పత్రీజీ .. ఇన్నర్ వ్యూ

 

బ్రహ్మర్షి పత్రీజీ ప్రతి ఆలోచనా, ప్రతి మాటా .. ప్రతి చేష్టా .. ప్రతి క్షణం మనకు ఎంతో గొప్ప ఆత్మవిద్యా ప్రకాశాన్ని అందిస్తుంది. నిరంతరం దేశవిదేశాల ధ్యానప్రచార కార్యక్రమాలతో, పిరమిడ్ ప్రారంభోత్సవాలతో, వివిధ పుస్తకాల కరెక్షన్‌లతో బిజీగా ఉండే పత్రీజీతో కాస్సేపు గడిపి .. PSSM రజతోత్సవాల సందర్భంగా వారితో “ఇన్నర్ వ్యూ” తీసుకోవడం “ధ్యాన జగత్” మహాభాగ్యం! ప్రతి పిరమిడ్ మాస్టర్ మనస్సులో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే అనేకానేక ప్రశ్నలతో పత్రీజీ అంతరంగాన్ని “ఇన్నర్ వ్యూ” ద్వారా మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసిన .. “జన – యువ” (PSSM యువజన విభాగం) కార్యకర్త K.సంపత్ కుమార్ గారిని అభినందిస్తూ ..

– ఎడిటర్

K.S.కుమార్: “‘పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ మహాప్రస్థానంలో .. ఇరవై అయిదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి’ అనిపిస్తోందా?”
పత్రీజీ: 1990 సంవత్సరంలో నేను సెక్రెటరీగా, శ్రీ N.G.శౌరిగారు ప్రెసిడెంట్‌గా కర్నూలులో “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ” ప్రారంభం అయ్యింది. N.G.శౌరిగారు చాలా గొప్ప వ్యక్తి !

డా||లోబ్‌సాంగ్ రాంపా గారి పుస్తకాలను బాగా చదివే శౌరి గారి దగ్గరి నుంచే నేను చాలా పుస్తకాలు తీసుకుని చదివేవాడిని. నా జీచితాన్ని ఒక మేలు మలుపు త్రిప్పి .. నాకు నా జీవిత లక్ష్యం మరింత అర్థం అయ్యేట్లుగా చేసింది రాంపా గారి ఆధ్యాత్మిక శాస్త్ర యోగ గ్రంథం .. “యూ ఫర్ ఎవర్” !

శ్రీ శౌరి గారు చాలా మందికి ధ్యానం గురించి చెప్పేవారు మరి వారి ఇంట్లో ధ్యాన కార్యక్రమాలను నిర్వహించేవారు. అలా వారి ద్వారా పరిచయం అయిన మరొక గొప్ప మాస్టర్ శ్రీ B.V.రెడ్డిగారు.

దీనికి నాందిగా ఇంకొక విషయం చెప్పాలి!

1985లో అనుకుంటా .. ఒకసారి నేను పత్రీమేడమ్ .. ఇద్దరం మా ఇంట్లో కూర్చుని ఊజాబోర్డ్ వేస్తున్నాము. ఇంతలో బోర్డ్ మీదకు కృష్ణా మాస్టర్ వచ్చారు.

మేము వారిని “మా ధ్యాన ఆశ్రమం ఎప్పుడు వస్తుందండీ ?” అని అడిగాం ! కృష్ణా మాస్టర్ వెంటనే “1990 లో వస్తుంది ” అని చూపించారు.

మాకు చాలా ఆశ్చర్యం వేసింది ! ఎందుకంటే .. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా అప్పట్లో నేను, మరి కొంతమంది ధ్యానమిత్రులం కలిసి .. హైదరాబాద్ చుట్టుప్రక్కలంతా తిరుగుతూ .. “ఆశ్రమం ఎక్కడపెడితే బాగుంటుంది ?” అని వెతికేవాళ్ళం !

B.V.రెడ్డిగారు ధ్యానంలోకి వస్తూనే అందులోని గొప్పతనాన్ని తెలుసుకుని .. పిరమిడ్ శక్తిపై మేము చేస్తోన్న చిన్న చిన్న ప్రయోగాలను చూసి .. ” కర్నూలు పట్టణంలో నా స్వంత స్థలంలో ధ్యానపిరమిడ్‌ను నిర్మిద్దాం ” అని మరింత ఉత్సాహపరిచారు.

అప్పటివరకు “PSSM” గురించిన ఏ ఊహాచిత్రమూ నా మనస్సులో లేదు ! మరి B.V.రెడ్డి గారిచే నిర్మించబడిన మొట్టమొదటి ధ్యానపిరమిడ్‌తో ఒకానొక ఊహాచిత్రానికి పటిష్టమైన భౌతికరూపం లభించింది.

విశ్వవ్యాప్తంగా విస్తరించబడిన ఈనాటి “PSSM మహోన్నత భవనానికి” .. “బుద్ధా పిరమిడ్” తో ఒక గట్టి పునాదిలా నిలిచిన B.V.రెడ్డి గారికి నేను సర్వదా కృతజ్ఞుడను !

ఇలా ఒక “సొసైటీ” .. ఒక “ధ్యాన పిరమిడ్” వచ్చేసాక ఇక నాకు ఉద్యోగం చేయాలంటే కంపరంగా ఉండేది. ఎందుకు పుట్టామో తెలుసుకునేంత వరకు ఏదో ఒకలా బ్రతికేస్తూంటాం ! ఎందుకు పుట్టామో తెలిసిపోయాక మాత్రం ఇక ఒక్క క్షణం ఉండలేం. ఒక మంటలా ఆ జీవితలక్ష్యం మనల్ని లోలోపలే కాల్చేస్తూ ఉంటుంది కనుక ఇంత గొప్ప ధ్యానాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజెయ్యాలంటే నేను ఒకే దగ్గర కూర్చుని ఉద్యోగం చేస్తూంటే లాభం లేదనుకుని మంచి జీతం .. మంచి హోదా .. సకల సౌకర్యాలు కలిగి ఉన్న నా ఉద్యోగానికి 1992 లో రాజీనామా చేసేశాను !

జీవితంలో క్రొత్త మలుపు వచ్చింది !

“ముందు ఎక్కడికి వెళ్ళాలి ?” .. “ధ్యాన ప్రచారం ఎలా మొదలుపెట్టాలి?” అనుకుంటూంటే .. ధ్యానం గురించి అప్పుడప్పుడే తెలుసుకుంటూన్న అనంతపూర్ పిరమిడ్ మాస్టర్ “గుణాకర్ రెడ్డి” గారు .. “సార్ మీరు మా ఊరికి వచ్చి నాకు ధ్యానం నేర్పాలి ! లేకపోతే నేనే నా ఉద్యోగాన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తాను” అన్నారు.

ఆయన అంతకు ముందే క్రొత్తగా ఉద్యోగంలో చేరారు మరి !

దాంతో ఇక నేను “ఉండవయ్యా! నేనే వస్తాను” అని చెప్పి తరచుగా గుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తూండేవాడిని. ఇలా ఇక అడ్వొకేట్ సంపత్ కుమార్, విజయకుమార్ గార్లు కలవడంతో “అనంతపూర్ PSSM” కార్యక్రమాలు ఊపందుకుని .. ఉరవకొండ, గుంతకల్లు, ప్రొద్దుటూరులతో పాటు అలా అలా విస్తరిస్తూ ఇప్పుడు PSSM ప్రపంచవ్యాప్తం అయిపోయింది !

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. ఒక్కొక్కరుగా మొదలయిన మా చిన్ని మిత్రబృందం .. ఈ ఇరవై అయిదు సంవత్సరాలలో లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్ల చేరికతో ఒక మహాఉద్యమంలా మారి .. శాఖోపశాఖలుగా విస్తరిస్తూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూండడం నాకే ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది!

1990 కర్నూలు “బుద్ధా పిరమిడ్” తో మొదలై .. 1996 ఉరవకొండ .. “లోబ్‌సాంగ్ రాంపా పిరమిడ్” .. 1999లో అనంతపూర్ “అగస్త్య పిరమిడ్‌” ల నిర్మాణంతో ఊపందుకున్న ధ్యాన పిరమిడ్‌ల నిర్మాణ ఉద్యమం ఇప్పుడు భారత దేశమంతా విస్తరించి వేలాది పిరమిడ్‌ల నిర్మాణంతో భూమిని ఎంతగానో శక్తివంతం చేస్తోంది.

ఇక సకల జలచర జంతు పక్షిజాల సంరక్షణ కోసం ఈ ఇరవై అయిదు సంవత్సరాలుగా మనం చేస్తోన్న “అహింసా-శాకాహార ప్రచారాలు” మహాఅద్భుతాలు ! ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల సమ్మేళనాలు GCSS, జాతీయ ఆధ్యాత్మిక వేత్తల సమాఖ్యలు IFSS, ధ్యాన మహాయజ్ఞాలూ, ధ్యాన మహాచక్రాలూ, మౌన ధ్యానాలూ, బుద్ధపౌర్ణమిలు లెక్కకు లేనన్ని నిర్వహించాం.

నేను ఎవరెవరి పుస్తకాలు చదివానో ఆ యా మాస్టర్లందరనీ “వాక్ – ఇన్” లుగా భౌతికంగా నేను కలిసాను!

బెంగళూరు “మైత్రేయబుద్ధ మెగా పిరమిడ్” .. హైదరాబాద్ “మహేశ్వర మహా పిరమిడ్” ల నిర్మాణం అద్భుతాలలో కెల్లా పరమాద్భుతాలుగా నిలుస్తున్నాయి ! ఇంకా ఏం కావాలి? ! భూమి మీదకు వచ్చిన పనిని నేను శ్రద్ధగా పూర్తి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది !!

ఈ అద్భుతమంతా ఏ ఒక్కరి కృషియో కాదు. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఆ యా సమయాలలో, ఆయా సందర్భాలలో, ఆయా ప్రదేశాలలో, ఆయా అవసరాలకు తగ్గట్లు స్పందించిన ఒక గొప్ప సరిక్రొత్త ఆధ్యాత్మిక విప్లవం !

K.S.కుమార్: “ఈ మూవ్‌మెంట్ ఇలా దేశవిదేశాలలో విస్తరిస్తుందనీ .. ఇంత పెద్దదవుతుందనీ 1990లో ఊహించారా?”
పత్రీజీ: “ఊహించలేదు” అంటే తప్పవుతుంది; “ఊహించాను” అంటే కూడా తప్పవుతుంది.

ఎందుకంటే నేను ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాను. వర్తమానంలో ఉన్న పనిని ఆనందంగా చేస్తూపోతాను.

కాకపోతే 2000సంవత్సరం తరువాత .. “2004 – ధ్యానాంధ్రప్రదేశ్” .. “2008-ధ్యాన భారత్” .. “2012 – ధ్యాన జగత్” .. “2016-పిరమిడ్ జగత్” మరి “2020-శాకాహారజగత్” పూర్తిచేయ్యాలని ఒక నియమబద్ధమైన ప్రణాళిక మాత్రం వేసుకున్నాను.

దాంతో ఆయా లక్ష్యాల పట్ల ప్రతి ఒక్కరికీ ఒక “సామూహిక స్ఫూర్తి” ఏర్పడి అందరూ చాలా కష్టపడ్డారు.

“లక్ష్యం” అన్నది లేకపోయినా ప్రగతి ఉంటుంది కానీ అది నెమ్మదిగా ఉంటుంది. లక్ష్యం పెట్టుకుని ప్రగతిని మరింత వేగవంతం చెయ్యడం చాలా అద్భుతమైన విషయం !

రాత్రనక, పగలనక నాతో సరి సమానంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం ఎంతో గొప్ప విషయం !!

ఒకప్పుడు నేనుంటేనే ఏ ధ్యాన కార్యక్రమమైనా జరిగేది. ఆ తరువాత నా కోసం ఎదురు చూసి .. కుదరకపోతే వాళ్ళే చేసుకునేవారు. ఇప్పుడు ఎవరి దారి వారిది ! ఎవరికి వారే తమ తమ పరిధులలో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఈ ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు.

K.S.కుమార్: “సాధారణంగా ఇతర సంస్థలలో ఇలా క్రియాశీలక పాత్రను పోషించే అవకాశం మరి స్వేచ్ఛ అందరికి ఇవ్వరు .. కానీ PSSMలో ఇది ఎలా సాధ్యం?”
పత్రీజీ: PSSM లోకి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి రోజే సరియైన ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు. ఇది ఇంత సరళమనీ .. ఇంతకన్నా ఇంకా ఏమీ చెయ్యలేమనీ తెలుసుకుంటారు !

తెలుసుకున్న తరువాత .. ఇక పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచీ తమను వేధిస్తూన్న సందేహాలకు సమాధానాలూ మరి తాము పరిశోధిస్తూన్న ప్రశ్నలకు అవగాహనలూ ఆ ఒక్కరోజులోనే పొందేస్తారు. దాంతో వారి ఆనందానికి అంతేలేకుండా పోతుంది !

అలా ఆత్మానందంతో చిందులేసే వాళ్ళకు “ధ్యాన ప్రచారం చెయ్యవయ్యా” .. అని ప్రత్యేకంగా నేను చెప్పనఖ్ఖరలేదు. నేను చెప్పకపోయినా వాళ్ళు ఆగరు ! ఒక దగ్గర కూర్చోకుండా వెళ్ళి అందరికీ ధ్యానం నేర్పిస్తూ తాము పొందిన ఆనందం అందరూ పొందాలని ఆరాటపడుతూంటారు ! ఆనందం యొక్క లక్షణం వ్యాపకత్వమే కదా !

K.S.కుమార్: “ఈ మహాప్రస్థానంలో మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరయినా ఉన్నారా?”
పత్రీజీ: ముఖతః నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఎవ్వరూ లేరుకానీ నన్ను ప్రభావితం చేసినవాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళే నేను చదివిన పుస్తకాలలోని గ్రేట్ మాస్టర్స్ ! పుస్తకాల ముఖంగా వారు నన్ను ఎంత ప్రభావితం చేశారో మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో వారు నాకు ఎంత మార్గదర్శనం చేశారో చెప్పలేను. ఒక్కొక్క పుస్తకం చదువుతూన్న కొద్దీ ఒక్కక్క మాస్టర్ చేయిపట్టుకుని నేను ఆధ్యాత్మిక జగత్తులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయాను.

K.S.కుమార్: “ఈ మహా ఉద్యమంలో లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ చేసిన కృషి ఒక ఎత్తయితే .. ధ్యాన ప్రచారం కోసం దేశవిదేశాలలో మీరు తిరిగిన వేల కిలోమీటర్ల దూరం ఒక ఎత్తు ! ఇన్ని సంవత్సరాలుగా అలుపు సొలుపు లేకుండా ఇలా బస్సుల్లో, కార్లల్లో, రైళ్ళల్లో మరి విమానాలలో నిర్విరామంగా ఎలా ప్రయాణం చెయ్యగలుగుతున్నారు? “
పత్రీజీ: నేను ఏ రోజుకారోజే జీవిస్తాను ! నా టార్గెట్ ఎప్పుడూ 24 గంటలే ! రోజుకు ఇరవైనాలుగు గంటలలో నేను ఎంత పని చెయ్యగలనో అంత చేస్తూనే ఉంటాను.

మిగతా వ్యాపారాలూ, వ్యవహారాలూ వేరు. అక్కడ మనం పని చేసేకొద్దీ శక్తిని కోల్పోతూంటాం ! కానీ ధ్యానంలో, ధ్యానప్రచారంలో మాత్రం అలా కాదు ! ఇక్కడ మనం ఎంతగా పని చేస్తూంటే అంతగా విశేషమైన శక్తిని పొందుతూ ఉంటాం కనుక అలసిపోయే ప్రసక్తే ఉండదు. అందుకే నాతో పాటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా వర్తమానంలో జీవిస్తూ ఆనందంగా పని చేస్తూంటాడు .. మరింత మరింత శక్తివంతం అవుతూనే ఉంటాడు.

K.S.కుమార్: “ఈ మహాప్రస్థానంలో మీరు ఎదుర్కొన్న సమస్యలూ, సవాళ్ళూ ఏవైనా ఉన్నాయా?”
పత్రీజీ: సమస్యలూ, సవాళ్ళూ ఎక్కడయినా ఉంటాయి ! ఎందుకంటే మనం విగ్రహారాధనలకూ, మూఢభక్తి సాంప్రదాయాలకూ, మూఢ నమ్మకాలకూ, వ్యర్థ కర్మకాండలకూ, మాంసాహార సేవనానికీ వ్యతిరేకంగా ప్రజలను జాగృత పరుస్తూ ఉంటాం.

మరి ప్రజల అమాయకత్వాన్నీ, అజ్ఞానాన్నీ ఆధారం చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ తాత్కాలిక లాభాలను పొందుతున్న వాళ్ళంతా కూడా మనమేదో తమ పొట్టల కొడుతున్నామనుకుని పొరబడి మనపై కోపగించుకోవడం సహజమే కదా !

ఒకసారి నేను మహబూబ్‌నగర్ “కొత్తకోట” లో ఒక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్నప్పుడు ఒకానొక హిందూ మతతత్త్వసంస్థ వాళ్ళు చాలా మంది చాలా ఆవేశంగా అక్కడికి వచ్చారు !

నేను వాళ్ళతో “మీరేం చెప్పదలచుకున్నారో చెప్పండి మీ వెంట ఎవరు వస్తే వాళ్ళను తీసుకెళ్ళండి; ఇది ప్రజాస్వామ్యయుత దేశం. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది. నేను చెప్పేది సత్యపూర్వకమైనదయితే నన్ను అనుసరిస్తారు” .. మీరు చెప్పేది సత్యపూర్వకమైనదయితే మిమ్మల్ని అనుసరిస్తారు” అని చెప్పాను మర్యాదగా!

వాళ్ళు ఆవేశంగా మైక్ తీసుకుని అర్థగంట సేపు అరిచీ .. అరిచీ .. ఏవేవో నినాదాలు ఇచ్చీ .. ఇచ్చీ వెళ్ళిపోయారు. కూర్చున్న చోటు నుంచి ఒక్కళ్ళు లేస్తే ఒట్టు ! వాళ్ళు వెళ్ళిపోయాక నేను హాయిగా మళ్ళీ మన వాళ్ళతో ధ్యానం చేయించాను !

ఇలాంటివి ఎన్నోసార్లు .. ఎన్నో చోట్ల రకరకాలుగా జరిగాయి. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఇవన్నీ జరగడం సహజమే ! జరగకపోతేనే అసహజం !

ఏసుప్రభువుకయితే ఏకంగా మేకులే కొట్టి శిలువేశారు, స్వామీ దయానంద సరస్వతికి గాజుపొడిని నీళ్ళలో కలిపి త్రాగించారు. మరి ఓషోని అర్సెనిక్ విషం ఇచ్చి చంపారు. ఇవన్నీ సహజమే ! అలా జరిగిపోతూ ఉంటాయి !!

K.S.కుమార్: “అహింసా – శాకాహారం గురించి మీరు చాలా పట్టుదలగా ప్రచారం చేస్తారు !”
పత్రీజీ: మనం ఏది ఆలోచిస్తామో .. అదే మనకు వస్తుంది. నకారాత్మకంగా ఆలోచిస్తే నకారాత్మక ఫలితాలు .. సకారాత్మకంగా ఆలోచిస్తే సకారాత్మక ఫలితాలు ! కనుక మనకు ఎవరు ఎలాంటి కష్టం లేదా నష్టం కలిగించినా కూడా అత్యంత సహనంతో వ్యవహరిస్తూ అందరి పట్ల సకారాత్మక ఆలోచనలే చెయ్యాలి !

“చంపడానికొస్తారా? ఇదిగో బాబూ నేను రెడీగా ఉన్నాను చంపెయ్! నీకు .. నా పట్ల కంప్లయింట్‌లూ, జడ్జిమెంటులూ ఉన్నాయేమో కానీ .. నాకు మాత్రం నీ పట్ల ఎలాంటి కంప్లయింట్‌లూ మరి జడ్జిమెంట్‌లూ లేవు” అనేంత సహజ అహింసా భావన మనలో ఉండాలి !

ఇలా మనకు నష్టం కలుగజేసే వారికి కూడా అపకారం తలపెట్టవద్దని శాస్త్రాలు బోధిస్తూంటే .. కోడి నీ మీద ఏం కంప్లయింట్ చేసిందయ్యా .. దానిని చంపి తినడానికి ?! మేక నీ మీద ఏం జడ్జిమెంట్ చేసిందయ్యా .. దానిని చంపి తినడానికి ? చేప నీకేం నష్టం చేసిందయ్యా .. దానిని చంపి తినడానికి ?!

అవన్నీ కూడా నిస్సహాయ జీవులు ! మనలాగే ఈ భూమి మీద పుట్టి మనతో పాటే పరిణామం చెందుతోన్న మన సోదర ఆత్మస్వరూపాలు ! “వాటిని చంపుకుతినడం” అన్నది మానవత్వం ఎలా అవుతుంది? కనుక నేను వాటికోసం పోరాటం చేస్తున్నాను .. మరి నోరులేని ఆ నిస్సహాయ జీవుల హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాను.

ఈ ప్రపంచం అంతా “అహింసా జగత్” గా మారేంత వరకూ .. ఈ భూమి మీద ప్రజలందరూ శాకాహారులుగా అయ్యేంతవరకూ .. మరి ఈ జగతిలో ప్రతి జంతువూ, ప్రతి పక్షీ, ప్రతి చేపా స్వేచ్ఛగా, హాయిగా జీవించేంత వరకూ నేను పోరాడుతూనే ఉంటాను!

K.S.కుమార్: “మిమ్మల్ని కానీ .. మీరు పడుతూన్న కష్టాన్ని గానీ ‘ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండు’ అని ఎప్పుడయినా ఆశించారా?”
పత్రీజీ: No Way ! ఎవరికైతే తాము చేసే పనిమీద తమకే స్పష్టత లేదో వారు “ఇతరులు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు” అని వాపోతారు ! ఎవరయితే తమ మీద తాము జాలిపడుతూ ఉంటారో వారు” ఇతరుల దృష్టికోణంలో నేనేంటి? ” అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఇతరులను సంతృప్తిపరచడానికి కష్టపడుతూ ఉంటారు !

కానీ .. నేనేంటో నాకు తెలుసు ! నేను చేసే పని పట్ల నేను సంపూర్ణమైన స్పష్టతతో ఉన్నాను ! నాకు ఎవ్వరి జాలి అఖ్ఖరలేదు .. మరి ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవలసిన పనిలేదు. నేను చెయ్యాలని అనుకుంటానో అది చేస్తూనే ఉంటాను. అదే నా ఆత్మవిశ్వాసం !!

K.S.కుమార్: “ఈ సొసైటీలో చాలా మంది మాస్టర్స్ .. మీరొక్కసారి చెప్తే చాలు .. మీరు చెప్పిన పనిని తమ జీవితలక్ష్యంగా చేసుకుని అంకిత భావంతో పని చేస్తూంటారు ! అది మీ మాటలోని శక్తి అయ్యుండవచ్చు .. “
పత్రీజీ: ఈ భూమి మీద జన్మ తీసుకునే ఆత్మ స్వరూపులందరికీ తమవైన ప్రత్యేక అయస్కాంత శక్తిక్షేత్రాలు ఉంటాయి. వివిధ అనుభవాల ద్వారా ఆ యా ఆత్మస్వరూపులు తాము పొందుతూన్న దివ్యజ్ఞానప్రకాశాన్ని అనుసరించి తమ తమ అయస్కాంత శక్తిక్షేత్రాలను పునరుజ్జీవింపజేసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే వారు తమ కంటే ఎక్కువ దివ్యజ్ఞానం ప్రకాశం పొందిన ఆత్మస్వరూపులు తారసపడినప్పుడూ వారి అయస్కాంత శక్తికేత్రాలకు ఆకర్షింపబడుతూ .. వారితో కలిసి పనిచేస్తూ లోకకల్యాణ కార్యక్రమాలను చేపడుతూంటారు.

మన ఆలోచనలూ .. మన దృక్పథాలూ, అలవాట్లూ, మన తెలివితేటలు, మన సత్యపూర్వకమైన వ్యవహారాలు మన దివ్యజ్ఞాన ప్రకాశాలూ అన్నీ కూడా నిరంతరం మన ఆయస్కాంత శక్తిక్షేత్రాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇతరుల పట్ల సహ-అనుభూతి, దయ, ప్రేమవంటి దైవ లక్షణాలు ఈ అయస్కాంత శక్తిక్షేత్రాల విస్తరణలో మరింత గొప్ప పాత్రను పోషిస్తాయి.

మదర్ థెరిస్సా, మహాత్మాగాంధీ లాంటి దివ్యజ్ఞాన ప్రకాశకులంతా ఇటువంటి దైవలక్షణాలతో కూడుకుని ఉండేవాళ్ళు కనుకనే వారి యొక్క అయస్కాంత శక్తిక్షేత్రాల పట్ల లక్షలాది మంది ప్రజలు ఆకర్షితులై వారితో కలిసి సమాజానికి సేవ చేస్తూండేవాళ్ళు ! ఇవన్నీ కూడా అయస్కాంత శక్తిక్షేత్రాల మార్పిడి ప్రక్రియలే కానీ మరేదో మాయో, మంత్రమో కానే కాదు !

K.S.కుమార్: “PSSM మహాఉద్యమంలో నిరంతరంబిజీగా ఉండే మీరు .. ఎప్పుడైనా ‘నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను’ అనుకున్నారా? “
పత్రీజీ: ఇదంతా నా కుటుంబమే! ఇంత గొప్ప వసుధైక కుటుంబంలో .. “నా కుటుంబం” అంటూ నాకు ప్రత్యేకంగా వేరే ఏదీ లేదు.

K.S.కుమార్: “2012లో లక్షల మందితో మనం ప్రపంచ ధ్యానమహాసభలు జరుపుకున్నాం .. ఎలా ఫీల్ అయ్యారు?!”
పత్రీజీ: “నీరు పల్లమెరుగు .. సత్యం వ్యాప్తినెరుగు” అన్నది సత్యం !

“2012లో ఏదో జరగబోతోంది” అన్న మీడియా ప్రచార భయంతోనో, సత్యం తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోనో లేక ఆధ్యాత్మిక జగత్తులో జరుగుతోన్న ఈ సరిక్రొత్త సామూహిక ధ్యాన ప్రయోగంలో ప్రత్యక్షంగా పాల్గొందామన్న ఉత్సాహంతోనో వచ్చిన వాళ్ళంతా వారి వారి అవగాహనల మేరకు ధ్యాన సత్యాన్ని తెలుసుకున్నారు !

ఏది ఏమైనా “2012 ప్రపంచ ధ్యాన మహాసభల” నిర్వహణ ద్వారా ప్రపంచం నలుమూలలా ధ్యాన-శాకాహార-పిరమిడ్ శక్తి సందేశాలు అజ్ఞాతంగా చేరిపోయాయి. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.

K.S.కుమార్: “మీకు ఏవైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?”
పత్రీజీ: (నవ్వుతూ) నాకేమీ అతీంద్రియ శక్తులు లేవు ! నేను చాలా, చాలా సాధారణమైన వ్యక్తిని. మనం ఎంతగా దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందుతూ ఉంటామో అంత సాధారణ వ్యక్తులలా పరిమారుతూ ఉంటాం ; నా దగ్గర ఎలాంటి మానవాతీత శక్తులు లేవు !

నా దగ్గర ఉన్నదల్లా సత్యం యొక్క శక్తి .. సకల ప్రాణికోటి పట్ల సహ అనుభూతితో కూడిన భూతదయ యొక్క శక్తి, నిరాడంబరత యొక్క శక్తి, సమయస్ఫూర్తి యొక్క శక్తి .. మరి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూడా శాస్త్రీయ దృక్పథంతో వీక్షించేశక్తి ! వీటిని మించి మరే ఇతర శక్తులు నా దగ్గర ఏమీ లేవు .. మరి వాటి సహాయంతోనే నేను నా జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా జీవిస్తున్నాను.

K.S.కుమార్: “కానీ చాలా మంది .. ‘మా మనస్సులో ఉన్న ఆలోచనలను సార్ బయటపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అనీ .. ‘భౌతికంగానో మరి ఆస్ట్రల్‌గానో మమ్మల్ని ఎన్నో సందర్భాలలో వారు ఆదుకున్నారు’ అనీ అంటారు?!”
పత్రీజీ: నా మనస్సు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. దాంతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళ మనస్సులోని ఆలోచనలన్నీ టక టకా నా మనస్సులోకి వచ్చేస్తూంటాయి ! అది అలా జరిగిపోతూ ఉంటుంది .. అంతే !

K.S.కుమార్: “మీకు అంటూ .. ప్రత్యేకమైన లక్ష్యాలు?!”
పత్రీజీ: నాకే కాదు! .. ప్రతి ఒక్కరి జీవితానికి కూడా జీవాత్మగా ఒక ప్రత్యేకమైన specific లక్ష్యం మరి సర్వాత్మగా ఒక సాధారణ general లక్ష్యం ఉంటుంది.

ఎప్పుడయితే మనం సర్వాత్మలుగా నలుగురికీ క్షేమదాయకమైన సాధరణ లక్ష్యం కోసం జాగరూకతతో పరిశ్రమిస్తూ ఉంటామో .. అప్పుడు జీవాత్మగా జన్మ తీసుకున్న మన ప్రత్యేకమైన లక్ష్యం దానికదే నెరవేర్చబడుతూ ఉంటుంది. అంటె ప్రతిక్షణం మనం లోక కల్యాణం కోసం పాటుపడుతూ ఉంటే మన స్వీయ కల్యాణం కూడా జరిగిపోతూ ఉంటుంది. “ధ్యాన జగత్” కంటే .. “శాకాహార జగత్” కంటే .. “అహింసా జగత్” కంటే .. “పిరమిడ్ జగత్” కంటే మించిన లోకకల్యాణ కార్యక్రమాలు ఇంక వేరే ఉండవు కదా!!

K.S.కుమార్: “మీ సందేశం? !”
పత్రీజీ: ఈ భూమి మీద భౌతిక శరీరంతో ఉన్నన్ని రోజులు తిండి, నిద్ర, మైధునం వంటి శారీరక అవసరాల పట్ల శారీరక పిపాస ఉన్నట్లే .. ఆ శరీరంలో ఆత్మ ఉన్నంత సేపు ఆత్మ పిపాస కూడా ఉంటుంది. అదే .. ధ్యాన పిపాస + జ్ఞాన పిపాస + ఆనంద పిపాస !

శరీరం కొద్దిరోజులే ఉంటుంది కనుక దాని అవసరాల పిపాస తాత్కాలికం ! కానీ శరీరం ఉన్నప్పుడూ, దానిని వదిలివేసిన తరువాతా .. మళ్ళీ శరీరాన్ని ధరించేంత వరకూ .. తిరిగి క్రొత్త శరీరాన్ని ధరించాక కూడా ఆత్మ పిపాస ఉంటూనే ఉంటుంది కనుక అది శాశ్వతమైనపిపాస ! అది అంతమయ్యేది కాదు.

“ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి; ఎంత చూసినా ఇంకా చూడాలి; ఎంత విన్నా .. ఇంకా వినాలి; ఎంత అనుభవం పొందినా .. ఇంకా పొందాలి; ఎంత సేవ చేసినా .. ఇంకా చెయ్యాలి” అన్న ఈ ఆత్మపిపాస ఎప్పటికీ తరిగేది కాదు. ఇది అద్భుతం అనంతం మరి సర్వవ్యాప్తం !

ధ్యానం ఒక్కటే ఈ సకల పిపాసలను తీర్చి .. శారీరకపరంగా ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది .. మానసికపరంగా ప్రశాంతతను కలుగజేస్తుంది .. బుద్ధిపరంగా సకల వికాసాలను కలుగజేస్తుంది మరి ఆత్మ పరంగా ఆత్మ యొక్క సర్వవ్యాపక తత్త్వాన్ని మనకు బహువిధాలుగా అవగాహనకు తెస్తుంది.

ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థం అయ్యాక మనలో మన జీవన ప్రవాహాన్ని అడ్డుకునే “చావు పట్ల భయం” పోతుంది. “చావు” అంటే ఏమిటో తెలుసుకున్నవాడు “చావడం సహజమే .. దానిని తప్పించుకోవలసిన అవసరం లేదు “అని తెలుసుకుని చావుపట్ల భయాన్ని వదిలేసి వర్తమానంలో హాయిగా జీవిస్తాడు. ఆత్మతత్వాన్ని అవగతం చేసుకున్నవాడికే జీవిత ప్రవాహం గమ్యగోచరంగా మరి సుగమంగా అయిపోతుంది !

అందరికీ PSSM రజతోత్సవాల సందర్భంగా మరి నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు !!