పత్రీజీ కాన్సెప్ట్‌లు
1. ద్విపాద క్రూరమృగాలు | : | అంటే మాంస భక్షకులు, క్రూర కర్ములు. |
2. ద్విపాద పశువులు | : | శాకాహారులు. అయితే, మూర్తిపూజలు చేసేవారు. స్వార్థపరులు |
3. ద్విపాద మానవులు | : | శాకాహారులు, రాళ్ళు రప్పల్ని కాక మానవులలో దైవాన్ని దర్శిస్తూ నిస్వార్ధ సమాజ సేవాతత్పరులు. |
4. ద్విపాద దేవతలు | : | ధ్యానులు. ‘ నేనెవరు ‘ అనే జిజ్ఞాసాపరులు. తాత్విక స్పృహ కల్గి పరలోక చింతన చేసేవారు. |
5. ద్విపాద దేవుళ్ళు | : | జ్ఞానులు. ఆత్మానుభవజ్ఞులు. ఆత్మ-పరమాత్మల ఏకత్వాన్ని గుర్తెరిగినవారు. సమదర్శనులు. |
* * *
“మీరు ఏ కేటగిరీలోకి వస్తారో మీరే బేరీజు వేసుకోండి”. క్రూరమృగాలా, పశువులా, మానవులా, దేవతలా, దేవుళ్ళా?
ధ్యాన సాధకులు మాంసాహారం విసర్జించి తీరాలి. “మీ కడుపుల్ని స్మశానాలుగా మార్చుకుంటారా?
* * *
“కోడిగ్రుడ్డు? ” … “గ్రుడ్డు వేరు, కోడి వేరూనా? మీ శరీరం ఒకటి, నోరు లేని మూగజీవానిది వేరా? ఆకు కోస్తే ఆకు మొలుస్తుంది. పీక కోస్తే పీక మొలుస్తుందా? చచ్చు సందేహాలు వదిలిపెట్టండి. మనిషి అన్నవాడు శాకాహారానికే ఉద్దేశింపబడ్డాడు. మనోవాక్కాయకర్మణా ఏ విధమైన హింసకూ పాల్పడరాదు. బుద్ధిగలవాడు వితరణ కోల్పోరాదు. ఎలాంటి హింస తగదు.”
” హింస పెడితే దానవుడు హింస వీడితే మానవుడు హంసను పడితే దేవుడు “
“ప్రాణిహింస మహాపాపం. పట్టుచీరలు కట్టినా పాపమే” … అవును. పట్టుపురుగుల్ని చంపితేనే కదా పట్టుదారం. హింస వలననే అశాంతి. అహింసే ఆత్మశాంతికి ఆలంబనం. పొట్ట నింపుకోవడానికి పట్టెడన్నం చాలు. అందుకోసం ప్రాణుల్ని నంజుకు తినాలి?
ఇంక “ఎంత తినాలి?” అంటే హితవైనది, పోషణకారి, మన శరీరానికి అనువైనది మితంగా, ఆకలి మేరకు, నియమిత వేళలో తినాలి.
* * *
“స్పిరిచ్యువాలిటీ అంటే ఏమిటి?”
“ఆధ్యాత్మికత … లేక స్పిరిచ్యువాలిటీ … అంటే మనలోని ఆత్మతో అనుసంధానించుకునే అనుభవమే (Experiencing the Soul).”
* * *
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నిల్పడం. మనస్సుని శూన్యం అంటే ఆలోచనా రహితం చేయడమే ధ్యానం . . . ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికత లభిస్తుంది. ఆత్మజ్ఞానం, ఆత్మానుసంధానం సాధ్యపడుతుంది. విత్తనంలో చెట్టు నిక్షిప్తమై ఉంది. ఆ విత్తనానికి నీరు జోడిస్తేనే అది మొలకెత్తుతుంది. అలాగే జీవగతమైన యీ ఆత్మ పరమాత్మగా పరిణితి చెందాలంటే ధ్యాన జలాలతో దాన్ని తడపాలి. వెదురుబొంగు తనలోని వ్యర్థ పదార్థాన్ని తొలగించి నవరంధ్రాలను తెరచి ఉంచినప్పుడే వెదురు వంశీగా మారి మాధవుని పెదవులను చేరి ముగ్ధ గీతాలాపనలను అందుకోగలుగుతుంది. అలాగే నిన్ను నువ్వు శూన్యం చేసుకుంటే ఆత్మనాధం పలుకుతుంది. నీలోని అహం (దేహమే నేననే సీమిత స్థూలభావన) ను శూన్యం చేసుకుంటే మిగిలినదంతా ఆత్మ చైతన్యమే. సర్వం శక్తిమయం. సర్వం ఏకం. సత్యం, నిత్యం, శక్తిమయం.
శూన్యంలోనే శక్తిప్రసారం జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస నిల్పి మెదడు ఆలోచనా రహితం చేసిన వెంటనే విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా అఖండంగా ప్రవేశించి నీలో అంతా నిండిపోతుంది. అంతా ఒక పూర్ణత్వం. నువ్వు అదే. నేను అదే. అది అదే. అంతా అదే అనే విశ్వ స్వరూప దృష్టి అవతరిస్తుంది. అఖండమైన సర్వవ్యాపకమై విలసిల్లే ఆ అనంతశక్తి వైవిధ్య సృజనాత్మక ప్రదర్శనమే ఈ సృష్టి సమస్తం. ఈ వ్యక్తప్రపంచ స్వరూపం. సచేతన పుష్పాలన్నిటినీ ఒక దివ్య హారంగా కూర్చే దారం. అంతా శూన్యమే.
విజ్ఞత + సమర్థత + అప్రమత్తత = బుద్ధత్వం
“ధ్యానం ద్వారా విజ్ఞత లభిస్తుంది, సమర్ధతో జీవన ధర్మాన్ని ఆచరించాలి. అప్రమత్తతో సర్వత్రా వ్యవహరించాలి.”
అందులోనే ఉంది జీవన విజయ రహస్యం. ఆ విధంగా ధ్యాన సాధన ద్వారా సత్య జ్ఞానాన్ని పొంది సన్మార్గ వర్తనులై సమర్ధతతో అప్రమత్తంగా వ్యవహరించే వారిని విజయం కోరి వస్తుంది. వారికి దైన్యం, దిగులు, నీరసం, నిస్పృహ, రోగం, రొష్టు, అశాంతి, అపజయం ఎందుకుంటాయి ? శాంతి, విశ్రాంతి వారికి కరతలామాలకాలు. వారి వ్యవహారంలో ‘ దండగ ‘ అన్నది ఉండదు. ప్రతిక్షణం పండుగే. అత్యంత జాగరూకతతో ఉండి తాను చేయవల్సిన విధి విహితాలను గురించి పూర్ణ విజ్ఞానం సంపాదించి జీవన అవకాశాలను, వనరులను వివేకంతో సమర్ధవంతంగా వినియోగించి త్రికరణశుద్ధిగా వ్యవహరించే వారికీ ఏ పనీ ‘శ్రమ’ కాదు. ఏదీ ‘ భారం ‘ కాదు. ఏ విధమైన ‘బాధ’ పడరు. విజయం పట్ల విశ్వాసంతో విశ్రాంతిగా, నిశ్చితంగా, నిస్సందేహంగా, నిశ్చలంగా ఉండగలుగుతారు.
కనుక, జీవితంలో నిజమైన శాంతిని విశ్రాంతిని కోరుకునేవారు … విజ్ఞత, సమర్ధత, అప్రమత్తత అనే త్రిసాధనాలను అలవర్చుకోవాలి. సోమరిపోతులకూ, మూర్ఖులకూ, అవిశ్వాసాలకూ ప్రకృతి విషమ ఫలాలను అందిస్తుంది.
విషయాన్ని తీవ్ర విచారణ చేసి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. అలా సంపాదించిన విషయ పరిజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణ చేయాలి. ప్రయోగం చేసుకుని తద్వారా నిశ్చితమైన అనుభవజ్ఞానంగా దాన్ని ధృవీకరించుకోవాలి. అప్పుడే దాన్ని గురించి ప్రసంగించే హక్కు, ప్రచారం చేసే యోగ్యత కలుగుతాయి. పరిపూర్ణ అవగాహన, ఆచరణ లేని వాక్ప్రచారం సారహీనం. సత్యదూరం. వ్యర్థ ప్రసంగం వ్యాసంగంగా మిగిలిపోతుంది. దాని ప్రభావం శూన్యం. అందుకే కావాలి విజ్ఞత. ఆచరణలో సమర్థత, అప్రమత్తత … ‘సింహవలోకనం’ అంటారు. ముందుచూపు వెనుకచూపు అంటే ప్రమాదాలు రాకుండా లభించిన ప్రయోజనాలు చేజారిపోకుండా వుండడమే అప్రమత్తత. అప్పుడే సాధ్యం కార్యానుకూలత. కార్య విజయం. రక్షణ, సంక్షేమం అనేవి మానవ సమాజపు రెండు ముఖ్య లక్ష్యాలు కదా. అందుకు అందరూ విజ్ఞానం, ఆచరణ, అప్రమత్త సాధన సాధించాలి.
“ధ్యాన స్థితిలో కూర్చుని వున్న బుద్ధ మూర్తి శివపార్వతీ తత్వం” . అంటే ధ్యానం ద్వారా జ్ఞాన సిద్ధి … నిశ్చలంగా నిలబడి వున్న బుద్ధమూర్తి “కార్యోన్ముఖతకు, సృజనాత్మకతకు ప్రతీకగా బ్రహ్మ వాగేశ్వరీ స్వరూపం”. అంటే, సమర్ధతకు, కార్యాచరణకు చిహ్నం. ఆ విధంగా పాలసంద్రం లాగా స్వచ్ఛతతో, అప్రమత్తతతో, ప్రణాళిక బద్ధంగా, కాలబద్ధంగా కార్యసాధన చేస్తే ఆ పైన పొందేది నిశ్చయ విశ్రాంతి, విరామాలే. అదే “పాలసంద్రాన శేషతల్ప గతుడై నిశ్చింతగా ముక్త మనస్కుడై యోగనిద్రా వశుడై పవళించే విష్ణుతత్వం”. అట్టి వానికి సిరి దాస్యం చేస్తుంది. విజయం కోరి తలుపు తడుతుంది. అదే శయనించే బుద్ధ శిల్పంలోని తత్వ రహస్యం. అదే ముక్త స్థితి. సమాధి స్థితి. అన్నీ వున్న పూర్ణత్వం … దేనికీ తాపత్రయపడని ప్రశాంత తత్వం … అన్నీ వున్నా ఏదీ కోరని నిష్కామ తత్వం, నిర్మల తత్వం, నిశ్చల తత్వం, జీవన్ముక్తి. జీవించి ఉండే అటువంటి మానసిక, బుద్ధి, పరిణితిని పరిపక్వతని పొందాలి. కోరికతో కాక కర్తవ్యతా దృష్టితో కార్యనిర్వహణ చేసేవారికి ఏ తాపత్రయాలు ఉండవు. ఏ నిరాశా నిస్పృహలు ఉండవు. అన్నింటా తృప్తులై ఉంటారు. అట్టివారి తలపులు, వాక్కులు, కర్మలు అన్నీ హితకరములై ఉంటాయి. ఆత్మహితములు లోకహితములు కూడా.