్మానం’ ..
అందుకు చేయవలిసింది శాస్త్రీయ పంధాలో జ్ఞాన మథనం ..
మరి అభ్యాసం చేయవలసింది
సరియైన, తీవ్రమైన ఆనాపానసతి – ధ్యానయోగసాధన ..
ప్రతి పువ్వులోనూ ఇంతో, అంతో మకరందం వున్నట్లే ..
అదే విధంగా ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో, అధికంగానో జ్ఞానం వుంటుంది కాబట్టి
ఏ ఒకరినీ విస్మరించరాదు .. ప్రతి ఒక్కరి దగ్గర నుంచీ నేర్చుకోవాలి
ఒకానొక తుమ్మెద ప్రతి పువ్వు నుంచీ మకరందాన్ని గ్రోలినట్లు,
ఒకానొక ముముక్షువు ప్రతి ఒక్కరి దగ్గరి నుంచీ విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి
అలా తెలుసుకున్నదీ మరి స్వయంగా అనుభవించినదీ .. తక్షణం అందరికీ చెప్పాలి.