“పరిప్రశ్న – పత్రీజీ పరి సమాధానం”

 

 

ప్రశ్న: ” ‘సన్యాసం’ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? “

పత్రీజీ: “సమ్యక్” .. అంటే “సరియైన”

“న్యాసం” .. అంటే “త్యజించడం”

సమ్యక్ + న్యాసం = సన్యాసం

“సన్యాసం” అంటే “సరియైన వాటిని త్యజించడం” సన్యాసం అన్నది నాలుగు రకాలు:

మర్కట సన్యాసం: చిన్ని చిన్ని కారణాలకే సన్యాసులుగా మారి ఉన్న సంసారాన్ని వదిలిపెట్టేయడం .. మర్కట సన్యాసం. ఇది “శూద్రసన్యాసం” .. మరి ఇలాంటివారు కొన్నిరోజులకు మరొక సంసారంలో తగులుకుంటూ ఉంటారు.

ఆపత్ సన్యాసం: ఇప్పుడో .. మరి కాస్సేపట్లోనో చనిపోతానని తెలిసి “స్వర్గంలో స్థానం పొందాలి” అన్న ఆశతో సన్యాసాన్ని స్వీకరించడం ఆపత్‌సన్యాసం; ఇది “వైశ్య సన్యాసం”.

వివిధిష సన్యాసం:  సత్యాన్ని తెలుసుకోవాలన్న తీవ్ర ఆకాంక్ష మరి జ్ఞాన తృష్ణతో తమకు ఉన్న ప్రతి దానినీ త్యజించి తీసుకునే సన్యాసం వివిధిష సన్యాసం. మేధో తత్వానికి చెందిన వివేకానందుని లాంటివారు ఇందుకు ఉదాహరణ; ఇది “క్షత్రియ సన్యాసం”.

విద్వత్ సన్యాసం: సన్యాసాల్లో కెల్లా అత్యున్నత ఆత్మస్థాయికి చెందిన సన్యాసమే విద్వత్ సన్యాసం! బ్రహ్మాజ్ఞానులైన విద్వత్ సన్యాసులు .. తమ సంసారాన్ని కాకుండా సంసారం పట్ల తమకు ఉన్న అజ్ఞానాన్ని మాత్రం వదిలిపెడతారు.

వారు తమ దైనందిన జీవితంలో అనవసరమైన వాటిని వదిలిపెట్టి అవసరమైన వాటికే పరిమితం అవుతూ “సంసారంలోనే నిర్వాణం” చెందుతూ ఉంటారు; ఇది బ్రాహ్మణ సన్యాసం; ఇది పిరమిడ్ మాస్టర్లకు స్వంతం!

 

ప్రశ్న: “ధ్యానం నేర్చుకోవాలంటే ఏమైనా పెట్టుబడి పెట్టాలా?”

పత్రీజీ: పెట్టాలి! “పెట్టుబడి” అంటే “ఇన్‌పుట్”! 24 గంటల్లో కొం‍తసమయాన్ని ప్రత్యేకంగా ధ్యానం కోసం పెట్టుబడిగా పెట్టాలి! ఒక వ్యాపారంలో ఇన్‌పుట్‌ను బట్టే  లాభం ఉన్నట్లు .. మనం పెట్టుబడిగా పెట్టే “సమయం” అనే  “ఇన్‌పుట్” ని బట్టే మనకు  “ధ్యానఫలితం” అనే లాభం వుంటుంది.

 

ప్రశ్న: “‘శాస్త్రం’ అంటే ఏమిటి?”

పత్రీజీ: ఏ పని చేస్తే, ఏ ఫలితం వస్తుందో .. ఏ కారణం ఏ పరిణామంగా మారుతుందో .. విశద పరిచేదే “శాస్త్రం”!

 

ప్రశ్న: “మీ జీవితాన్ని ధ్యానానికే అంకితం చేశారా?”

పత్రీజీ: క్రికెట్ ఆటకు కూడా అంకితం చేశాను .. మొన్న మ్యాచ్ అంతా చూశానుగా! నా జీవితాన్ని TV లోని అన్ని ఛానెల్స్ చూడడానికి అంకితం చేశాను! నా జీవితాన్ని ప్రపంచ జనులందరితో స్నేహానికి అంకితం చేశాను!

 

ప్రశ్న: “జీవితం ఒక ఉత్సవం ఎప్పుడు అవుతుంది?

పత్రీజీ: ధ్యాన – జ్ఞానాదుల వలన మనకు సృష్టి యొక్క మూల సిద్ధాంతాలన్నీ అవగతం అయినప్పుడు మనకూ మరి విశ్వంలో ఉన్న అనేకానేక నక్షత్రలోకవాసులకూ మధ్య వున్న సంబంధాన్ని తెలుసుకోగలిగే “ఆత్మజ్ఞాన ప్రకాశం” మన స్వంతం అవుతుంది. “ఆత్మజ్ఞాన ప్రకాశాన్ని” పొందిన మనం యుక్తా యుక్త విచక్షణతో కూడి ఉంటూ మన జీవితాన్ని ప్రతిక్షణం ఒక ఉత్సవంలా జీవిస్తూంటాం!

 

ప్రశ్న: “ఈ మధ్య చాలా మంది డాక్టర్స్ .. తమ తమ ప్రిస్క్రిప్షన్స్‌లో మందులతో పాటు మెడిటేషన్ కూడా చెయ్యమని వ్రాస్తున్నారు!?”

పత్రీజీ: “సత్యం” కావాలని కోరుకోకుండా ఎవరు ఉంటారు? వారు ‘డాక్టర్’ కానీ .. ‘పేషెంట్’ కానీ .. ‘గృహిణి’ కానీ .. ‘రాజు’ కానీ .. ‘పేద’ కానీ .. ‘పండితుడు’ కానీ .. ‘పామరుడు’ కానీ .. ‘ప్రధానమంత్రి’ కానీ .. మరి ‘బంట్రోతు’ కానీ .. ఎవరెవరికైతే సత్యం కావాలో .. మరి ఎవరెవరైతే జీవితాన్ని శాంతిమయంగా జీవించాలని కోరుకుంటారో .. వాళ్ళంతా కూడా ధ్యానం చెయ్యాల్సిందే! విధిగా సత్యంతో జీవిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిందే! ధ్యానం ద్వారానే మరి ఆరోగ్యం అన్నది సమకూరుతుంది కనుక డాక్టర్లు కూడా మందులతో పాటు “ధ్యానం చెయ్యండి” అని పేషంట్లకు సూచించడం ఆనందించదగ్గ విషయం.

 

ప్రశ్న: “ధ్యానం చేసేవాళ్ళకు ఫ్యామిలీ ఉండొచ్చా?!”

పత్రీజీ: అంటే వుండకూడదనా మీ ఉద్దేశ్యం?! యోగీశ్వరుడైన కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలతో కూడిన పెద్ద ఫ్యామిలీ ఉంది! వశిష్ఠుడు మరి అరుంధతి గొప్ప యోగీశ్వరులే కదా! సుఖమయ సంసారంలోనే .. నిర్వాణమయ ఆత్మవత్ జీవితం అన్నదే “పిరమిడ్ సిద్ధాంతం”.

 

ప్రశ్న: పాపాలు చేసేవాళ్ళంతా మళ్ళీ జన్మల్లో క్రిమికీట కాదులుగా పుడుతారని పురాణాల్లో వ్రాసింది నిజమేనా?

పత్రీజీ: అవన్నీ కూడా ఆధ్యాత్మికపరంగా కొందరు వ్రాసిన పనికి వచ్చే చిలిపి వ్రాతలు! మానవజన్మ తరువాత మానవజన్మలే పరంపరగా వుంటాయి! ఒక మానవజన్మలో నేర్చుకోని పాఠాలు మరు మానవజన్మల్లో సరిచేసుకునే తీరాలి!

 

ప్రశ్న: “సమాజం పట్ల మన కర్తవ్యం?”

పత్రీజీ: సమాజంలో ఇతరుల అందరూ సుఖంగా, సంతోషంగా మరి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం! అందుకు గాను మన దగ్గర ఉన్న సర్వ వనరులను మనకు అవసరమైనంత మేర మాత్రమే ఖర్చుపెట్టుకుంటూ మిగిలిన వాటిని ఇతరులతో పంచుకోవాలి.

అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి దానాలతో పాటు .. “ధ్యాన దానం” మరి “జ్ఞానదానం” వంటి ధ్యానులను మరి శక్తిమేరకు చెయ్యాలి!

ప్రశ్న: “మనుష్యులందరూ నా ఇల్లూ, నా కుటుంబం అనుకుంటూ వారికోసం పాటుపడుతూంటే మీరు దానికి భిన్నంగా ‘ప్రపంచమంతా నా కుటుంబమే” .. మరి ‘అందరినీ ఉన్నతీకరించాలి’ అని ఎందుకు అనుకున్నారు?”

పత్రీజీ: “నేను, నా పిల్లలు” అనేది ఎవరికైనా కొంత కాలం వుండి తీరుతుంది. స్వంత తల్లిదండ్రుల దగ్గర ఒక కుటుంబంలో పెరిగి, ఆ తర్వాత మనం స్వయంగా తల్లిదండ్రులమై ఒక కుటుంబం స్థాపించటానికి ఆరాటపడతాం. అది తీరిన తరువాత “వసుధైక కుటుంబం” కోసం తహతహలాడే దశ కూడా అందరికీ వచ్చి తీరుతుంది. సృష్టిలో చాలా మందికి ఆ స్థితి వచ్చినట్లే మరి నాకూ వచ్చింది, అంతే!

ప్రశ్న: “మీ వద్ద ధ్యానం నేర్చుకుని కొంత సాధన చేసి జ్ఞానం పొందిన తరువాత కూడా కొందరు జారిపోతూ వుంటారు? ఎందుకని?”

పత్రీజీ: అదంతా సహజమే. పౌర్ణమి తరువాత అమావాస్య వచ్చే తీరుతుంది. ఆ అమావాస్య తరువాత మళ్ళీ పౌర్ణమి వచ్చే తీరుతుంది. ఈ అమావాస్య పౌర్ణమిల మధ్య ఊగిసలాటలోనే క్రమక్రమంగా స్థితప్రజ్ఞత్వం వస్తుంది. ఆటుపోటలను తట్టుకునేదే స్థితప్రజ్ఞత. ‘స్థితప్రజ్ఞత’ అన్నదే ఆధ్యాత్మికతకు సూచిక.

ప్రశ్న: “మీరు ఎవరికైనా ఒక విషయం చెప్పినప్పుడు దానిని యధాతధంగా అనుసరించకుండా తమ తెలివిని ఉపయోగించి, దానికి మార్పులు చేర్పులు చేసి అదే మధ్యేమార్గం అనీ. అదే ఉన్నతమైనదనీ భావించటం సరియైనదేనా?”

పత్రీజీ: తప్పకుండా సరియైనదే. ఎప్పుడూ మన ఇంగితజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే ఉండాలి. మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి ఎంతయినా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఎవరికి అనిపించిందే వారు చేయాలి. అందరూ అలానే చేస్తున్నారు కూడా. ఎవరి దృక్పధం, ఎవరి ధర్మం వారి వారికి ప్రత్యేకం. “ప్రతి ఒక్కరూ వారి వారి దృష్టికోణాల నుండి సరిగ్గానే వున్నారు” అని గ్రహించగలిగినదే విశాల దృక్పధం. ఒక ప్రక్క ప్రత్యేక దృక్పధంతోనూ, ఇంకో ప్రక్క విశాల దృక్పధంతోనూ రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా కూడానూ, ఈ రెండింటితోనూ మనగలగాలి. అదే మధ్యేమార్గం అంటే. ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క జీవితమూ ఆధ్యాత్మికత అన్నదానికి ఒక క్రొత్త మలుపు కావాలి. ఆధ్యాత్మిక జీవితం మూసపోసినట్లుగా అందరికీ ఒకే విధంగా ఉండదు. దృక్పధాలు ఎన్ని విధాలుగా వున్నా అంతా చిరునవ్వుతో స్వీకరించడమే ఆధ్యాత్మికత!

ప్రశ్న: “భూమి మీద అందరితోనూ మిత్రత్వంతో వ్యవహరిస్తూ చక్కటి సంబంధాలను కలిగి ఉండి, ఇంగిత జ్ఞానంతో వ్యవహరించడం ముఖ్యమా? ఇతర లోకాల జ్ఞానం తెలుసుకోవడం ముఖ్యమా?”

పత్రీజీ: మొదటి ఒక ఇంట్లో పుట్టి, పెరిగి నెమ్మదిగా ప్రక్క ఇంటికి ఉత్సుకతతో వెళతాం. ఆ తరువాత మెల్లిమెల్లిగా ఆ ప్రక్క ఇంటికీ, ఇంకో ప్రక్క ఇంటికీ వెళతాం. గోడలు దూకి వాటి వెనుక ఏముందో చూస్తాం. తరువాత ప్రక్క ఊరికి పిక్‌నిక్‌కు వెళతాం. దూరంగా కన్పించే కొండ ఎక్కి అన్నీ చూసి తిరిగి వస్తాం. కొంత దూరంలో ఉన్న అడవికి వెళ్ళి, అడవి అంతా చూసి తిరిగి వస్తాం. తరువాత దగ్గరలోని నగరానికి వెళ్ళి అక్కడి వింతలూ విశేషాలు చూసి వస్తాం. వీలైనంతలో దేశవిదేశాలన్నీ తిరిగి వస్తాం.

ఇదంతా ప్రాపంచిక జీవితంలో అందరూ అనుభవిస్తున్నదే. ఆ తరువాత ఆధ్యాత్మిక జీవితంలో కూడానూ ఇటువంటి క్రమమే వుంది. “సరే ఈ జన్మలో ఇక్కడ వున్నాను; గత జన్మలో ఏమై వుంటాను?” అన్నప్రశ్న ఉదయిస్తుంది. గత జన్మలన్నీ దర్శించాలని ఆకాంక్షిస్తాము. అ అపైన “జన్మకూ జన్మకూ మధ్య ఎక్కడ వున్నాను? అక్కడ ఏం చేస్తాము?” అన్నది తెలుసుకుంటాము! ఆ తరువాత “ఎన్ని గెలాక్సీలలో ఎన్ని జీవరాసులు ఉన్నాయి? మనుష్యులలాంటి వారు వున్నారా? గ్రహాంతర వాసులను కలుసుకోవచ్చా? వారితో మాట్లాడవచ్చా?” .. వంటివన్నీ ఆధ్యాత్మిక జీవితంలో సహజం.

ప్రశ్న: “ధ్యానం తెలిసిన వెంటనే కొందరు గంటలు, గంటలు రోజులు రోజులు ధ్యాన సాధన చేస్తూ వుంటారు. కొందరు నిరంతరం ధ్యానప్రచారంలోనూ దానికి చెందిన అనేక పనులలోనూ మునిగి తేలుతూ వుంటారు, దేనిని అనుసరించాలి?”

పత్రీజీ: గత జన్మలలో అధికంగా ధ్యానసాధన చేసినవారే ఈ జన్మలో అధికంగా ధ్యానప్రచారం చేస్తూ వుంటారు. “ఈ జన్మలో ధ్యానం చెయ్యాలి .. అదొక్కటే నాకు కావాలి”అన్న వారికి అదొక్కటే సత్యం. “నాకు ధ్యాన సాధన కన్నా ధ్యాన ప్రచారమే ఇష్టం; అది లేకుండా నేను ఉండలేను” అనే వారికి అదే సత్యం. ఎవరి సత్యంలో వాళ్ళు జీవించాలి.

ప్రశ్న: ‘ప్రాపంచికత’ – ‘ఆధ్యాత్మికత’ రెండూ ఒక్కటేనా? వేరువేరా?”

పత్రీజీ: సత్యం తెలుసుకోనంత వరకూ అవి రెండూ వేరు వేరే. సత్యం తెలిసిన తరువాత అవి రెండూ ఒక్కటే. “ప్రాపంచికత” అంటే ప్రపంచంలో మనం జీవించే తీరుతెన్నులు. “ఆధ్యాత్మికత” అంటే ఆత్మస్ఫూర్తితో మనం జీవించే తీరుతెన్నులు. ఈ ప్రపంచంలో పుట్టడం, జీవించడం, మరణించడం – ఇదంతా ఆత్మ యొక్క ఎంపికే. ఆధ్యాత్మికత తెలిసినవాడికే “ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండూ ఒక్కటే” అని తెలుస్తుంది. ఆధ్యాత్మికత తెలియని వారే “ఆధ్యాత్మికత వేరు ప్రాపంచికత వేరు” అని భ్రమ పడుతూ వుంటారు. ప్రాపంచికంలో వుండే ప్రతి చిన్న విషయం ఆధ్యాత్మికతలో మహా విషయమే. ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి .. ఇదంతా ఆధ్యాత్మిక విజ్ఞాన విషయమే. ఆధ్యాత్మికత అన్నదే ప్రాపంచికతకు అర్థవంతమయిన చుక్కాని. ఒకానొక నావ యొక్క ప్రధానభాగం చుక్కాని గదా, ప్రాపంచికత యొక్క అత్యంత ప్రధాన భాగమే ఆధ్యాత్మికత. శాంతిమయ, ప్రగతిమయ ప్రాపంచికత కోసమే ఆధ్యాత్మికత.

ప్రశ్న: ధ్యానం చెయ్యడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు ఉన్న రోగాలన్నీ పోయాయి. గత మూడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రోగాలు వేదిస్తున్నాయి. ధ్యానం చేస్తే రోగాలన్నీ పోవాలి కదా?

పత్రీజీ: చేసిన కర్మల చిట్టా ఎన్ని జన్మల నుంచీ వుందో ఎవరికి తెలుసు? లోగట్టు పెరుమాళ్ళకెరుక! కొంత ధ్యానం చేస్తే కొంత బాగుపడుతాం. అంతా బాగుపడాలంటే ఎంతో ధ్యానం చేయాలి.

కొంత ధ్యానం చేస్తే కొంత బాగుపడి కొంతే బాగుంటాం. మళ్ళీ గతజన్మల నుంచి కర్మ మళ్ళీ ఎక్కడో ఎదురై శరీరం చెడిపోతుంది. దానర్థం ఏమిటంటే మన ధ్యానం ఎంత చేశామో అంత బాగుపడ్డాము. మరి ఇంకా ఎన్నో జన్మల నుండి వచ్చిన దానిని బాగుచేసుకోవటానికి ఇంకా ఎంతో ధ్యానం చేయాలి. అంతేకానీ “చిన్న ధ్యానానికి అన్ని రోగాలు పోతాయి” అనుకోవడం చాలా మూర్ఖత్వం.

మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో వాటిలో ఎన్ని హీనమయిన కర్మలు వున్నాయో ఆ చిట్టా మనకు తెలియదు కదా! తెలియనప్పుడు ఇలాంటి లెక్కలు అడగకూడదు. మనకు మన గతజన్మలలోని లెక్కలు తెలియనప్పుడు నిరంతరంగా ధ్యానం చేస్తూనే వుండాలి. మన ప్రణాళికలో కొన్ని తెలుసుకోవలసినవి వుంటాయి, కొన్ని అనుభవించవలసినవి వుంటాయి. ఆ విధంగా “ఎంత ధ్యానం చేసినా కొన్ని జబ్బులు తగ్గటం లేదు, కొన్ని క్రొత్త జబ్బులు వస్తున్నాయి” అంటే అవి మనం విధిగా ప్రణాళికాబద్ధంగా అనుభవించే తీరాలి కనుక వస్తున్నాయి. కొన్ని రోగాలు ధ్యానం చేసి తప్పించుకునేలా వుంటాయి.

రోగాలు, దుఃఖాలు రకరకాలుగా వుంటాయి. అన్నీ అనుభవించటం కోసమే మనం వచ్చాం. తగ్గేవి తగ్గుతాయి. తగ్గనవి తగ్గవు. మనం మట్టుకు ఎప్పుడూ ధ్యానాభ్యాసం చేస్తూనే వుండాలి. దీనావస్థలో వున్నా కూడా తప్పనిసరిగా, విడిచిపెట్టకుండా చేస్తూనే వుండాలి ధ్యానం. అప్పుడే మనకు జీవితం యొక్క గొప్పతనం మహా గొప్పగా తెలుస్తుంది.

ప్రశ్న: అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా, ఆనాపానసతినే ఎందుకు అనుసరించాలి?

పత్రీజీ: నిజమే! అనేకానేక ధ్యానపద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు ఓషో రజనీష్ గారు 108 పద్ధతులు చెప్పారు. ఇంకా మిగతా మాస్టర్లు అనేక రకాల ధ్యాన పద్ధతులను అనాదిగా చెప్పారు, చెప్తున్నారు, చెప్తూనే వుంటారు కూడా, తమ అనుభవజ్ఞానాన్ని అందరితో పంచుకోవడం సహజమే కదా!

అయితే ఎవరి అనుభవం వారిది, ఎవరి జ్ఞానం వారిది. మొదటి జన్మల్లో ఉన్నప్పుడు ఒక విధమైన అవగాహన వుంటుంది. జన్మలు పెరిగే కొద్దీ అవగాహనలు అత్యంత స్వచ్ఛంగా వుంటాయి, అందువల్ల వారి బోధనలు అత్యద్భుతంగా వుంటాయి.

గౌతమబుద్ధుడు అనేక జన్మల క్రిందటే అరిహంతుడు. ఆ తరువాత జన్మలలో బోధిసత్వుడిగా విరాజిల్లాడు; అంతిమ జన్మగా గౌతమ బుద్ధునిగా మనందరికీ ఆయన జీవితం, ఆయన బోధనలు సుపరిచితమే!

బుద్ధిడి జన్మలో కూడా సుమారు 500 గురువుల వద్దకు వెళ్ళి ఎన్నెన్నో రకాల ధ్యానపద్ధతులు నేర్చుకుని అభ్యాసం చేయడం జరిగింది; అయితే ఆయన వున్న స్థాయికి అవి తూగక చివరికి ఆనాపానసతిని కనుక్కోవడం జరిగింది! వెంటనే తన లక్ష్యంలో కృతకృత్యుడు కావటం కూడా జరిగిపోయింది! అంతిమంగా బుద్ధుడు ప్రవచించిన “ఆనాపానసతి”యే మన పిరమిడ్ ధ్యానానికి మూలమైనది. “ఆనాపానసతి సాధన”లో పిరమిడ్ ధ్యానులు కూడా విశేషంగా కృతకృత్యులై బుద్ధుళ్ళై విరాజిల్లుతున్నారు.

ప్రశ్న: మందులు, మరి ముఖ్యంగా అల్లోపతి మందులు వాడవద్దు అనడానికి కారణం ఏమిటి?

పత్రీజీ: ప్రతి చిన్న తలనొప్పికీ, కడుపు నొప్పికి మాత్రలు మ్రింగటం అందరికీ రివాజు అయిపోయింది. ఏది వచ్చినా డాక్టర్ వద్దకు పరిగెత్తటం .. అతను ఏది పొడిస్తే దానిని పొడిపించుకోవటం, ఇచ్చింది మ్రింగటం, “అంతా బాగైపోతుంది” అనుకుంటూ ఇంటికి వచ్చేయడం అలావాటైపోయింది.

నిజమైన  “MBBS” అంటే “Bachelor of Meditation and Bachelor of Spirituality” అని అర్థం. “M” for “Medicine కాదు .. “M” for Meditation .. “S” for Surgery కాదు .. “S” for Spirituality అని అర్థం చేసుకోవాలి.

కొన్ని సంవత్సరాల క్రిందట న్యూజిల్యాండ్‌లో “విలియమ్స్” అనే ఆయన ముఖానికి, గొంతుకూ క్యాన్సర్ సొకితే డాక్టర్లు కిమోథెరపీ కూడా చేసి “ఇక తగ్గదు” అని చెప్పారు. కానీ ఆయన కేవలం రెండు నెలలలో అక్కడి మన పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఆనాపానసతి ధ్యానం చేసి మరి దానిని పూర్తిగా తగ్గించుకున్నారు! ఇది ఎలా జరిగింది?

అన్నమయకోశం వెనుక ప్రాణమయకోశం వుంది. ప్రాణమయకోశ శుద్ధి జరిగితేనే అన్నమయకోశం బాగుపడుతుంది. అల్లోపతి వైద్యుల సూదులు మందులు అన్నీ అన్నమయకోశానికి చెందినవే! వారికి ఆ పైన వుండే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయకోశాలు వుంటాయని తెలియదు. తెలియని వారి వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకుంటే చికిత్స జరుగుతుందా? జరగదు! ఆధ్యాత్మిక ఆరోగ్యం అన్నది “తల్లి వేరు” అయితే శారీరక ఆరోగ్యం దాని యొక్క “వృక్ష ఫలం”! “ఆధ్యాత్మిక ఆరోగ్యం” అన్నది ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారానే మరి సాధ్యం.

ప్రశ్న: కర్మకూ, ఎరుకకూ సంబంధం వుందా?

పత్రీజీ: సృష్టి అంతా “ఎరుక” నుండి వచ్చిందే. సృష్టిపర్యంత మహాశుద్ధ చైతన్యమే “ఎరుక”అంటే.

“ఎరుక” అనేది మూల పదార్థం; పదార్థం పదార్థం కాని పదార్థం. “ఎరుక” అన్నది శాశ్వతమైనది. పుట్టుక, చావులు లేనిది, అజరామరమైనది. “సృష్టి పర్యంత మహా శుద్ధ ఎరుక” నుండి మన “స్వీయ ఎరుక” బయల్పడింది. మన స్వంత “ఎరుక” నుంచి మన స్వంత కర్మ ప్రకటితమౌతుంది .. సదా ప్రకటితమౌతూనే వుంటుంది.

జన్మలన్నీ “ఎరుక”  నుంచి వచ్చేవే. జన్మలోకి వచ్చిన తరువాత చేసే కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఎరుక నుండి వచ్చేవే. ప్రతి జన్మలోని కర్మలన్నీ ఎరుక జనితాలే. ప్రతి కర్మకూ కర్త ఎరుకే. చేసిన కర్మల ఫలితాలను అధ్యయనం చేసి, బేరీజు వేసుకునేది ఎరుకే.

ఆ విధంగా “ఎరుక” అన్నది సంతోషంగా సముజ్వలమవుతూనే వుంటుంది మరి! ఎప్పటికప్పుడు ఎరుక యొక్క మహాప్రస్థానం ఏమని చెప్పవలె! ఎంతని చెప్పగలం!! ఎరుకను మరింత బాగా ఎరుక చేసే మహాప్రయత్నమే ధ్యానం, ధ్యానకర్మ, ధ్యాన ప్రక్రియ. ధ్యానమహాకర్మల ద్వారా మన ఎరుకను ప్రతిదినం మనం దేదీప్యమానం చేసుకుందుము గాక!

ప్రశ్న : “సమాజంలో చుట్టూ జరుగుతూన్న అనర్థాలను చూస్తూంటే చాలా బాధ కలుగుతోంది.”

పత్రీజీ : చెడ్డవాళ్ళు చెడ్డపనులు చక్కగా చేస్తున్నారు! మరి మంచివాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు కానీ .. అక్కడ ఇంకా ఏం చేయాలో వాళ్ళకు తోచదు. చర్చ్‌లకు, మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు కానీ .. ఇంకా ఏం చెయ్యాలో వాళ్ళకు తెలియదు. ఇది సరిఅయిన పద్ధతి కాదు!

చెడ్డవాళ్ళ చెడ్డ పనులవల్ల జరగాల్సిన అనర్థాలు జరుగుతోంటే .. మంచివాళ్ళ నిష్క్రియాపరత్వం వల్ల ప్రపంచంలో రావల్సిన మంచి మార్పులు రావడం లేదు. కాబట్టి మంచివాళ్ళంతా కూడా ధ్యానం చేసి సాధ్యమైనంత ఎక్కువగా తమదైన ఆత్మశక్తిని సృష్టిస్తే .. ఆ శక్తి తరంగాలు ఈ భూమి మీద వ్యాపించి .. చెడ్డ వాళ్ళల్లో మంచి మార్పులను సత్వరంగా కలుగజేస్తాయి.

గౌతమబుద్ధుని ధ్యానశక్తి తరంగాలు పరమ కిరాతకుడైన అంగుళీమాలుడిని పరివర్తన చెందించినట్లు .. భూమిపై వున్న అనేకానేకమంది బుద్ధుళ్ళ ధ్యానశక్తి తరంగాలు సమాజంలోని చెడునంతటినీ ప్రక్షాళం చేస్తాయి! కనుక ఊరికే బాధపడుతూ కుర్చోకుండా విస్తృత ధ్యాన-జ్ఞాన ప్రచారాల ద్వారా అజ్ఞాత బుద్ధుళ్ళను తట్టి లేపుతూ ధ్యానశక్తి తరంగాలను విశ్వవ్యాప్తం చెయ్యాలి.

ప్రశ్న: “ధ్యానం .. ఖచ్చితంగా 40 రోజులు చెయ్యాలా?”

పత్రీజీ: నలభై రోజుల ధ్యానం అన్నది తప్పనిసరి! ఒక రాయిని సుత్తితో గట్టిగా కొడుతూ ఉంటే పదిహేను దెబ్బలవరకు ఏమి జరిగినట్లు కనపడదు; ఆ తరువాత కేవలం ఒక చిన్ని దెబ్బకే అది రెండుగా పగులుతుంది. అయితే అది చివరి దెబ్బ గొప్పతనం కాదు;అది అంతవరకు శ్రమించి కొట్టిన పధ్నాలుగు దెబ్బల ఫలితమే !

అలాగే ధ్యానం కూడా 40 రోజులు ఖచ్చితంగా చెయ్యాలి !ముందు కొన్ని రోజులు పాటు బయటికి ఏమీ కనపడకపోయినా .. ఒక్కొక్క దెబ్బకు రాయి లోపల ఉన్న పరిస్థితిలో కొద్దికొధ్దిగా మార్పు వచ్చి చివరికి పగిలిపోయినట్లే .. ఒక్కొక్క రోజు ధ్యానం వల్ల మన అంతరంగం లోపలి ఒక్కొక్క చక్రస్థాయిలో చిక్కుకుపోయిన జన్మజన్మల చెడు కర్మ ఫలితాలు విఘటితం చెందుతూ మన నాడిమండలాన్ని మనం పరిశుద్ధం చేసుకుంటూ వుంటాం.

తపనతో కూడిన శ్రద్ధతో ధ్యానసాధన చేస్తూ వుంటే రాయిలా ఉన్న మనం .. పగలక ముందు నరుడైన అర్జునుడిలా పదే పదే దుఃఖానికి గురవుతూ వున్నవారం ధ్యానం ద్వారా పగిలి రెండుగా విడిపోయాక .. నారాయణుడైన కృష్ణుడిలా ఆత్మజ్ఞానంతో విలసిల్లుతూ ప్రతిక్షణం ఆనందంగా గడుపుతూంటాం ! అంతకు ముందు అనేకానేక సందేహాలతో నిండి వున్న మనకు నలభై రోజుల ధ్యాన సాధన తరువాత ప్రతి ఒక్క సందేహానికీ మన అంతరంగం నుంచే సమాధానం వస్తుంది.

ప్రశ్న : జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక ఒక్కోసారి నేను బాగా ఏడ్చేస్తూంటాను. ఒక్కోసారి ధ్యానం చేసి ‘ఇది కూడా ఒక అనుభవమే’ అని తెలుసు కుంటూంటాను. ఇందులో ఏది సరైనది?”

పత్రీజీ: “ఏడవడం” అన్నది మనకూ మరి మన చుట్టూ ఉన్నవారికీ మన భావాలను తెలియజేసే ఒకానొక అద్భుతమైన భావ అభివ్యక్తీకరణ చర్య! అది తప్పేమీ కాదు! అయితే బాగా ఏడ్చాక కుదురుగా కూర్చుని ధ్యానం చెయ్యండి!

ప్రశ్న: కర్మఫలత్యాగం అంటే?”

పత్రీజీ: చేస్తున్న సకల కర్మలను లోకకల్యాణార్థమే చేపడుతూ .. అలా చేపట్టిన కర్మల యొక్క అంతిమ ఫలితాన్ని తిరిగి ఆశించకపోవడమే కర్మఫలత్యాగం.

ప్రశ్న: “ఒక్కోసారి ఎంత నిగ్రహించుకున్నా ఆవేశం వచ్చేస్తోంది?”

పత్రీజీ: ‘ఆవేశం’ అన్నది ఒకానొక గొప్ప ‘శక్తి’! ఒకానొక బుద్ధుడు ఎల్లవేళలా శాంతస్వరూపుడై ఉంటూ .. అత్యవసరం అయినప్పుడు మాత్రమే తన ఆవేశశక్తిని ఆపద్ధర్మంగా వాడుకుంటూంటాడు ! అలా వాడుతున్న శక్తిపట్ల అతడు అత్యంత ఎరుకతో ఉంటాడు కనుక అతనికి ఏ విధమైన కర్మబంధాలూ అంటవు.

ప్రశ్న: “మనలో నిక్షిప్తమై ఉన్న అంతర్గత శక్తిని ఎలా తెలుసు కోవాలి?”

పత్రీజీ : “అంతర్గత శక్తిని తెలుసుకోవాలి” అనుకోవడమే చాలా గొప్ప విషయం! అయితే అంతర్గతశక్తిని తెలుసుకోవాలంటే ముందు మనం బయటి అనవసర విషయాలను గురించి ఆలోచించడం, వినడం, చూడడం మరి మాట్లాడడం పూర్తిగా తగ్గించాలి. అనవసరంగా బయట తిరగటం మానేయాలి మరి బయటి విషయాల మీద వ్యామోహం తగ్గించుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖులం కావాలి! అప్పుడే మనలోని అపారమైన అంతర్గత శక్తిని మనం తెలుసుకోగలుగుతాం.

ప్రశ్న : “‘మతబేధం’ అన్నది ఎందుకు వస్తోంది?”

పత్రీజీ :  ఆత్మజ్ఞానలోపంతో కూడిన మూర్ఖత్వం వల్ల మానవుల్లో ‘మతబేధం’ అన్నది వస్తోంది. మనం ఒకానొక జన్మలో ‘క్రిస్టియన్’ గా, మరొక జన్మలో ‘మహ్మదీయుడి’ గా .. ఇలా అనేకానేక జన్మల్లో అనేకానేక రీతులలో పుడుతూంటాం. కానీ పుట్టిన తరువాత ఆ ఆత్మ సత్యాన్ని మర్చిపోయి .. “నేను మహ్మదీయుడిని”, “నేను క్రిస్టియన్‌ని” లేదా “నేను హిందువుని” అన్న అజ్ఞానంలో పడి మతబేధాల్లో ఇరుక్కుంటూ ఉంటాం. జన్మ పరంపర పట్ల మరి కర్మ సిద్ధాంతం పట్ల ఎరుకతో ఉండాలంటే .. తప్పనిసరిగా ధ్యానం చెయ్యాల్సిందే!!

ప్రశ్న : ” ఈ మధ్య ఎక్కడ చూసిన ఇబ్బడి ముబ్బడిగా ఆధ్యాత్మిక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో నాకు ఏది సరి అయినదో నేను ఎలా ఎంపిక చేసుకోవాలి?”

పత్రీజీ : ఒక్కొక్క పద్ధతినీ నిశితంగా పరీక్షిస్తూ వెళ్ళాలి ; దానికి ఎంతో సహనం ఉండాలి! గౌతమ బుద్ధుడు ఆరేళ్ళపాటు విసుగు విరామాలు లేకుండా సుమారు ఐదువందల మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాడు. అక్కడ తాను గ్రహించిన విషయాల అన్నింటినీ ఆచరించి చూసి .. ఆ అనుభవ జ్ఞానాన్నంతా క్రోడీకరించుకుని .. తనదైన “ఆనాపానసతి” దారిని ఎన్నుకున్నాడు. బుద్ధుడికైనా ..మరెవరికైనా .. ఎంపిక పద్ధతి ఒక్కటే!

ప్రశ్న : “గత కొన్ని సంవత్సరాలుగా ఏవో తెలియని భయాలు నాలో పేరుకుపోయి నన్ను చాలా బాధపెడుతున్నాయి. వాటినుంచి విముక్తి చెందడం ఎలా?”

పత్రీజీ : ధ్యానంలో కూర్చుని .. గతంలో మీకు మాటల ద్వార చేష్టల ద్వారా ఎవరెవరి వల్ల బాధ కలిగిందో వారందరినీ పేరు పేరునా గుర్తుకు తెచ్చుకుని .. వారిని బేషరతుగా క్షమించివెయ్యండి.

అలాగే .. మీరు మీ మాటల ద్వారా చేష్టల ద్వారా ఎవరెవరిని బాధపెట్టారో గుర్తు తెచ్చుకుని పేరు పేరునా వాళ్ళను క్షమాపణలు అడగండి. క్రమక్రమంగా మీ అంతశ్చేతనా మనస్సు యొక్క మూల మూలల్లో నిక్షిప్తమై ఉన్న బాధాకరమైన ఆలోచనల నుంచి మీరు విముక్తి చెందుతారు.

ఇంకా ఇంకా మీ ధ్యాన సమయాన్ని పెంచుతూ .. నవీన ఆధ్యాత్మికతకు చెందిన పుస్తకాలను చదువుతూ .. ప్రతిరోజు దీనిని ఒక అభ్యాసంలా చేయండి.

ప్రశ్న : “ధర్మం ఎన్ని రకాలుగా సాక్షాత్కరిస్తుంది?”

పత్రీజీ : ధర్మం రెండు రకాలుగా సాక్షాత్కరిస్తుంది. ఒకటి: “స్వధర్మం” రెండు : “పరధర్మం” 

ధ్యానం చేసి స్వానుభవంతో ఆత్మసత్యాన్ని తెలుసుకోవడం “స్వధర్మం” తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టి “నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాలాగే ఆత్మస్వరూపులు” అని తెలుసుకుని మసలుకోవడం “పరధర్మం”.

ప్రశ్న: “ధ్యానం సరిగ్గా కుదరడానికి ఏవైనా ‘చిట్కాలు‘ ఉన్నాయా?!”

పత్రీజీ: ఇంతకు ముందు ఏ విధమైన పూజలూ, మత క్రతువులూ, శాస్త్రచర్చలూ చేయని వారికి ధ్యానం కాస్త చక్కగానే కుదురుతుంది! యాభై యేళ్ళ వయస్సు గల నూతన ధ్యానాభ్యాసికి మనస్సు మీద పడిన పాత ముద్రలను చెరిపివేసుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది! యాభై యేళ్ళ వయస్సులో క్రొత్త భాష నేర్చుకునేవాడినికి కంటే అంతకు ముందు వేరే ఏ ఇతర ముద్రలు మనస్సు మీద లేని చిన్న పిల్లవాడు ఎంతో తొందరంగా ఏదైనా నేర్చేసుకుంటాడు కదా! కనుక ఆలోచనలన్నీ వదిలేసి కాస్సేపు మానసికంగా చిన్నపిల్లల్లా మారి అతి సహజమైన స్థితిలో ధ్యానానికి ఉపక్రమించడమే .. చక్కటి ‘చిట్కా‘!

ప్రశ్న: “‘చదువు’ అన్నది వ్యాపారంలా మారిపోతూన్న ఈ తరుణంలో .. అసలు ఎలాంటి చదువు చదువుకోవాలో అర్థం కావడం లేదు!”

పత్రీజీ: “చదువు” అన్నది ప్రతి ఒక్కరిలో విజ్ఞానాన్నీ, విజ్ఞతనూ మరి విచక్షణా జ్ఞానాన్నీ పెంచి అసలైన జీవితశాస్త్రాన్ని బోధిస్తుంది. అందుకే ఈ లక్షణాలను కలిగి ఉన్న వాళ్ళను “అసలైన చదువున చదువుకున్నవాళ్ళు” అంటారు! రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, జీసస్‌క్రైస్ట్, షిరిడీ సాయిబాబా, మహమ్మద్ ప్రవక్త వంటి ఎంతో మంది యోగులు ప్రాపంచిక చదువులేమీ చదువలేదు కానీ .. వాటిని చదివేసి లెక్కలేనన్ని డిగ్రీలను పేర్ల చివరన తగిలించుకున్న వాళ్ళెందరో వీళ్ళ దగ్గరికి అసలైన జీవితశాస్త్రాన్ని నేర్చుకోవడానికి వచ్చారు!

ప్రశ్న: “ధ్యానం చేస్తే మనం ఎక్కడెక్కడో లోకాల్లో ఉన్నవాళ్ళను కలుసుకోవచ్చా??”

పత్రీజీ: ఎంచక్కా కలుసుకోవచ్చు!! ఎక్కడెక్కడి లోకాల్లో ఉన్న మాస్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను చూడగలిగే శక్తినీ .. వాళ్ళతో మాట్లాడగలిగే శక్తినీ .. మరి వారి నుంచి సందేశాలను అందుకునే శక్తినీ .. మనం ధ్యానం ద్వారా మాత్రమే పొందగలం!

ప్రశ్న: “శ్వాస పైనే ధ్యాస పెట్టి ఎందుకు ధ్యానం చెయ్యాలి?”

పత్రీజీ: “శ్వాస” అన్నది ఈ రోజు, ఈ క్షణానికి చెందిన వర్తమాన అద్భుతం! అది నిన్నటి భూతకాలానికి చెందిన ‘పెనుభూతం’ నుంచీ మరి రేపటి భవిష్యత్తుకు చెందిన ‘గాలిమేడల’ నుంచీ మనల్ని సంపూర్ణమైన ఎరుకతో విముక్తి చెందించి .. వర్తమాన క్షణంలోని అద్భుత ఆనందంతో మనల్ని మమేకం చేస్తుంది. అందుకే “శ్వాస మీద ధ్యాస” పెట్టి ధ్యానం చేసే ఆత్మ విజ్ఞాన కాముకులందరూ వర్తమాన క్షణంలోని ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా గొప్ప జ్ఞానంలా స్వీకరిస్తూ తమ తమ ఆత్మలను ఉన్నతీకరించుకుంటూ ఉంటారు.

ప్రశ్న: “మిమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కరికీ మీరు ఎంతో ఆత్మీయులుగా కనిపిస్తారు .. ఎందుకు?!!”

పత్రీజీ: ఎందుకంటే నేను అందరికీ ఒక “అద్దం”లా ఉంటాను కనుక! “అద్దం” అన్నది ఎప్పుడూ తన ముందు ఉన్నవాళ్ళ నిజరూపాలనే ప్రతిబింబిస్తుంది! మరి ప్రతి ఒక్కరికీ “అద్దం”లో తమను తాము చూసుకోవడం ఎంతో నచ్చుతుంది కదా! నేను కూడా “అద్దం”లాగే నా దగ్గరికి వచ్చిన వారి గుణగణాలను అచ్చంగా ప్రతిబింబిస్తూ ఉంటాను కనుక నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా తమను తాము ప్రేమించుకున్నట్లే .. తమకు “అద్దం”లా ఉన్న నన్ను కూడా అంతగానే ప్రేమిస్తూంటారు.

ప్రశ్న: ” ‘దేవుడు’ ఎక్కడ ఉంటాడు?”

పత్రీజీ: “సర్వం ఖల్విదం బ్రహ్మ” .. అంటే “ఈ వున్నదంతా దైవమే” .. అందుకే నేను నా కంటికి కనిపించే జీవదేవుళ్ళందరినీ కొలుస్తుంటాను; మరి ప్రతి ఒక్క దేవుడితో మాట్లాడుతుంటాను ; అందరితో కలిసి, మెలిసి వుండటానికి ఉవ్విళ్ళూరుతూ వుంటాను!

ప్రశ్న: ” ‘ఆధ్యాత్మికత’ అంటే?”

పత్రీజీ: “మనం పూర్ణదేవుళ్ళనుంచి విడివడిన అంశ దేవుళ్ళం .. మనం దేవుళ్ళచే తయారు చేయబడిన దేవుళ్ళం” అని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి గాను మన దైనందిన జీవితంలో మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ధ్యానాభ్యాసం! నీటిలో మునిగితే – స్నానం .. శ్వాసలో మునిగితే – ధ్యానం .. సత్యంలో మునిగితే – జ్ఞానం!

ప్రశ్న: “మనలో శక్తి ఎన్ని రకాలుగా ప్రకటితం అవుతుంది?”

పత్రీజీ: “తామసిక”, “రాజసిక”, “సాత్విక” .. “నిర్గుణ” .. తామసిక శక్తి భౌతిక శరీరంతో .. రాజసిక శక్తి మనస్సుతో .. సాత్విక శక్తి బుద్ధితో .. మరి నిర్గుణ శక్తి ఆత్మతో కలిసి ప్రకటితం అవుతూ వుంటుంది.

ప్రశ్న: “జంతులోకానికి కూడా ప్రకృతి సూత్రాలు వర్తిస్తాయా?”

పత్రీజీ: ఖచ్చితంగా వర్తిస్తాయి! పశుపక్ష్యాదులన్నీ కూడా ప్రకృతి సూత్రాలకు బద్ధులై అతి సహజంగా జీవిస్తూ ఆనందంగా వుంటాయి. అందుకే విచారంగా ఉంటూ, చావునూ, బాధలను తలచుకుని తలచుకుని భయపడుతూ భయపడుతూ కుమిలిపోయే జంతువులనూ, పక్షులనూ మనం ఎప్పుడూ చూడం!

ప్రశ్న: “‘జ్ఞానం’ ఎలా సేకరించుకోవాలి?”

పత్రీజీ: ప్రతి పువ్వులోనూ అంతో ఇంతో మకరందం ఉన్నట్లే .. ప్రతి మనిషిలో కూడా స్వల్పంగానో, అధికంగానో ఇంగితజ్ఞానం అన్నది విధిగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఒకానొక తుమ్మెద ప్రతి పువ్వు నుంచీ మకరందాన్ని గ్రోలినట్లు ఒకానొక ముముక్షువు ఏ ఒక్కరినీ విస్మరించకుండా ప్రతి ఒక్కరి నుంచీ ఇంగిత జ్ఞానాన్ని విధిగా సేకరించుకోవాలి. అలా సేకరించుకున్న జ్ఞానాన్ని ఆచరణ ద్వారా తన అనుభవ జ్ఞానంలా మలచుకుంటూ .. దానిని మళ్ళీ పది మందితో పంచుకోవాలి; సర్వకాల సర్వావస్థల్లోనూ “జ్ఞాన సేకరణ”సూత్రం ఇదే.

బొట్టూ బొట్టూ చేరి సముద్రం అవుతుంది కదా!

ప్రశ్న : ఆత్మ .. “పురోగమన దిశ” లో ఉందని తెలుసుకోవడం ఎలా ?

పత్రీజీ: “ఆత్మ యొక్క పురోగతి” అన్నది .. ఆ ఆత్మ తన జీవితకాలంలో తాను స్వయంగా ఎంపిక చేసుకున్న రకరకాల భౌతిక మరి ఆధ్యాత్మిక ప్రయత్నాల యొక్క విశాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఆయా ప్రయత్నాల యొక్క “తుది ఫలితం ” అన్నది జయం కావచ్చు లేదా అపజయం కావచ్చు కానీ … పురోగమనం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ” జయం ” అన్నది ఆ ఆత్మకు పునరుత్సాహాన్ని అందిస్తే .. ” అపజయం ” అన్నది ఆ ఆత్మలో విశేష సహనాన్ని పెంచుతుంది ! అందుకే ఆత్మ పురోగతికి ” జయాపజయాలు ” రెండూ కూడా సరిసమానమైన నిష్పత్తిలో అవసరం అయిన కీలక అంశాలు! అసలు ప్రయత్నమే లేనప్పుడు .. జయం ఉండదు .. అపజయం ఉండదు .. మరి ” పురోగమనం ” అంతకన్నా ఉండదు. ఎన్ని జన్మలు ఎత్తినా ఆత్మస్థితి అన్నది ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా వుంటుంది.

ప్రశ్న: చాలా మంది తమ తమ జీవితాలను హాయిగా ఆనందించలేక పోతున్నారేమో అనిపిస్తోంది ?

పత్రీజీ: అది మీ అవగాహనలో లోపమే! ఎందుకంటే .. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలను హాయిగానే ఆనందిస్తున్నారు .. ప్రతిక్షణం క్రొత్త క్రొత్త పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు. ఇలా ” నిరంతర నేర్చుకోవడం ” అన్నది వారి వారి ఆత్మ యొక్క ఎదుగుదలను బట్టి ” ఎరుకతో ” జరుగవచ్చు లేదా ” ఎరుకలేకుండా ” కూడా జరుగవచ్చు. కానీ ఆ నేర్చుకున్న ఫలితం మాత్రం వారి భవిష్యత్ జీవితంపై తన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తుంది.

ప్రశ్న: “తృప్తి” అన్నది ఎలా కలుగుతుంది?

పత్రీజీ: జీవితంలో ఏ రంగం కూడా ఎవ్వరికీ సంపూర్ణమైన సంతృప్తిని ఇవ్వజాలదు ! అయితే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదులతో కలిగే దివ్యజ్ఞానప్రకాశాన్ని పొందిన తరువాతే ఎవ్వరికైనా .. వారి వారి జీవితంలోని ఏ కార్యక్షేత్రమైనా కూడా .. తనదైన సంతృప్తిని కొద్దిగానైనా అందించగలుగుతుంది.

ప్రశ్న: కర్మ ఎలా చెయ్యాలి ? భగవంతుడు అంటే ? ఆత్మ అంటే ?

పత్రీజీ: కర్మ ఎలా చెయ్యాలో నేర్చుకోవాలంటే ధ్యానం చెయ్యాలి .. భగవంతుడు ఎవరో గుర్తించాలంటే ధ్యానం చెయ్యాలి .. ఆత్మ అన్నది తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి.

ప్రశ్న: 2012 తరువాత పరిస్థితి ?

పత్రీజీ: 2012 సంవత్సరం తరువాత నుంచి ప్రపంచంలో సకారాత్మక ఆలోచనలు చేసేవారి సంఖ్య విశేషంగా పెరుగుతోంది. 2016 కల్లా వారంతా ఆధ్యాత్మిక దృక్పధంతో పరిపుష్టం అయ్యి .. 2020 కల్లా ప్రపంచంలోని అన్ని కార్యక్షేత్రాలు కూడా ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్తలతో నిండిపోతాయి. ఇదంతా కూడా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వారి సౌజన్యంతో జరుగుతూ వుంది!

ప్రశ్న: మూర్తి పూజలు ఎందుకు చెయ్యకూడదు ?

పత్రీజీ: హిందూ సమాజంలోని అనేకానేక మూఢ నమ్మకాలపై పోరాడిన స్వామి దయానంద సరస్వతి గారు అందించిన ” సత్యార్థ ప్రకాశం ” అనే గ్రంథరాజాన్ని అధ్యయనం చెయ్యాలి! ” మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త ” అని వారు అందులో స్పష్టంగా సెలివిచ్చారు ! మహమ్మద్ ప్రవక్త మూర్తి పూజలను నిరసించారు .. మరి బుద్ధుని బోధనల సారాంశం కూడా అదే ! ” దేవుని రాజ్యంలో నువ్వూ, నేను ఒక్కటే ” అన్న ఏసుక్రీస్తు సందేశాన్ని కూడా విని .. మేలుకుని .. మీరు ఎవరో .. ఏం చెయ్యాలో తెలుసుకోవాలి !

ప్రశ్న : “కావలసినవి అన్నీ కూడా ప్రకృతే మనకు సమకూర్చి పెడుతూండగా .. ఇక మనం కష్టపడి పని చెయ్యాల్సిన అవసరం ఏముంది ?” అని నా స్నేహితుడు అంటున్నాడు !

పత్రీజీ : అలా మూర్ఖంగా మాట్లాడే స్నేహితులను తక్షణం విడిచిపెట్టాలి ! ప్రకృతి నుంచి ఏది పొందాలన్నా కూడా మనం తగినంతగా కష్టపడాల్సిందే ! ఛార్లెస్ డార్విన్ మహాశయులు అందించిన జీవపరిణామ సిద్ధాంతాలైన ” Struggle for Existance ” మరి ” Survival of the Fittest ” ల గురించి ఎప్పుడూ వినలేదా?! ప్రకృతి ఎప్పుడూ సరియైన వాటినే ఎన్నుకుంటుంది .. మరి సరికాని వాటిని నిర్మూలించి వేస్తుంది !

ప్రశ్న: బుద్ధుడు జాతకరీత్యా యోగీశ్వరుడు అయ్యాడా ? లేక సాధన ద్వారా అయ్యాడా ?

పత్రీజీ: గౌతామ బుద్ధుడు గత అనేక జన్మలుగా యోగీశ్వరుడే ! ఆయన సంగతి అలా ఉంచి .. “గౌతమ బుద్ధుడిలా నేను యోగీశ్వరుడిని నేను ఎలా కావాలి ?”, “అందుకు నేను ఎంత సాధన చెయ్యాలి?” అన్నదే ఇప్పుడు మీరు తలపెట్టాల్సిన విషయం !

ప్రశ్న: సాధకుడికి ఆహారపరిమితులు ఎలా ఉండాలి ?

పత్రీజీ: కేవలం యోగ సాధకుడే కాదు .. బుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ శ్రేష్ఠమైన శాకాహారం మాత్రమే తినాలి ! అది కూడా అధికంగా తింటే దేహం బలిసి ఇంద్రియాలు మందగిస్తాయి కనుక క్రమక్రమంగా దేహ ఆహారాన్ని తగ్గిస్తూ ఆత్మ ఆహారమైన ధ్యానసమయాన్ని పెంచుతూపోవాలి.

ప్రశ్న: “ధ్యాన శక్తితో, మన దేహంలోని రెండు ప్రోగుల DNA పన్నెండు ప్రోగుల DNA గా అభివృద్ధి చెందడం సాధ్యమేనా !”

పత్రీజీ : సాధ్యం ! అయితే అది మనం చేసే ధ్యాన, స్వాధ్యాయ సజ్జనసాంగత్యాది సాధనలను బట్టే ఉంటుంది ! ఆత్మ పరిణామక్రమంలోని అతి సాధారణ మానవ స్థాయి అయిన రెండు ప్రోగుల పరిమిత DNA నుంచి రకరకాల జీవిత అనుభవాల సారంతో ఉచ్ఛస్థితికి చేరిన 12 ప్రోగుల DNA తో కూడిన అధిమానవ .. Higher Universal Man .. స్థాయికి ఎదగడమే మానవ జీవిత పరిపూర్ణ లక్ష్యం !

ఆ లక్ష్యసాధన దిశగానే మనం చేసే వివిధ సాధనలను బట్టి ముందు సూక్ష్మలోకాల్లో మన మనోమయ, కారణమయ, మహాకారణమయ మరి నిర్వాణమయ కోశాలు అన్నీ కూడా 12 ప్రోగుల DNA స్థాయికి ఉన్నతీకరించబడతాయి. ఆ తరువాతే భూలోకంలో ఉన్న మన భౌతిక దేహ కణజాలాల్లోని క్రోమోజోములపై ఉన్న DNA కూడా రెండు ప్రోగుల నుంచి 12 ప్రోగులకు ఉన్నతీకరించబడి మనం బహుముఖ ప్రజ్ఞాశాలులుగా విరాజిల్లడం ప్రారంభం అవుతుంది !

ప్రశ్న: “జ్ఞానం అన్నది ఎన్ని రకాలు ? ”

పత్రీజీ : “జ్ఞానం” అన్నది మౌలికంగా రెండు రకాలు : ఒకటి .. “ఆత్మపరమైన ఇంగిత జ్ఞానం” రెండు .. “భౌతికపరమైన ఇంగిత జ్ఞానం”

మనకు ఆత్మపరంగా అవసరం అయ్యేది ఏమిటో .. అవసరం కానిది ఏమిటో .. తెలుసుకోవడం అన్నదే “ఆత్మపరమైన ఇంగిత జ్ఞానం” . మన భౌతిక అవసరాలతో పాటు .. ఇతరుల భౌతిక అవసరాలను కూడా అవసరం అయ్యింది ఏమిటో .. అవసరం కానిది ఏమిటో .. తెలుసుకోవడం అన్నది ” భౌతికపరమైన ఇంగిత జ్ఞానం “

ప్రశ్న : “ధర్మబద్ధంగా ఎలా జీవించాలి ?”

పత్రీజీ : మనిషై పుట్టిన ప్రతి ఒక్కరూ మౌలికంగా మూడు ధర్మాలను తప్పక పాటించాలి .. మొదటిది : “దేహం పట్ల ధర్మం” : ఈ భూమి మీద అనేకానేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి జన్మతీసుకున్న ఆత్మస్వరూపులమైన మనందరికీ .. దేహం ఒక ‘ వాహనం ’ !

ఈ వాహనాన్ని మనం ఎప్పటికప్పుడు శ్రుతిబద్ధంగా, లయబద్ధంగా చుసుకుంటేనే అది మనకు సరి అయిన విధంగా సహకరిస్తూ వుంటుంది. వాహనం బాగుంటేనే కదా మనం ఎప్పటికైనా ప్రయాణం చెయ్యగలం .. మరి మనం వచ్చిన పనిని చక్కబెట్టుకోగలం ! కనుక శుద్ధ శాకాహారంతో శరీరానికి సరి అయిన పోషణను అందిస్తూ, ధ్యానంతో దానిని శక్తివంతం చేయాలి.

మన శరీరంలో కోటానుకోట్ల కణాలు వున్నాయి. వాటన్నింటికీ మన గురించి బాగా తెలుసు కానీ .. మనకే వాటి గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే సరికాని మాంసాహారంతో వాటిని బాధిస్తూ వాటిని వేదనకు గురిచేస్తున్నాం. పెట్రోలు కారులో డీజెల్ పోసి నడిపి దాని ఇంజన్ పనితీరును దెబ్బతీసినట్లు .. మాంసాహారంతో మన దేహం యొక్క పనితీరును దెబ్బతీస్తూ మనం అభాసుపాలు అవుతున్నాం !

ఈ కోటానుకోట్ల కణాల్లో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో జ్ఞానవంతమైంది ! మన కణజాలం అంతా కూడా ప్రతిక్షణం ఒకదానిని ఒకటి సమన్వయ పరచుకుంటూ క్రమక్రమంగా ఆత్మ ఉద్దీపన దిశగా సాగుతూంతుంది. కనుక వాటితో మనం సరియైన విధంగా ప్రవర్తించాలి అంటే .. మనకు నిరంతర ధ్యానసాధన మరి అహింసా ధర్మాచరణయే మార్గం !

రెండవది “సమాజం పట్ల ధర్మం” : సమాజంలో మనం కూడా భాగస్వాములం కనుక అందరూ సుఖంగా సంతోషంగా వుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం ! అందుకు గాను మన దగ్గర ఉన్న ఆర్థిక సంపదనూ ఆధ్యాత్మిక సంపదనూ అందరితో పంచుకోవాలి. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేకానేక దానాలతో పాటు ధ్యానదానం కూడా చేయాలి. ధ్యానప్రచారం ద్వారా ధ్యానదానం చేయకపోతే .. మిగతా అన్ని దానాలు కూడా వ్యర్థమైపోతాయి.

మూడవది “ఆత్మ పట్ల ధర్మం” : మనం ఏ పని కోసం ఈ భూమ్మీద జన్మ తీసుకున్నామో .. విశేషంగా ఆ పని మీదే ధ్యాస ఉంచుకుంటూ .. మరి ఇతర దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వుండాలి. వచ్చిన పనిని సజావుగా పూర్తిచేసుకోకపోతే .. ఇక్కడ గడిపిన మన జన్మకాలం తో పాటు మనం సంపాదించిన సంపదలన్నీ వ్యర్థమైపోతాయి ! ఆ తరువాత చనిపోయి పై లోకాల్లోకి వెళ్ళాక .. జరిగిన అనర్ధానికి చింతించినా లాభం వుండదు .. మళ్ళీ జన్మ తీసుకోవడానికి వేచి ఉండాల్సి ఉంటుంది. కనుక సమయాన్ని అనవసరమైన కాలక్షేపాలతో అతిగా వ్యర్థం చేసుకోకుండా .. ఇతోధికంగా ధ్యాన సాధనలో ఆత్మను పరిపుష్టం చెయ్యాలి ! విశేషంగా స్వాధ్యాయ సాధన చేస్తూండాలి .. విస్తృతంగా సజ్జన సాంగత్యం చేయాలి!

ప్రశ్న : “మరణానంతరం మన పరిస్థితి ఏంటి ?

” పత్రీజీ : ” మరణం ” అంటే .. భౌతిక శరీరానికీ మరి సూక్ష్మశరీరానికీ మధ్య వున్న “వెండిప్రోగు -Silver cord” యొక్క సంబంధం తెగిపోవడం మాత్రమే. మరణం ద్వారా ” చైతన్యంతో కూడిన ఎరుక ” మన భౌతికశరీరం నుంచి విడివడి .. “సూక్శ్మశరీరం” తో శాశ్వతంగా అనుసంధానించబడి .. ఇక అక్కడి నుంచే తన యొక్క కార్యకలాపాలు సాగిస్తూ వుంటుంది.

ఒకానొక సగటు మూమూలు వ్యక్తి యొక్క సూక్ష్మశరీరం .. మరణం తర్వాత కూడా .. ఈ భూమి మీద కనీసం మూడు రోజుల పాటు తిరుగుతూ వుంటుంది. ఆ సమయంలో “ఒకానొక ఆస్ట్రల్ మాస్టర్” మరి “ఒకానొక ఆస్ట్రల్ అప్రెంటీస్” కలిసి ఆ వ్యక్తికి సూచనలిస్తూ శక్తినిస్తూ ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్తారు. అక్కడ కాస్త సేద తీయించిన తర్వాత అతనితో అంతవరకూ ఆ జన్మలో అతడు గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేయిస్తారు.

అప్పుడే అతని పాప మరి పుణ్యకార్యాల చిట్టా సరిచూడబడి, అతని కర్మలస్థాయిని అనుసరించి మళ్ళీ పునఃపరిశీలించబడిన లక్ష్యాలతో .. మరి పునర్ వ్యవస్థీకరించబడిన గమ్యాలతో .. అతని ” పునర్జన్మ ప్రణాళిక ” రచించబడుతుంది.

ప్రశ్న : ధ్యానం మన నిత్యజీవితంలో ఎలంటి సహాయం చేస్తుంది?

పత్రీజీ : నిరంతర ధ్యానం ద్వారా మనం పొందే “విశ్వశక్తి” వల్ల మనలోని “శక్తికేంద్రాలన్నీ” ఉత్తేజితం చేయబడి మనం “శక్తిస్వరూపాల్లా” పరిమారిపోతాం. దీనివల్ల మనం చేస్తోన్న పనులన్నింటిలో .. సునిశితమైన నాణ్యత, నైపుణ్యతలు పెరిగి ఎంతటి పనినైనా అవలీలగా మరి ఆనందంగా ఒక ఆటలా పూర్తిచేయగలుగుతాం.

ధ్యానం అన్నది మనల్ని ఒక “నిశ్చలానందస్థితి” లో వుంచడం వల్ల మనం ఆత్మశాంతితో .. సాక్షీతత్వంతో కళ్ళముందు వున్న పరిస్థితులు ఏ రకమైన మార్పు చెందుతున్నా సరే .. సమతా స్థితిలో వాటి ఫలితాలను గ్రహిస్తూ .. మనం చేస్తూన్న పని మీద మాత్రమే ధ్యాస ఉంచగలుగుతాం.

ధ్యానం అన్నది మనల్ని క్రమక్రమంగా “అత్యంత చక్కగా అధ్యయనం చేయబడిన శాస్త్రీయ దృక్పథాల” తో కూడిన “బుద్ధిజీవులు” గా పరిమార్చుతుంది. దానివల్ల పరిస్థితులను ఆకళింపు చేసుకోవడంలో మరి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడంలో మనలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ప్రతి విషయాన్ని పరిపక్వ శాస్త్రీయ అవగాహనతో అర్థం చేసుకుంటూ మరి “సంపూర్ణ ఆత్మయుతస్వేచ్ఛ” తో మన నిర్ణయాలు మనమే తీసుకుంటూ మరి ఇతరుల ఆత్మయుతస్వేచ్ఛ ను కూడా గౌరవిస్తూ .. వారితో అద్భుతమైన అనుబంధాలను నెరపుతాం. ఇలా ” విశ్వపు ఏకత్వం ” వైపు మనం ప్ర్రయాణం చేస్తూ .. సదా బ్రహ్మానంద స్థితిలో వుంటాం. “సరియైన ధ్యానం” అనేది మనల్ని 1. శక్తిస్వరూపాల్లా 2. నిశ్చలానందస్వరూపాల్లా 3. బుద్ధజీవుల్లా పరిమార్చివేస్తుంది.

ప్రశ్న: “దివ్యజ్ఞాన ప్రకాశం పొందడానికి ప్రత్యేక పద్ధతులు ఏవైనా ఉన్నాయా ?”

పత్రీజీ: “దివ్యజ్ఞాన ప్రకాశం” అన్నది అలనాటి గౌతమ బుద్ధుడికి మాదిరిగానే .. నేర్చుకునే క్షమతను బట్టి .. నేర్చుకోగలిగిన పరిస్థితులను బట్టి .. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత శాతం ఉంటూనే ఉంటుంది. మరి నిరంతర ధ్యాన – జ్ఞాన సాధనల ద్వారా తమ బుద్ధిని మరింత పదును పెట్టుకునే వాళ్ళంతా కూడా బుద్ధుళ్ళే!

బుద్ధుళ్ళుగా వున్నవాళ్ళు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కలుసుకుంటూ “ఎలా ఉండాలి ? ” .. “ఎలా ఉండకూడదు? ” .. “ఎలా మాట్లాడాలి ?” .. “ఎలా మాట్లాడకూడదు ?” .. “ఏం తినాలి ?” … “ఏం తినకూడదు ? ” లాంటి అనేకానేక విషయాల పట్ల సంబంధించిన మేలైన బుద్ధినీ, మౌలిక ఇంగిత జ్ఞానాన్నీ ప్రతిక్షణం ధారాపాతంగా పొందూతూనే ఉంటారు.

ప్రశ్న : “జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక ఒక్కోసారి నేను బాగా ఏడ్చేస్తూంటాను. ఒక్కోసారి ‘ఇది కూడా ఒక అనుభవమే’ అని సమాధాన పడుతూంటాను. ఇందులో ఏది సరైనది?

పత్రీజీ : “ఏడవడం” అన్నది మన భావాలను మనకూ మరి చుట్టూ వున్నవారికీ తెలియజేసే ఒకానొక చక్కటి అభివ్యక్తీకరణ చర్య! అది తప్పేమీకాదు కాబట్టి, బాగా ఏడ్చాక కూర్చుని కుదురుగా ధ్యానం చెయ్యండి .. “ధ్యానం”, “తీరిగ్గా కూర్చుని ఏడవడం”.. రెండూ కూడా ఆత్మప్రగతికి దోహదం చేసేవే!

ప్రశ్న : “గౌతమబుద్ధుడు తన జాతకరీత్యా యోగీశ్వరుడయ్యాడా? లేక ..”

పత్రీజీ :గత అనేకానేక జన్మలనుంచే .. గౌతమబుద్ధుడు గొప్ప యోగీశ్వరుడు! అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ..”గౌతముడిలా మనం ఎప్పుడు యోగీశ్వరులం అవుతాము? ఒకానొక బుద్ధుడిలా మనం ఎలా జీవించగలుగుతాము?” అన్నదే కానీ మరింకోటి కాదు! అనేకానేక మంది యోగీశ్వరులు మనకు అందించిన అనుభవపరమైన శాస్త్రీయ ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ దానిని మన స్వీయ అనుభవజ్ఞానంలా మలుచుకోవడమే మనం చెయాల్సిన పని కానీ .. వాళ్ళ జాతకాలను విశ్లేషించుకుంటూ కూర్చోవడం వల్ల మనకు జరిగేదేమీ వుండదు.

ప్రశ్న : “గతకొన్ని సంవత్సరాలుగా నాలో ఏవో తెలియని భయాలు పేరుకుపోయి నన్ను చాలా బాధపెడుతూ వున్నాయి. వాటి నుంచి విముక్తి చెందడం ఎలా?”

పత్రీజీ : ధ్యానంలో కూర్చుని .. గతంలో మీకు ఎవరెవరి వల్ల బాధకలిగిందో వారిని గుర్తుతెచ్చుకుని .. వాళ్ళందరినీ పేరు పేరునా బేషరతుగా క్షమించివెయ్యండి. అలాగే మీరు ఎవరెవరిని బాధించారో వాళ్ళను కూడా గుర్తుకు తెచ్చుకుని .. పేరు పేరునా వాళ్ళను క్షమాపణలు అడగండి. క్రమక్రమంగా మీ అంతశ్చేతనా మనస్సు యొక్క మూల మూలల్లో నిక్షిప్తమై వున్న బాధాకరమైన ఆలోచనల నుంచి మీరు విముక్తి చెందుతారు. ఇంకా మీ ధ్యాన సమయాన్ని పెంచుతూ .. నవీన ఆధ్యాత్మికతకు చెందిన పుస్తకాలను చదువుతూ ప్రతి రోజూ ఇది ఒక అభ్యాసంలా చేయండి.

ప్రశ్న : “మనం పొందవలసినవి అన్నీ కూడా అడక్కుండానే ప్రకృతి మనకు సమకూర్చి పెడుతుంది కనుక మనం ఏ పని చెయ్యకపోయినా ఫరవాలేదు’ అని నా స్నేహితుడు అంటున్నాడు ..”

పత్రీజీ : అటువంటి మూర్ఖశిఖామణి మీకు స్నేహితుడు కాకూడదు! వెంటనే వాడి స్నేహాన్ని వదిలి పెట్టండి! చార్లెస్ డార్విన్ మహాశయులు అందించిన సిద్ధాంతాలను గురించి మీరు చదువుకోలేదా? పరిణామక్రమంలో భాగంగా ప్రకృతి ఎప్పుడూ మన అస్తిత్వానికి సంబంధించిన రకరకాల పరీక్షలకు మనల్ని గురిచేస్తూ వుంటుంది: Struggle for Existence. ఆ పరీక్షల్లో నెగ్గిన వారినే అర్హులుగా ఎంచి .. క్రమక్రమంగా అప్పుడు వారికి చెందవలసినవి వారికి అందజేస్తూ వుంటుంది: Survival of The Fittest.

ప్రశ్న : “ఇంటగెలిచి రచ్చగెలవమని పెద్దలు చెప్తారు .. అది ఎలా?!”

పత్రీజీ : ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అన్నవి మూడు కలిసిన “ఆధ్యాత్మిక జీవితం 50 శాతంగా” ఉన్నప్పుడే “మిగతా 50 శాతం ప్రాపంచిక జీవితం” అన్నది సమత్వపు స్థితిలో సాగుతుంది. “ఆత్మ ఇంట” గెలిచిన ఒకానొక బుద్ధుడు మాత్రమే “ప్రాపంచిక రచ్చ”లో కూడా గెలుస్తూ సమత్వపు స్థితిలో తన జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూంటాడు!

ప్రశ్న : “ఇప్పుడు ఎక్కడ చూసినా ఇబ్బడి ముబ్బడిగా ఆధ్యాత్మిక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో ఏది నాకు సరిఅయినదో ఎంపిక చేసుకోడానికి ఏదయినా Short Cut పద్ధతి ఉందా?!

పత్రీజీ : “Short Cut ” అన్నది ఎక్కడా లేనేలేదు! ఒక్కొక్క పద్ధతినీ నిశితంగా పరీక్షిస్తూ వెళ్ళాల్సిందే! .. దీనికి ఎంతో సహనం వుండాలి. గౌతమబుద్ధుడు ఆరేళ్ళ‌పాటు విసుగు విరామం లేకూండా సుమారు 500 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాడు. అక్కడ తాను గ్రహించిన విషయాలన్నింటినీ ఆచరించి ఆ అనుభవజ్ఞానాన్నంతా క్రోడీకరించుకుంటూ చివరికి తనదైన ఆనాపానసతి దారిని ఎన్నుకున్నాడు. గౌతమబుద్ధునికైనా .. మరెవరికయినా “సునాయాస చిట్కా పద్ధతులు” అంటూ ఏవీ లేవు!

ప్రశ్న : “‘కోపం, ఏడ్పు, కరుణ ప్రేమ, దయ సానుభూతి అన్న భావాలను బయటికి వ్యక్తం చేస్తేనే’ వాటి నుంచి విముక్తం చెందుతాడు’ అని నేను చాలా సందర్భాల్లో చదివాను. కానీ అలా చేయడం వల్ల నా సన్నిహితులే నన్ను అర్థం చేసుకోకుండా నన్ను చిత్రంగా చూస్తూన్నారు.”

పత్రీజీ :క్షీరసాగర మధనంలో ముందు హాలహలం వచ్చి ఆ తరువాత ‘ కల్పవృక్షం ’, ‘ కామధేనువు’, ‘ఐరావతం’, ‘వజ్రాయుధం’ లాంటివన్నీ వచ్చి చివరిగా అమృతం దక్కుతుంది. ఆధ్యాత్మిక సాధనాక్రమంలో ముందు నా అనుకున్న వాళ్ళనుంచే ఛీత్కారాలూ, వెటకారాలూ వస్తాయి! అన్నింటినీ తట్టుకుంటూ మరి మనోనిబ్బరం కోల్పోకుండా సత్యసాధన చేస్తూ వుంటే క్రమక్రమంగా మనకు దక్కవలసినవి అన్నీ వస్తూ వుంటాయి.అప్పటికి .. మన ధ్యానసాధనా తరంగాల ప్రభావం వల్ల అందరి స్థితిగతుల్లో కూడా మార్పువచ్చి క్రమక్రమంగా వాళ్ళు కూడా ఈ రహదారిలోకే వచ్చి అంతవరకు అపార్థం చేసుకున్న వాళ్ళంతా కూడా అప్పుడు కొంతైనా అర్థం చేసుకుంటారు.

ప్రశ్న : “నేను ధ్యానం చేస్తూ .. మాంసాహారం యొక్క అనర్థాలను తెలుసుకుని వెంటనే పూర్ణ శాకాహారిగా మారిపోయాను. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మా ఇంట్లో వాళ్ళంతా నన్ను మాంసాహారం తినమని బలవంతం చేస్తున్నారు. వాళ్ళ మాట ‘సరే’ అన్నప్పుడల్లా నాకు ధ్యానం సరిగ్గా కుదరకపోగా నా హృదయం అంతా వేదనతో నిండిపోతోంది. కిం కర్తవ్యం?!”

పత్రీజీ : తక్షణం మీరు మీ ఇంటి నుంచి బయటపడండి! మిమ్మల్ని పాపపంకిలంలోకి త్రోసేవాళ్ళు మీ వాళ్ళు ఎలా అవుతారు? “ప్రహ్లాదుడు -హిరణ్యకశ్యపుడు” కథ వినలేదా?!

ప్రశ్న : “గురువుగారు! సత్యయుగం మొదలైనట్లేనా?!”

పత్రీజీ : భిన్నత్వంతో కూడిన ఈ సృష్టిలో అందరికీ ఒకేలా ఉండదు! మీకు సత్యయుగం మొదలై మీ ఇంట్లో వాళ్ళు ఇంకా కలియుగంలోనే ఉండవచ్చు! లేదా మీ వాళ్ళంతా సత్యయుగంలోకి వెళ్ళిపోయి మీరు ఇంకా కలియుగంలోనే కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు!

ప్రశ్న : “జీవితాన్ని ఎలా జీవించాలి?!”

పత్రీజీ : “ఈ జన్మ మనకు తెలియకుండా అకస్మాత్‌గా జరిగిన సంఘటన ఎంతమాత్రం కానేకాదు” అన్న సత్యాన్ని మనం తెలుసుకుని జీవితం గురించి నిరంతరం జాగ్రత్తగా ఆలోచించాలి. మన స్వ-ఇచ్ఛతో ఏరుకుని, కూర్చుకున్నటువంటి అత్యంత ప్రణాళికాబద్ధమైన మన జీవితాన్ని అజ్ఞానంతో, మూర్ఖత్వంతో దుర్భరం చేసుకోకుండా ప్రతిక్షణం ఆత్మజ్ఞానపు ఎరుకతో జీవిస్తూ దానిని “చాన్నాళ్ళ అద్భుతం” లా మలచుకోవాలి!

ప్రశ్న : “మరణం తరువాత ఆత్మకు ఏమవుతుంది?”

పత్రీజీ : ఏమీ కాదు!! మీ శరీరం మీద నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరానికి ఏమవుతుంది? అలాగే.. మరణం తరువాత తాత్కాలికమైన శరీరాన్ని ధరించి వున్న శాశ్వతమైన ఆత్మకు కూడా ఏమీకాదు! శరీరానికి బట్ట ఎలాంటిదో .. ఆత్మకు శరీరం అలాంటిదే కనుక మరణం ద్వారా శరీరం నశించిన తరువాత కూడా ఆత్మ మరిన్ని అనుభవాలకోసం మరిన్ని జన్మలను తీసుకుంటూ మరిన్ని క్రొత్తక్రొత్త శరీరాలను ధరిస్తూ తన అనంతకాల ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వుంటుంది.

ప్రశ్న : “అందరూ ‘దేవుడు ఉన్నాడు’ అంటున్నారు కదా! అసలు దేవుడిని చూడడం ఎలా?!

పత్రీజీ : సర్వం ఖల్విదం బ్రహ్మ .. కనపడేదంతా దేవుడే! అందరూ దేవుళ్ళే!

“నేను ప్రతిక్షణం .. ప్రతి ఒక్కదేవుడినీ చూస్తున్నాను; ప్రతి ఒక్కదేవుడితో మాట్లాడుతున్నాను” అన్న సత్యాన్ని మరిచిపోయిన దేవుళ్ళంతా కూడా విజయవాడ నుంచి తిరుపతికీ .. కోదాడ నుంచి షిరిడికీ వెళ్ళి “దేవుడెక్కడా?” “దేవుడెక్కడా?” అని దేవులాడుతున్నారు!

ప్రశ్న: “మీకు మొండిధైర్యం ఎక్కువ!”

పత్రీజీ : నాకు సత్యం ఏదో, అసత్యం ఏదో ఖచ్చితంగా తెలుసు! కాబట్టే .. ఆ తెలుసుకున్న సత్యాన్ని అందరికీ స్పష్టంగా చెబుతూ వస్తున్నాను. సత్యాన్ని ‘సత్యం’ అనీ ఐస్‌క్రీమ్ ని ‘ఐస్‌క్రీమ్’ అనీ చెప్పడానికి మొండిధైర్యం అవసరంలేదు. దానిని గురించిన వాస్తవం తెలిస్తే చాలు.

ప్రశ్న: “క్లిష్టమైన పరిస్తితుల్లో ఎలా రియాక్ట్ కావాలి?”

పత్రీజీ : REACTION చెందేవాడు పురుషాధముడు CREATION చేసేవాడు పురుషోత్తముడు.

“REACTION” అన్న ఆంగ్ల పదంలోని అక్షరాలను మరోవిధంగా కూర్చి తెలుసుకుంటే “CREATION” అని వస్తుందిగదా! కాబట్టి నో రియాక్షన్!! “కరుణ”ను చూపించాలి; “కరుణ” ను “సృష్టించి”, ఆచరించి, చూపించాలి. నా వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి నేను నా జీవితంలో ఈ సూత్రాన్నే అనుసరిస్తున్నాను.

ప్రశ్న : “ఓ ఎన్‌లైటెన్డ్ మాస్టర్‌ను గుర్తించడం ఎలా?”

పత్రీజీ : ఎన్‌లైటెన్డ్ మాస్టర్‌ను గుర్తించడం చాలా సులభం! అతడు తన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకుని మరీ జీవిస్తూంటాడు. అతడు కష్టాలకు కృంగిపోడు; బాధలకు తలవంచడు. అందరితో మమేకం అవుతూ అందరినీ సరిసమాన స్నేహదృష్టితో చూస్తూ.. ఎవరు తనను పొగిడినా పొంగిపోకుండా, దూషించినా బాధపడకుండా .. ఒక బుద్ధుడిలా సదా బ్రహ్మానందస్థితిలో వుంటాడు.

ప్రశ్న : “‘పనియే ప్రార్థన’ అనే సంస్కృతి ప్రబలిపోయిన ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ధ్యానం చేసి అంతరాత్మను పట్టించుకునేంత తీరిక ఎవరికి వుంటుంది?

పత్రీజీ : మరేం ఫరవాలేదు! ఈ జన్మలో కాకపోతే మరో వందజన్మల తరువాత కూడా ధ్యానం చేసుకుని అంతరాత్మను పట్టించుకుని ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. కాకపోతే .. ఆత్మసాక్షాత్కారం పొందేంతవరకూ క్రొత్త జన్మ తీసుకున్నప్పుడల్లా ప్రాపంచిక కష్టాల్లో, బాధల్లో పడి నలుగుతూనే వుండాలి. అందుకే .. ఊరికే పుట్టడం, గిట్టడం కాకుండా .. ఆ ధ్యానమేదో ఇప్పుడే చేసి ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం పొందితే ఎంతో బాగుంటుంది .. అదే అసలైన ‘పని!

ప్రశ్న : “ధ్యానం చక్కగా కుదరాలంటే?”

పత్రీజీ : ధ్యానం చక్కగా కుదిరిన వాళ్ళతో సాంగత్యం చేయాలి; ధ్యానం అనునిత్యం ప్రబోధించే వాళ్ళతో.. ఆ సంఘంతో .. చేరాలి! “పిరమిడ్ సంఘం శరణం గచ్ఛామి” అని నిశ్చయించుకోవాలి!

ప్రశ్న : “సమాజం పట్ల మన కర్తవ్యం?”

పత్రీజీ : “దానం!” సమాజంలో అందరూ సుఖంగా, సంతోషంగా వుంటేనే సంఘజీవులమైన మనం కూడా సుఖంగా సంతోషంగా వుంటాం! అందుకుగాను మనం అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేకానేక ఆర్థికపరమైన దానాలతో పాటు .. ధ్యాన-జ్ఞాన దానాలవంటి ఆధ్యాత్మికపరమైన దానాలను కూడా విశేషంగా చెయ్యాలి.

ప్రశ్న : “విదేశాల్లో నివసిస్తూన్నప్పుడు ఒక్కోసారి శాకాహారం దొరకడం కష్టంగా వుంటోంది?”

పత్రీజీ :”ధ్యానం”-“శాకాహారం” అన్నవి రెండూ .. మనకు రెండు పాదాలలాంటివి. ఇందులో ఏ ఒక్కటి మనకు లేకపోయినా మనం వికాలాంగుల్లా కుంటి బ్రతుకు ఈడవాల్సిందే! ఒకవేళ శాకాహారం బొత్తిగా దొరకని ప్రదేశాల్లో కనుక ఉండాల్సి వస్తే .. అది ఎంత గొప్ప ప్రదేశం అయినా సరే .. నిర్ద్వందంగా దానిని వదిలి పెట్టెయ్యాలి. ధర్మబద్ధంగా జీవించడానికి అనువుగాలేని అలాంటి దుర్భరప్రదేశాలు డాలర్లను కురిపిస్తూ మనల్ని తాత్కాలిక మాయకు గురిచేసినా .. ఆత్మ పరిణామక్రమంలో మాత్రం అవి మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి.

]ప్రశ్న : “ప్రకృతితో కలిసి జీవించడం ఎలా?”

పత్రీజీ : ప్రకృతి రెండు పార్శ్వాలుగా వుంటుంది. స్థూల ప్రకృతి .. చర్మచక్షువులతో చూసేది. సూక్ష్మ ప్రకృతి .. దివ్యచక్షువులతో చూసేది. ఒకే జీవిత కాలంలో ఈ రెండు పార్శ్వాలతో కూడిన ప్రకృతితో విశేషంగా కలిసి జీవించడమే .. శాస్త్రీయమైన జీవనవిధానం. చర్మచక్షువులతో చూడగలిగిన స్థూలప్రకృతి అయిన కొండ – కోనలు .. చెట్లు – చేమలు .. పక్షులు – జంతువులు .. నదులు – సెలయేళ్ళు .. స్వచ్ఛమైన గాలి – సముద్రాలు వంటి శక్తి క్షేత్రాలలో సమయం గడుపుతూ వాటి నుంచి ఇతోధికంగా విశ్వమయప్రాణశక్తిని పొందాలి.

ధ్యానం ద్వారా దివ్యచక్షువును ఉత్తేజపరచుకుని మామూలు చర్మచక్షువులతో చూడలేని సూక్ష్మకారణ, మహాకారణ వంటి అనేకానేక ఉన్నత లోకాలను దర్శించి .. ఆ యా లోకాల నుంచి విశ్వశక్తినీ, ఆ యా లోకాల భావసంపదనూ గ్రహించి నూతన ఔన్నత్యంతో కూడిన మనోవికాసాన్ని పొందాలి.

ఇలా స్థూల, సూక్ష్మ ప్రకృతులతో కూడి శాస్త్రీయ పద్ధతిలో ఏకకాలంలో జీవించగలిగినప్పుడే మనం విశ్వజీవులుగా పరిణమిస్తాం!

ప్రశ్న : “ఆనందం ఎలా వస్తుంది?”

పత్రీజీ : మనసా, వాచా, కర్మణా త్రికరణశుద్ధిగా, నిజాయితీగా ఉన్నప్పుడు మనకు ఆనందం అన్నది విశేషంగా లభ్యం అవుతూ వుంటుంది. ధ్యాన అనుభవం ద్వారా మనం తెలుసుకున్నదానినే మాట్లాడుతూ .. అలా మాట్లాడిన దానినే ఆచరిస్తూ .. నిత్య ఎరుకతో ఉన్నప్పుడు మనం ఆనందమయులుగా ఉంటాం.

ఈ నిత్య జీవన ఆనందమయ సూత్రాన్ని పిల్లలకూ, పెద్దలకూ, బంధువులకూ మరి మనల్ని శత్రువులగా చూస్తున్నవాళ్ళకు కూడా అందజేస్తూ వారిని కూడా ఆనందమయుల్లా మలుస్తూ ఉంటే మనం బ్రహ్మానందంతో విలసిల్లుతూ ఉంటాం.

ప్రశ్న : “యోగభ్రష్టత్వం అంటే ఏమిటి?”

పత్రీజీ :సరియైన ధ్యాన సాధనను విశేషంగా చేసిన ప్రతి ఒక్కరికీ అపరమితమైన శక్తిసామర్థ్యాలు సంక్రమిస్తూ ఉంటాయి. తద్వారా వారు ఏది కోరుకుంటే అది ప్రాపంచికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా సునాయాసంగా కలిసివస్తూ ఉంటాయి.

“ప్రాప్తి” .. “ప్రకామ్యం” .. “ఈశత్వం” .. “వశిత్వం” అనబడే ఇలాంటి సిద్ధుల వల్ల మనం గర్వం, అహంకారం మరి డంబాతిశయాలను పెంచుకుంటే .. అది మన ఆధ్యాత్మిక మరి ప్రాపంచిక పతనాలకు దారితీసి మనల్ని యోగభ్రష్ఠుల్లా మలిచి మరు జన్మల్లో మరింత క్లిష్టపరిస్థితుల్లో జన్మతీసుకునేలా చేస్తుంది.

అలా కాకుండా నిరంతర ధ్యాన సాధన ద్వారా మనకు సంక్రమిస్తోన్న సిద్ధుల పట్ల ఎరుకతో కూడిన సమదృష్టిని కలిగి ఉండాలి! కోరుకున్నవైనా .. లేదా అనాలోచితంగా నైనా సరే .. మనకు సంప్రాప్తిస్తోన్న అద్భుత ఫలితాలు పట్ల కృతజ్ఞతతో కూడి ఉంటూ గర్వానికి లోబడిపోకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే ఆత్మ తన పరిణామ క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటుంది.

ప్రశ్న : “సాధన ఎంత వరకు?”

పత్రీజీ :ఆత్మసాక్షాత్కారం అయ్యేంతవరకూ ధ్యానసాధన కొనసాగుతూనే ఉండాలి. దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకోవాలి .. సూక్ష్మ శరీరయానాలు చేయాలి .. గత జన్మల జ్ఞాన సంపదంతటినీ తిరిగి పొందాలి .. పరలోక గురువులతో సంపర్కం కలిగి ఉంటూ ఆత్మజ్ఞానాన్నంతా ఔపోసన పట్టాలి. “ఈ ప్రక్రియ అంతా ఇప్పుడే మొదలుపెట్టి ఈ జన్మలోనే పరాకాష్ఠను సాధించాలి” అన్న దృఢనిశ్చయంతో ముందుకు సాగడం ఉత్తముల లక్షణం!

ప్రశ్న : గురువు యొక్క అవసరం ఎంత వరకు?”

పత్రీజీ : పరిమితమైన అలోచనలతో కూడిన ప్రాపంచిక మాయలోంచి బయటపడేంత వరకూ మనకు బాహ్య గురువుల సూచనలూ, సలహాలూ, అవసరం! ధ్యాన సాధన ద్వారా మనల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు స్వయంప్రకాశంతో కూడిన గురువుల్లా మనకు మనమే మార్గదర్శనం చేసుకుంటాం. ఇందుకు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాదులు మనకు ఇతోధికంగా సహాయపడతాయి!

ప్రశ్న : “టెన్షన్ అన్నది లేకుండా ఎప్పుడూ శాంతంగా ఎలా వుండవచ్చు?”

పత్రీజీ :‘టెన్షన్’ అన్నది మీకే కాదు .. అందరికీ వుంటుంది! మహాభారతయుద్ధం చేయడానికి అస్త్రశస్త్రాలతో బయలుదేరిన అర్జునుడికి కూడా తీరా యుద్ధరంగం మధ్యలోకి రాగానే “టెన్షన్” మొదలైంది! “శత్రుసైన్యంలో వున్న ఆ ద్రోణాచార్యుడిని ఎలా చంపాలి?”, “కురువృద్ధులైన భీష్మపితామహులను ఎలా మట్టుపెట్టాలి?”.. “అసలు ఇప్పుడు యుద్ధం చెయ్యడం అవసరమేనా? అంటూ అనేకానేక ఉద్రేకాలకు గురిఅయిన అర్జునుడి పరిస్థితికి జాలిపడిన శ్రీకృష్ణుడు” అర్జునా! నువ్వు ముందు యోగివి కా!” అని చెప్పాడు.

మహావీరుడు మరి ఎన్నెన్నో ఆయుధాలను చేతిలో కలిగివుండికూడా అర్జునుడు టెన్షన్ పడ్డాడేకానీ .. చేతిలో ఏ ఆయుధం లేకుండా యుద్ధరంగంలో రధాన్ని తోలుతూ కూర్చున్న శ్రీకృష్ణుడు మాత్రం ఏ టెన్షన్ లేకుండా కులాసాగా కూర్చున్నాడు! కారణం అతడు చిన్నతనం నుంచే ధ్యానసాధనలో తన జీవితాన్ని పండించుకున్న గొప్ప యోగీశ్వరుడు! ధ్యానవిద్యలో నిష్ణాతులు అయినవారికి శ్రీకృష్ణుడిలాగా ఎప్పుడూ టెన్షన్ అన్నది ఉండదు.

ప్రశ్న : “‘ధ్యానసాధనలో వుండే ప్రతిబంధకాలు ఏవేవి ?”

పత్రీజీ : ధ్యానసాధనలో ఉండే ప్రాథమిక ప్రతిబంధకాలు :

1. సోమరితనం .. 2. భయం .. 3 అహం

1. సోమరితనం : పీకలదాకా తిని త్రాగి పడుకోవడం .. టీవీలో వచ్చే ప్రోగ్రామ్‌లను కళ్ళప్పగించేసి చూస్తూ కూర్చోవడం .. ఏ కాస్త తీరిక దొరికినా పక్కింటి వాళ్ళతో నిష్ప్రయోజనకరమైన కాలక్షేపపు చెత్తకబుర్లు మాట్లాడుతూ కాలాన్ని హరించివేయడం.

2. భయం : ఎంత రోతవైనా పాత విషయాలను బంగారంలా కాపాడుకుంటూ వాటిని వదలడానికి భయపడడం .. బంగారంలాంటి క్రొత్త విషయాలను స్వీకరించి ఆచరించడానికి భయపడడం.

3. అహం: ‘దేవుడు’, ‘బుద్ధి’, ‘ఆత్మ’ ల గురించి అక్షరంముక్క తెలియకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడడం .. తెలుసుకోవాల్సిన విషయాల పట్ల నిర్లక్ష్యం వహించడం.

ఈ మూడు మౌలిక ప్రతిబంధకాలు ధ్యానసాధకులకే కాదు .. ఎవరికైనా .. సుతరామూ పనికిరావు.

ప్రశ్న : “‘క్రొత్త కట్టడాల నిర్మాణాన్ని మొదలుపెట్టేప్పుడు భూమి పూజ చెయ్యాలా ?”

పత్రీజీ : తప్పనిసరిగా చెయ్యాలి ! క్రొత్త నిర్మాణం మొదలు పెట్టబోయే నేలపై చక్కగా ధ్యానంలో కూర్చుని కాస్సేపు చిత్తవృత్తులన్నీ నిరోధం చేయాలి ! మన ఎరుకను ఆ నేల తల్లిలో ప్రవేశింపజేసి ఆ తల్లితో మమేకమై .. అక్కడ కట్టబోయే క్రొత్త నిర్మాణానికి ఆమె అనుమతి తీసుకోవాలి ! నేలతల్లితో అలాంటి అవినాభావసంబంధాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు ఇద్దరూ కలిసిచేసే పనులన్నీ అవిఘ్నంగా నెరవేరుతాయి!

మంచి సువాసనలు వెదజల్లే అగరువత్తులను ఆ ప్రదేశంలో వెలిగించి .. కొబ్బరికాయనో, అరటిపండునో, స్వీటునో అక్కడ క్రిమికీటకాదులకు విందుభోజనంలా పెట్టాలి ! చక్కటి శ్రావ్యమైన బిస్మిల్లాఖాన్ లాంటి సంగీతాన్ని వింటూ ధ్యానం చెయ్యాలి!

ప్రశ్న : “ఆచార్యుడు అంటే ఎవరు?”

పత్రీజీ : ” యః యాచినోతి, ఆచరతి, ఆచారయతి చ .. సః ఆచార్య ” అన్నది శాస్త్రం !

అనేకానేకమంది గురువుల దగ్గర ఆత్మజ్ఞానాన్ని యాచించి, యాచించి పొంది .. అలా యాచించి యాచించి పొందిన దానిని సాధన ద్వారా తన స్వానుభవంగా మార్చుకుని .. తాను చేసిన ఆ ఆత్మాభ్యాసాన్నే ఇతరుల చేత కూడా చేయించేవాడే ఆచార్యుడు !

ఈ భూమి మీద జన్మతీసుకున్న ప్రతి ఒక్కరూ ఆచార్యుడు కావడానికి ప్రయత్నించాల్సిందే .. మరి ఆచార్యుడిగా అయ్యేంత వరకు తిరిగి తిరిగి ఇక్కడ పుట్టాల్సిందే !

ప్రశ్న : “‘స్వేచ్ఛ’ ను నిర్వచించండి!”

పత్రీజీ : స్వ = స్వంత .. ఇచ్ఛ = కోరిక .. “స్వేచ్ఛ” అంటే మన “స్వంత ఇచ్ఛ”!

“మనం ఎక్కడ వున్నా, ఏ లోకంలో తిరిగినా మన వాస్తవాన్ని మన స్వంత కోరికల ప్రకారం మనమే సృష్టించుకుంటున్నాం” అన్న ఆత్మజ్ఞానపు ఎరుకతో సదా ఆనందంగా జీవించడమే సేచ్ఛ !

ప్రశ్న: “కర్మయోగం అంటే ఏమిటి ?”

పత్రీజీ : * మనం చేయవలసిన కర్మలను గుర్తించి వాటిని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నించడమే ” కర్మయోగం ” !

* మనం చేస్తున్న వృత్తుల మీద గౌరవభావాన్ని కలిగి వుండడమే .. “కర్మయోగం” !

* సమయాన్ని దుర్వినియోగం చేయకుండా అనేకానేక సుకర్మల్లో మనల్ని మనం ఎప్పటికప్పుడు నియమించుకోవడమే .. “కర్మయోగం”!

* రకరకాల విద్యలనూ, కళలనూ సదా నేర్చుకుంటూ వుండడమే .. “కర్మయోగం” !

* సంసార చక్రంలో పైన వున్నప్పుడు మిడిసిపడకుండా .. క్రింద వున్నప్పుడూ క్రుంగిపోకుండా స్థిరచిత్తంతో ధైర్యంగా నిలబడగలగడమే .. “కర్మయోగం”!

* కర్మఫలితం మీద ఎక్కువగా ఆధారపడకుండా కర్మచేయడంలో మాత్రమే శ్రద్ధగా నిమగ్నమై ఉండడమే ” కర్మయోగం ” !

* మన ఆలోచనలూ, మాటలూ, చేష్టలూ .. అన్నింటి పట్ల సమయ సందర్భాలను అనుసరించి జాగురూకులుగా వుండడమే .. ” కర్మయోగం ” !

* ప్రతి కర్మ కూడా మరొక కర్మకు కారణభూతమవుతుందన్న కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకుని కర్మచక్రాన్ని జాగరుకతతో పరిశీలించడమే .. ” కర్మయోగం ” !

* ” చేసుకున్న వాడికి చేసుకున్నంత ” అన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఆ పరిధిలో జీవించడమే “కర్మయోగం”

ప్రశ్న : “తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి ?”

పత్రీజీ : ప్రతి మనిషి కూడా తన ప్రగతి పథంలో తప్పులు విధిగా చేస్తూనే ఉంటాడు. అయితే వాటిని నడకనేర్చుకోవడంలో దొర్లే చిన్ని చిన్ని తప్పటడుగుల్లాగానే గుర్తించాలి ! అంతేకాక ఒకవేళ నిజంగా తప్పు జరిగినా కూడా దానిని మరిచిపోయి మళ్ళీ వెంటనే క్రొత్త క్రొత్త సృజనాత్మక కార్యక్రమాల్లో మునిగిపోవాలి.

” నేను పాపిని .. నేను పాపిని ” అని పదే పదే అనుకుంటూ ఆత్మనూన్యతకు గురికావడం కానీ .. ” నువ్వు పాపివి .. నువ్వు పాపివి ” అంటూ మరొకరిని నిందించడం కానీ చెయ్యకూడదు. తప్పులు చేస్తున్న వాళ్ళ దగ్గరి నుంచి కూడా సదా పాఠాలు నేర్చుకోవడమే మనం చెయ్యవలసిన పని.

ప్రశ్న : “సజ్జన సాంగత్యానికీ, ఆచార్యసాంగత్యానికి తేడా ఏమిటి ?”

పత్రీజీ : “సజ్జన సాంగత్యం” అంటే “‘సత్యం ’ తెలుసుకున్న వారితో కలిసి ఉండడం” .. అంటే ఆత్మవిద్య గురించీ, ఆత్మశక్తి గురించీ స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న సజ్జనులతో కూడిన సాంగత్యం !

“ఆచార్యులు” అంటే “తాము తెలుసుకున్న సత్యంలో సదా జీవిస్తూ తమతమ జీవితాలను మరింత సత్యసాధనకే అంకితం చేసినవారు, చేస్తున్నవారు. ఆధ్యాత్మికతలో పరిపూర్ణ ప్రగతిని సాధించిన ఇలాంటి ఆచార్యులతో కలిసిమెలిసి జివించడమే” ఆచార్య సాంగత్యం”.

ప్రతి ఒక్క సాధకుడు కూడా ధ్యానంతో పాటు ” సజ్జన సాంగత్యం ” మరి ” ఆచార్యసాంగత్యం ” అన్నవి విధిగా చెయ్యాలి. అప్పుడే అతని ఆత్మ ప్రగతిపధంలో ముందుకు నిశ్చితంగా సాగిపోతూ వుంటుంది.

ప్రశ్న : “బుద్ధుడి మూర్తులను .. కూర్చున్న భంగిమలో, నిలుచున్న భంగిమలో మరి పడుకున్న భంగిమలో చూస్తూంటాం ! వాటి అంతరార్థాలు ?”

పత్రీజీ : ధ్యానస్థితిలో కూర్చుని వున్న బుద్ధమూర్తి .. ” ధ్యానం ద్వారా జ్ఞానం ” అన్న శివ పార్వతీ తత్త్వాన్ని సూచిస్తూ వుంటుంది. నిశ్చలంగా నిలబడి వున్న బుద్ధమూర్తి .. “కార్యోన్ముఖతకూ, సృజనాత్మకతకూ ప్రతిరూపంగా వున్న బ్రహ్మవాగేశ్వరీ తత్త్వాన్ని సూచిస్తుంది.

ఇక పడుకుని వున్న బుద్ధమూర్తి .. పాలసముద్రంలో యోగనిద్రాపరవశుడై ముక్తస్థితిలో వున్న విష్ణుతత్త్వాన్ని సూచిస్తుంది.

ప్రశ్న : “జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు ?”

పత్రీజీ : దేనికీ తాపత్రయపడని ప్రశాంత నిర్మల తత్వంతో బుద్ధి పరిణితిని సాధించి ఉన్నవాడే ” ఒకానొక జీవన్ముక్తుడు “; అలాంటి నిష్కామ నిశ్చలమూర్తి అయిన జీవన్ముక్తునికి సిరి దాస్యం చేస్తుంది .. విజయం కోరి తలుపు తడుతుంది.

అన్నింటా తృప్తులై ఉన్న జీవన్ముక్తుల వాక్కులూ, కర్మలూ ఆత్మహితకరాలుగా, లోకహితకరాలుగా విరాజిల్లుతూ వుంటాయి.

ప్రశ్న : “రాజకీయాలంటే జనాలకు ఏ మాత్రం సదభిప్రాయం లేని ఈ రోజుల్లో ‘ధ్యానులే పరిపాలుకులు కావాలి’ అన్న నినాదంతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించి, ఎన్నికల సంరంభంలో ధ్యానులను విస్తృతంగా పాల్గొనేలా చేయటంలో మీ ఉద్దేశ్యం?”

పత్రీజీ: “జీవితంలో అన్ని రకాల ఆటలూ ఆడాలి, అన్ని రకాల పాటలూ పాడాలి, అన్ని రకాల రుచులూ అనుభవించాలి, అన్ని రకాల రసాలూ గ్రోలాలి, అనేకానేక సంఘపరమైన క్రియాత్మక కార్యకలాపాలలో ‘రాజకీయం’ అనేది కూడా ఒకానొక ప్రముఖ కార్యకలాపం. బాధ్యత గల ప్రతిపౌరుడికీ రాజకీయ స్పృహ, ‘రాజకీయ అవగాహన’ అన్నది చాలా ముఖ్యం. మామూలు పౌరులకే రాజకీయ చైతన్యం ఎంతో అవసరమైనప్పుడు ఆధ్యాత్మిక పౌరులకు అది ఇక మరింత అవసరమవుతుంది.

ఆధ్యాత్మిక పౌరులు తమ స్వంత వ్యక్తిగత సంక్షేమాన్ని పూర్తిగా సాధించినవారు. తమ స్వంత వ్యక్తిగత జీవితాలను ‘కడిగిన ముత్యాలు’ గా చేసుకున్న వారు. ఆ తదుపరి కార్యక్రమమే ‘సంఘాన్ని కడిగిన ముత్యం గా చేయటం’ ఈ నేపథ్యంలో సాంఘిక కార్యకలాపాల్లో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న ‘రాజకీయాలను ప్రక్షాళన చేయటం’ అన్నది ఆధ్యాత్మిక పౌరుల ప్రథమ కర్తవ్యం.

పిరమిడ్ ధ్యానులకూ, పిరమిడ్ ఆత్మజ్ఞాన పరాయణులకూ ఒక ఆధ్యాత్మిక రాజకీయ పార్టీని పెట్టటమనేది, స్ఠాపించటమనేది, ఆ పార్టీ ఆశయాల ప్రచారం అనేది, ఎన్నికలలో పాల్గొనటమనేది ఇదంతా ఒక నూతన ఆట -ఒక వినూత్న పాట -క్రొత్త నినాదం -క్రొత్త రుచి క్రొత్త విద్యాభ్యాసం – క్రొత్త విజ్ఞానం క్రొత్త సాంఘిక కార్యకలాపం -క్రొత్త కర్తవ్యం -క్రొత్త వికాసం”

ప్రశ్న : “గెలుపు ఓటముల పైనె నేటి సమాజం వ్యక్తులకిచ్చే విలువ ఆధారపడి ఉంటుంది కదా! ‘పిరమిడ్ పార్టీ’ పేరుతో మీరు ‘చేసిన సాహసం’ వెనుక గల స్ఫూర్తి ఎంతో ఉన్నతమైనదైనా, దానివలన ఎదుర్కొనవలసి ఉన్న విమర్శలు, అప్రతిష్టల గురించి మీ వ్యాఖ్యానం?”

పత్రీజీ : “భారతదేశం స్వతంత్రదేశం. ప్రతి వారికీ ఇతరులను విమర్శించటానికీ, వాఖ్యానించటానికీ నిర్ద్వందంగా పూర్ణ హక్కు ఉంది. ముఖ్యంగా ఒక క్రొత్త రాజకీయ పార్టీ వచ్చినప్పుడు, విమర్శలూ, చర్చలు అత్యమంత సహజం.

అజ్ఞానులూ, అల్పజ్ఞానులూ 99% ఉన్న ఈ వర్తమాన సమాజంలో అజ్ఞానపు, అల్పజ్ఞానపు విమర్శలే, వ్యాఖ్యానాలే బహుళంగా ఉండటం అన్నది కూడా అత్యంత సహజం. అజ్ఞానుల మూర్ఖ విమర్శలకూ, వివేక రహిత వ్యాఖ్యానాలకూ ఏ మాత్రం లక్ష్య పెట్టకపోవటం జ్ఞానులకూ అత్యంత సహజం. అందులోనూ పిరమిడ్ ధ్యానులకూ, పిరమిడ్ ఆత్మజ్ఞాన పరాయణులకూ వెన్నతొ పెట్టిన విద్య.

చివరి మాటగా చెప్పాలంటే, ధ్యానయోగులు మాత్రమే పరిపాలకులుగా ఉండటానికి సామర్థ్యం కలవారు. ఎందుకంటే ధ్యానులే, ఆత్మజ్ఞానపరాయణులే నిస్వార్థులుగా నిపుణులుగా ఉంటారు కనుక.

ప్రశ్న : “ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందా ?”

పత్రీజీ : ధ్యానం చెయ్యడం వల్ల పెరిగేదే .. ఆత్మవిశ్వాసం. ” ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలు .. పర్వతాలను సైతం కదలించవచ్చు ” అన్నారు జీసస్ క్రైస్ట్. కనుక ధ్యానం చేసేవాళ్ళకు కొండంత ఆత్మవిశ్వాసం వుంటుంది .. మరి వాళ్ళు ఏది అనుకుంటే దానిని సాధించుకోగలుగుతారు.

ప్రశ్న : “‘కోపం’, ‘భయం’, ‘చిరాకు’ వంటి మానవ సహజమైన లక్షణాలను పోగొట్టుకోవడం ఎలా ? “

పత్రీజీ : “‘కోపం ‘, ‘భయం’, ‘చిరాకు’ వంటి మానవ సహజమైన లక్షణాలను పోగొట్టుకోవడం కాకుండా .. ఏవి, ఎక్కడ, ఎప్పుడు ఎలా ఉంచాలో .. అక్కడ, అప్పుడు, అలా ఉంచడం అలవాటు చేసుకోవాలి. బాత్‌రూమ్‍లో మంచాలు పెట్టడం మరి డ్రాయింగ్ రూమ్‌లో బాత్‌టబ్ పెట్టడం వంటి మూర్ఖపు పనులు చెయ్యం కదా! ప్రతి ఒక్క వస్తువుకీ ఒక నిర్దిష్టమైన స్థానం వున్నట్లే .. కోపం, భయం, చిరాకు, నవ్వు, ఆనందం .. వంటి ప్రతి ఒక్క లక్షణానికీ కూడా ఒకానొక నిర్దిష్టమైన స్థానం తప్పకవుంటుంది.

నిరంతర ధ్యానసాధన వల్ల మన అంతరంగం మనకు తేటతెల్లం అవుతూ .. మన సహజ లక్షణాలన్నీ మనకు తేటతెల్లం అవుతూ .. మన సహజ లక్షణాలన్నీ మనకు అవగాహనకు వస్తూంటాయి. జీవితంలో ఏది ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా సవ్యమైన రీతిలో వుంటూ .. ప్రతి ఒక్క క్షణంలోని ఆనందాన్ని మనకు అనుభవంలోకి తెస్తాయి. ధ్యానం చెయ్యకపోతే ఈ లక్షణాలన్నీ ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండకూడదో అలా అపసవ్యంగా వుంటూ జీవితాన్ని అమిత గందరగోళంలో పడవేస్తూంటాయి.

ప్రశ్న : “బుద్ధత్వం అంటే ఏమిటి ?”

పత్రీజీ : మనకు ప్రయోజనం లేని పనులు చేయకపోవడమే బుద్ధత్వం. అలాగే అవతలివారికి ప్రయోజనం లేని పనులను కూడ చేయకపోవడమే బుద్ధత్వం. మన జీవితావసరాలతో పాటు .. ఇతరుల అవసరాలను కూడా గుర్తించి చూడగలగటమే .. బుద్ధత్వం. బుద్ధితో కూడి మట్లాడుతూ .. అన్నింటిలోనూ మితంగా వుండటమే బుద్ధత్వం. తిండి, నిద్ర, చదువు, సంపాదన, సేవ .. ఇలా అన్ని రకాల జీవన వ్యాపారాల్లో కూడా మధ్యేమార్గాన్ని అవలంబించడమే .. బుద్ధత్వం.

అందుకే ఏ పని అయినా టెన్షన్ లేకుండా చెయ్యాలంటే .. ప్రొద్దున్నే లేవగానే ధ్యానం చెయ్యాలి. లేకపోతే అర్జునుడిలాగా .. టెన్షన్ ఎక్కువై .. ” అసలు సమస్య నుంచే పలాయనం చిత్తగించాలి ” అనిపిస్తుంది.

ప్రశ్న : “ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ హాయిగా వుండే పిల్లలకు ధ్యానం అవసరమా ?”

పత్రీజీ : ఆటలు ఇంకా బాగా ఆడటానికీ, పాటలు ఇంకా బాగా పాడటానికీ .. మరి ఇంకా హాయిగా ఆనందంగా ఉండటానికీ .. ధ్యానం తప్పనిసరిగా అవసరం.

ప్రశ్న : “మతబేధం అన్నది ఎందుకు వస్తోంది ?”

పత్రీజీ : ఆత్మజ్ఞానంలోపంతో కూడిన మూర్ఖత్వం వల్ల మానవుల్లో మతబేధం అన్నది వస్తోంది. మనం ఒకానొక జన్మలో ‘ క్రిస్టియన్ ‘ గా, మరొక జన్మలో ‘ మహ్మదీయుడి ‘ గా .. ఇలా అనేకానేక జన్మల్లో అనేకానేక రీతులలో పుడుతూంటాం. కానీ పుట్టిన తరువాత ఆ ఆత్మ సత్యాన్ని మర్చిపోయి .. ” నేను కేవలం మహ్మదీయుడిని “, నేను కేవలం క్రిస్టియన్ని “, లేదా ” నేను కేవలం హిందువుని ” అన్న అజ్ఞానంలో పడి మనం మన జన్మపరంపరను మరిచిపోతూ మతబేధాల్లో ఇరుక్కుంటూ ఉంటాం. జన్మ పరంపరపట్ల మరి కర్మ సిద్ధాంతం పట్ల ఎరుకతో ఉండాలంటే .. తప్పనిసరిగా ధ్యానం చెయ్యాల్సిందే.

ప్రశ్న : “ఆత్మజ్ఞానాన్ని బోధించాల్సిన గురువులూ, స్వామీజీలు ‘కాళ్ళు పట్టుకుంటే పది వేలు, ఇంటిని పావనం చేస్తే ఇరవై వేలు’ అంటూ భక్తులను దోచుకుంటున్నారు ?! దీనికి తరుణోపాయం లేదా ?

పత్రీజీ : వాళ్ళు అలా రేట్లు పెట్టడంలో తప్పు లేదు కానీ .. మీరు అక్కడికి పోవడంలోనే తప్పువుంది. వాళ్ళు మిమ్మల్ని దోచుకోవడం లేదు .. మీరే దోచుకోబడుతున్నారు. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే .. వాళ్ళను తిట్టడం మాని, మీ అజ్ఞానానికి మిమ్మల్ని మీరే తిట్టుకుని తక్షణం ధ్యానాన్ని ఆశ్రయించడం మంచిది. ధ్యానంలో మీ స్వీయఆత్మ మిమ్మల్నెప్పుడూ దోచుకోదు .. పైగా ఇంతవరకూ జన్మజన్మల అజ్ఞానంతో మీరు కోల్పోయిన సంపదలన్నింటినీ తిరిగి మీరు పొందేట్లుగా చేస్తుంది.

ప్రశ్న : “ధ్యానం చేయడానికి ప్రశాంత వాతావరణం కావాలి అంటారు కదా ! మరి అలాంటి ప్రశాంత వాతావరణం లేనప్పుడు ధ్యానం ఎలా చెయ్యాలి ?”

పత్రీజీ : “ధ్యానం చెయ్యడానికి ప్రశాంత వాతావరణం కావాలి” అన్నది సరియైనదే. మీరు క్రొత్తగా స్కూటర్ నడపడం నేర్చుకోవాలంటే రద్దీగా ఉన్న రోడ్లమీద ప్రయత్నిస్తారా ? లేక జన సమ్మర్దం లేని మైదానంలోకి వెళ్ళి నేర్చుకుంటారా ? అలాగే ఇంట్లో అందరూ నిద్రపోయాక మీరు లేచికూర్చుని ధ్యానం చెయ్యండి. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చక్కగా కుదురుతుంది.

ప్రశ్న : “అనేకానేక మంది గురువులు అనేకానేక రకాలైన బోధనలు చేస్తోన్న ప్రస్తుత తరుణంలో సరియైన గురువును ఎలా ఎంచుకోగలం ?”

పత్రీజీ : రాశిలోంచి ఏదో ఒకటి ఎంచుకునే లాటరీ విధానం కాదు ” గురువుని ఎంపిక చేసుకోవడం ” అంటే ! అలా చేసే ఓటి కుండలో నీళ్ళు నింపుతూన్నట్లే.

శాస్త్రీయపద్ధతిలోనే ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్తూండాలి. సహనంతో మౌనంగా మీ ధ్యానసాధన మీరు చేసుకుంటూ వెళ్తూంటే .. మీ చైతన్యస్థాయికి తగిన గురువును మీరు ఎప్పటికైనా కలుసుకోగలుగుతారు.

ప్రశ్న: “గురూజీ! నేనొక సమస్యలో చిక్కుకున్నాను .. దాంతో నాకు జీవితమంతా సమస్యల వలయంలా కనబ డుతోంది. ఇందులోంచి బయటపడటానికి ఒక గురువుగా నాకు మీ సహాయం కావాలి. నన్నేం చేయమంటారు?”

పత్రీజీ : ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం తప్పక వుంటుంది. మరి పరిష్కారం కూడా .. నిదానంగా వెతికితే మన అంతరంగంలోనే వుంటుంది. బయట వేరే ఎక్కడా వుండదు గాక వుండదు. బయటివాళ్ళెవ్వరూ అసలు మన సమస్యను పరిష్కరించజాలరు.

మనకు ఎదురైన ప్రతి ఒక్క సమస్య కూడా మనలోంచి ఒక ప్రశ్నను ఉదయింపజేస్తుంది. మరి ఆ ప్రశ్నే .. మనకు సమస్యకు కావాల్సిన సమాధానాన్ని కూడా వెతికిపెడుతుంది. అందుకే సమస్యలు వచ్చినప్పుడల్లా మన మనస్సుల్లోంచి ఎన్నెన్నో ప్రశ్నలు కూడా ఉద్భవిస్తూ వుంటాయి. వాటన్నింటికీ మన అంతరంగంలోంచి ఎప్పుడైతె సరియైన సమాధానాలు లభిస్తాయో .. ఇక అప్పుడు మనం మానసికకల్లోలం నుంఛి బయటపడి .. ఆ సమస్య యొక్క పరిష్కారం వైపుగా మన భౌతికపరమైన చర్యలు మొదలుపెడుతాం. ఎప్పుడైతే ఇలా మనం భౌతికపరమైన చర్యలను సమర్థవంతంగా చేపడతామో అప్పుడు ఆ సమస్యకు సంపూర్ణమైన మరి అద్భుతమైన పరిష్కారం తప్పక లభ్యమవుతుంది.

చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న పరిష్కారాలూ, మరి పెద్ద పెద్ద సమస్యలకు పెద్ద పెద్ద పరిష్కారాలూ అవసరమవుతాయి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు పెద్దగా ధైర్యం అవసరం లెకపొయినా పెద్ద పెద్ద సమస్యలను మాత్రం తగిన ధైర్యస్థైర్యాలతో ఎదుర్కోవాలి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు మామూలు భౌతికపరమైన చర్యలు చాలు కానీ .. పెద్దసమస్యల పరిష్కారానికి మాత్రం ” అత్మశక్తి” చాలా, చాలా అవసరం. ఇలాంటి సమయంలో .. ఒకవేళ మీకంటే ఎక్కువ ఆత్మశక్తిని కలిగివున్న సరియైన గురువు మీకు దొరికితే మాత్రం .. పెద్ద సమస్యలకే కాకుండా అతిచిన్న సమస్యల పరిష్కారానికి కూడా వారి నుంచి సహకారాన్ని కోరవచ్చు. అయితే .. ఇక్కడ అసలు ‘సమస్య” ఎమిటంటే .. ‘ఎవ్వరికి సరియైన గురువు లేకపోవడం”. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మనం బయట ఎవర్ని పడితే వాళ్ళనే “గురువులు” అని నమ్మకుండా .. ధ్యానంద్వారా శాస్త్రీయ పద్ధతిలో మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ మన “అంతరాత్మ”నే గురువుగా ఎంచుకుని, ఆ ‘అంతరాత్మ” తోనే అనుసంధానం చెందుతూ .. ఆ “అంతరాత్మ”నుంచే సందేశాలు అందుకోవాలి. ఒకవేళ అదృష్టం బాగుండి మన అంతరాత్మకు ప్రతిరూపమైన గురువు బాహ్య ప్రపంచంలో కనుక లబిస్తే .. ఇక మనకు మన అంతరాత్మతో ఎక్కువగా పనిలేదు.

ఇలా లభించిన అసలు గురువు మన అంతరాత్మ యొక్క బాహ్యరూపమే కాబట్టి అలాంటి గురువు బోధనలను బోధనలను మనకు అర్థం అయినా, కాకపోయినా సరే మారు పలుకకుండా అమలు పరచాల్సిందే .. ఎందుకంటే గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రబోధాలే కనుక. ఇలాంటి గురువు బోధనలు మనకు .. మన సత్వర జ్ఞానోదయానికీ, మన సత్వర సమాధానాలకూ మరి మన సత్వర పరిష్కారాలకూ ఒకానొక దగ్గరి దారి మాత్రమే.

“ధ్యానం” మనలో వున్న ఆత్మశక్తిని పెంచి సమస్యలను ఎదుర్కోగలిగే సామర్థాన్నీ, మరి బుద్ధికుశలతతో సమస్యలను సావధానంగా ఎదుర్కోగలిగే స్థిరచిత్తాన్నీ ఇస్తుంది. తద్వారా మనం అందుబాటులో వున్న భౌతికపరమైన వనరులతో పాటుగా ఆత్మకు వున్నటువంటి అనంత శక్తులను కూడా కూడగలుపుకుని .. సమస్యను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. అప్పుడు గెలుపు, ఓటముల సంగతి ప్రక్కకి పెడితే “అసలు సమస్య్ పట్ల మనం ఏ మేరకు అవగాహన సాధించాం” అన్నదాని మీదే ఫలితం అన్నది ఆధారపడి వుంటుంది.

ఇక్కడ తెలుసుకోవల్సినదేమిటంటే .. ఏ గురువు కూడా వేరే ఎవరి సమస్యను కూడా తన భుజాన వేసుకోడు. అయితే ఒక గురువు సమస్యల పట్ల మనకు శాస్త్రీయదృక్పథాన్ని ఏర్పరుస్తాడు; కావలసిన ధైర్యం చెబుతాడు; అంతో, ఇంతో శక్తిపాతం కూడా చేయడానికి ఇష్టపడితే ఇష్టపడవచ్చు .. అంతే కానీ సమస్యలు మాత్రం ఎవరికి వారే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే గురువుకి కూడా తన సమస్యల “యుద్ధాలు” తనుకుంటాయి. అలాగే మన యుద్ధాలు మనవి. “జీవితం” అంటేనే .. “ఒక యుద్ధరంగం” దానికి ఆది, అంతం లేవు, అక్కడ ఎవరికి వారు ఒంటరిగా పోరాడాల్సిందే.

ఆత్మజ్ఞానం లేనివాళ్ళకు జీవితమంటే ఒక దుర్భరమైన .. మరి భీభత్సమైన”యుద్ధం” లా కనిపిస్తుంది. మరి అదే జీవితం ఒక ఆత్మజ్ఞానికి తన ఆత్మోన్నతికై ఆడే ఒక “మహాక్రీడ” లా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడి “జీవితం ఒక ఆట మాత్రమే” అన్న సంగతి మర్చిపోతామో .. ఇక అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు మనకంటే పెద్దవిగా మారి భూతాల్లా భయపడతాయి అదే మనం సరియైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆత్మజ్ఞానప్రకాశకుల్లా మారి సమస్యల పట్ల చక్కటి అవగాహనతో మెలుగుతే .. ఇక సమస్యలు అన్నీ మనకంటే చిన్న చిన్నగా మారిపోతాయి.

జీసస్ “నేను స్వర్గాధిపతియైన దేవుని కుమారుడను” అంటారు. అంటే “నేను స్వర్గ నియమాలతో కూడుకుని వున్న ఒకానొక గురువు యొక్క ఒకానొక శిష్యుణ్ణి” అని తనను తాను చెప్పుకుంటారు.

ఇక్కడ “స్వర్గం” అంటే ఆత్మ యొక్కస్థితి మరి “గురువు అంటే అలాంటి స్వర్గస్థితిలో వున్న ఒకానొక పురుషోత్తముడు “స్వర్గం” అంటే ఒక ప్రదేశం, లేదా స్థలం కాదు. “స్వర్గం అంటే అంతా ఆనందమే. ఎవరైతే తమ అంతరాత్మకు ప్రతిరూపమైన గురువుతో కలిసి సదా వుంటారో వారు స్వర్గంతో కలిసి వున్నట్లే.. లేకపోతే వారికి స్వర్గం చేజారినట్లే.

మన అంతరాత్మకు ప్రతిరూపమైన సరియైన గురువు .. స్వర్గకళను చక్కగా ఔపోసన పట్టిన స్వర్గాధిపతి కాబట్టి మనందరం కూడా జీసస్ లా .. అంటే స్వర్గాధిపతి కుమారుల్లా వుందాం. మరి గురువుతో కూడి మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం.

ప్రశ్న : “‘ధ్యానం’ లో ఏం జరుగుతుంది ?”

పత్రీజీ : ధ్యానాభ్యాస సాధనలో మన మనస్సులో క్రమక్రమంగా శూన్యస్థితి ఏర్పడినప్పుడు విశ్వం మన వైపుకు ప్రవహించడం ప్రారంభం అవుతుంది. మన శ్వాసతో మనం కూడి ఉన్నప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు ప్రత్యక్షమై తమ శక్తిని మనకు ధారపోస్తారు. మనం వాళ్ళను తలచుకోవాలని కానీ, పూజించాలని కానీ వారు కోరుకోరు కానీ .. ” స్వయంప్రకాశం అయిన మాస్టర్లుగా మనం ఎదగాలి ” అనుకుంటోన్న మనపట్ల వారు ఎంతైనా ఆనందంతో ఉంటారు. ధ్యానంలో ఏ ఆలోచనలూ లేని పసిబిడ్డలుగా మనం మారినప్పుడు .. తల్లి తన స్తన్యాన్ని బిడ్డకు అందించినట్లు ఆస్ట్రల్ మాస్టర్లు కూడా తమ శక్తిని మనకు ధారపోస్తారు.

ప్రశ్న : “కర్మయోగం గురించిన మీ ఉపన్యాసంలో ‘మన ఆత్మ స్థాయి .. ఉదా :- శైశవాత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, విముక్తాత్మ మరి పరిపూర్ణ ఆత్మ .. ని బట్టి మనం కర్మచేస్తూండాలి ‘ అని విన్నాను. నా ప్రశ్న ఏమిటంటే ‘ మన ఆత్మస్థాయిని ఎలా తెలుసుకోవాలి ? ‘” అని!

పత్రీజీ : ధ్యానం చేయడం అంటూ మొదలు పెడితే .. ఎవరి స్థాయిని .. వారే క్రమక్రమంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవిత ధ్యేయం ఏమిటో తెలియకపోతే మీరు ఒక బాలాత్మ! ధ్యానానికి ముందు ప్రతి ఆత్మ కూడా ఒక బాలాత్మ స్థాయిలోనే ఉంటుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే .. ముందు ” ధ్యానం ” అన్నది మొదలు పెట్టండి. వివరాల జోలికి వెళ్ళవద్దు. నెమ్మది నెమ్మదిగా మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు మీరే తెలుసుకుంటారు. మరి మెల్లిమెల్లిగా ఒక దాని సహాయంతో ఇంకొకటి .. ఇలా అన్ని స్థాయిలను కూడా దాటుతారు.

ప్రశ్న : ” ‘ పిరమిడ్స్ ‘ , ‘ క్రిష్టల్స్ ‘ , ‘ క్రాప్ సర్కిల్స్ ‘ .. వీటి మీద ఆధారపడడం అనేది ఒక మాస్టర్‌కు ఎంతవరకు అవసరం ?

పత్రీజీ : ఒక మాస్టర్‌కు దేని సహాయం కూడా అవసరం లేదు ! ఒక అంధునికీ, ఒక బాలునికీ, ఒక వృద్ధునికీ, ఒక రోగికీ మాత్రం రోడ్డుదాటడానికి ఇంకొకరి సహాయం తప్పనిసరిగా అవసరం. మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకుండానే రోడ్డు దాటగలం.

ప్రారంభదశలో వున్నవాళ్ళకుగానీ, ఏవైనా తీవ్రమైన సమస్యలు వున్న మాస్టర్లకుగానీ మీరు ఉదహరించినవన్నీ కొంతవరకు తప్పకుండా సహాయం చేస్తాయి. అక్కడ .. ఆ సమయంలో .. అవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ .. అజ్ఞానంతో గానీ, అహంకారంతో గానీ .. వాటిని ఉపయోగించుకోకపోతే అది వారి ‘ ఖర్మ ‘! ఎప్పుడు సహాయం తీసుకోవాలో, ఎప్పుడు స్వీయశక్తిని ఉపయోగించుకోవాలో అన్న విచక్షణాజ్ఞానాన్ని ఉపయోగించే వాడే మాస్టర్.

ఎవరైన రోడ్డు దాటడానికి సహాయం చేస్తే సహాయం తీసుకుని కృతజ్ఞతలు తెలిపినట్లే .. పిరమిడ్ శక్తి, సామూహిక ధ్యానశక్తి, పౌర్ణమి ధ్యానశక్తి, ప్రకృతిశక్తి, క్రిస్టల్‌శక్తి .. ఇలా ఏది అందుబాటులో ఉంటే దాని సహాయం తీసుకుంటూ ఆయావాటిపట్ల మనం ఎంతైనా కృతజ్ఞతతో ఉండాలి. మీరు ఒక ‘ ధ్యాని ‘ అయినా కాకపోయినా .. ఒక ‘ మాస్టర్ ‘ అయినా కాకపోయినా సహాయపడే విషయాలు అందరికీ విధిగా సహాయపడుతూనే వుంటాయి !

ప్రశ్న : “‘అహం ‘ అంటే ఏమిటి ? దానిని ఏ విధంగా గుర్తిస్తాము ?”

పత్రీజీ : మనం అందరం తెలుసుకోవలసిన ఒకానొక పరమసత్యం ఏమిటంటే .. ఈ లోకంలో ‘అజ్ఞానం ‘ అన్నది వుంది కానీ “అహంకారం” అన్నది లేనేలేదు ; లోపల, అంతరంగంలో, అందరూ స్వచ్ఛత మరి అమాయకత కలబోసిన వారే. అయితే సంఘప్రభావం వల్ల మాత్రమే వారు సమాజంలో అహంకారులుగా నటిస్తూంటారు.

మన పిరమిడ్ సిద్ధాంతాల్లో “అహంకారాన్ని కోల్పోవడం” అనే మాటను మనం ఎప్పుడూ వాడం ! కళ్ళుమూసుకుని శ్వాసను గమనిస్తూ అంతర్ముఖులమై .. మనం ఏదైనా, మనం ఎలా వున్నా .. జీవితం మనకు నేర్పే అనుభవాలను ఎరుకతో గ్రహిస్తూ వుంటే అదే పరమభాగ్యం !

ప్రశ్న : “నా గత జీవితంలోని బాధలను మరచిపోవడం ఎలా ?”

పత్రీజీ : సరిక్రొత్త స్నేహితులను చేసుకోవచ్చు గదా ?!


ప్రశ్న : “ఆత్మమూలం, ఆత్మగమ్యం .. ఒక్కటే అయితే దానికి అనేక జన్మలు, అనేక శరీరాలు ఎందుకు ?”

పత్రీజీ : ప్రతిఒక్క జన్మ కూడా ఆత్మకు లెక్కలేనన్ని అనుభవాలను అందిస్తుంది. అది మంచిదైనా, చెడ్డదైనా .. ఆ అనుభవం ఆత్మను సుసంపన్నం చేస్తుంది. చివరికి, జన్మజన్మల అనుభవసారంతో పండిపోయిన ఒకానొక ఆత్మ .. స్థితప్రజ్ఞత్వస్థితిలో ఉంటూ .. నిర్వాణ స్థితిలోని పూర్ణత్వాన్ని పొందుతుంది. అందుకే ఆత్మ అనేకానేక భౌతిక వ్యవస్థలతో, అనేకానేక భౌతిక శరీరాలను ధరిస్తూ వుంటుంది. కాబట్టి ఆత్మయొక్క గమ్యం గరిష్ట స్థాయిలో అనుభవాలే ! మరి ఆత్మయొక్క మూలం అనుభవశూన్యత్వమే ! ఒకానొక ఆత్మ .. ఆత్మగా తన ఆత్మ జీవితాన్ని ప్రారంభించినప్పుడు అది నిజంగా ఏమీ తెలియని ఒక విధమైన అమాయక, స్వచ్ఛ స్థితి !

ప్రశ్న : “ఒక్కోసారి నేను, నాకు ఇవ్వవలసినంత ప్రాధాన్యతను ఇతరులు నాకు ఇవ్వలేదని గింజుకుంటాను. అది నాకు బాధ కలిగిస్తుంది. కోపం తెప్పిస్తుంది. అక్కడ బాధ కలిగేది నాకు కాదని ఆత్మస్థితిలో నేను అర్థం చేసుకోగలను .. అయినా అది ఇంకా నన్ను బాధిస్తూనే ఉంది. నేను ఈ అహాన్ని దాటి నాలో శాంతినీ, సమత్వాన్నీ పొంది క్షమా, కరుణా గుణాలను వ్యక్తీకరించగలిగే మార్గం ఏదైనా వుందా ? అది ఋషులకు మాత్రమే సాధ్యపడే విషయమా ?”

పత్రీజీ : దయచేసి పనికిరాని మాటలను పూర్తిగా తగ్గించేసుకుని మరి ఎక్కువగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.

ప్రశ్న : “‘జ్ఞానం’ అంటే ఏమిటి ?”

పత్రీజీ : ‘ధ్యానం’ ద్వారా ముప్పై శాతం ప్రత్యక్ష జ్ఞానాన్ని మనం పొందుతాం. ‘ స్వాధ్యాయం ‘ ద్వారా ముప్పై అయిదు శాతం పరోక్ష జ్ఞానాన్నీ .. ‘ సజ్జన సాంగత్యం ‘ ద్వారా మరో ముప్పై అయిదు శాతం పరోక్ష జ్ఞానాన్నీ మనం పొందుతాం.

ఈ ప్రత్యక్షజ్ఞానం మరి పరోక్షజ్ఞానం అంతా వెరసి మనకు ముక్తిని ఇస్తుంది.

“జ్ఞానాన్ ముక్తిః” కదా !

ప్రశ్న : ” ‘జీవిత పరమార్థం’ అంటే ఏమిటి? “

పత్రీజీ : ప్రశాంతంగా .. తేలికగా .. హాయిగా అత్యంత ఉత్సాహంతో .. అపారమైన కరుణార్ధ్ర హృదయంతో .. పరిపక్వత పొందిన జ్ఞానంతో .. సంపూర్ణమైన ఎరుకతో జీవించడమే జీవితపరమార్థం. దీనిని సమర్థవంతంగా సాధించాలంటే ..

  • సాధ్యమైనంత ఎక్కువ మౌనంగా వుండటం
  • వీలైనంత హాయిగా ఉండడానికి ప్రయత్నించటం
  • జీవితోత్సాహాన్ని నిలిపివుంచే మన అంతరంగంలోని ‘స్వ-ఇచ్ఛ’లను తెలుసుకుని, వాటిని నెరవేర్చుకోవడానికి స్వయంగా జాగ్రత్త వహించటం
  • ఏ సమయంలోనైనా, ఏ విషయంలోనైనా అందరి పట్లా కరుణాతప్త హృదయంతో స్పందంచటానికి సిద్ధంగా వుండటం
  • మనకు బాహ్యంలోనూ, అంతరంలోనూ జరుగుతూన్న అన్ని విషయాల పట్ల సాధ్యమైనంత ఎక్కువగా ఎరుకతో వుండటం
  • మన లోపల, బయట నిరంతరంగా కొనసాగుతూన్న వైచిత్య్రాలన్నిటికీ సంబంధించిన జ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా పొందటానికి ప్రయత్నించటం.”

ప్రశ్న : ” ‘బంధరాహిత్యం’ అంటే ఏమిటి ? “

పత్రీజీ : “మన అవసరం, మనకు ప్రయోజకత్వం లేవని స్పష్టంగా అర్థమైన తర్వాత, అది ఎంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమైనా, సందర్భమైనా సరే మనకు మనంగా అక్కడి నుంచి వైదొలగటమే బంధరాహిత్యాన్ని పొందటం అంటే”.

ప్రశ్న : ” సరికాని ఆలోచనా విధానాలను పూర్తిగా తొలగించుకోవటం ఎలా? “

పత్రీజీ: ” ‘సరికాని ఆలోచనా విధానం’ అనడానికి బదులుగా ‘నిష్ప్రయోజనమైన ఆలోచనా విధానం’ అనటం ఇంకా సత్యానికి దగ్గరగా వుంటుంది. ఎందుకంటే అసలు ‘తప్పు’ ‘ఒప్పు’ అనేవి లేనే లేవు. ప్రతీదీ కూడా .. అయితే ఎక్కువ ప్రయోజనకరంగానూ లేదా ఇంకా కొన్ని తక్కువ ప్రయోజనకరంగానూ వున్నాయి అంతే.

“పదే పదే అప్రమేయంగా చేసే పనిని ‘అలవాటు’ అని అంటాం. ఆలోచనలకు సంబంధించిన అలాంటి అలవాట్లే మన ప్రత్యేకమైన ‘మానసిక ప్రణాళికలు’గా మన మనో మండలంలో రూపుదాల్చుతాయి. అవే కాలక్రమంలో నెమ్మదిగా ఈ స్థూలప్రపంచంలో ఆయా ఆలోచనా విధానాలకు అనుబంధిత వాస్తవాలుగా మన అనుభవంలోకి వస్తాయి. మనం చేసే ప్రతి ఆలోచన, ఒకానొక ప్రక్రియకు ప్రాథమిక స్వరూపమే. అందువల్ల అలాంటి ఆలోచనలు పునారావృతమైనప్పుడు అవి ‘ఒక నిర్దిష్టమైన మానసిక ప్రణాళిక’గా పరిణితి చెందుతాయి. అలాంటి మన మానసిక ప్రణాళికలు, ప్రకృతి నియమాలకు అనుగుణంగా స్పందిస్తే, సహజంగానే అలాంటి ప్రణాళికలు మనకెంతో ప్రయోజనకరంగా వుంటాయి. అలాకాకుండా మన ఆలోచనా విధానాలు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ధ్వనిస్తూ వుంటే అవి మనకు ఎలాంటి ప్రయోజనన్నీ చేకూర్చలేవు. అయితే అటువంటి వ్యతిరేక మనోభావాల నుంచి మనం సంపూర్ణంగా విముక్తి చెందటానికి .. నిరంతర ధ్యానం మరి సానుకూల ఆలోచనాధోరణి ఇతోధికంగా సహాయం చేస్తాయి. ఈ రెండింటితో కూడుకున్న ‘సాధన’ మొదట్లో అంత తేలికగా అనిపించకపోవచ్చు. ఆ మాటకు వస్తే మనకు క్రొత్తదైనప్పుడు అది ఏదైనా కొంత కష్టంగానే అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ‘సరియైన సాధన’ను మొదలు పెట్టటం అంటూ జరిగితే .. నిష్ప్రయోజనమైన ఆలోచనా ధోరణులన్నీ ఉత్కృష్ట ప్రయోజనం కల ఆలోచనా విధానాలతో క్రమంగా తుడిచివేయబడతాయి. ‘ధ్యానం’ మరి ‘సానుకూల ఆలోచనాధోరణి’ల సహాయంతో.. నిదానంగా అయినా ఖచ్చితంగా ఒకానొక సుస్థిరమైన పారవశ్య మానసిక స్థితి మనకు అందటం తథ్యం.”

ప్రశ్న : ” మన ‘ఎరుక’ ను ఏ విధంగా పెంపొందించుకోవాలి? “

పత్రీజీ: “మన ‘ఎరుక’ అంటే ‘ఏ విషయాన్నైనా అన్ని కోణాల్లో సంపూర్ణ చైతన్యంతో తెలసుకోవటం’ గా నిర్వచించవచ్చు. ‘ఎరుక’ కు పర్యాయపదంగా ‘చైతన్యం’ ను చెప్పవచ్చు. ‘ఎరుకతో వుండటం’, ‘పూర్తి చైతన్యంతో వ్యవహరించటం’ .. ఈ రెండూ కూడా ఒకే భావాన్ని స్ఫురింపజేస్తాయి.

“‘ఎరుక’ లేదా ‘చైతన్యమే’ మన స్వస్వరూపం. మనమే అది. ‘తత్వం అసి శ్వేతకేతు’. ‘తత్’ అంటే ‘అది’, ‘త్వం’ అంటే ‘నీవు’, ‘అసి’ అంటే ‘అయివున్నావు’ అని అర్థం. అంటే నువ్వు కేవలం ఈ స్థూలశరీరానివి కాదు, నువ్వు కేవలం ఈ ఎముకల గూడువో లేక ఇంద్రియాల సముదాయమో కాదు సుమా. మనం సాక్షాత్తూ ‘చైతన్య స్వరూపులం’ .. అదే ‘సత్యం’ ఆ ‘సత్యం’ లో స్థితం కావడమే ‘ఎరుక’.

“అందువల్ల .. ఆ ‘ఆత్మ చైతన్యాన్ని’ పెంపొందించుకోవాలి. ఆ అంతరంగిక చైతన్యంతో ఎక్కువసేపు .. సాధ్యమైనంత ఎక్కువసేపు ఉండాటానికి ప్రయత్నించాలి. మనం మన స్థూలకాయంతో సమయాన్ని ఎంత ఎక్కువగా గడిపితే, అంత ఎక్కువగా ఎముకలూ, మాంసమూ, ఇంకా ఇంద్రియాలూ .. ఇవే వృద్ధి చెందుతాయి. అలా కాకుండా మనం మన ‘స్వస్వరూపం’ తో ‘చైతన్యం’ తో ఎంత ఎక్కువ సమయం గడిపితే , అంత ఎక్కువగా మన ‘ఎరుక’ పెంపొందుతుంది. మనం ఎంత ఎక్కువగా మన ‘ఆత్మ చైతన్యం’ తో గడిపితే అంత ఎక్కువగా .. మనం మన చైతన్యానికి వున్న మహాద్భుతమైన సామర్థ్యాన్ని, దాని అనంతత్వాన్నీ, ఇంకా ఆ ఎరుక మనకు అందిస్తున్న ‘ఉత్సవ హేల’ నూ తెలుసుకోగలుగుతాం”.

ప్రశ్న : ” మన వ్యక్తిగత అవసరాలూ, మన వ్యక్తిగత బాధ్యతలూ మధ్య గల భేదం ఏమిటి? “

పత్రీజీ: ” మనిషి అనేవాడు రెండు ‘నేను’ ల కలయిక. మొదటిది ‘వ్యక్తిగితమైన నేను’ ; రెండవది ‘అందరిలోని నేను’, ప్రతి వ్యక్తీ ఈ రెండు ‘నేను’ లను సదా పరీక్షించుకోవాలి.

“ప్రతి ఒక్కరూ తమ తమ ‘వ్యక్తిగత నేను’ ను పరిరక్షించుకోవడంలో స్వార్థపూరితంగానే వ్యవహరించాలి. చిన్ని చిన్ని కోరికలు, అరుదైన సుఖాలు .. మన ‘వ్యక్తిగతమైన నేను’ ఆనందంగా జీవించి ఉండటానికి చాలా అవసరం. అయితే ఇలాంటివన్నీ తేలికగా ప్రాప్తించవు కాబట్టి ఇలాంటి వ్యక్తిగత అవసరాలు పొందటానికి తప్పనిసరిగా మన శక్తిమేరకు తీవ్రంగా కృషిచేసి తీరాలి.

దాంతో పాటుగా మన తోటివారికి కుడా మనం చిన్ని చిన్ని సహాయాలను చేయాలి. దాని ద్వారా మనం మన వ్యక్తిగత ఇచ్ఛలను నెరవేర్చుకోవటంలో వారి సహకారాన్ని కుడా పొందగలుగుతాం. ఈ మొత్తం వ్యవహారమంతా మన ‘వ్యక్తిగత బాధ్యతల’ కోవలోకే వస్తుంది.

ఇలాంటి చిన్న చిన్న బాధ్యతలతో పాటుగా, పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మనందరికీ వున్నాయి. మొత్తం మానవాళికి, మనదైన ప్రత్యేకతను సూచించే విధంగా ఏదైనా ఇవ్వగలగడం ఈ కోవలోకే వస్తుంది. ఇలాంటి ఉన్నతమైన బాధ్యతను నిర్వహించటానికి, ప్రతి ఒక్కరూ .. ఏదైనా కళలో కానీ, ఆటలో కానీ, ఒకానొక విజ్ఞానశాస్త్ర విభాగంలో కానీ విశేషమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఆయా అంశాల సహాయంతో వారిని ఆనందింపజేస్తూ .. వారిని సేవించగలగాలి

ప్రశ్న : ” నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవం భూమి మీద ప్రస్తుతం ఏ స్థితిలో వుంది? “

పత్రీజీ : ” నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవం … ప్రాపంచిక భావజాలం యొక్క రూపురేఖలను అనూహ్యంగా మార్చివేసింది. వారసత్వంగా అందించిన రకరకాల భయాలన్నీ, ఈ విప్లవం ధాటికి ఆవిరై, నింగికెగసి కనుమరుగయ్యాయి.

వేలాదిగా ఆధ్యాత్మిక యోగుల నిస్వార్థ భరితమైన కార్యక్రమాలు, భూమండల వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించబడటం వలన, భూలోకానికి వున్న బాధాతప్తభరితమైన ఋణాలు చాలావరకు ఈ సరికే తీర్చబడ్డాయి. మహోన్నతమైన యోగీశ్వరుల సంకల్ప ఫలితం వల్ల మనమంతా ఎన్నాళ్ళుగానో ఆశిస్తున్న ‘దివ్యజ్ఞానోదయం’ త్వరలోనే ఈ భూమి మీద సాక్షాత్కరింపబడి ఒకానొక చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతోంది.”

ప్రశ్న: “లంఖణం పరమౌషధం” అంటారు..”

పత్రీజీ: ‘లంఖణం ’ అంటే నిరాహారంగా ఉండడం .. లంఖణాలు మూడు రకాలు: 1. “శారీరక లంఖణం ” 2. ” వాచిక లంఖణం ” 3.” మానసిక లంఖణం “.

శారీరక లంఖణం కన్నా ‘ వాచిక లంఖణం ’ శక్తివంతమైంది మరి ఆరోగ్యదాయకమైంది ; దీనికన్నా శక్తివంతమైంది మరి విశేష ఆరోగ్యదాయకమైంది ‘ మానసిక ’ ‘ లంఖణం ’ .. అథవా ‘ ధ్యానం ’. కాబట్టి లంఖణాన్ని కేవలం భౌతిక దేహానికి మాత్రమే పరిమితం చెయ్యకుండా ‘ మౌనం ’ ద్వారా మాటలనూ .. ‘ ధ్యానం ’ ద్వారా మనస్సునూ .. శూన్యపరచుకోవడం అభ్యాసం చేస్తూ వుండాలి.

ప్రశ్న: ” తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి? “

పత్రీజీ: ప్రగతిపథగాములు అయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరి తప్పులు చేస్తూనే వుంటారు. అయితే అవి ” నడక నేర్చుకునే క్రమం ” లో దొర్లే చిన్ని చిన్ని తప్పటడుగులు మాత్రమే ! వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ .. మళ్ళీ మళ్ళీ వెంటనే క్రొత్త క్రొత్త సృజనాత్మకమైన కార్యక్రమాల్లో మునిగిపోతూండాలి. ” నేను పాపిని .. నేను పాపిని ” అని పదే పదే అనుకుంటూ ఆత్మన్యూన్యతకు గురికావడం కానీ .. ” నువ్వు పాపివి .. నువ్వు పాపివి ” అంటూ ఇతరులను నిందించడం కానీ ససేమిరా చేయరాదు. అందరి దగ్గర నుంచి కూడా పాఠాలు సదా నేర్చుకుంటూ ఉండడమే బుద్ధిమంతుల లక్షణం !

ప్రశ్న: “మా తల్లిగారు ఇటీవలే చనిపోయారు; అందుకు నాకు చాలా బాధగా వుంది .. ”

పత్రీజీ: ‘చనిపోవడం’ అన్నది కొంపలు అంటుకునే వ్యవహారం ఎంతమాత్రం కాదు ! అది ‘ఒక కొంప’ నుంచి ‘మరొక కొంప’ కు ..‘ఒక స్థానం’ నుంచి ‘మరొక స్థానం’ కు .. ‘ ఒక దేశం ’ నుంచి ‘మరొక దేశాని’ కి మారే సర్వసాధారణమైన కార్యక్రమం !

అందరూ ఎందుకు చనిపోతున్నారో మీ తల్లిగారు కూడా అందుకే చనిపోయారు ; కాబట్టి ఇప్పుడు మీరు వారు చనిపోయినందుకు బాధపడకుండా .. అసలు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారో .. మరి మీ తల్లి గారిలాగే అందరూ చనిపొయీ ఏ ఏ లోకాలకూ వెళ్ళి మళ్ళీ మళ్ళీ వస్తున్నారో .. ఆ ప్రదేసాల గురించి, మరి ఆ యా లోకాల గురించి కూలంకషంగా విచారించండి ; మరి మరణానంతర జీవితం గురించి అధ్యయనం చేయడం వెంటనే ప్రారంభించండి !

ప్రశ్న: ” ‘తడిసి మోపెడు’ అని తరచూ వింటూంటాం .. “

పత్రీజీ: ‘గుప్పెడు’ – ‘మోపుడు’ అన్నవి తెలుగుభాషలో వున్న రెండు పదాలు. ఏదైనా సరే తడవకపోతే చేతిలో పట్టుకోగలిగినట్లు ‘గుప్పుడే’ ఉండి తడిసినప్పుడు మాత్రం తలపై మోయలేనంత బరువెక్కి ‘మోపుడు’ అవుతాయి.

పుట్టుకతో మనం తెచ్చుకునే కర్మలు ఎప్పుడూ గుప్పుడే వుంటాయి ! అయితే జీవనగమనంలో మనమే వాటిని తడుపుకుని అంటే అజ్ఞానంతో పెంచుకుని ‘ మోపుడు ’ చేసుకుని బెంబేలెత్తి పోతూంటాం.

ధ్యానం అనునిత్యం చేసుకుంటూ .. మరి శారీరక బాధలను కాస్త ఓర్చుకుంటూ ఓపిక పడితే గుప్పెడు రోగాలు .. కష్టాలు .. సునాయసంగా సమిసిపోతాయి ! అలాకాకుండా .. “ఆ డాక్టర్ .. ఈ మందు” .. “ఆ దేవుడు .. ఈ మంత్రగాడు” అంటూ అసహనంతో పరుగులు పెడితే అవి తడిపి మోపుడు అవుతాయి.

ధ్యానులు, ఆత్మజ్ఞానులు అయిన వారు “కాసిని -గుప్పెడు” కష్టాలను ఓర్పుతో తేలిగ్గా అధిగమిస్తూ సదా ఆనందంగా జీవించగలుగుతారు. మయసభలో ద్రౌపది నవ్వుతో భంగపాటు చెందిన దుర్యోధనుడు ఆ విషయాన్ని అక్కడితో వదిలివేయకుండా పదే పదే ఆలోచిస్తూ .. “నాకు ఇంత అవమానమా?” .. “నేను ఇంత లోకువా?” అని ఆ విషయాన్ని తడుపుకుని తడుపుకుని మోపెడంత చేసుకుని .. మహాభారత మహాయుద్ధాన్ని సృష్టించి .. అందరి వినాశనానికి కారణభూతుడయ్యాడు !

ప్రశ్న: ” ‘ధ్యానసాధనలో ఉండే ప్రతిబంధకాలు ఏవేవి? ”

పత్రీజీ: ధ్యానసాధనలో ఉండే ప్రాథమిక ప్రతిబంధకాలు: 1. సోమరితనం.. 2. భయం.. 3.అహం “సోమరితనం”: పీకలదాకా తిని, త్రాగి పడుకోవడం .. టీవీలో వచ్చే కార్యక్రమాలను కళ్ళప్పగించేసి చూస్తూ .. ఏ కాస్త తీరిక దొరికినా పక్కింటి వాళ్ళతో నిష్ప్రయోజనకరమైన కాలక్షేపపు చెత్తకబుర్లు మాట్లాడుతూ కాలాన్ని హరించివేయడం.

“భయం” : ఎంత రోతవైనా పాత విషయాలను గట్టిగా పట్టుకుని ప్రాకులాడుతూ .. క్రొత్త విషయాలను వినడానికి కూడా భయపడడం: విన్నా ఆ క్రొత్త విషయాలను పరిశోధించడానికి వెనుకాడడం.

“అహం”: ‘దేవుడు’ .. ‘బుద్ధి’ .. ‘ఆత్మ’ అన్న విషయాల గురించి అక్షరంముక్క తెలియకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడడం .. తెలుసుకోవాల్సిన విషయాల పట్ల నిర్లక్ష్యం వహించడం.

ఈ మూడు మౌలిక ప్రతిబంధకాలు ధ్యానసాధన విషయంలోనే కాదు .. ఇంకా ఏ విషయంలోనైనా సమానంగా వర్తిస్తాయి.

ప్రశ్న: “చాలామంది జీవితాన్ని ఒక అందమైన ప్రవాహంలా ఈదలేక పోతున్నారు ఎందుచేతనో .. “

పత్రీజీ: మీ దృష్టికోణం తప్పు! ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలను హాయిగా ఆనందంగా ఈదలాడుతూనే ఉన్నారు. “వారు సరిగ్గా లేరేమో” అని మీరనుకుంటున్న సందర్భాలు వారికి సరిగ్గానే ఉన్నాయి! అందుకే ఆ యా సందర్భాలను వారు ఎరుకతోనో .. మరి కాస్త ఎరుక లేకుండానో .. అయినా “చక్కగా ఆస్వాదించుకుంటూ” అందుకు తగిన అనుభవజ్ఞాన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు!

ప్రశ్న: “ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ తమ తమ ఆత్మస్థాయులకు తగ్గట్లుగా జీవిస్తూ సహజంగానే అనుభవ జ్ఞాన పాఠాలను నేర్చుకుంటూ ఉంటే .. ఇక మనం వారికి ఇంకా ధ్యానబోధ చెయ్యాల్సిన అవసరం ఏమిటి?”

పత్రీజీ: “ధ్యాన బోధ/ధ్యాన ప్రచారం” అన్నది వాళ్ళతో పాటు మనకు కూడా అనుభవజ్ఞాన పాఠాలను నేర్చుకునే విధానాన్ని త్వరితగతం చేస్తుంది. “ధ్యాన బోధ” .. “ధ్యాన ప్రచారం” ల వలన మన స్వీయ వ్యక్తిత్వం మరింత పటిష్టమవుతుంది.

ప్రశ్న: ” మానవులలో వివిధ శక్తి స్థాయిలు ఎలా ఉంటాయి?

పత్రీజీ :భౌతిక శరీరానికి సంబంధించి తామసిక శక్తి; మనోమయ శరీరానికి సంబంధించి రాజసిక శక్తి; బుద్ధిమయ శరీరానికి సంబంధించి సాత్విక శక్తి; ఆత్మమయ శరీరానికి సంబంధించి నిర్గుణ శక్తి.

వివిధ శక్తిస్థాయిలను అనుసరించి తామసిక శక్తిస్థాయిలో ఉన్నవాళ్ళు ఒకానొక వ్యక్తి యొక్క కంటికి కనిపించే ఘనరూపంలో ఉన్న శరీరాన్నే చూడగలుగుతారు. వారు తమ కంటితో చూసిన దానినే నమ్ముతారు.

రాజసిక శక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ వ్యక్తి యొక్క ద్రవస్థితిలో ఉన్న మనస్సును చూడగలిగితే .. సాత్విక శక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు అదే వ్యక్తి యొక్క మంచిని చూడగలుగుతారు.

ఇక చిట్టచివరి నిర్గుణస్థాయిలో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తి యొక్క ఈథర్ స్థాయిలో ఉన్న ఆత్మ శక్తిని చూడగలుగుతారు.

తామసిక శక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు కేవలం తమ కంటితో చూసిన దానినే అర్థరహితంగా నమ్ముతూ .. పరిమిత శక్తిక్షేత్రంలో పనిచేస్తూ ఉంటే .. సాత్విక శక్తి స్థాయిలో ఉన్న వాళ్ళు కంటికి కనిపించిన దానిని అర్థం చేసుకుని అర్థసహితంగా పనిచేస్తూ ఉంటారు. ఇక నిర్గుణ స్థాయిలో ఉన్న వాళ్ళు .. వీటన్నింటికీ అతీతంగా అత్యంత శక్తివంతమైన ఆత్మశక్తితో పనిచేస్తూ తమ జన్మలను ధన్యం చేసుకుంటూ ఉంటారు.

ప్రశ్న: ” ‘సైన్స్’ అన్నది హేతుబద్ధమైన అంశాల మీద ఆధారపడి ఉండగా .. కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉన్న ఆధ్యాత్మికతను ‘సైన్స్’ అని ఎలా అనగలం?”

పత్రీజీ: “సైన్స్” అన్నది ప్రయోగం, పరిశోధన మరి అనుభవ జ్ఞానాలపై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే “ధ్యానం” మరి “ఆధ్యాత్మికత” అన్నవి కూడా ప్రయోగాలూ, పరిశోధనలూ మరి అనుభవ జ్ఞానాలపై ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. అందుకే భగవద్గీతలో ప్రతి ఒక్క అధ్యాయాన్నీ శ్రీకృష్ణ పరమాత్ముల వారు” బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రః” అని నిర్థారించారు.

“అందుకే కేవలం మూఢ నమ్మకాలు మరి ఆచారాల వ్యవస్థపై ఆధారపడి పనిచేసేది ఎన్నటికీ ఆధ్యాత్మికత కానేరదు” అని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం!

ప్రశ్న: “అశ్రమాలు అన్నవి నిజంగా ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడతాయా?!”

పత్రీజీ: “ఆశ్రమాలు అన్నవి భవిష్యత్తుకు మార్గనిర్దేశకాలు!! భవిష్యత్తులో సమస్త భూగ్రహం అంతా కూడా ఒకే “ఒక్క ఆశ్రమం” లా రూపుదిద్దుకోనుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత కుటుంబ జీవనం నుంచి “వసుధైక కుటుంబ జీవనం” లోకి ప్రవేశిస్తూ .. దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందనున్నారు.

ప్రశ్న: “ఒక్కోసారి ధ్యానం చేసిన తరువాత చాలా నీరసంగా మరి సత్తువ లేనట్లుగా అనిపిస్తోంది .. ఎందుచేత?!”

పత్రీజీ: మీరు గత అనేకానేక జన్మలుగా చేస్తూ వచ్చిన హింసాత్మక కర్మలకు సంబంధించిన కర్మ ఫలితాలన్నీ కూడా సూక్ష్మలోకాలలో నమోదు కాబడి ఉంటాయి. తెలిసో తెలియకో అవన్నీ మరి అనుభవించి తీరాల్సిందే కదా! అయితే .. ధ్యానం అన్నది కర్మల యొక్క తీక్షణతను ఒకింత తగ్గించి .. వాటిని హాయిగా అనుభవించే విధంగా మనల్ని మలుస్తుంది.

“ఏది జరిగినా అది మన ఆత్మ అభ్యున్నతికే” అని అవగాహన చేసుకుని ధ్యానసాధనను మరింతగా పెంచుకుంటూ పోవాలి!

ప్రశ్న: “ఆధ్యాత్మిక మార్గంలో ‘గురువు’ అంత అవసరమా?!”

పత్రీజీ: “గురువు” అన్న అంశం ఎక్కడా ముఖ్యం కాదు. అయితే సమకాలీన దృక్పథాలను కలిగి వున్న భావజాల సంపన్నులంతా ఒకరినొకరు వెతుక్కుంటూ వెళ్ళి ఒకానొక “బృందగాన సమూహం” లా మారడం ఏ రంగంలో అయినా సహజమే. ఒకే జాతి పక్షులన్నీ ఒకే గూటికి చేరుకుంటాయి కదా!

ప్రశ్న: “నేను గత రెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు మూడు సార్లు గర్భస్రావం జరిగింది. ప్రతిసారి గర్భస్రావం జరగడానికి రెండురోజుల ముందు నా కడుపులో బిడ్డ నాకు దూరం కావడం నేను చూసుకుంటున్నాను. కారణం తెలుసుకోవడానికి ఒకసారి ధ్యానంలో కూర్చోగా .. ఒకానొక జన్మలో నేను గర్భవతిని హింసిస్తూన్నట్లు మరి బాధిస్తూన్నట్లు చూసుకున్నాను. వెంటనే ఆ ఆత్మకు ధ్యానంలోనే క్షమాపణ చెప్పుకున్నాను. గతజన్మకు సంబంధించిన నా ఈ అజ్ఞానపు చర్యకు నేను ఇంకా ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి?!”

పత్రీజీ: కర్మసిద్ధాంతం అమలుపరచడంలో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు. కర్మఫలితాలను ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే!

మీరు మరిన్ని మంచి పనులు చేయండి; ధ్యానం మరి ధ్యానప్రచారం మరింత మరింతగా చేస్తూ మీ పాపకర్మను పుణ్యకర్మలతో బ్యాలెన్స్ చేసుకోండి!!

ప్రశ్న: “పిరమిడ్ శక్తికి ఆధ్యాత్మికతతో ఏమిటి సబంధం?!”

పత్రీజీ : సాధారణంగా నిర్దిష్టమైన సమాన కొలతలతో కూడిన ఏ క్షేత్రమితీయ నిర్మాణం అయినా .. అసమాన కొలతలతో నిర్మింపబడిన మామూలు నిర్మాణాలకంటే ఎక్కువ శక్తి క్షేత్రాలను కలిగి ఉంటాయి. “‘పిరమిడ్స్’ ఈ భూమి మీద ఉన్న అన్ని నిర్మాణాల కంటే కూడా అత్యంత నైపుణ్యంతో కూడిన సమాన కొలతలతో నిర్మించబడిన శక్తిక్షేత్రాలు” అని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.

ఆ శక్తిక్షేత్రంలో కూర్చుని ధ్యానం చేసినవారికి అనేకానేక అతీంద్రియ మరి సూక్ష్మలోక అనుభవాలు సులభంగా కలగడం వల్ల “‘పిరమిడ్’ అన్నది ఆధ్యాత్మిక ప్రయోగాలకు అనువైన స్థలం” అని ధ్యానయోగులు తెలియుజేస్తున్నారు.

ఇటీవల కాలంలో పిరమిడ్ శక్తితో కూడిన వాణిజ్య ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పిరమిడ్ శక్తిపై విశేషప్రయోగాలు చేస్తోన్న PSSM, ముఖ్యంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మరి ఆధ్యాత్మిక ఉన్నతికి పిరమిడ్ నిర్మాణాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది.

ప్రశ్న: “గత 8 నెలలుగా ప్రతిరోజూ రాత్రి ఆఫీసు నుంచి రాగనే నేను కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను. గతంలో ఉన్న మాంసాహారం తినడం, మద్యం సేవించడం, సిగరెట్లు త్రాగడం మరి అతిగా సినిమాలు చూడడం వంటి దురలవాట్ల నుంచి నేను క్రమంగా బయటపడ్డాను. “ఇలా చక్కటి సంస్కారాన్ని నాకు అందించిన మీరు మళ్ళీ నేను ఆ చెడు అలవాట్లకు బానిసను కాకుండా ఏవైనా సూచనలు ఇవ్వండి..”

పత్రీజీ: మీరు శాకాహారిగా మారినందుకు అభినందనలు! ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ .. PSSM ప్రచురిస్తోన్న నవీన ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన గ్రంథాలను చదువుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్!!

ప్రశ్న: “‘పనియే ప్రార్థన’ అన్న సామాజిక సంస్కృతిలోనే జన్మంతా గడిచిపోతూంటే .. ఇక నన్ను నేను తెలుసుకోగలిగే ధ్యానసాధనకూ మరి నన్ను నేను ఉద్ధరించుకునే ఆధ్యాత్మిక అభివృద్ధికీ ఇంకా టైమ్ ఎక్కడ ఉంటుంది?”

పత్రీజీ: ఈ జన్మ కాకపోతే .. మళ్ళీ ఇంకో జన్మ! ఇంకో భౌతికశరీరం.. ఇంకో ప్రాపంచిక జీవితం! అప్పుడు అసలు ఈ మాత్రం వెసులుబాటు కూడా ఉంటుందో లోదో?! ధ్యానం చేసి ఎవరి ఆత్మ స్వరూపాన్ని వారు గుర్తించుకునేంతవరకూ ఈ పరంపర అలా సాగిపోతూనే ఉంటుంది వృధాగా! కనుక “ధ్యానమే అన్నింటి కంటే పెద్ద పని” మరి “ఆ పనే అన్నింటి కంటే గొప్ప ప్రార్థన” అని తెలుసుకోండి!

ప్రశ్న: “గత 14 సంవత్సరాలుగా నేను ఏదో తెలియని భయంతో బాధ పడుతున్నాను. ఇందులోంచి బయటపడడం ఎలా?!”

పత్రీజీ: గతంలో మీరు ఎవరిపట్ల అయినా దుర్మార్గంగా మరి దురుసుగా ప్రవర్తించి ఉంటే .. ధ్యానంలో కూర్చుని వారిని ఆత్మపూర్వకంగా క్షమాపణలు అడగండి. ఒకవేళ మీ పట్ల ఎవరయినా దురుసుగా మరి దుర్మార్గంగా ప్రవర్తించి మిమ్మల్ని బాధపెట్టి ఉంటే వారిని కూడా పేరు పేరునా తలచుకుని బేషరతుగా వారిని క్షమించి వెయ్యండి.

క్రమక్రమంగా ఇతరుల పట్ల మీకు ఉన్న నకారాత్మక భావజాలం నుంచీ మీరు విముక్తి చెందుతారు.

ప్రశ్న: “మాంసాహారం తింటే బలం వస్తుందని సైన్స్ చెబుతోంది కదా ..”

పత్రీజీ: మాంసాహార సేవనం వల్ల కలిగే అనర్థాల గురించి కూడా సైన్స్ విశేషంగా వివరిస్తోంది! అంతర్జాలంలో అనేకానేక వెబ్‌సైట్‌లు ఈ విషయాన్ని అత్యంత శాస్త్రీయంగా తెలియజేస్తున్నాయి. “ఏది చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని విధిగా అనుభవించాల్సి వస్తుంది” అని ఆధ్యాత్మిక శాస్త్రం తెలియజేస్తోంది కనుక కాస్త మీ బద్ధకాన్నీ మరి మీ మూర్ఖత్వాన్నీ వదిలించుకుని సత్యం ఏదో తెలుసుకోండి!

ప్రశ్న : “పిరమిడ్ మాస్టర్ల విశేష కృషి వల్ల 2012 కల్లా ధ్యానజగత్ పూర్తి అయ్యింది అని PSSM ప్రకటించింది. ఇక పిరమిడ్ మాస్టర్ల పరిస్థితి?”

పత్రీజీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ మేటి ఆధ్యాత్మికవేత్తలుగా గుర్తించబడుతున్నారు!

ప్రశ్న: “‘ అహం’ అంటే ‘నేను’ .. ‘నాది’ .. ‘అంతా నాదే’ అనుకోవడమేనా?” పత్రీజీ: నిజానికి “అహం” అన్నది అసలు లేనే లేదు! ఉన్నదంతా అజ్ఞానమే! అమాయకత్వం మరి స్వచ్ఛత అన్న మన జన్మ సహజ లక్షాణాలు .. అజ్ఞానం మరి మూర్ఖత్వాలతో కప్పివేయబడడంతో సమాజం దృష్టిలో మనం అహంకారులుగా మభ్యపెట్టబడుతున్నాం.

అలా కాకుండా ధ్యానం ద్వారా మనం సకల అజ్ఞానాల నుంచీ మరి మూర్ఖత్వాల నుంచీ విముక్తి చెందినప్పుడు అహంకారం అన్న అపవాదులోంచి బయటపడి సత్యజ్ఞానప్రకాశులుగా వెలుగుతాం.

ప్రశ్న : “కర్మ పరంపరను అనుసరించి మనం అంతా కూడ శైశవాత్మలుగా, బాలాత్మలుగా, ప్రౌఢాత్మలుగా, విముక్తాత్మలుగా మరి పరిపూర్ణాత్మలుగా జన్మలు తీసుకుంటూ ఉంటాం అని కర్మ సిద్ధాతం తెలియజేస్తోంది, అయితే ‘మనం ప్రస్తుత జన్మలో ఏ రకంగా ఉన్నాం’ అన్నది మనకు ఎలా తెలుస్తుంది?”

పత్రీజీ: ధ్యానం చెయ్యకముందు .. అసలు తమను తాము ఆత్మస్వరూపాలుగా గుర్తించుకోక ముందు అందరూ శైశవాత్మలే! ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాక అన్నీ వరుసక్రమంలో అర్థం అవుతూనే ఉంటాయి.


ప్రశ్న: ” దివ్యజ్ఞానప్రకాశం అంటే ‘నేను’ అన్నదంతా భగవంతుడిలో కలిసిపోవడమేనా?”

పత్రీజీ: “నేను” అనే ఒకానొక నీటి చుక్కతాను సముద్రంలో ఒక భాగమని తెలుసుకుని .. సర్వసమర్పణ భావంతో వెళ్ళి సముద్రంలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోవడమే దివ్యజ్ఞాన ప్రకాశం” అని వేదాంత శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆ చిలుక పలుకులనే వల్లెవేస్తూ పండితులంతా ప్రజలను తరతరాలుగా అజ్ఞానాందకారంలోకి నెట్టేస్తున్నారు. నిజానికి “దివ్యజ్ఞానప్రకాశం” అంటే .. అంత వరకూ “నేను ఒక పరిమిత దేహాన్ని .. నేను వేరు .. భగవంతుడు వేరు” అని అజ్ఞానపు బ్రతుకు బ్రతుకుతూన్న ఒకానొక శైశవాత్మ, అజ్ఞానాత్మ .. ధ్యానం చేసి “నేను అపరిమితమైన శక్తి యుక్తులను కలిగి ఉన్న ఒకానొక అనంతమైన ఆత్మ స్వరూపాన్ని .. నేనే ఆ భగవంతుడిని” అని గుర్తించుకుని ఇక ఆ విధంగా మసలుకుంటూ ఈ సృష్టిలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకోవడమే!

ప్రశ్న: “ధ్యానం రోజువారీ జీవిత సమస్యలను కూడా పరిష్కరిస్తుందా?..”

పత్రీజీ: నిరంతర ధ్యాన సాధన మన యొక్క శక్తి లబ్ధతను పెంచి .. తడవ తడవకూ మనల్ని మరింత గొప్ప శక్తి శకలాలుగా పరిమారుస్తుంది. దాంతో మనం శారీరకంగా, మానసింగా మరి ఆత్మపరంగా కూడా మరింత మరింత దృఢంగా మారి అంతవరకూ “అమ్మో” అని బెంబేలుపడి పోయిన జీవిత సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని పొందుతాం.

“విషయం చెయ్యిదాటి పోతోంది” అని అందరూ భయపడే సందర్భాలలో కూడా మనం ప్రశాంత చిత్తంతో ఉంటూ నిబ్బరంగా పనులు చక్కబెట్టుకుంటాం. సమస్యనూ మరి ఆ సమస్యకు కారణం అయిన వారినీ కూలంకషంగా అవగాహన చేసుకుని తెలివిమంతుల్లా సమస్యనుంచి బయటపడతాం.

అన్నింటినీ మించి స్థిర చిత్తంతో సమస్య మూలాలను శోధించి అత్యంత శాస్త్రీయంగా సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకుంటాం.

బుద్ధి పూర్వకమైన కరుణా హృదయంతో సహా అనుభూతిని చెందుతూ సృష్టిలోని ఇతర జీవుల పట్ల మహత్తరమైన సామరస్య భావనతో వెలుగుతూ ఉంటాం.

ప్రశ్న: “ఎవరి వయస్సు ఎంతో .. అంతసేపు ప్రతి రోజూ ధ్యానం చెయ్యాలి అన్నారు. నా వయస్సు 40 సంవత్సరాలు. నేను ప్రతిరోజూ 40 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను కానీ నా మనస్సును మాత్రం నిలకడగా ఉంచుకోలేక పోతున్నాను. ధ్యానం చేసినంతసేపూ ఆలోచనలు వస్తూ .. పోతూనే ఉన్నాయి. చూసేవాళ్ళకు నేను ధ్యానం చేస్తున్నట్లు బయటికి కనిపించినా .. లోలోపల నేను చేసేది ధ్యానం కాదు అని నాకు అనిపిస్తోంది. కిం కర్తవ్యం?”

పత్రీజీ: అభ్యాసం కూసు విద్య కదా .. మీరు మరింతగా ధ్యాన సాధన చెయ్యండి అప్పో దీపో భవ అని మీ ధ్యానాన్నే మీరు నమ్ముకుంటూ మిమ్మల్ని మీరే ఒక బుద్ధుడిలా మలచుకోండి.

అయితే “ఇది అనేకానేక సంశయాలతో కూడిన కష్టతరమైన మార్గం” అనుకునే కంటే “ఇది శాస్త్రీయ దృక్పథంతో కూడిన సత్య మార్గం” అని భావించుకుంటే .. మీరు సులభంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు! ఎంపిక మీదే!

ప్రశ్న: “గత మూడు సంవత్సరాల నుంచి నేను శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ శుద్ధ శాకాహారిగా జీవిస్తున్నాను. అయితే నాకంటే కూడా ఆర్థికంగా మంచి స్థితిలో ఆనందంగా ఉన్నమాంసాహారులయిన నా బంధుమిత్రులు ధ్యానం గురించి వారికి చెప్పినప్పుడు నన్ను గేలిచేసి అవమానిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది ..”

పత్రీజీ: ఎవరయినా మనల్ని గేలి చేసినప్పుడు బాధపడడం సహజమే కాని .. “బేలతనం” అన్నది బుద్ధత్వపు లక్షణం ఎన్నటికీ కాజాలదు! బుద్ధుడు అన్నవాడు మానావమానాలను రెండింటినీ ఉపేక్షిస్తూ తన లక్ష్యం మీదే గురి ఉంచి క్షణక్షణం ముందుకు సాగుతూ ఉంటాడు!

ప్రశ్న: “విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించీ మరి సూక్ష్మశరీరానికి సంబంధించీ మేడమ్ బ్లవాట్‌స్కీ, డోలోరిస్ కెన్నాన్, పరమహంస యోగానంద వంటి తత్త్వవేత్తలు కొన్ని సిద్ధాంతాలను మనకు అందించారు! అవన్నీ నిజమే అంటారా లేక చిత్త భ్రమలు కావచ్చా ..”

పత్రీజీ: ముందు మీరు చక్కగా ధ్యానం చేసి మీ మనస్సును ఆవరించి ఉన్న అజ్ఞానాన్నీ మరి మూర్ఖత్వాన్నీ వదలించుకోండి. మెల్లమెల్లగా అవి మీకే తేటతెల్లం అవుతాయి.

ప్రశ్న: “గత మూడు సంవత్సరాలుగా నేను ధ్యానం చేసినప్పుడల్లా అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా నా ముందు నేను వుండి నన్ను నేను చూసుకుంటున్నాను. సూక్ష్మశరీరం అంటే అదేనా?”

పత్రీజీ: అవును! సూక్ష్మశరీరాది విశిష్ట విషయాలను గురించి థియోసోఫికల్ సొసైటీ వారు విస్తారంగా తెలియజేశారు. వారి వెబ్‌సైట్‌ని గానీ లేక చెన్నై అడయార్‌లో ఉన్న వారి ముఖ్యకార్యాలయాన్ని గానీ సంప్రదించండి.

ప్రశ్న: “మెహర్ బాబా గారి ‘గాడ్ స్పీక్స్’ అనే గ్రంథంలో ‘భగవంతుడు అయిదుగురు సద్గురువులతో కలిసి ఈ భూమి మీద అవతరించి ఉన్న భగవంతుడు ఎవరు? ఆ అయిదుగురు సద్గురువులు ఎవరు?”

పత్రీజీ: ఏదైనా ఒక గ్రంథాన్ని చదివినప్పుడు అందులో మన ఆత్మను బలోపేతం చేసే స్పష్టమైన సమాచారాన్ని మాత్రమే గ్రహించి సంశయాత్మకమైన విషయాలను తాత్కాలికంగా ఉపేక్షించాలి. ఒకే గ్రంథాన్ని పట్టుకుని వ్రేలాడకుండా అనేకానేక New Age మాస్టర్స్ అందించిన రకరకాల గ్రంథాలను కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి.

ప్రశ్న: నేను ఆత్మను అని తెలుసుకోవడం ఎలా? ఆత్మసాక్షాత్కారం పొందటం ఎలా? కర్మసిద్ధాంతాన్ని అవగతం చేసుకోవడం ఎలా?”

పత్రీజీ: నేనే ఆత్మను అని తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ధ్యానం చెయ్యాలి. కర్మసిద్ధాంతాన్ని అవగతం చేసుకుని జీవించాలంటే ధ్యానం చెయ్యాలి.

ప్రశ్న: “ఆత్మ యొక్క మూలం మరి గమ్యం రెండూ ఒక్కటే అయినప్పుడు అది మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం ఎందుకు?”

పత్రీజీ: “మూలం” మరి “గమ్యం” అన్నవి రెండూ కూడా వేరు వేరు అంశాలు! మూల స్థానంలో ఉన్న ఆత్మకు అనుభవజ్ఞానం శూన్యంగా ఉంటుంది! కనుక అది శైశవాత్మ నుంచి మొదలుకుని బాలాత్మ, యవ్వనాత్మ, ఫ్రౌఢాత్మ, వృద్ధాత్మ మరి పరిపూర్ణ ఆత్మల స్థాయిలలో ఈ భూమి మీద రకరకాల స్థాయిల జన్మలు తీసుకుంటూ రకరకాల పాఠాల ద్వారా విస్తారంగా అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. తనను తాను పరిపుష్టం చేసుకుంటూ మానవమానాలనూ, సుఖదుఃఖాదులనూ సమానంగా తీసుకోగలిగిన స్థితప్రజ్ఞత్వంలో “ఒకానొక నిర్గుణ ఆత్మ”గా విలసిల్లడమే ప్రతి ఆత్మ చేరుకోవలసిన ప్రధాన గమ్యం!

ప్రశ్న: “సత్యం తెలుసుకుని కూడా సత్య పూర్వకంగా ఎందుకు జీవించలేకపోతున్నాం?”

పత్రీజీ: సత్యం పట్ల సంపూర్ణ అవగాహన కలగాలంటే మనం ఎన్నెన్నో మానవ జన్మలు ఎత్తవలసి వుంటుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా వేలకొద్దీ మనుష్యుల్లో “సత్యాన్ని తెలుసుకోవాలి” అనుకునేవారు కొంత మందే అయితే .. అందులోనూ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు మరికొంతమందే ! అలా ప్రయత్నించి సఫలత చెందేవారు .. ఇంకా కొంతమందే !

అంతిమంగా సత్య సాక్షాత్కారాన్ని పొందినవారే సత్యపూర్వకంగా జీవిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక అద్భుత పరిణామ ప్రక్రియ. ఇందులో ఎవ్వరూ “ఎక్కువ” కాదు .. ఎవ్వరూ ” “తక్కువ” కాదు. తక్కువ జన్మల పరిమిత జ్ఞానంతో కూడిన “శైశవాత్మ” మొదలుకుని ఎక్కువ జన్మల పరిపూర్ణ జ్ఞానంతో కూడిన “వృద్ధాత్మ” వరకు ప్రతి ఒక్కరి స్థితి కూడా గొప్పదే!

ఈ సత్యాన్ని తెలుసుకుని .. మనం “నిన్నటికంటే ఈ రోజు కొద్దిగానైనా మెరుగ్గా ఉన్నామా, లేదా?” అన్న అవగాహనతో జీవించడమే .. సత్యపూర్వకమైన జీవన విధివిధానం!

ప్రశ్న: ” ‘భయం’ అన్నది ఎలా పోగొట్టు కోవాలి?”

పత్రీజీ : ఈ ప్రపంచంలో సగం మందికి “చావు” అంటే భయం .. సగం మందికి “బ్రతుకు” అంటే భయం ! సగం మందికి “సంసారం” అంటే భయం .. సగం మందికి “సన్యాసం” అంటే భయం. ఇలా “భయం” అన్నది ప్రతి ఒక్కరికీ వుంటుంది మరి అలాంటి భయాలలోంచే అనేకానేక సందేహాలు పుట్టుకొస్తూ వుంటాయి.

కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి యుద్ధం పట్ల కలిగిన భయం వలన అనేకానేక సందేహాలు పుట్టుకొచ్చాయి! అస్త్రశస్త్రాలను పడవేసి యుద్ధరంగం మధ్యలో కూర్చుని .. ఒక భీరువులా భయాన్ని నటిస్తూ లోకంలో అందరి తరపున వకాల్తా పుచ్చుకుని మరీ శ్రీకృష్ణుడిని అనేకానేక సందేహాలు అడిగి ఈ లోకానికి “భగవద్గీత” అందించబడడానికి ఏకైక కారకుడయ్యాడు.

ఇలా ఒక్కోసారి సుజ్ఞానులకు కలిగే భయం వల్ల లోకానికి ఉపకారం కూడా జరుగుతూ వుంటుంది. కనుక భయాన్ని తలచుకుని ఊరికే భయపడుతూ కూర్చోకుండా .. భయరహితులైన వారితో కలిసి తిరుగుతూ ఉండండి. మీకు మేలు జరుగుతుంది.

ప్రశ్న: “మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? !”

పత్రీజీ : ఎవ్వరూ .. ఎవ్వరినీ అర్థం చేసుకోవలసిన అవసరం లేదు! అసలు అలా “ఒకరు ఇంకొకరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం” అన్నది పరమ మూర్ఖపు చర్య!

“ఒకరు ఇంకొకరిని ఎన్నటికీ అర్థం చేసుకోజాలరు” అన్న సత్యం తెలుసుకున్న ఒకానొక ఆత్మజ్ఞాని .. ఇతరులను అర్థం చేసుకుంటూ తన సమయాన్ని వృధా చేసుకోవడానికి అవస్థలు పడదు. స్వీయ అంతరంగ పరిశీలన ద్వారా తనను తాను సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఆత్మవత్ జీవనం గడపడానికి సదా ప్రయత్నిస్తూంటాడు.

ప్రశ్న: “జంతువులను చంపితే వాటికి దుఃఖం కలుగుతుందా?”

పత్రీజీ: జంతువులకు కలగదు !! వాటిని చంపి తిన్నవారికి అపారమైన దుఃఖం కలుగుతుంది. జంతువులకు శరీరంతో పాటు సామూహిక ఆత్మ చైతన్యమే వుంటుంది! వాటికి ‘మనస్సు’ అనేది వుండదు కనుక చంపబడుతూ ఉన్నప్పుడు .. ‘బాధ’ మాత్రం వుంటుంది !

మనిషికి మాత్రం శరీరానికీ, ఆత్మకూ మధ్య అనేకానేక కర్మలతో కూడిన ‘మనస్సు’ వుంటుంది. కనుక జంతువులను చంపిన కర్మతో కూడిన “దుఃఖం” అతనికి తప్పకుండా వుంటుంది.

అందుకే “మానవ జీవితంలో దుఃఖం ఉండకూడదు” అంటే మూగజీవులను చంపడం మానెయ్యాలి!

ప్రశ్న: “చర్య (action) కు ప్రతిచర్య (reaction) ఉండవచ్చా?”

పత్రీజీ: “చర్య – ప్రతిచర్య” .. “action-reaction” అన్నవి రెండూ కూడా ప్రతి ఒక్క మనిషి జీవితంలో అత్యంత సహజంగా వుంటాయి.

అయితే ఉప్పు, కారం తినే సంసారేశ్వరులలో చర్యలకు బదులుగా “సర్వసాధారణ ప్రతిచర్యలు” ఉంటే .. ప్రాణశక్తితో వరిపుష్టం అయిన యోగీశ్వరులలో చర్యలకు బదులుగా “సృజనాత్మక ప్రతిచర్యలు” ఉంటాయి. కాబట్టి సంసారంలో ఉంటూనే ధ్యానయోగీశ్వరులులా బ్రతికితే మన జీవితం కూడా సృజనాత్మక ప్రతిచర్యలతో విశేషంగా నిండిపోయి వుంటుంది.

ప్రశ్న: “పిరమిడ్ మాస్టర్లను మీరు ఎంతో గౌరవంగా చూస్తారు. వాళ్ళంతా చాలా పర్‌ఫెక్ట్‌గా మీకు కనిపిస్తారు ! అది ఎలా సాధ్యం ? !”

పత్రీజీ: నేను ఎలా ఉంటానో .. నాతో పాటు వున్న నా ఎదుటి వారు కూడా నాకు అలాగే కనిపిస్తారు! నన్ను నేను ఎలా గౌరవించుకుంటానో నాతో వున్న ఎదుటి వారిని కూడా నేను అలాగే గౌరవిస్తాను!

ప్రశ్న: ” ‘అవధులు లేని ప్రేమ’ గురించి వివరించండి !”

పత్రీజీ: ఈ ప్రపంచంలో లేనివి రెండే రెండు : ఒకటి: “ప్రేమ” .. రెండు: “చావు” .. ఉండవలసినది ఒక్కటే .. అదే “మైత్రీతత్వం”!

“బృహదారణ్యకోపనిషత్తు” లో యాజ్ఞ్యవల్కుడు తన భార్య అయిన మైత్రేయితో “ఈ ప్రపంచంలో ప్రేమ అన్నది ఎక్కడా లేదు. ఒకానొక మగవాడు కూడా ఒకానొక స్త్రీని తన కోసమే పెళ్ళి చేసుకుంటాడు; మరి ఆ ఇద్దరూ కలిసి తమ కోసమే ఒకానొక బిడ్డకు జన్మను ఇస్తారు.

“ఇదంతా కూడా మైత్రీతత్వంతో కూడుకుని ఉంటే .. ఎక్కడా ఒకరిపై ఒకరికి పెత్తనాలు ఉండవు. ఒకరితో ఒకరు హాయిగా జీవిస్తూ ఒకరి నుంచి ఒకరు సదా నేర్చుకోవడమే వుంటుంది!” అని చెబుతాడు.

ప్రశ్న: ” ‘అజ్ఞానం’ మరి సుజ్ఞానం’ ల మధ్య బేధం ఎలా తెలుసుకోవటం?”

పత్రీజీ: ఒకానొక వస్తువును గురించిన యధార్థం మనకు తెలిసి ఉండడం “సుజ్ఞానం”! ఆ వస్తువును గురించిన యధార్థం మనకు తెలియకపోవడం “అజ్ఞానం”.

సుజ్ఞానం వల్ల మనకు దుఃఖం నుంచి విముక్తి లభిస్తే .. అజ్ఞానం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. అందుకే “లేనిది కోరరాదు .. ఉన్నది కాదనరాదు వస్తూంటే వస్తుందని సంబరపడరాదు పోతూంటే పోతుందని బాధపడరాదు” … అన్నారు శ్రీ సదానందయోగి గారు.

వారు చెప్పినట్లుగానే నేను జీవితం యొక్క యథార్థాన్ని తెలుసుకుని సుజ్ఞానపూర్వకమైన అవగాహనతో జీవిస్తూ హాయిగా ఉన్నాను.

ప్రశ్న: “ద్వేషాన్ని ఎలా పోగొట్టుకోవాలి?”

పత్రీజీ: ఈ ప్రపంచంలో రకరకాల సంఘాలు ఉన్నాయి. పేకాట ఆడాలంటే “పేకాట సంఘం” లో చేరాలి; త్రాగుబోతు కావాలంటే “త్రాగుబోతుల సంఘం” లో చేరాలి! ధ్యానం నేర్చుకోవాలంటే “ద్యానుల సంఘం” లో చేరాలి! ఒక బుద్ధుడిలా కావాలంటే “బుద్ధుళ్ళ సంఘం” లో చేరాలి! అలాగే ద్వేషరహితులుగా కావాలంటే “ద్వేష రహితుల సంఘం” లో చేరాలి!

కనుక ద్వేషరహితులుగా ఉన్నవారి సంఘంలో చేరి వారితో కలిసి తిరుగుతూ ఉంటే లోపల ఉన్న ద్వేషభావాలన్నీ క్రమక్రమంగా అత్యంత సహజంగానే పోతాయి!

ప్రశ్న: “నిజమైన స్వేచ్ఛ ఎలా ఉండాలి?”

పత్రీజీ: పరీక్ష హలులో కూర్చుని పరీక్ష వ్రాస్తున్న ఒకానొక విద్యార్థి .. “నాకు స్వేచ్ఛ కావాలి” అనుకుని పరీక్ష మధ్యలో నుంచి లేచి బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ ‘స్వేచ్ఛ’ అతని అభివృద్ధికి ప్రతిబంధకం అవుతుంది.

సంవత్సరం పాటు కష్టపడి చదివి .. ఆ కాస్త పరీక్ష వ్రాసి అందులో ఉత్తీర్ణుడయితే అది అతడికే లాభం! ఇంతలోనే “నాకు స్వేచ్ఛ లేదు” అని ఆక్రోశిస్తే అతడికి సంవత్సరం శ్రమ, డబ్బు అంతా వృధా అయిపోతుంది.

అలాగే మనం కూడా అనెకానేక నక్షత్రలోకాలలో కొన్ని యుగాలు గడిపి ఎంతో సమాచారాన్ని సేకరించుకుని దానిని అనుభవ జ్ఞానంలా మలచుకోవడానికి ఈ “భూమి” అనే “పరీక్ష హాలు”లోకి వచ్చాం!

ఇక్కడి రూల్స్ .. రెగ్యులేషన్స్ అన్నీ అక్కడే క్షుణ్ణంగా తెలుసుకునే వచ్చాం! అయినా “జీవితం” అనే క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే దానిని పూర్తి చేయకుండా “నాకు స్వేఛ్ఛ కావాలి” అంటూ ఆక్రోశించడం మరి పరీక్ష మధ్యలోంచి లేచి బయటికి రావడం “మూర్ఖత్వం” అనిపించుకుంటుంది.

పరీక్ష హాలు లోనే కూర్చుని ఒక్కొక్క ప్రశ్నకూ తన వద్ద వున్న జ్ఞానంతో చక్కగా “సమాధానం” వ్రాస్తూ .. అలా సమాధానం వ్రాస్తూ .. అలా సమాధానం వ్రాస్తూ ఉన్నప్పుడు పొందే స్వేచ్ఛను ఒక్కొక్క కోణంలో అనుభవిస్తూ ఉండడమే ఉత్తమ విద్యార్థి లక్షణం!

ప్రశ్న: “కర్మలు చేస్తాం సరే .. కర్మఫలితాలను ఎలా గుర్తించాలి?”

పత్రీజీ: మనకు మన శరీరం గురించి తెలుసు .. అలాగే మన శరీరాన్ని వెన్నంటి వస్తూన్న ‘నీడ’ ను గురించి కూడా తెలుసు. ఒక్కోసారి ‘నీడ’ మన వెనుక వుంటుంది .. ఒక్కోసారి ముందు వుంటుంది .. ఒక్కోసారి మనకంటే పెద్దగా వుంటుంది .. మరి ఒక్కోసారి అది మనకంటే చాలా చిన్నదిగా అయిపోతుంది.

మన శరీరాన్ని వెన్నంటి వచ్చే ‘నీడ’ లాగే “కర్మ ఫలితాలు” అన్నవి కూడా మనం చేసే రకరకాల కర్మల రూపంలో ‘నీడ’ లలా వెన్నంటే వుంటాయి. సాధారణంగా మనం మన నీడను పట్టించుకోం .. మనం పట్టించుకోకపోయినా .. ఎప్పుడు, ఎక్కడ, ఏ మేరకు మనల్ని ప్రభావితం చేయాలో అక్కడ, అప్పుడు ఆ మేరకు అవి మనల్ని ప్రభావితం కర్మఫలితాలను కూడా ఎంతమాత్రం పట్టించుకునే అవసరం లేదు.

ఇదంతా కూడా “అవగాహన” చేసుకుని ఆత్మ చైతన్యవు ఎరుకతో జ్ఞానపూర్వకంగా జీవించినప్పుడే కర్మలూ బాగుంటాయి, పరంపరగా కర్మ ఫలితాలూ బాగుంటాయి ! వెరసి జీవితమంతా ఆనందదాయకంగా ఉంటుంది!!

ప్రశ్న: “వ్యాధులు ఎలా తగ్గుతాయి??”

పత్రీజీ: పూర్వజన్మల పాపాలే .. ఈ జన్మలో వ్యాధులు. ధ్యాన – జ్ఞాన సాధనలతో ఆ పాపాలఫలితాలను పూర్తిగా తుడిచివేయకపోతే వ్యాధుల నుంచి బయటపడడం కల్ల! జీవిత గమనంలో మనం నేర్చుకున్న అనుభవ జ్ఞానపాఠాల తాలూకు గాయాలే మనల్ని వ్యాధుల నుంచి సంపూర్ణంగా విముక్తి చెందిస్తాయే కానీ .. ఏ మందో .. ఏ మాకో కాదు!

ప్రశ్న: “మా తల్లిగారు ఇటీవలే చనిపోయారు, అందుకు నాకు చాలా బాధగా వుంది ..

” పత్రీజీ: నిజానికి ‘చనిపోవడం’ అన్నది కొంపలు అంటుకునే వ్యవహారం ఎంతమాత్రం కాదు! అది ‘ఒక కొంప’ నుంచి ‘మరొక కొంప’ కూ .. ‘ఒక స్థానం’ నుంచి మరొక స్థానం’ కూ .. ‘ఒక దేశం’ నుంచి ‘మరొక దేశానికీ’ మారే సర్వసాధారణమైన కార్యక్రమం!

అందరూ ఎందుకు చనిపోతున్నారో మీ తల్లిగారు కూడా అందుకే చనిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు వారు చనిపోయినందుకు బాధపడకుండా .. .. అసలు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారో .. మరి మీ తల్లి గారిలాగే అందరూ చనిపోయి ఏ ఏ లోకాలకూ వెళ్ళి మళ్ళీ మళ్ళీ భూలోకానికి తిరిగి వస్తున్నారో .. ఆయా ప్రదేశాల గురించీ, మరి ఆ యా లోకాల గురించీ కూలంకషంగా విచారించండి.

“మరణానంతర జీవితం” గురించి అధ్యయనం చేయడం వెంటనే ప్రారంభించండి!

ప్రశ్న: “లంఖణం పరమౌషధం” అంటారు .. ”

పత్రీజీ : ‘లంఖణం’ అంటే నిరాహారంగా ఉండడం .. లంఖణాలు మూడురకాలు : 1. “శారీరక లంఖణం” 2. “వాచిక లంఖణం” 3. “మానసిక లంఖణం”

శారీరక లంఖణం కన్నా “వాచిక లంఖణం” శక్తివంతమైనది మరి ఆరోగ్యదాయకమైనది; దీనికన్నా శక్తివంతమైనది మరి విశేష ఆరోగ్యదాయకమైనది “మానసిక లంఖణం” .. అంటే “ధ్యానం”. కాబట్టి లంఖణాన్ని కేవలం భౌతిక దేహానికి మాత్రమే పరిమితం చెయ్యకుండా ‘మౌనం’ ద్వారా మాటలనూ .. ‘ధ్యానం’ ద్వారా మనస్సునూ .. శూన్యపరచుకుంటూ అభ్యాసం చెయ్యాలి. అప్పుడే మరి ఆ లంఖణం “పరమౌషధం” అవుతుంది.

ప్రశ్న: “ప్రార్థన కంటే ధ్యానం గొప్పదా?” ..

పత్రీజీ: ఒకానొక జీవిత ప్రయాణంలో “ప్రార్థన” అన్నది .. “ఔట్‌పోస్ట్” లాంటిది అయితే .. “ధ్యానం” అన్నది “హెడ్‌క్వార్టర్స్” లాంటిది.

మన ప్రయాణం ఎప్పుడూ ఔట్‌పోస్ట్ దగ్గరే ఆగిపోకూడదు కదా!

ప్రశ్న: “తడిసి మోపెడు’ అని తరచూ వింటూంటాం .. ”

పత్రీజీ : ‘గుప్పెడు’ – ‘మోపెడు’ అన్నవి తెలుగు భాషలో వున్న రెండు చక్కటి పదాలు.

ఏదైనా సరే తడవకపోతే చేతిలో పట్టుకోగలిగినట్లు ‘గుప్పెడే’ ఉంటుంది. తడిసినప్పుడు మాత్రం తలపై మోయలేనంత బరువెక్కి ‘మోపెడు’ అవుతుంది. పుట్టుకతో మనం తెచ్చుకునే కర్మలు ఎప్పుడూ గుప్పెడే వుంటాయి! అయితే జీవనగమనంలో మనమే వాటిని తడుపుకుని అంటే అజ్ఞానంతో బరువు పెంచుకుని మరి వాటిని ‘మోపెడు’ చేసుకుని బెంబేలెత్తి పోతూవుంటాం!

“మయసభ” లో ద్రౌపది నవ్వుతో భంగపాటు చెందిన దుర్యోధనుడు ఆ విషయాన్ని అక్కడితో వదిలివేయకుండా పదే పదే ఆలోచిస్తూ .. “రారాజైన నాకు ఇంతటి అవమానమా?” .. “నేను ఇంత లోకువా?” అని ఆ విషయాన్ని తడుపుకుని .. తడుపుకుని మోపెడంత చేసుకుని .. మహాభారత మహాయుద్ధాన్ని సృష్టించి .. అందరి వినాశనానికి కారణభూతుడయ్యాడు!

కాబట్టి అనునిత్యం ధ్యానం చేసుకుంటూ .. మరి శారీరక భాధలను కాస్త ఓర్చుకుంటూ ఓపిక పడితే గుప్పెడు రోగాలు .. గుప్పెడు కష్టాలు .. దూదిపింజెల్లా సమసిపోతాయి!

“ఆ డాక్టర్” .. “ఈ మందు” .. ” ఆ దేవుడు .. ఈ మంత్రగాడు” అంటూ అసహనంతో అటూ ఇటూ పరుగులు పెడితే అవి కాస్తా “తడిసి మోపెడు” అవుతాయి.

ధ్యానులు, ఆత్మజ్ఞానులు అయిన వారు ఆ “కాసిన్ని గుప్పెడు” కష్టాలను ఓర్పుతో తేలిగ్గా అధిగమిస్తూ సదా ఆనందంగా జీవించగలుగుతారు.

ప్రశ్న : ” మాంసాహారం తింటే .. దారుణమైన తిప్పలు తప్పవు అంటున్నారు ! మాంసం తినేవారి ఇంట పుట్టిన ఒక చిన్న బిడ్డకు .. తల్లిదండ్రులే దానిని అలవాటు చేసి మరీ పెడతారు. ఆ చిన్న బాబుకు ఇలా శిక్ష పడడం న్యాయమా?!”

పత్రీజీ: న్యాయం కాదు! అందుకే ఆ చిన్ని బాబుకు పడాల్సిన శిక్ష కూడా కన్నవారికి బదిలీ అయ్యి .. అది వారి పాలిట ఇంకా బలమైన పాపకర్మగా రూపుదిద్దుకుంటుంది.

అయితే ఆ చిన్నబాబు పెరిగి పెద్దయ్యాక మాత్రం ‘అది పాపపు కూడు’ అన్న జ్ఞానాన్ని పొంది కూడా తింటే అది అతడి స్వంతపాపకర్మగా రూపుదిద్దుకుంటుంది. అందుకే తల్లిద్దండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు ఆత్మజ్ఞానాన్నీ మరి శాకాహార ప్రాముఖ్యతను బోధించి .. వారిని పాపకూపంలో పడకుండా కాపాడాలి. అదే పిల్లల పట్ల వారి మౌలిక బాధ్యత!

ప్రశ్న: ” ‘లాజిక్’ కూ ‘రీజనింగ్’ కూ మధ్య ఉన్న తేడా?”

పత్రీజీ: “లాజిక్” అన్నది అప్పటి వర్తమాన సంభాషణకు సంబంధించింది.

“వాక్చాత్యురం” మరి “సంభాషణా శక్తి” ని కలిగిన వారు తమ తమ జిమ్మిక్కులను ఉపయోగించి అక్కడ ఉన్న పరిస్థితిని తాత్కాలికంగా తమకు అనుకూలంగా మలచుకోవడమే .. “లాజిక్”.

“శాశ్వతసత్యాన్ని” .. చక్కటి శాస్త్రీయ పరిజ్ఞానంతో అందరికీ తగినట్లుగా చూపించగలిగే ప్రజ్ఞనే “రీజనింగ్” అంటాం.

ప్రశ్న: “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో కొంతకాలం ఉండి .. ఏవో కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయి .. మళ్ళీ ఇదే గూటికి చేరుకునే వారి గురించి?” పత్రీజీ: ఇక్కడ ఉన్నంత కాలం పిరమిడ్ సంస్థకు వారు అందించిన ప్రాపంచిక మరి ఆధ్యాత్మిక ఉపకారాలకు గుర్తింపు తప్పక ఉంటుంది.

అయితే .. ‘వాళ్ళు విడిగా ఉంటూ కూడా విశ్వకల్యాణానికి కారకులవుతున్నారు’ అని తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది!

మళ్ళీ సంస్థలోకి తిరిగి వచ్చాక మాత్రం అంతకు ముందు ఉన్న స్థానాన్ని తిరిగి పొందడానికి వాళ్ళు మరి వేచి ఉండాలి. ఎందుకంటే .. అప్పటికే ‘క్యూ’ లో వెనుక ఉన్నవాళ్ళంతా సహజంగానే ముందుకు వచ్చేస్తారు! ఇది ప్రకృతి ఏర్పరచిన నియమం!!

ప్రశ్న: ” లోకకల్యాణం గురించి చిత్తశుద్ధితో కార్యక్రమాలను చేపడుతూ ఉంటే విశ్వాత్మ మనకు కుటుంబపరంగా సహాయం చేస్తుందా?”

పత్రీజీ: నిస్సందేహంగా చేస్తుంది ! మనం అంతా కూడా ఆత్మస్వరూపులమే కాబట్టి .. విశ్వకల్యాణం కోసం మనం మనకు ఇవ్వబడిన పనులను చేపట్టినప్పుడు .. మూల విరాట్‌స్వరూపమైన మన విశ్వాత్మ మనల్ని ప్రకృతితో అనుసంధానిస్తుంది.

మన దేహానికీ, మనస్సుకూ, బుద్ధికీ మరి ఆత్మకూ ఎనలేని .. అంటే మనకు మనం కూడా చేసుకోలేనంత మేలు చేస్తూ మనల్ని సదా ఆనందస్వరూపుల్లా స్థిరంగా ఉంచుతుంది.

ప్రశ్న: “కొంతమంది .. గురువులను వారి అభిముఖంగా పొగుడుతూనే .. తెరవెనుక మరోలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారి ‘ద్విపాత్రాభినయనం’ గురువులకు తెలుస్తూ ఉంటుందా?”

పత్రీజీ: ఖచ్చితంగా తెలుస్తుంది! ఎదుటివారి హృదయ శుద్ధత, మనోనిర్మలత మరి నిజాయితీ వారి కదలికలలోనే తెలిసిపోతూ ఉంటుంది; వారి అమాయకత్వానికీ, వెర్రితనానికీ గురువులు నవ్వుకుంటూ ఉంటారు! అయితే ఒకానొక డాక్టర్ .. ఒకానొక రోగి యొక్క శరీరంలోని పాడైపోయిన భాగాలను శస్త్రచికిత్స సమయంలో తీసి బయటపడవేసి రోగిని కాపాడినట్లు .. గురువులు కూడా సమయం, సందర్భం వచ్చినప్పుడు తమ చూపులతో, మాటలతో లేదా తమ చేష్టలతో వారిలోని అజ్ఞానాన్ని దూరం చేసి వారిని సరిచేస్తూ ఉంటారు.”

ప్రశ్న: “సార్! మీరు గొప్ప అవతారంగా అందరూ భావిస్తున్నారు!”

పత్రీజీ: “అవతారం” అంటే ఒకానొక ఉత్కృష్ఠమైన లక్ష్యాన్ని ఈ భూమిమీద సాక్షాత్కరింపజేయడానికి పరిపూర్ణంగా దిగి రావడం! మీ దృష్టిలో నేను ఒక అవతారాన్ని అయితే .. నా దృష్టిలో మీరు అందరూ కూడా మీ మీ స్థాయిలలో పరిపూర్ణంగా దిగి వచ్చిన అవతారాలే!!

ప్రశ్న: “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఇలా దేశవిదేశాలలో విస్తరిస్తుందనీ .. ఇంత పెద్దదవుతుందనీ ప్రారంభంలో మీరు ఊహించారా?!”

పత్రీజీ: “ఊహించలేదు” అంటే తప్పవుతుంది ! “ఊహించాను” అంటే కూడా తప్పవుతుంది.

ఎందుకంటే నేను ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాను; మరి వర్తమానంలో ఉన్న పనిని ఆనందంగా చేస్తూపోతాను.

కాకపోతే 2000 సంవత్సరం తరువాత “2004 – ధ్యానాంధ్రప్రదేశ్” .. “2008-ధ్యాన భారత్” .. “2012- ధ్యాన జగత్” .. “2016 -పిరమిడ్ జగత్” మరి “2020-శాకాహార జగత్” పూర్తిచెయ్యాలని ఒక నియమబద్ధమైన ప్రణాళిక మాత్రం వేసుకున్నాను. దాంతో ఆ యా లక్ష్యాల పట్ల ప్రతి ఒక్కరికీ ఒక “సామూహిక స్ఫూర్తి” ఏర్పడి అందరూ విశేష కృషిచేయడం ప్రారంభం అయ్యింది.

ఈ అద్భుతమంతా ఏ ఒక్కరి కృషియో కాదు. వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఆ యా సమయాలలో, ఆ యా సందర్భాలలో, ఆ యా ప్రదేశాలలో, ఆ యా అవసరాలకు తగ్గట్లు స్పందించిన ఒకానొక సరిక్రొత్త గొప్ప ఆధ్యాత్మిక విప్లవం!

ప్రశ్న: ” PSSM లోకి వచ్చిన వాళ్ళు వెంటనే క్రియాశీలక కార్యకర్తలుగా ధ్యాన ప్రచారం చేస్తూంటారు. ఇది ఎలా సంభవం?!”

పత్రీజీ: PSSM లోకి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి రోజే సరియైన ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు.

ఇది ఇంత సరళమనీ .. ఇంతకన్నా ఇంకా ఏమీ చెయ్యలేమనీ కూడా తెలుసుకుంటారు!

తెలుసుకున్న తరువాత .. ఇక పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచీ తమను వేధీస్తూన్న సందేహాలకు సమాధానాలూ మరి తాము పరిశోధిస్తూన్న ప్రశ్నలకు అవగాహనలూ ఆ ఒక్కరోజులేనే పొందేస్తారు. దాంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోతుంది!!

అలా ఆత్మానందంతో చిందులేసే వాళ్ళకు “ధ్యాన ప్రచారం చెయ్యవయ్యా .. ” అని ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పఖ్ఖరలేదు. ఎవరు చెప్పకపోయినా వాళ్ళు మాత్రం ఆగరు! ఒక్క దగ్గర కూర్చోకుండా వెళ్ళి అందరికీ ధ్యానం నేర్పిస్తూ తాము పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని ఆరాటపడుతూంటారు! ఆనందం యొక్క లక్షణం వ్యాపకత్వమే కదా!

ప్రశ్న: “ధ్యానప్రచారం కోసం ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇలా బస్సుల్లో, కార్లల్లో, రైళ్ళల్లో మరి విమానాలలో నిర్విరామంగా ఎలా ప్రయాణాలు చెయ్యగలుగుతున్నారు? మీకు అలసట రాదా?!”

పత్రీజీ: నేను ఏ రోజుకారోజే జివిస్తాను! నా టార్గెట్ ఎప్పుడూ 24 గంటలే! రోజుకు ఇరవైనాలుగు గంటలలో నేను ఎంతగా పని చెయ్యగలనో అంతగా చేస్తూనే ఉంటాను.

మిగతా ప్రాపంచిక వ్యాపారాలూ, వ్యవహారాలూ వేరు. అక్కడ మనం పని చేసేకొద్దీ శక్తిని కోల్పోతూంటాం! కనుక తొందరగా అలసట వచ్చేస్తుంది. కానీ ధ్యానంలో, ఆధ్యాత్మికమైన ధ్యానప్రచారంలో మాత్రం అలా కాదు! ఇక్కడ మనం ఎంతగా పని చేస్తూంటే అంతగా విశేషమైన శక్తిని పొందుతూ ఉంటాం కనుక అలసిపోయే ప్రసక్తే ఉండదు.

ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కు కూడా ఈ కిటుకు తెలుసు ! అందుకే నాతో పాటే వాళ్ళు వర్తమానంలో జీవిస్తూ ఆనందంగా పని చేస్తూంటారు .. మరింత మరింత శక్తివంతం అవుతూనే ఉంటారు.

ప్రశ్న: “మీకు కూడా సమస్యలూ, సవాళ్ళూ ఉంటాయా? ”

పత్రీజీ: సమస్యలూ, సవాళ్ళూ అన్నవి ఈ భూమి మీద పుట్టిన ఎవరికయినా ఉంటాయి. మనకు మరీ ఎక్కువగా ఉంటాయి! ఎందుకంటే మనం విగ్రహారాధనలకూ, మూఢభక్తి సాంప్రదాయాలకూ, మూఢ నమ్మకాలకూ, వ్యర్థ కర్మకాండలకూ .. మరి మాంసాహార సేవనాలకూ .. వ్యతిరేకంగా ప్రజలను జాగృత పరుస్తూ ఉంటాం.

దాంతో ప్రజల అమాయకత్వాన్నీ, అజ్ఞానాన్నీ ఆధారంగా చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ తాత్కాలిక లాభాలను పొందుతూన్న వాళ్ళంతా కూడా మనమేదో తమ పొట్టలు కొడుతున్నామనుకుని పొరబడి మనపై కోపగించుకుంటూ ఉంటారు.

ఇలాంటివి ఎన్నో సార్లు .. ఎన్నో చోట్ల రకరకాలుగా జరిగాయి. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఇవన్నీ జరగడం సహజమే! జరగకపోతేనే అసహజం!

ఏసుప్రభువు కయితే ఏకంగా మేకులే కొట్టి శిలువవేశారు, స్వామీ దయానంద సరస్వతి కి గాజుపొడిని నీళ్ళలో కలిపి త్రాగించారు. మరి ఓషో ని ఆర్సెనిక్ విషం ఇచ్చి చంపారు. ఇవన్నీ సహజమే! అలా జరిగిపోతూనే ఉంటాయి!!

ప్రశ్న: “అహింస-శాకాహారం గురించి మీరు చాలా పట్టుదలగా ప్రచారం చేస్తారు.. ఎందుకు?!”

పత్రీజీ: ఈ సృష్టిలో ఉన్న కోడి, మేక, గొర్రె, కుందేలు వంటి సాధుజంతువులు అన్నీ కూడా నిస్సహాయజీవులు! అవి కూడా మనలాగే ఈ భుమి మీద పుట్టి మనతో పాటే పరిణామం చెందుతోన్న మన సోదర ఆత్మ స్వరూపాలు! “వాటిని చంపుకు తినడం ” అన్నది మానవత్వం ఎంత మాత్రం కాదు కనుక నేను వాటి కోసం పోరాటం చేస్తున్నాను. నోరులేని ఆ నిస్సహాయ జివుల హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాను.

ఈ ప్రపంచం అంతా “అహింసా జగత్” గా మారేంత వరకూ .. ఈ భూమి మీద ప్రజలందరూ శాకాహారులుగా అయ్యేంత వరకూ .. మరి ఈ జగతిలో ప్రతి జంతువూ, ప్రతి పక్షీ, ప్రతి చేపా మనలాగానే స్వేచ్ఛగా, హాయిగా జీవించేంత వరకూ నేను పోరాడుతూనే ఉంటాను!

ప్రశ్న: “చాలా మంది ‘నేను పడుతూన్న కష్టాన్ని ఇతరుల అర్థం చేసుకుంటే బాగుండు’ అనుకుని బాధలుపడుతూ ఉంటారు ..”

పత్రీజీ: ఎవరికయితే తాము చేసే పనిమీద తమకే స్పష్టత లేదో వారు “ఇతరులు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు” అని వాపోతారు! తమ మీద తాము జాలిపడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడూ “ఇతరుల దృష్టికోణం లో నేనేంటి? ” అని ఆలోచిస్తూ ఇతరులను సంతృప్తిపరచడానికే కష్టపడుతూ ఉంటారు!

కానీ తాము చేసే పనిపట్ల సంపూర్ణమైన స్పష్టతతో ఉన్నవారికి ఎవ్వరి జాలీ అఖ్ఖరలేదు. మరి వారిని ఎవ్వరూ అర్థం చేసుకోవలసిన పని లేదు. వారేం చెయ్యాలని అనుకుంటారో అది చేస్తూనే ఉంటారు. అదే వారి ఆత్మవిశ్వాసం !!

ప్రశ్న: ” ఈ భూమి మీద ప్రతి ఒక్కరికీ .. ‘ప్రత్యేకమైన లక్ష్యాలు ‘మరి’ సాధారణ లక్ష్యాలు’ అన్నవి వేరువేరుగా ఉంటాయా?!”

పత్రీజీ: ప్రతి ఒక్కరి జీవితానికి కూడా “జీవాత్మ” గా “ఒకానొక ప్రత్యేకమైన లక్ష్యం” మరి “సర్వాత్మ” గా “ఒకానొక సర్వసాధారణ లక్ష్యం” తప్పకుండా ఉంటాయి.

ఎప్పుడయితే మనం సర్వాత్మలుగా .. నలుగురికీ క్షేమదాయకమైన .. “సర్వసాధారణ లక్ష్యం” కోసం .. పది మందితో కలిసి పరస్పర సహకార ప్రవృత్తితో కూడుకుని పరిశ్రమిస్తూ ఉంటామో .. అప్పుడు జీవాత్మగా జన్మ తీసుకున్న మన ప్రత్యేకమైన లక్ష్యం కూడా దానికదే నెరవేర్చబడుతూ ఉంటుంది. అంటే లోకకల్యాణంతో పాటే మన స్వీయకల్యాణం కూడా జరిగిపోతూ ఉంటుంది.

ప్రశ్న: ” ‘ఆత్మపిపాస’ అంటే?”

పత్రీజీ: ఈ భూమి మీద మనం భౌతిక శరీరంతో ఉన్నన్ని రోజులు మనకు తిండి, నిద్ర, మైధునం వంటి శారీరక అవసరాల పట్ల ‘శారీరక పిపాస’ ఉంటుంది. శరీరం కొద్దిరోజులే ఉంటుంది కనుక దాని అవసరాల పిపాస కూడా తాత్కాలికమే !

కానీ శరీరం ఉన్నప్పుడూ, దానిని వదిలివేసిన తరువాతా .. మళ్ళీ శరీరాన్ని ధరించేంతవరకూ .. మరి తిరిగి క్రొత్త శరీరాన్ని ధరించాక కూడా ఆ శరీరంలో ఉండే ఆత్మకు “ఆత్మశక్తి” మరి “అనుభవజ్ఞానం” వంటి తప్పనిసరి అవసరాల పట్ల పిపాస ఉంటుంది.

“ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి; ఎంత చుసినా ఇంకా చూడాలి; ఎంత విన్నా .. ఇంకా వినాలి; ఎంత అనుభవం పొందినా .. ఇంకా పొందాలి; ఎంత సేవ చేసినా .. ఇంకా చెయ్యాలి” అన్న ఈ ‘ఆత్మ పిపాస’ ఎప్పటికీ తరిగేది కాదు కనుక ఆత్మ యొక్క అవసరాల పిపాస శాశ్వతమైనది.

ధ్యానం ఒక్కటే ఈ సకల పిపాసలను తీర్చి .. శారీరకపరంగా ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది .. మరి ఆత్మపరంగా ఆత్మ యొక్క బహుముఖ ప్రజ్ఞతో కూడిన సర్వవ్యాపక తత్వాన్ని మనకు అవగాహనకు తెస్తుంది.

ప్రశ్న: “మీకు ఏవైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?”

పత్రీజీ: నేను చాలా, చాలా సాధారణమైన వ్యక్తిని. నా దగ్గర ఉన్నవల్లా “సత్యం యొక్క శక్తి” .. “సకల ప్రాణికోటి పట్ల సహా అనుభూతితో కూడిన భుతదయ యొక్క శక్తి” .. “నిరాడంబరత యొక్క శక్తి ” .. ” సమయస్ఫూర్తి యొక్క శక్తి” .. మరి “ప్రతి ఒక్క విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో వీక్షించేశక్తి”; వీటిని మించి మరే ఇతర మానవాతీత శక్తులు నా దగ్గర ఏమీ లేవు. వాటి సహాయంతోనే నేను నా జీవితాన్ని సంపుర్ణంగా మరి ఆనందంగా జీవిస్తున్నను !

ప్రశ్న: “మీ ఉద్దేశ్యంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అంటే ఏమిటి?”

పత్రీజీ: “అత్యున్నతమైన ఆత్మజ్ఞానాన్నీ .. సరియైన ధ్యాన శాస్త్ర జ్ఞానాన్నీ .. మరి సరియైన రోజువారీ జీవన విధానాన్నీ .. వీలయినంత అతి తక్కువ సమయంలో .. వీలయినంత అతి తక్కువ ఖర్చుతో .. వీలయినంత అతి సరళమైన .. సామాన్యమైన వాడుక భాషారీతిలో .. వీలయినంత ఎక్కువమంది ప్రజలకు అందించడం.”

ప్రశ్న: “నేటి సమాజానికి ఆత్మజ్ఞాన ప్రభుత్వం యొక్క అవశ్యకత ఎంత వరకు?”

పత్రీజీ: పూర్వకాలంలో రాజులకూ, మహారాజులకూ ఆస్థానాల్లో రాజగురువులు ఉండేవారు. ఆ యా రాజులకు వారు పాలనాపరమైన సలహాలను ఇస్తూండేవారు. దశరథునికి “వశిష్ఠుడు” .. పాండవులకు “శ్రీకృష్ణుడు” ..చంద్రగుప్తునికి “చాణక్యుడు” .. ఛత్రపతి శివాజీకి .. “సమర్థ రామదాసు” వంటి గురువుల ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానపు నేపథ్యంతో కూడిన సలహాలతో వారు తమ ప్రజలను పరిపాలిస్తూ వుండేవారు!

ఇక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారస్వరూపులైన రాజుల సంగతి సరేసరి! ఇలా ఆనాడే కాదు .. ఈనాడు కూడా రాజగురువులు, ధర్మనీతిజ్ఞులయిన పాలకులులేని ప్రభుత్వం చుక్కానిలేని పడవలా ఎప్పుడు మునిగిపోతుందో తెలియకుండా వుంటుంది .. మరి “ఆధ్యాత్మికత లేని ప్రాపంచికత” గమ్యం లేని గమనం” లా అస్తవ్యస్తం అవుతూ వుంటుంది.

” ‘కడుపునిండా తిండి’ .. ‘ఒంటినిండా వస్త్రం’ .. ‘ఉండడానికి ఇల్లు’ అన్నవే ముఖ్యం .. మరి వీటిని ప్రజలకు కల్పించడమే మహా మహా ఆదర్శం” అని ప్రభుత్వాలు అనుకున్నంత కాలం మనిషి యొక్క శాశ్వత తత్త్వం అయిన “ఆత్మతత్త్వం” మరుగున పడిపోయి వుంటుంది. అలాంటి ప్రజలతో కూడిన సమాజంలో అశాంతి, అనారోగ్యం, అసంతృప్తి అన్నవి శాశ్వత నిలయాలయి వుంటాయి.

ప్రశ్న: “‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్నది పెద్దల మాట! అయితే ఎవరితో కలిసి వుండాలి?”

పత్రీజీ: మన స్వంత ఆత్మతో సదా కలిసి వుండాలి .. ఆత్మజ్ఞాన పరమరహస్యాలతో కలిసి వుండాలి .. ఆత్మజ్ఞాన పరాయణులతో కలిసి వుండాలి .. పిరమిడ్ శక్తితో కలిసి వుండాలి.

ప్రశ్న: “ముఖాన పులుముకునే ‘నిలువు నామాలు’, ‘అడ్డనామాలు’ అన్నవి ఆధ్యాత్మికతకు చిహ్నాలుగా చెప్పుకోవచ్చా?!”

పత్రీజీ: అసలు “నామాలు” అన్నవి తీసివేయడమే ఆధ్యాత్మికత! “నామాలు” అంటే బాహ్యంగా ముఖం మీద పులుముకునే అలంకార ప్రాయాలు కావు. అవి ‘నా’ శరీరం .. ‘నా’ ఇల్లు .. ‘నా’ పిల్లలు .. ‘నా’ పొలం .. ‘నా’ వ్యాపారం తోపాటు .. ‘మా’ జాతి .. ‘మా’ వర్గం .. ‘మా’ కులం .. ‘మా’ దేశం .. అంటూ మానవజాతికి పట్టిన చీడ పీడలు!

ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రం మనల్ని ‘నా’, ‘మా’ అన్న చీడ పీడల నుంచి వేరు చేసి “మన” అన్న విశాల సృష్టితత్వంతో వికసించేట్లు చేస్తుంది.

ప్రశ్న: ” ‘శివుడికి ఇద్దరు భార్యలు’ అని పురాణాల్లో వింటూంటాం! నిజమేనా?!”

పత్రీజీ: నిజమే! శివుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు! మొదటి భార్య “పార్వతి” అయితే .. రెండవ భార్య “ఆకాశగంగ”! పార్వతి అంటే ప్రాపంచికత .. ఆకాశగంగ అంటే ఆధ్యాత్మికత. ఇలా ఇద్దరు భార్యలతో కూడి శివుడు .. కైలాసంలో సదా ఆనంద తాండవం చేస్తూ వుంటాడు.

శివుడిలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మొదటి భార్య “ప్రాపంచికత”తోపాటు .. రెండవ భార్య “ఆధ్యాత్మికత” కూడా వుండితీరాలి! అప్పుడే వారు శివుడిలా ప్రతిక్షణం ఆనందంగా ఉంటారు. కేవలం ప్రాపంచికత మీదగానీ .. కేవలం ఆధ్యాత్మికత మీద గానీ ఆధారపడి బ్రతికేవాళ్ళ జీవితంలో ఆనందం అన్నది యాభై శాతం మాత్రమే వుంటుంది.

అలా కాకుండా నూటికి నూరు పాళ్ళు ఆనందంగా జీవించాలంటే పగలు ప్రాపంచికమైన జీవన వ్యాపారాలను ధర్మబద్ధంగా సాగించుకుంటూనే .. రాత్రి ఆనాపానసతి ధ్యానసాధన విధిగా చెయ్యాలి .. ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ ఔపోసన పట్టాలి .. మరి సంసారం లో వుంటూనే నిర్వాణం చెందాలి. ఇదే ఇద్దరు భార్యలతో కూడిన శివతత్త్వంలోని పరమార్థం !

ప్రశ్న: ” ‘చావు’ .. ‘నిద్ర’ .. ‘ధ్యానం’ .. వీటి మధ్య మౌలికమైన తేడా ఏమిటి?

పత్రీజీ: “చావు”, “నిద్ర”, “ధ్యానం” .. ఈ మూడు కూడా మౌలికంగా మనం మన స్థూలశరీరాన్ని శాశ్వతంగానో – అశాశ్వతంగానో .. పూర్తిగానో – కొద్దిగానో .. తెలిసో – తెలియకో వదిలివేసే ప్రక్రియలు.

“చావు” లో మనం మన స్థూలశరీరాన్ని శాశ్వతంగా వదిలివేస్తాం. “నిద్ర” లో మనం మనకు తెలియకుండానే మన స్థూలశరీరంలోంచి బయటికి వచ్చి సూక్ష్మశరీరంతో కూడి విహరించి కొన్ని గంటల తరువాత మళ్ళీ మనకు తెలియకుండానే తిరిగి స్థూలశరీరంలోకి ప్రవేశిస్తాం!

“ధ్యానం” లో మనం పూర్తి ఎరుకతో మన స్థూలశరీరాన్ని వదిలి సూక్ష్మశరీరంతో కూడి అనేకానేక లోకాల్లో సూక్ష్మశరీరయానాలు చేసి .. అక్కడి జ్ఞానంతో తిరిగి ఎరుకతో మళ్ళీ స్థూలశరీరంలోకి ప్రవేశిస్తాం !

అంతేకాకుండా ధ్యానం చేయడం వలన మనం నిద్రావస్థలో చేసే సూక్ష్మశరీర యాత్రల యొక్క పరమార్థం కూడా తెలుసుకుంటాం .. మరి మరణానంతర జీవితం గురించి పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం !

ప్రశ్న: “మరణానంతరం ఏం జరుగుతోంది?

పత్రీజీ: “మరణం” అంటే .. భౌతిక శరీరానికి మరి సూక్ష్మ శరీరానికీ మధ్య వున్న “Silver Cord – వెండిప్రోగు” యొక్క సంబంధం తెగిపోవడం మాత్రమే. మరణం ద్వారా మన “చైతన్యంతో కూడిన ఎరుక” మన భౌతికశరీరం నుంచి విడివడి .. “సూక్ష్మశరీరం”తో శాశ్వతంగా అనుసంధానించబడి .. ఇక అక్కడి నుంచే తన యొక్క కార్యకలాపాలను సాగిస్తూ వుంటుంది.

“మరణం” తర్వాత కూడా ఒకానొక సగటు మామూలు వ్యక్తి యొక్క సూక్ష్మశరీరం .. ఈ భూమి మీద కనీసం మూడురోజులపాటు తిరుగుతూ వుంటుంది. ఆ సమయంలో “ఒకానొక ఆస్ట్రల్ మాస్టర్” మరి “ఒకానొక ఆస్ట్రల్ స్టూడెంట్” ఇద్దరూ కలిసి ఆ వ్యక్తికి సూచనలిస్తూ శక్తినిస్తూ ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్తారు.

అక్కడ కాస్త సేద తీయించిన తర్వాత అతనితో అంతవరకూ ఆ జన్మలో అతడు గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేయిస్తారు. అప్పుడే అతని “అజ్ఞానయుత” మరి “జ్ఞానయుత” కార్యాల చిట్టా సరిచూడబడి, అతని కర్మలస్థాయిని అనుసరించి మళ్ళీ పునఃపరిశీలించబడిన లక్ష్యాలతో .. మరి పునర్‍వ్యవస్థీకరించబడిన గమ్యాలతో .. అతని “పునర్జన్మ ప్రణాళిక” రచించబడుతుంది.

ప్రశ్న: ప్రకృతి మనతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి వుంటుంది?

పత్రీజీ: మీరు ఏ “ప్రకృతి” గురించి అడుగుతున్నారు? బహుశా మీరు “మన చుట్టూ ఉన్న ప్రకృతి”ని గురించి అడుగుతున్నారు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనం “రకరకాల ప్రకృతుల”తో కలిసి జీవిస్తున్నాం. వీటన్నింటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి:

“మొదటి రకం ప్రకృతి”

* “పంచభూతాలు” .. ఇందులోని ప్రకృతి పంచభూతాలతో నిర్మించబడి మన స్వంత భౌతిక ఎదుగుదలకు మాత్రమే సహాయకారిగా ఉంటోంది. ఇందుకోసం మనం అడవులలోకి వెళ్ళడం, పర్వత శిఖరారోహణాలు చేయడం, నదులు మరి సముద్రాలలోకి ఈతకొట్టడం వంటివి చేస్తూ .. భౌతికపరమైన ప్రకృతికి దగ్గరగా సమయం గడపడం వల్ల పంచభూతాల నుంచి శక్తిని గ్రహిస్తూ మనం ఇంకా ఇంకా శక్తివంతుల్లా మారి సదా ఆనందస్థితిలో ఉండగలుగుతాం. ఇది “భౌతిక శరీరానికి” సంబంధించిన “భౌతిక ప్రకృతి” మాత్రమే సుమా!

“రెండవ రకం ప్రకృతి”

* “పంచతన్మాత్రలు”.. అంటే “సూక్ష్మలోకపు ప్రకృతి”. ధ్యానస్థితిలో మనం సూక్ష్మశరీరయానం చేస్తూ సూక్ష్మలోకపు వృక్ష సామ్రాజ్యాలకూ, సూక్ష్మలోకపు పర్వతశిఖరాలకూ, మరి సూక్ష్మలోకాల నదీనదాలకూ దగ్గరగా వెళ్ళి .. వాటి నుంచి శక్తిని పొందుతూ .. ఆత్మానందాన్ని అపారంగా పొందగలం. ఇది సూక్ష్మశరీరానికి సంబంధించిన “సూక్ష్మప్రకృతి”

“మూడవరకం ప్రకృతి”

* “మూడవ ప్రకృతి” అంటే “సంపూర్ణ అద్వైత స్థితిలో పూర్తి చైతన్యంతో నిండిన పురుషుడు”. ధ్యానం ద్వారా ఇలాంటి “శుద్ధచైతన్యం”లో మనం సదా మునకలేస్తూ వుంటే .. “మనమంతా ఆత్మస్వరూపులం” అనీ .. “అహం బ్రహ్మాస్మి” అనీ .. మనకు విశేషంగా అర్థమవడం మొదలవుతుంది. ఈ స్థితి మనకు “బ్రహ్మానందం”తో పాటుగా అనేకానేక శుద్ధచైతన్య లోకాలకు సంబంధించిన “అనంతజ్ఞాన ప్రకాశాన్ని” కూడా అందజేస్తుంది. మన మనస్సులను మనం మరిచిపోయిన ప్రగాఢ ధ్యానస్థితిలో మాత్రమే మనలోని ఈ శుద్ధచైతన్యం .. ప్రకృతితో మమేకమై మనకు ఇంతటి బ్రహ్మానంద స్థితిని అందిస్తుంది.

“నాల్గవ రకం ప్రకృతి”

* ఇప్పుడు మనం మన “నాల్గవ రకం ప్రకృతి” అయిన “సంస్కారాల చిత్తప్రకృతి” .. “వాసనల చిత్తప్రకృతి” గురించి తెలుసుకుందాం.

“సంస్కార చిత్తం” అంటే మన యొక్క “పూర్వ జన్మల నుంచి సంతరించుకున్న మానసిక ప్రవృత్తులు” .. “పూర్వజన్మల నుంచి సంతరించుకున్న అంతఃకరణం”. ఇవి “నేను ఫలానా”, “నాది ఫలానా” అనే రకరకాల చిత్రవిచిత్ర వ్యక్తిగత చిత్త అస్తిత్వాలతో కూడి ఎంతో సంక్లిష్టంగా వుంటాయి.

“ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్థితి మన జన్మపరంపరలోని అనేకానేక సంభావనల మరి కర్మఫలితాల సంపూర్ణ స్వరూపమే” అన్నది పరమసత్యం.

కనుక “సిద్ధాంతపరం”గా మనం మన మూడవ ప్రకృతిలో వుంటూ మరి “ప్రయోగపరం”గా మన నాల్గవ ప్రకృతి గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగివుండాలి. ఎందుకంటే, భౌతికతలంలో మనయొక్క ప్రాపంచిక కార్యకలాపాలు ఇతరులతో కూడి కలిసిమెలిసి నిర్వహించాల్సి వుంటుంది.

సర్వసాధారణంగా మనం .. ఆత్మజ్ఞానం లోపించి “నేను ఫలానా”, “నువ్వు ఫలానా” అనే ప్రకృతిలో .. అంటే “ద్వైతం”లో .. వుంటూ మూడవ ప్రకృతికి సంబంధించిన ఆత్మచైతన్యపు మౌలిక అవగాహన లోపంతో అనేకానేక ఇబ్బందికర భావనాక్షేత్రాలతో .. అనేకానేక సంక్లిష్ట పరిస్థితులలోకి ప్రయాణిస్తూ .. జీవితాన్ని దుఃఖభాజనం చేసుకుంటూంటాం.

ఇలాంటి ద్వైతప్రకృతిని “సైకోఎనాలసిస్” ద్వారా విశ్లేషించే .. సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు సైతం “ఆత్మతత్వాన్ని” పట్టించుకోకుండా, దానిని పూర్తిగా విస్మరించారు.

“ఆలోచనల సముదాయమైన మనస్సు” అనేది మెదడుకు సంబంధించిన భౌతిక వ్యాపారం మాత్రమే .. కానీ “శుద్ధ చైతన్యం వీటన్నిటికీ అతీతమైంది” అన్న మౌలికసత్యాన్ని గ్రహించని ఈ మానసికశాస్త్ర నిపుణులంతా .. “మనిషి అంటే కేవలం భౌతికశరీరం మాత్రమే” అన్న భావనతోనే మనిషి యొక్క సమస్యల పరిష్కారం పై దృష్టిపెడుతూ వచ్చారు.

“అయితే ప్రతి మనిషి తన యొక్క ఆత్మలక్ష్యాలనూ, మరి తన ఆత్మ గమ్యాలనూ అర్థం చేసుకోనంతవరకు ప్రాపంచిక సమస్యలకు పరిష్కారం లభించనే లభించదు” అన్న ప్రాథమిక సత్యాన్ని తప్పకుండా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా వుంది. ఇక్కడే “ఆధ్యాత్మిక శాస్త్రం” అన్నది మనకు చక్కటి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది .. మరి దానివల్ల మనం ఆత్మజ్ఞానంతో కూడిన అవగాహనతో ఎలాంటి సమస్యనైనా తేలికగా పరిష్కరించుకోగలుగుతాం.

ఇలా ఎవరైతే “మూడవ రకం ప్రకృతి”లోని శుద్ధచైతన్యం పట్ల ఎరుకతో తమ తమ “నాల్గవ రకం ప్రకృతి” అయిన అనేకానేక జన్మల జనిత సంస్కారాల వాసనలతో కూడిన “చిత్ర విచిత్ర చిత్త ప్రకృతి” పట్ల అవగాహన కలిగివుంటూ ప్రాపంచిక కార్యకలాపాల పట్ల సదా అర్థవంతంగా మరి ఆనందంగా జీవించగలుగుతారో వారే జీవన్ముక్తులు.

మరి వారి చైతన్యమే .. “శ్రీ కృష్ణ చైతన్యం”

ప్రశ్న: “ధ్యానం” మన నిత్యజీవితంలో ఎలాంటి సహాయం చేస్తుంది?

పత్రీజీ: నిరంతర ధ్యానం ద్వారా మనం పొందే “విశ్వమయప్రాణశక్తి” వల్ల మనలోని “శక్తికేంద్రాలన్నీ” ఉత్తేజితం చేయబడి మనం “శక్తి స్వరూపాల్లా” పరిమారిపోతాం. దీనివల్ల మనం చేస్తోన్న పనులన్నింటిలో.. సునిశతమైన నైపుణ్యత పెరిగి ఎంతటి పనినైనా అవలీలగా మరి ఆనందంగా ఒక ఆటలా పూర్తిచేయగలుగుతాం.

ధ్యానం మనల్ని ఒకానొక “నిశ్చలానంద స్థితి” లో వుంచడం వల్ల మనం ఆత్మశాంతితో .. సాక్షీతత్వంతో కళ్ళముందు వున్న పరిస్థితులు ఏ రకమైన మార్పు చెందుతున్నా సరే .. సమతా స్థితిలో వాటి ఫలితాలను గ్రహిస్తూ .. మనం చేస్తూన్న పని మీద మాత్రమే ధ్యాస ఉంచగలుగుతాం.

ధ్యానం మనల్ని క్రమక్రమంగా “అత్యంత చక్కగా అధ్యయనం చేయబడిన శాస్త్రీయ దృక్పథాల”తో కూడిన “బుద్ధిజీవులు”గా మరి “వివిధ రీతులుగా ఉండే ప్రకృతి తత్త్వాలతో సామరస్యం”లో ఉండే “ప్రకృతి అనుగుణ జీవులు”గా పరిమార్చుతుంది. దానివల్ల పరిస్థితులను ఆకళింపు చేసుకోవడంలో మరి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడంలో మనలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది.

ప్రతి విషయాన్నీ శాస్త్రీయ అవగాహనతో అర్థం చేసుకుంటూ మరి “సంపూర్ణ ఆత్మయుతస్వేచ్ఛ”తో మన నిర్ణయాలు మనమే తీసుకుంటూ మరి ఇతరుల”సంపూర్ణ ఆత్మయుతస్వేచ్ఛ”ను కూడా అద్భుతంగా గౌరవిస్తూ .. అందరితో అద్భుతమైన అనుబంధాలను నెరపుతాం.

ఇలా “విశ్వపు ఏకత్వం” వైపు .. మరి “విశ్వసమభావన” వైపుగా మనం ప్రయాణం చేస్తూ .. సదా బ్రహ్మానంద స్థితిలో వుంటాం.

“సరియైన ధ్యానం” అనేది మనల్ని 1. శక్తి స్వరూపాలలా, 2. నిశ్చలానంద స్వరూపాలలా మరి 3. బుద్ధి జీవులలా పరిమార్చివేస్తుంది.

ప్రశ్న: “పోటీతత్త్వం విపరీతంగా పెరిగిపోతూన్న ఈ కాలంలో పిల్లలను ఎలా పెంచాలి?”

పత్రీజీ: చాలామంది కేవలం ప్రాపంచిక తల్లిదండ్రులు “క్లాస్లో నువ్వే ఫస్ట్ రావాలి .. నువ్వే ఇంజనీయర్ కావాలి .. నువ్వే డాక్టర్ కావాలి .. నువ్వే కలెక్టర్ కావాలి .. నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి” .. అంటూ చిన్నప్పటి నుంచీ పిల్లలకు 100% ప్రాపంచికతను నూరిపోస్తూ వుంటారు.

ఆ పిల్లలు కూడా పాపం అవే వింటూ .. చిలుక పలుకుల్లా అలాంటి మాటలే నిత్యం పలుకుతూ ఉంటారు. ఫలితంగా వారు తమ తమ జీవితాలలో అంతులేని అవమానాలకూ, అపజయాలకూ గురవుతూ ఉంటారు!

కాబట్టి “నేను అందరి కన్నా ముందుండాలి” అన్న భావన కంటే “అందరూ పక్వంగా ఉండాలి .. అందులో నేను కూడా ఒకానొక పక్వంగా ఉండాలి” అన్న సరైన భావనతో పిల్లలను పెంచాలి! నిజానికి విద్యార్థి జీవనానికి కావలసినవి ‘ఏకాగ్రత’ .. ‘పట్టుదల’ .. ‘జ్ఞాపకశక్తి’ .. ‘ఏక సంధాగ్రాహ్యత’ .. ‘చురుకుదనం’ .. ‘ఉత్సాహం’ .. ‘శక్తి’! ఇవి అన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి ఉంటారు అయితే ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూంటే తమలోనే నిక్షిప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను వారు సహజ ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు.

ప్రశ్న: ” ‘నిజమైన గురువు’ను గుర్తించడం ఎలా?”

పత్రీజీ: ‘గురువు’ కానివాడు .. గురువుని గుర్తించడం అసంభవం! ఏ జాతి పక్షులు ఆ జాతినే గుర్తించి ఆ జాతిలోనే సంచరించినట్లు .. ‘గురువు’ను గుర్తించగలిగిన వాడు మాత్రమే గురువుతో కూడిన సంచరిస్తాడు. గురువు కాని వాడికి గురువుల గుర్తులు చెప్పినా లాభం లేదు .. మరి గురువు అయిన వాడికి గురువుల గుర్తులు చెప్పడం అంతకంటే అనవసరం. కాబట్టి ‘నిజమైన గురువును గుర్తించడం ఎలా?’ అని తికమకపడేకంటే ముందు ‘నేను గురువును ఎలా కావాలి?’ అన్న ప్రయత్నం మొదలుపెట్టడం ముఖ్యం.

ప్రశ్న: “జీవితాన్ని మనం ఎలా ‘సార్థకం’ చేసుకోవలి?”

పత్రీజీ: ‘సార్థకం’ అంటే ‘స + అర్ధకం’ అర్థం తో కూడుకుని వున్నది’ అని అర్థం! ‘జీవితం’ అంటే అది మనిషి పుట్టుక నుంచి మరణం వరకూ ఉన్న దేశకాల పరిస్థితుల పరంపరలో కలిగిన స్పందన మరి ప్రతిస్పందనల ప్రవాహం.

కేవలం “ఒక గంట” సేపో “ఒకరోజు”లోనే .. “ఒక ఊరి”లోనో .. లేదా “ఒక మనిషి”తోనో జీవితాన్ని అర్థవంతంగా జీవిస్తే .. అది కేవలం అంతవరకే సార్ధకత. అలాకాక ప్రతి ఒక్క దేశకాల పరిస్థితిలోనూ .. క్షణక్షణం సృజనాత్మకంగా, క్రియాశీలకంగా, అర్ధసంహితంగా, దుఃఖరహితంగా మరి అందరికీ శ్రేయస్సును కలిగించే విధంగా ఉంటూ .. సత్యస్థితులై, ధర్మవర్తులై .. ఆఖరి శ్వాస వరకు జీవిస్తే .. దానినే ‘జీవితం యొక్క సంపూర్ణ సార్ధకత’ అంటాం. జీవితంలో ఇలాంటి సార్థకత ను పొందాలంటే .. మనం వదిలిపెట్టాల్సింది .. ‘హింస’ మరి పట్టుకోవాల్సింది ‘హంస’.

ప్రశ్న: “ధ్యానం చెయ్యడం వల్ల ఇంటిలో వున్న వాస్తుదోషాలు పోతాయా?”

పత్రీజీ: “తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు” అసంఖ్యాకమైన దోషాలు మనలో నిండి ఉండి మనం ఆధ్వాన్నంగా వుంటే .. మరి మన చుట్టూ వున్న వస్తు సముదాయంలో కూడా లేనిపోని అధ్వాన్నాలు పుట్టుకొస్తాయి! కాబట్టి ‘వాస్తు’ పేరుతో మనం చుట్టూ వున్న ప్రపంచంలోని దోషాలను సరిచెయ్యడం కాకుండా .. ముందు మనలో ఉన్న దోషాలను సరిచేసుకోవాలి. ఇందుకుగాను స్వీయపరిశీలనా శక్తిని కలిగించే ‘ధ్యానం’ ఒక్కటే మనకు మార్గం; నిరంతర ధ్యానసాధన ద్వారా మనలో వున్న దోషాలన్నీ దూరమైపోయి .. మన దృక్పథంలో విశేషమైన మార్పువస్తే .. మనచుట్టూ వున్న దోషాలన్నీ కూడా తదనుగుణంగా సరిచేయబడతాయి.

ప్రశ్న: “ఎలాంటి పనులు చేస్తూంటే ఆత్మపరంగా మరి భౌతికపరంగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం?”

పత్రీజీ: మనం ఏ పని చేస్తున్నా .. అది మంచి కానీ .. చెడుకానీ .. దానివల్ల మనం నిరంతరం అభివృద్ధి చెందుతూనే వుంటాం. ఏ స్థాయికి ఉండే పాఠాలు ఆ స్థాయికి ఉండనే ఉంటాయి. ఏ విత్తనాన్ని నాటితే ఆ ఫలమే పొందుతాం .. కనుక తగిన పాఠాలను నేర్చుకుంటూ నిరంతరం .. ఎదుగుతూనే ఉంటాం. అయితే ధ్యానం, ధ్యానప్రచారం, స్వాధ్యాయ సత్సంగాదులు మన ఆత్మయొక్క అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయి.

ప్రశ్న: “జీవితాన్ని ఒక ‘ఉత్సవం’లా జీవించడం ఎలా?”

పత్రీజీ: నిరంతర ధ్యాన – జ్ఞానాభ్యాసాల వల్ల మనకు సృష్టి యొక్క మూల సిద్ధాంతాలన్నీ క్రమక్రమంగా, సావధానంగా అవగతం అవుతూంటాయి. అప్పుడు ఇక “మనకూ – మనకూ” .. మరి “విశ్వంలోని నక్షత్ర లోకాలకూ – మనకూ” మధ్య ఉన్న సంబంధాలు స్పష్టంగా, తేటతెల్లం అవుతూంటాయి. అదే మరి దివ్యజ్ఞానప్రకాశం! ఆ దివ్యజ్ఞానప్రకాశాన్ని పొందిన క్షణం నుంచీ మన ఆహార-వ్యవహారాల తీరులన్నీ మారిపోయి మన జీవితం నిత్యనూతనంగా వెలిగిపోతుంది. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానంతో అప్పుడు మనం ముక్తజీవుల్లా మన జీవితాలను ప్రతి క్షణం ఒక ‘ఉత్సవం’లా జీవిస్తాం..

ప్రశ్న: “తల్లిలాంటి ప్రకృతి మనపట్ల చూపించే ప్రేమలో తేడాలు ఉంటాయా?!”

పత్రీజీ: తప్పకుండా ఉంటాయి. ఒకానొక తల్లిలా ప్రకృతి తన బిడ్డలను సదా ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ వారు చేసే పనులవల్ల ఒక్కోసారి ఆమె ప్రేమలో కొంత వైవిధ్యత కనబడుతుంది. ఇందులో మొదటి రకం బిడ్డలు: వీరు పూర్తి హింసామార్గంలో జీవిస్తూన్నా సరే .. వారు చేసే ఆగడాలను, దారుణాలను, దౌర్జన్యాలను ఎంతో శాంతంగా ప్రకృతిమాత సహిస్తూనే ఉంటుంది! సాగినంత వరకు “నా అంతటి వారు లేరు” అని వాళ్ళు అనుకున్నంత కాలం బాగానే ఉంటుంది. కానీ ఏ జన్మ కర్మఫలితమో అనుబవించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ మహా ప్రకృతి, ఆ మహా తల్లి ఆ హింసాత్ములకు సహాయం చెయ్యడం సరికదా .. వారి నుంచి తన మొహం త్రిప్పేసుకుంటుంది! రెండవ రకం బిడ్డలు: వారు “అహింసా పరమో ధర్మః” అన్న సిద్ధాంతాన్ని “తు.చ.”తప్పకుండా ఆచరిస్తూ ఇతర జీవులకు హింస కలిగించకుండా తమ బ్రతుకేదో తాము గడుపుతూ వుంటారు. అలాంటి వాళ్ళు ఎదురయినప్పుడు ప్రకృతిమాత చక్కగా పలుకరించి .. వారిని వెయ్యేళ్ళు జీవించమని ఆశీర్వదిస్తుంది! మూడవ రకం బిడ్డలు: వారు ధ్యాన సాధన ద్వారా తమను తాము తెలుసుకుని, విశ్వప్రణాళికలో తమ వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఆ దిశగా ప్రయాణిస్తూ సమస్త ప్రాణికోటి ఉద్ధరణ కోసం లోకకల్యాణ కార్యక్రమాలను చేపడుతూ అహర్నిశలు శ్రమిస్తూంటారు. ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించే వీరిని చేసి ప్రకృతి మాత పులకరించిపోతూ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తుంది!!

ప్రశ్న: “ధ్యానం యొక్క ప్రభావం పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉందా .. లేక భారతదేశంలో ఎక్కువుగా ఉందా?”

పత్రీజీ: అసలు “భారతదేశం” మరి “పాశ్చాత్య దేశాలు” అన్నవి వేరు వేరు కాదు. భౌగోళికంగా ఉన్నది భూమి ఒక్కటే! ఒక్కడే సూర్యుడు .. ఒక్కడే చంద్రుడు .. మరి ఒక్కటే భూమి! రకరకాల సముద్రాలలో ఉన్న నీరు కూడా ఒక్కటే! రకరకాల ఎల్లలు ఏర్పరచి ఇలా దేశాలన్నింటినీ విభజించడం మానుకుంటే మన మనస్సు శుభ్రపడుతుంది. కనుక “ఇక్కడ ఏదీ పరదేశం కాదు .. ఏదీ మాతృదేశమూ కాదు” అని తెలుసుకోవాలి. ఉన్నది ఒక్కటే “వసుధైక కుటుంబం”!! ధ్యానం సర్వవ్యాపకమైంది. కనుక ఈ వసుధైక కుటుంబంలో ప్రతి ఒక్కరిపైనా దాని ప్రభావం ఉంటుంది.

ప్రశ్న: ” ‘యుక్తజీవనం’ అంటే ..”


పత్రీజీ: “యుక్తజీవనం” అన్నది యుక్తాహారం నుంచి మొదలవుతుంది. యుక్తమైన శాకాహారంతో మన శరీరం పోషింపబడితే మనకు మనమే మిత్రులం అవుతాం మరి ఇతర జీవులను చంపి వండే అయుక్తికమైన మాంసాన్ని తింటే .. మనకు మనమే శత్రువులం అయిపోతాం! కనుక మాంసాన్ని విసర్జించి .. శుద్ధ శాకాహారాన్నే మితంగా భుజిస్తూ .. శ్వాసాహారులుగా జీవించడమే యుక్త జీవనం.

ప్రశ్న: “పిరమిడ్స్ అన్నవి ఈజిప్ట్ దేశపు సాంప్రదాయం కదా .. దానిని మీరెలా తీసుకున్నారు?”

పత్రీజీ: మీ జేబులోని సెల్‌ఫోన్ మన సాంప్రదాయమా? మీ చేతిలోని మైక్ మన సంప్రదాయమా? అయినా మనం వాటిని వాడడం లేదా? సైన్స్ మరి సాంకేతికత అన్నవి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అలాగే పిరమిడ్స్ అన్నవి కూడా శాస్త్రీయమైన కొలతలతో నిర్మించబడిన జియోమెట్రికల్ శక్తి నిక్షేప కట్టడాలు .. వాటి లాభాలను ఎవ్వరయినా .. ఎక్కడయినా ఉపయోగించుకోవచ్చు.

ప్రశ్న: “యోగభ్రష్టత్వం అంటే ..”

పత్రీజీ: సరియైన ధ్యాన సాధనను విశేషంగా చేసే ప్రతి ఒక్కరికీ అపరిమితమైన శక్తి సామర్ధ్యాలు ఖచ్చితంగా సంక్రమిస్తూ ఉంటాయి. తద్వారా వారు ఏది కోరుకున్నా.. అది ప్రాపంచికంగా అయినా సరే లేదా ఆధ్యాత్మికంగా అయినా సరే .. సునాయసంగా తీరిపోతూ ఉంటాయి.

“ప్రాప్తి” .. “ప్రకామ్యం” .. “ఈశత్వం” .. “వశిత్వం” అనబడే ఇలాంటి సిద్ధుల వల్ల మనం గర్వం, అహంకారం మరి డంబాతిశయాల వంటి లక్షణాలను పెంచుకుంటే అవి మన ప్రాపంచిక మరి ఆధ్యాత్మిక పతనాలను దారితీస్తాయి. దానివల్ల మనం యోగభ్రష్టుల్లా మిగిలిపోతాం! అందుకే ఆత్మజ్ఞాన సముపార్జన ద్వారా మనకు సంక్రమిస్తోన్న ఇలాంటి సిద్ధులపట్ల అప్రమత్తతతో ఉండాలి! అలాంటి సమదృష్టితో మనం ఉన్నప్పుడే మరి ఎక్కడా దిగజారకుండా ఆత్మపరిణామక్రమంలో ముందుకు వెళతాం!

ప్రశ్న: “ధ్యానం చెయ్యడానికి ఏవైనా అర్హతలు ఉండాలా?!” (‘భారత్ టుడే’ సౌజన్యం)

పత్రీజీ: ఈ స్టూడియోని స్థాపించడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి?! తీవ్రమైన అభిలాష మరి అంకితభావంతో కూడిన కార్యాచరణ! అంతేకదా!

అలాగే ధ్యానం చెయ్యడానికి కూడా మౌలికంగా ధ్యానం చెయ్యాలన్న తపన మరి అందుకు తగిన తీవ్రతర సాధన ఉంటే చాలు!

ప్రశ్న: “ఎవ్వరయినా బ్రహ్మర్షి కావచ్చా?!”

పత్రీజీ: కావచ్చు!! బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్న ఎవ్వరయినా బ్రహ్మర్షులే! వంటగది నుంచి మొదలుకుని అంతరిక్షం వరకూ ఏదైనా సరే ఆ విషయాన్ని గురించిన సంపూర్ణ పరిజ్ఞానం మనకు ఉండాలి. అది నిరంతర ధ్యానసాధన ద్వారా మాత్రమే సాధ్యం! అలా ధ్యానసాధన ద్వారా సేకరించుకున్న పరిజ్ఞానాన్ని ఆచరణ ద్వారా అనుభవైక ఆత్మజ్ఞానంలా జీవించే వాళ్ళంతా కూడా బ్రహ్మజ్ఞానులే!

ప్రశ్న: “సార్! మీరు గొప్ప అవతారంగా అందరూ భావిస్తున్నారు!”

పత్రీజీ: “అవతరించడం” అంటే ఒకానొక ఉత్కృష్ఠమైన లక్ష్యాన్ని ఈ భూమిమీద సాక్షాత్కరింపజేయడానికి పరిపూర్ణంగా దిగి రావడం! మీ దృష్టిలో నేను ఒక అవతారాన్ని అయితే .. నా దృష్టిలో మీరు అందరూ కూడా మీ మీ స్థాయిలలో పరిపూర్ణంగా దిగి వచ్చిన అవతారాలే!!

ప్రశ్న: “మాంసం తింటే .. దారుణమైన తిప్పలు తప్పవు అంటున్నారు! మాంసం తినేవారి ఇంట పుట్టిన ఒక చిన్న బిడ్డకు .. తల్లిదండ్రులే దానిని అలవాటు చేసి మరీ పెడతారు. ఆ చిన్న బాబుకు ఇలా శిక్ష పడడం న్యాయమా?!”

పత్రీజీ: “న్యాయం” కాదు! అందుకే ఆ చిన్ని బాబుకు పడాల్సిన శిక్ష కూడా కన్నవారికి బదిలీ అయ్యి .. అది వారి పాలిట ఇంకా బలమైన పాపకర్మగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఆ చిన్నిబాబు పెరిగి పెద్దయ్యాక మాత్రం .. “అది పాపపు కూడు” అన్న అవగాహనను పొంది కూడా తింటే .. అది అతడి “స్వంత పాపకర్మ” గా రూపుదిద్దుకుంటుంది!

అందుకే తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు ఆత్మజ్ఞానాన్నీ మరి శాకాహార ప్రాముఖ్యతనూ బోధించి .. వారి భావి జీవితాలను పాపకూపంలో పడనీయకుండా కాపాడాలి. అదే పిల్లల పట్ల తల్లితండ్రుల మౌలిక బాధ్యత!

ప్రశ్న: “ధ్యానం తెలిసిన వెంటనే కొందరు గంటలు, గంటలు రోజులు రోజులు ధ్యాన సాధన చేస్తూ వుంటారు. కొందరు నిరంతరం ధ్యానప్రచారంలోనూ దానికి చెందిన అనేక పనులలోనూ మునిగి తేలుతూ వుంటారు; దేనిని అనుసరించాలి?”

పత్రీజీ: గత జన్మలలో అధికంగా ధ్యానసాధన చేసినవారే ఈ జన్మలలో ధ్యానప్రచారం చేస్తూ వుంటారు. “ఈ జన్మలో ధ్యానం చెయ్యాలి .. అదొక్కటే నాకు కావాలి” అన్న వారికి అదొక్కటే సత్యం.

“ధ్యానసాధన కన్నా నాకు ధ్యానప్రచారమే ఇష్టం; అది లేకుండా నేను ఉండలేను” అనే వారికి అదే సత్యం; ఎవరి సత్యంలో వాళ్ళు జీవించాలి.

ప్రశ్న: “మరణం తరువాత ఆత్మకు ఏమవుతుంది?”

పత్రీజీ: ఏమీ కాదు!! మీ శరీరం మీద నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరానికి ఏమవుతుంది?? అలాగే .. మరణం తరువాత తాత్కాలికమైన శరీరాన్ని ధరించి వున్న శాశ్వతమైన ఆత్మకు కూడా ఏమీ కాదు!

శరీరానికి బట్ట ఎలాంటిదో .. ఆత్మకు శరీరం అలాంటిదే కనుక మరణం ద్వారా శరీరం నశించిన తరువాత కూడా ఆత్మ మరిన్ని అనుభవాలకోసం మరిన్ని జన్మలను తీసుకుంటూ మరిన్ని క్రొత్త క్రొత్త శరీరాలను ధరిస్తూ తన అనంతకాల ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వుంటుంది.

ప్రశ్న: “ఒకానొక ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్‌ను గుర్తించడం ఎలా?”

పత్రీజీ: ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్‌ను గుర్తించడం చాలా సులభం! అతడు తన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకుని మరీ జీవిస్తూంటాడు. అతడు బాధలకు కృంగిపోడు; కష్టాలకు తలవంచడు. అందరితో మమేకం అవుతూ అందరినీ సరిసమాన స్నేహదృష్టితో చూస్తూ .. ఎవరు తనను పొగిడినా పొంగిపోకుండా, ఎవరు తనను దూషించినా బాధపడకుండా .. ఒకానొక బుద్ధుడిలా సదా బ్రహ్మానందస్థితిలో వుంటాడు.

ప్రశ్న: “విదేశాలలో నివసిస్తూన్నప్పుడు ఒక్కోసారి శాకాహారం దొరకడం కష్టంగా వుంటోంది!”

పత్రీజీ: “ధ్యానం” – “శాకాహారం” అన్నవి రెండూ .. మనకు రెండు పాదాలలాంటివి. ఇందులో ఏ ఒక్కటి మనకు లేకపోయినా మనం వికలాంగుల్లా కుంటి బ్రతుకు ఈడవాల్సిందే!

ఒకవేళ శాకాహారం బొత్తిగా దొరకని ప్రదేశాలలో కనుక ఉండాల్సి వస్తే .. అది ఎంత గొప్ప ప్రదేశం అయినా సరే .. నిర్ద్వందంగా దానిని వదిలి పెట్టేయాలి. ధర్మబద్ధంగా జీవించడానికి అనువుగాలేని అలాంటి దుర్భరప్రదేశాలు డాలర్లను కురిపిస్తూ మనల్ని తాత్కాలిక మాయకు గురిచేసినా .. ఆత్మపరిణామక్రమంలో మాత్రం అవి మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి.

ప్రశ్న: “భూమి మీద అందరితో చక్కటి సంబంధాలను కలిగి వుండి .. ఇంగిత జ్ఞానంతో వ్యవహరించడం ముఖ్యమా? లేక ఇతర లోకాల జ్ఞానం తెలుసుకోవడం ముఖ్యమా?”

పత్రీజీ: మొదట మనం ఒక ఇంట్లో పుట్టి .. పెరిగి .. ఉత్సుకతతో నెమ్మదిగా ప్రక్క ఇంటికి వెళతాం. ఆ తరువాత మెల్లి మెల్లిగా ఆ ప్రక్క ఇంటికీ, ఇంకో ప్రక్క ఇంటికీ వెళతాం. క్రమేణా గోడలు దూకి వాటి వెనుక ఏముందో చూస్తాం. తరువాత ప్రక్క ఊరికి “పిక్‌నిక్” కు వెళతాం. దూరంగా కనిపించే కొండ ఎక్కి అన్నీ చూసి తిరిగివస్తాం. కొంత దూరంలో ఉన్న అడవికి వెళ్ళి, అడవి అంతా చూసి తిరిగి వస్తాం.

తరువాత దగ్గరలోని నగరానికి వెళ్ళి అక్కడి వింతలూ విశేషాలూ చూసి వస్తాం. వీలైనంతలో దేశవిదేశాలన్నీ తిరిగి వస్తాం. ఇలా ప్రాపంచిక జీవితంలో అందరూ అనుభవించినట్లే .. “ఆధ్యాత్మిక జీవితం” లో కూడా ఇటువంటి క్రమమే ఉంటుంది!

“సరే .. ఈ జన్మలో ఇక్కడ వున్నాను కదా .. గత జన్మలో ఏమై వుంటాను?” అన్న ప్రశ్న ఉదయించి .. గత జన్మలన్నీ దర్శించాలని ఆకాంక్షిస్తాము. ఆపైన ” జన్మకూ జన్మకూ మధ్య ఎక్కడ వున్నాను? అక్కడ ఏం చేస్తాం?” అన్నది తెలుసుకుంటాము!

ఆ తరువాత “ఎన్ని గెలాక్సీలలో ఎన్ని జీవరాసులు ఉన్నాయి? మనుష్యుల లాంటి వారు ఉన్నారా? గ్రహాంతర వాసులను కలుసుకోవచ్చా? వారితో మాట్లాడవచ్చా??” అంటూ ఉత్సాహంగా ఆధ్యాత్మిక అన్వేషణ మొదలుపెడతాం!

ఇదంతా ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతి సహజంగా జరిగే సుందరమైన ఆత్మపురోగమనప్రక్రియ!

ప్రశ్న: “జీవిత ధ్యేయాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి?”

పత్రీజీ: ప్రతి క్షణం ఆనందంగా జీవించడమే “జీవిత ధ్యేయం”! కలిమిలోనైనా, లేమిలోనైనా .. జయంలోనైనా, అపజయంలోనైనా .. మానంలోనైనా, అవమానంలోనైనా .. ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా .. పుట్టుకలో అయినా, మరణంలో అయినా .. అన్ని పరిస్థితులలో కూడా శాంతంగా, ఆనందంగా జీవించగలగాలి!

మన ఆనందం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఆనందం కూడా మనకు అంతే ముఖ్యంగా వుండాలి. మన మౌనం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి మౌనం కూడా మనకు అంతే ముఖ్యంగా ఉండాలి. మన ఏకాంతం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఏకాంతం కూడా మనకు అంతే ముఖ్యంగా వుండాలి.

ఇలా ప్రతిక్షణం ఎరుకతో జీవించగలగడమే .. “జీవితధ్యేయం”!

 ‘బ్రహ్మర్షి పత్రీజీ’ అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో ధ్యాన పర్యటన ముగించుకుని వచ్చిన పత్రీజీతో “పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్” ఇంటర్వ్యూ

ప్రశ్న: “అమెరికా మరి ఇంగ్లాండ్‌లు తిరిగి ఎన్నో ధ్యాన తరగతులను నిర్వహించి వస్తూన్న సందర్భంగా మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ వయస్సులో మీరు ఈవిధంగా కష్టపడుతూ .. తిరుగుతూ .. ఉంటే మిమ్మల్ని చూసి మాకు ఒక్కోసారి సిగ్గు వేస్తుంది.”

పత్రీజీ: “అటువంటిది ఏమీ అవసరం లేదు. అందరి సంకల్పం మరి శక్తుల వల్లనే నేను దేశవిదేశాలలో తిరిగి ధ్యాన తరగతులు చెప్పగలుగుతున్నాను.

” ప్రశ్న: “గురువు గారూ! పాదాభివందనాలు .. మీ పర్యటన విశేషాలు చెప్పండి!”

పత్రీజీ: “మొట్టమొదట ఇంగ్లాండ్ వెళ్ళాను. అయిదు రోజులు ఉన్నాను. అక్కడ మన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అందరితో కలిసి ధ్యానం చేసి .. వారి ఇళ్ళకు వెళ్ళి .. వారితో అనుభవాలు పంచుకోవటం జరిగింది. 20, 30, 40 మంది వచ్చారు, కొందరు స్థానిక బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. ధ్యాన తరగతులు కూడా తీసుకున్నాను.”

ప్రశ్న: “గురువు గారూ! ఇంగ్లాండ్ వెళ్ళటం ఎన్నోసారి?”

పత్రీజీ: “ఇది 3వ సారి”.

ప్రశ్న: “అక్కడ మనుష్యులు ఎలా ఉంటారు?”

పత్రీజీ: “ఎక్కడైనా మనుష్యులు ఒకే విధంగా ఉంటారు. ధ్యానం అంటే కొంతమంది ఇష్టం ఉన్నవాళ్ళు .. ఇష్టం లేనివాళ్ళు .. కొంతమంది ‘తెలుసుకుందాం’ అనుకునే వాళ్ళు .. కొంతమంది ‘వద్దు’ అనుకునేవాళ్ళు .. అక్కడా .. ఇక్కడా .. ఎక్కడైనా అన్నిచోట్ల ఒకేవిధంగా ఉంటుంది.”

ప్రశ్న: “అంటే ప్రాంతాన్ని బట్టి మైండ్‌సెట్ ఉండదా?”

పత్రీజీ: “ఏమీ ఉండదు! జీవితాన్ని బట్టి ఎక్కడైనా మనుష్యులు అందరూ ఒక్కటే. అందరి ధ్యాన అవశ్యకతా ఒక్కటే. వేష, భాషలలో మార్పు ఉంటుంది కానీ మైండ్ సెట్‌లో మార్పు ఉండదు. అందరి అవసరాలూ ఒక్కటే కొందరు త్వరగా తెలుసుకుంటే కొందరు నిదానంగా తెలుసుకుంటారు.”

ప్రశ్న: “ఇంగ్లాండ్‌లో మొత్తం ఎన్ని తరగతులు ఇచ్చారు?”

పత్రీజీ: “లండన్, బ్రిస్టల్‌లలో క్లాసులు ఇచ్చాను. లండన్ మాత్రమే పర్యటించాను. ఇంగ్లాండ్ అన్నది ఎంతో పెద్ద దేశం”.

ప్రశ్న: “గురువు గారూ! తరువాత ఎక్కడెక్కడ తరగతులు నిర్వహించారు?”

త్రీజీ: “తరువాత అమెరికా వెళ్ళాను. అక్కడ అనేకచోట్ల మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగా మేరీల్యాండ్‌లో మా అమ్మాయి ‘పరిమళ పత్రి’ ఉంది. అక్కడ పుస్తకాలు చదువుకుంటూ మంచి మంచి T.V. ప్రోగ్రామ్స్ చూస్తూ పదిహేను రోజులు విశ్రాంతి తీసుకున్నాను. అక్కడే రెండు, మూడు ధ్యాన తరగతులు జరిగాయి. తరువాత బోస్టన్‌లో ‘థామస్’ అనే పిరమిడ్ రీసెర్చ్ మాస్టర్ ఉన్నారు. ఆయన వద్దకు వెళ్ళి ఆయన అనుభవాలను అన్నింటినీ తెలుసుకున్నాం. ఆయన పిరమిడ్ మీద పరిశోధించి పుస్తకం వ్రాశారు. గొప్ప మాస్టర్. ఆ తరువాత న్యూజెర్సీలో రెండు మరి మూడు తరగతులు జరిగాయి. అక్కడనుంచి ఇండియానాపోలిస్ వెళ్ళాను. అక్కడ మూడు యూనిటీ యూనిటేరియన్ చర్చ్‌లలో ధ్యాన తరుగతులు జరిగాయి. అవి నూతన యుగ భావాలు స్వాగతించే చర్చ్‌లు .. వారు అందరి నుంచీ నేర్చుకోవాలనుకుంటారు .. ‘బైబిల్ మాత్రమే కరెక్ట్’ అని చెప్పరు .. వారికి ధ్యానం గురించి తెలియజేసి .. మన కాన్సెప్ట్ చెప్పి తరువాత శాకాహార భోజనం ఏర్పాటుచేశాం.”

ప్రశ్న: “అక్కడ మన పిరమిడ్ కూడా రాబోతుంది అన్నారు?”

పత్రీజీ: “అవును! అట్లాంటా నుంచి కొంత దూరం ప్రయాణం చేశాక ఎనిమిది ఎకరాల స్థలం గురించి డీల్ నడుస్తోంది. అక్కడ మనం పిరమిడ్‌కు భూమిపూజ చేశాం. అది ఒక సంవత్సరంలో తయారవుతుంది. దాని పేరు ‘పిరమిడ్ మెడిటేషన్ అకాడెమీ అట్లాంటా’ అని పెట్టాం. అది మన ‘Pyramid Spiritual Science Academy (PSSA)’ క్రింద పని చేస్తుంది. లైబ్రెరీ ఉంటుంది .. ధ్యాన తరగతులు నిర్వహించటం .. ఆన్‌లైన్ మరి ఆఫ్‌లైన్ కోర్సులు కూడా నడుస్తాయి. ఆ ప్రదేశం చాలా బాగుంది. అక్కడ ఒక వాగు ప్రవహిస్తోంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్‌లు తీసుకున్నాక పని మొదలవుతుంది.”

ప్రశ్న: “మీ పర్యటనలో మీ భోజన ఏర్పాట్లు మరి మీ కుటుంబం గురించి .. ?”

పత్రీజీ: “ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట నేను వంటే చేయవలసిందే .. లేకపోతే నాకు తోచదు. అది చేయడమే నాకు విశ్రాంతి. ఇంక మా అమ్మాయి పిల్లలతో ఆడుకుని పూర్తిగా విశ్రాంతి పొందాను. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళతో గడవటం చాలా బాగుంది.”

ప్రశ్న: “అక్కడ మన మాస్టర్స్ .. ధ్యాన కేంద్రాలు ఎలా ఉన్నాయి?”

పత్రీజీ: “మనకు ఇండియానాపోలిస్‌లో ఒక సెంటర్ ఉంది. మన వాళ్ళే పిరమిడ్స్ పెట్టి దానిని చక్కగా నిర్వహిస్తున్నారు. మిగతాచోట్ల ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఒక గదిని ఖాళీపెట్టి దానిలో పిరమిడ్స్ పెట్టి ధ్యానం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నేను ‘Global Pyramid Conference’ కు చికాగో వెళ్ళాను.”

ప్రశ్న: “సర్! గ్లోబల్ పిరమిడ్ కాన్ఫరెన్స్ అంటే ఏమిటి? దాని గురించి వివరించండి!”

పత్రీజీ: “అది చికాగోలో మూడు రోజుల కార్యక్రమం. ప్రపంచ వ్యాప్తంగా పిరమిడ్లపై పరిశోధనలు చేసినవారు మరి మన పిరమిడ్ మాస్టర్స్ 30 మంది మొత్తం 150 మందితో నిర్వహించబడింది. ప్రతిరోజూ నా వేణు ధ్యానంతోనే కార్యక్రమం ప్రారంభం అయ్యేది!” “దానిని ‘మార్తా’ అనే ఆవిడ ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను వెళ్ళాను. ఎవరెవరు పిరమిడ్స్ గురించి ఏమేమి పరిశోధించారో అక్కడ ప్రదర్శించి వివరించారు. పిరమిడ్ల గురించి బ్రహ్మాండమైన పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి వివిధ ప్రయోజనాలు కనుగొంటున్నారు.”

ప్రశ్న: “ఈ మధ్య మన దగ్గర కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు పిరమిడ్స్ ఉపయోగిస్తున్నారు కదా!”

పత్రీజీ: ” అవును.” ప్రశ్న: “సర్! ఆ కాన్ఫరెన్స్ తరువాత ఎక్కడకు వెళ్ళారు?” పత్రీజీ: “ఆ తరువాత మిన్నియాపోలిస్ వెళ్ళాను. అక్కడి సెంటర్స్‌లో మూడు రోజులు క్లాసులు తీసుకున్నాను. అక్కడ ‘ఎకో బోడిన్’ అనే గొప్ప మాస్టర్ ఉన్నారు. వారి సెంటర్‌లో కూడా క్లాసు తీసుకున్నాను. ఆ సెంటర్ చాలా బాగుంది.”

ప్రశ్న: “సర్! అక్కడ మన మాస్టర్స్ అందరూ ప్రచారం చేసుకున్నారా?”

పత్రీజీ: “భారతదేశంలో వలే అక్కడ ప్రచారం ఉండదు. ఇంటికి వచ్చిన వారికి ధ్యానం గురించి చెబుతారు.”

ప్రశ్న: “సర్! ధ్యానజగత్‌లో భాగంగా మీరు అమెరికాలో పర్యటించారు; అసలు మన మూవ్‌మెంట్ ఎన్ని దేశాలలో ఉంది?”

పత్రీజీ: “మన మూవ్‌మెంట్ సుమారు వంద దేశాలలో ఉంది. ఆంధ్ర రాష్ట్రాలలో తెలుగువాళ్ళలో తర్ఫీదు పొందిన మాస్టర్లు వందకు పైగా దేశాలలో ఉంటారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు. అందులో నేను 35 దేశాలలో పర్యటించాను. అక్కడకు వెళ్ళినప్పుడు వారిని కలిసి వస్తూంటాను.”

ప్రశ్న: “సర్! మనవాళ్ళు ఏయే దేశాలలో ఎక్కువ మంది ఉన్నారు?”

పత్రీజీ: “అమెరికాలో ఎక్కువమంది ఉన్నారు. తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేసియా, UAE లలో ఉన్నారు.”

ప్రశ్న: “సర్! మన పిరమిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి?”

పత్రీజీ: “ఇండోనేషియా, ‘బాలి’ లో నిర్మించాం. వచ్చే సంవత్సరానికి అమెరికాలో, బోస్నియాలో వస్తాయి మలేసియాలో మంచి సెంటర్ ఉంది. పిరమిడ్ కాదు. వియత్నాంలో చాలా మంచి మాస్టర్స్ ఉన్నారు. మన వాళ్ళు కాదు. స్థానికులు, భారతదేశం తర్వాత ఎక్కువ స్థానికంగా తయారైన మాస్టర్స్ వియత్నాం వాళ్ళే!”

ప్రశ్న: “వియత్నాం దేశంలో ఆ విధంగా ఎందుకని సర్?”

పత్రీజీ: “ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినా మొదటినుంచి వాళ్ళు బుద్ధిస్ట్‌లే. వారికి కమ్యూనిజంలో సంతృప్తి లేదు. వాళ్ళకి ఒరిజినాలిటీ కావాలి. ఒకసారి బుద్ధ ప్రబోధిత ‘ఆనాపానసతి’ గురించి తెలియగానే దానిపట్ల ఆకర్షితులై మాస్టర్సయ్యారు. మన పుస్తకాలు చాలా వియత్నామీస్ భాషలోకి తర్జుమా కూడా అయ్యాయి .. Breath పైన, vegetarianism పైన, PSSA పుస్తకాలు మొదలైనవి. ఇంకా మన మూవ్‌మెంట్ ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, ఈజిప్ట్, జర్మనీలలో ఉంది.”

ప్రశ్న: “మీరు కర్నూల్‌లో మొదలు పెట్టినప్పుడు ఇదంతా జరుగుతుంది అనుకున్నారా?”

పత్రీజీ: “అప్పుడు నేను అనుకోలేదు .. అనుకోకుండానూ లేదు. ఎక్కడిదాకా సాగుతుందోనని మొదలుపెట్టాం. అయితే అది హనుమంతుడు తోకలాగా సాగుతూనే ఉంది! ఏదో ఒకరోజు ప్రపంచాన్ని చుట్టి వేస్తుంది! అందరికీ ధ్యానం కావాలి .. మనం ఇస్తున్నాం. ఏదేని ఊరిలో వేడి వేడి జిలేబీ ఊరికనే పంచిపెడితే ఎవరు తీసుకోకుండా ఉంటారు. మనం ధ్యానం అనే జిలేబీని ఇంటింటికీ అందిస్తున్నాం. ఎవరు వద్దంటారు? శరీరానికి జిలేబీ, ఆత్మకు ధ్యానం కావాలి. మనం గడప గడపకూ ధ్యానం అందిస్తున్నాం.”

ప్రశ్న: “చిన్నప్పటి నుంచి ‘ధ్యాన జగత్’ గురించి నేను వింటున్నాను. ఇప్పుడు అది సాకారమైంది. అదంతా మీ పాజిటివ్, మిరాక్యులస్ ఆలోచనల వల్లనే అనుకుంటున్నాను”

పత్రీజీ: ” అవును! పాజిటివ్, మిరాక్యులస్ ఆలోచనల ద్వారానే ఇవన్నీ జరిగాయి. అలా మనం ఆలోచించాం కనుకనే ఇవన్నీ జరిగాయి.”

ప్రశ్న: “ఇన్ని దేశాలలో పిరమిడ్లు, ధ్యానం విస్తరించింది కదా! భవిష్యత్తులో ఆధ్యాత్మికత ఇంకా ఎక్కువ వ్యాపిస్తుందా?”

పత్రీజీ: “పిరమిడ్ల గురించి తెలీకపోవచ్చు కానీ ఆధ్యాత్మికత గురించి చాలామందికి తెలుసు. మనం శరీరం కాదు ఆత్మ, ఆత్మ ప్రయాణాలు ఉంటాయి. వేరే లోకాలు ఉన్నాయి. నక్షత్ర మండలాలు ఉన్నాయి. అక్కడ మనుష్యులు ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే ధ్యాన విధానాలు వేరుగా ఉంటాయి. మనం అత్యున్నతమైన ‘ఆనాపానసతి’ని చెప్పగానే హాయిగా తీసుకుంటున్నారు. ఇదే మంచిది కనుక వాళ్ళు స్వీకరిస్తారు.” “అయితే ముఖ్యమైన block ఏమిటంటే అందరూ మాంసం తింటారు. ధ్యానం చేస్తూ మాంసం తింటూ ఉంటారు. ధ్యానంలో గాఢత పొందినప్పుడు మాత్రమే శాకాహారులుగా మారుతారు.”

ప్రశ్న: “చాలా మంచిది సర్! మన మూవ్‌మెంట్ వల్ల ఎంతోమంది శాకాహారులుగా మారారు. ఒక మనిషి శాకాహారిగా మారితే 11,000 జంతువులు రక్షించబడతాయి అని ఎక్కడో చదివాను .. మీ వల్ల కొన్ని వేల కోట్ల జీవులు రక్షించబడటం చాలా గొప్ప విషయం కదా సర్!”

పత్రీజీ: “అదే మన ఉద్దేశ్యం కదా! ధ్యానం ద్వారా శాకాహారం, అహింస వస్తాయి. అహింస సిద్ధాంతం ద్వారా స్వర్గం అనబడే ‘శాకాహార జగత్’ వస్తుంది.”

ప్రశ్న: “ఒకప్పుడు ధ్యానప్రచారం ఎంత ముమ్మరంగా జరిగిందో ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి శాకాహార ప్రచారం అంత ముమ్మరంగా జరుగుతోంది. దీనిని గురించి ఏమంటారు సర్!”

పత్రీజీ: “శాకాహార ర్యాలీలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కేలేదు. ‘యాత్ర ఫర్ యానిమల్స్’ కూడా జరుగుతోంది కదా!” “రేపు అక్టోబర్ 2వ తేదీన కూడా ఎన్నోచోట్ల మెగార్యాలీలు జరగబోతున్నాయి.”

ప్రశ్న: “యాత్ర ఫర్ యానిమల్స్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. భార్యా భర్తలు ఇద్దరూ చక్కగా శాకాహార ప్రచారం చేస్తున్నారు. ఈ శాకాహార ప్రచారం ఇంత పెరగటానికి కారణం?”

పత్రీజీ: “భూమండలంలో శక్తి బాగా పెరిగింది. భూమి ఫోటాన్ బాండ్‌లో ప్రవేశించింది కదా! రోజురోజుకీ ధ్యానం పెరుగుతోంది. ధ్యానశక్తి పెరుగుతోంది. అంతకు ముందు అయిదు సంవత్సరాలలో వచ్చే ధ్యానం ఇప్పుడు అయిదు నెలల్లో వస్తోంది. అయిదు నెలలలో వచ్చేది అయిదు రోజులలోనూ, అయిదు రోజులలో వచ్చేది అయిదు గంటలలోనూ వస్తోంది. నా చిన్నప్పుడు ఇంత ధ్యానం ఎక్కడ ఉంది? ఇప్పుడు అన్ని చోట్లా ఉంది! ధ్యానం నుంచి శాకాహారం వస్తుంది!”

ప్రశ్న: “నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. పదిహేను సంవత్సరాల క్రితం ఆరోగ్యం కోసం యోగ, ధ్యానం అని ఉండేది. కానీ ఈ అయిదు సంవత్సరాల నుంచి ఆరోగ్యం కోసం ధ్యానానికి రావటం లేదు. సత్యం తెలుసుకోవటం కోసం వస్తున్నారు. మోడీ కూడా ‘యోగా డే’ గురించి – ‘ఇది భోజనానికి ముందు ఇచ్చే సూప్‌లాంటిది మాత్రమే, అసలు భోజనం తర్వాత ఉంటుంది’ అన్నారు.”

పత్రీజీ: “విషయం అందరికీ తెలిసింది. కాకపోతే శాకాహారులుగా కావటమే వుంది. శాకాహారులుగా మారటం అన్నది చాలా కష్టం. ధ్యానం బాగా చేస్తే మాత్రమే శాకాహారులుగా మారగలరు. ధ్యానం ఎంత బాగా ప్రాచుర్యం పొందితే దానికి సమాంతరంగా శాకాహారం అంత అభివృద్ధి చెందుతుంది. “ధ్యానం వల్ల సత్యం తెలుస్తుంది, దానినే ‘జ్ఞానం’ అంటారు. ఆ జ్ఞానం వల్ల హింస పోతుంది; అహింస వస్తుంది.”

ప్రశ్న: “భారతదేశంలో మీ వల్ల శాకాహారం పట్ల ఎరుక వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చిందా?”

పత్రీజీ: “వచ్చింది! మనం ఒక్కళ్ళమే దీనిని చెయ్యటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది చేస్తున్నారు. లక్షలమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళవల్ల కోట్లమంది తయారువుతున్నారు. ఆ లక్షలమందిలో మనం ఒక్కళ్ళం. అంతే! కనుక ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్లు ఒక శాకాహారి ఇంకో శాకాహారిని .. ఒక ధ్యాని మరో ధ్యానిని .. ఒక పిరమిడ్ నిర్మించిన వారు మరో పిరమిడ్ నిర్మించేవారినీ .. తయారుచేస్తున్నారు. “ఎన్నో పుస్తకాలు ఒక వ్యక్తి జీవిత సారాన్నంతా నింపినవి వస్తున్నాయి. ఒక్కొక్కటీ లక్షల ప్రతులుగా అమ్ముడు అవుతున్నాయి. ఒక్కొక్క పుస్తకంలోనూ ఆ మాస్టర్ అనుభవం చదివిన ప్రతివారినీ ఆధ్యాత్మికత వైపు మళ్ళేటట్లు చేస్తోంది. నేను అమెరికా నుంచి వస్తూ ఎన్నో పుస్తకాలు తెచ్చాను. ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక జ్ఞాన విప్లవం నడుస్తోంది. “మనం మన దేశంలో చేస్తే .. వాళ్ళు వాళ్ళ దేశాలలో చేస్తున్నారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకు తెలియదు. ఉదాహరణకు మొన్న కాన్ఫరెన్స్ జరిగినప్పుడు పిరమిడ్ గురించి భారతదేశంలో ఇంత జరుగుతోందని వాళ్ళకు తెలిసింది. వాళ్ళందరూ మన పిరమిడ్‌లు చూడటానికి వస్తామన్నారు. మనం అక్కడకు వారి దగ్గరికి వెళ్తాం. అట్లా అందరికీ అన్నీ తెలుస్తాయి.”

ప్రశ్న: “భారతదేశ ప్రధానిగా మోడీ వచ్చిన తరువాతే ‘యోగ దినోత్సవం’ వచ్చింది!”

పత్రీజీ: “మరి తరువాత ‘ధ్యాన దినోత్సవం’ వస్తుంది. ఒక పది, పదిహేను సంవత్సరాలలో ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది! ఇంకో పది సంవత్సరాలలో అంతా శాకాహారమయం అవుతుంది! అప్పుడు మనం నిరుద్యోగులం అవుతాం. నేను ఎప్పుడు నిరోద్యోగిని అవుతానా అని ఎదురు చూస్తున్నాను. రోగులు లేకపోతే వైద్యుల అవసరమే లేదు. అజ్ఞానులు లేకపోతే యోగుల అవసరమే లేదు. నది ప్రక్కన నీరు అమ్మనవసరం లేదు కదా! ఎడారిలో అవసరం ఉంటుంది. ఎడారులన్నీ నదీ ప్రాంతాలుగా మారిపోతాయి, ఇంకో పది పదిహేను సంవత్సరాలలో.”

ప్రశ్న: “ఒక పది సంవత్సరాల క్రితం సందేహం ఉండేది. ఇప్పుడు నమ్ముతాం. ఎక్కడ చూసినా ధ్యాన సెంటర్లు, పిరమిడ్లు .. మనకి తెలియనివి ఎన్నెన్నో!”

పత్రీజీ: “అమెరికా కనీసం అయిదు వేలమంది పిరమిడ్ ధ్యానులు ఉన్నారు. వారిలో ప్రతి వారూ రోజూ ఎక్కడో ఒకరికైనా, ఆఫీసులోనో .. ఇంట్లోనో ధ్యానం చెపుతూనే ఉన్నారు.”

ప్రశ్న: “మీరు పెంపొందించే వ్యవస్థ అలాంటిది. ఒకానొక మనిషి ధ్యానం చేస్తే ఇక చెబుతూనే ఉంటాడు. మీరు మాస్టర్లను చక్కగా ప్రొత్సహిస్తారు!”

పత్రీజీ: “నా ప్రోత్సాహం వల్ల కాదు. వాళ్ళు స్వయంగా ఎన్నో జన్మలలో సాధన చేసి పరిపూర్ణులైనవారు. మన దగ్గరకు రాగానే అది జ్ఞాపకం వచ్చి వెంటనే తమ ధర్మం తాము మొదలుపెడతారు. ప్రతి జన్మలోనూ ధ్యానం చేసి జ్ఞాపకం చేసుకోవలసిందే. నేను ఎవ్వరికీ శిక్షణ ఇవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళూ తమ జన్మ పరంపరలో స్వీయ శిక్షణ పొందిన వారే. బంగారు ముద్దలా తయారైన వారే. వారు ఇక్కడకు ఆకర్షింపబడతారు. ఇక్కడకు వచ్చి తమ పని తాము చెయ్యటం మొదలుపెడతారు.”

ప్రశ్న: “ఎంతోమంది ధ్యానం చెపుతూ ఉండటం చాలా గొప్ప విషయం సర్!”

పత్రీజీ: “కోట్లాది మంది ఉన్నారు. ఎందరో ధ్యానం చెప్పాలి మరి ఒక్కళ్ళే చెపితే సరిపోదు. లక్షల మంది చెప్పేవాళ్ళు కావాలి. అట్లా చెప్పే వాళ్ళనే నేను ప్రోగు చేశాను.”

ప్రశ్న: “అందుకే ‘ధ్యాన జగత్’ వైపు దూసుకుపోతున్నాం. ఒక్కొక్కరికీ దీక్ష ఇస్తూ పోతే ఇది సాధ్యం అయ్యేది కాదు కదా!”

పత్రీజీ: “ఆ దీక్ష ఇవ్వటం అంత సరియైనది కాదు!” ప్రశ్న: “మీరు ఈ సంవత్సరం ఈ విధంగా చెయ్యాలి .. తరువాత ఇలా చెయ్యాలి .. అని ప్రణాళిక వేసుకుంటారా లేక విజన్‌యా?” పత్రీజీ: “ఎప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తూ పోవడమే. రేపు ప్రొద్దున బ్రేక్‌ఫాస్ట్ గురించి ఈ రోజు ఆలోచిస్తాం కానీ మూడు నెలల క్రితం కాదు కదా! ఇదీ అంతే. ఏం చెయ్యాలి అనిపిస్తే .. ఏ పుస్తకం వ్రాయాలి / చదవాలి అనిపిస్తే అదే చెయ్యటం. అంతా సహజంగా జరుగుతుంది అంతే.”

ప్రశ్న: “అంటే ప్రణాళిక ఏమీ ఉండదా??”

పత్రీజీ: “ప్రణాళిక ఇమిడి ఉంటుంది, కానీ సహజత్వంలో నుంచే అంతా జరుగుతుంది.

ప్రశ్న: “భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలు ఎలా ఉంటాయి?”

పత్రీజీ: “వాళ్ళు చిన్న చిన్న పిరమిడ్‌లలో ప్రయోగాలు చేస్తున్నారు. పిరమిడ్‌ల వల్ల వివిధ ఉపయోగాలు కనుక్కుంటున్నారు .. నిద్రపోవడానికి .. స్వస్థతకూ .. కానీ ధ్యానానికీ, పిరమిడ్‌కూ సంబంధం ఉందని మన ద్వారా తెలుస్తుంది. ధ్యానం కోసం పిరమిడ్స్ అన్నది మన నుంచి ప్రపంచం అంతా తెలుస్తుంది. “పిరమిడ్లు అన్ని చోట్లా వస్తాయి. పిరమిడ్‌లను చూసి ధ్యానానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ధ్యానం చేసి శాకాహారులు అయ్యెవాళ్ళు ఉంటారు. తర్వాత ధ్యానం చెబుతారు. “కర్నూల్‌లో 1991 మొట్టమొదటి పిరమిడ్ వచ్చింది. రెండవ పిరమిడ్ రావటానికి ఆరేళ్ళు పట్టింది. మూడో పిరమిడ్ మరో మూడేళ్ళకు వచ్చింది. ఇప్పుడో .. లెక్కలేనన్ని! కొన్ని పిరమిడ్‌లయితే నేను చూడలేదు, చూడటానికి వీలుపడదు. ఇండియాలో నేను చూడని PSSM పిరమిడ్‌లు ఉన్నాయి. భారతదేశంలో వేరే ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు కూడా ఇప్పుడు పిరమిడ్లు నిర్మిస్తున్నారు. ధ్యానం అంటే పిరమిడ్ అని విస్తృతంగా తెలిసిపోయింది.”

ప్రశ్న: “ఒకప్పుడు పూజకోసం దేవాలయాలు నిర్మించేవారు .. ఇప్పుడు ధ్యానంకోసం పిరమిడ్లు నిర్మిస్తున్నారు .. మనం ఆ విధంగా చేసాం. ఇదంతా ఎలా భావించవచ్చు.?”

పత్రీజీ: “ఎక్కడ ధ్యానం ఉందో అక్కడ నూతనయుగం. పిరమిడ్ ఉన్నచోట స్వర్ణయుగం. శాకాహారిగా మారినవారు బంగారు మనిషి. హింస నుంచి అహింసలోకి వచ్చినవారు బంగారం కాక మరేమిటి?”

ప్రశ్న: “భారతదేశం ఉత్తమ శాకాహార దేశం అని ఎందుకు అంటారు?”

పత్రీజీ: “మన భారతదేశంలో దొరికినంత శాకాహారం ప్రపంచంలో మరెక్కడా దొరకదు. భారతదేశం అత్యుత్తమ శాకాహార దేశం. ప్రపంచంలో శాకాహారం సంఖ్య పెరుగుతోంది. వివిధ దేశాలలో ప్రజలు భారతీయ రెస్టారెంట్లకు వచ్చి తింటున్నారు. వారు నెమ్మదిగా మన వంటకాలు వండడం నేర్చుకుంటారు. అమెరికాలోని ఇండియానాపోలిస్ లో ఒక చర్చ్‌వారు గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ ‘శాంతి శ్రీ మేడమ్’ను ప్రతినెలా ఒక ధ్యానం క్లాసు ఇచ్చిన తరువాత ఒక శాకాహార వంటకం నేర్పమన్నారు. త్వరలో మన వంటలు అందరూ అడిగి నేర్చుకుంటారు. చికాగోలో ఒక ‘ఉడిపి’ హోటల్ ఉంది.!”

ప్రశ్న: “అవును సార్! ప్రపంచ వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్ల డిమాండ్ పెరుగుతోందని విన్నాను.”

పత్రీజీ: “సాత్విక వంటలు జగత్‌కు ఇది నాంది. పిరమిడ్ మాస్టర్లు ధ్యానంతోపాటు సాత్వికాహారం తయారు చెయ్యటం కూడా నేర్పిస్తారు. ప్రతిరోజూ ధ్యానం ఎలా అవసరమో, భోజనం కూడా అంతే అవసరం. కనుక అందరూ నేర్చుకుంటారు.”

ప్రశ్న: “నా పాదాలు కాదు .. పదాలు పట్టుకోవటంలో అర్థం ఏమిటి సార్?”

పత్రీజీ: “పాదాలలో ఏమీ ఉండదు, దుమ్ము తప్ప! పదాలు అంటే ‘జ్ఞానం’ పట్టుకోండి. దానిని ఉపయోగించుకోండి .. ఆ దిశలో పయనించండి అని అర్థం.”

ప్రశ్న: “మీరందరికీ స్వేచ్ఛనిచ్చారు ఎందుకు?”

పత్రీజీ: “స్వేచ్ఛను దొంగలించినవాడు తన స్వేచ్ఛను తాను కోల్పోతాడు, మనం మన చుట్టూ ఉన్న వారందరికీ ఎంత ఎక్కువ స్వేచ్ఛనిస్తే మనం అంత స్వేచ్ఛగా ఉండగలం. ధనం సమయం, స్వేచ్ఛ ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మనం దేనినైనా బంధిస్తే మనమే బంధనాలలో ఇరుక్కుంటాం.”

ప్రశ్న: “మోక్షం అంటే ఏమిటి?” పత్రీజీ: “ముక్తి, మోక్షం, అపవర్గం, నిశ్రేయస్సు, ఎన్‌లైటెన్‌మెంట్ ఇవన్నీ పర్యాయపదాలు. దుఃఖం లేకుండా ఉండటమే మోక్షం. ఎవరో ఏదో అన్నారని విచార పడకుండా ఉంటూ మనం చెయ్యవలసింది చేయడమే మోక్షం.” ప్రశ్న: “నేను పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను; కానీ నా జీవితలక్ష్యం తెలియటం లేదు ..”

పత్రీజీ: “ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం .. మూడు గంటలపాటు చెయ్యండి. సజ్జన సాంగత్యం ద్వారా జీవిత లక్ష్యం క్రమంగా తెలుస్తుంది. పిరమిడ్ నిర్మాణం, ధ్యానం చెప్పటం, పుస్తకాలు వ్రాయటం .. ఇలా ఉండకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్లే!”

ప్రశ్న: “మీకు విస్తృతమైన స్వాధ్యాయం ఎలా సాధ్యమైంది?”

పత్రీజీ: “చిన్నప్పటి నుంచీ నేను పుస్తకాల పురుగును. ఎనిమిది ఏళ్ళ వయస్సులోనే మహాత్మాగాంధీగారి `My Experiments with Truth’ .. పది ఏళ్ళ వయస్సులోనే విశ్వనాథ వారి ‘వేయి పడగలు’ .. పదిహేను ఏళ్ళ వయస్సులో పండిత రాధాకృష్ణన్ గారి 2 volumes of `Indian Pholosophy’ .. తరువాత విలియం షేక్స్పియర్, చాసర్, టర్జెనీవ్, డాస్టవిస్కీ వంటి మహామహులనందరినీ చదివాను. హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఉదయం 10.00 గంటలకు లైబ్రెరీకి వెళ్ళి రాత్రి వరకు అక్కడే ఉండేవాడిని. పుస్తకాలు అంటే నాకు అంత ఇష్టం. అందుకే అందరికీ అదే చెబుతాను. ప్రతి ఒక్కరి నుంచీ నేర్చుకోవాలి కనుక వివిధ ఆధ్యాత్మికవేత్తల పుస్తకాలు చదవాలి.”

ప్రశ్న: “ధ్యానం చేస్తే కర్మలు పోతాయా సార్?”

పత్రీజీ: “ధ్యానం చేస్తే కర్మలు పోయేమాట నిజమే కానీ మనకు ‘హిమాలయాలంత’ కర్మలు ఉంటే ‘గోల్‌కొండ’ అంత కొద్దిపాటి ధ్యానంతో అది తొలగదు. కొండంత కర్మకు కొండంత ధ్యానం చెయ్యాలి. గోరంత కర్మకు గోరంత ధ్యానం చాలు.”

ప్రశ్న: “అక్టోబర్ 2వ తేదీన మీరు ఎక్కడ ఉంటారు?”

పత్రీజీ: “నేను బెంగళూరులో ‘Global Spiritual Scientist`s Festival’ లో ఉంటాను. అన్నిచోట్లా జరిగే శాకాహార ర్యాలీలు యధావిధిగా జరిగి PMC లో ప్రసారం చేస్తారు. నేను అమెరికాలో ఉండి PMC చూస్తూ ఈ విశేషాలన్నీ తెలుసుకున్నాను.”

ప్రశ్న: “కరుణ, ప్రేమ ఒక్కటేనా?”

పత్రీజీ: “చిన్నపిల్లలపై ఉండేది ప్రేమ .. తల్లిప్రేమ. బాధలలో ఉన్నవారిపై చూపేది కరుణ. తల్లికి తన పిల్లలపై ప్రేమ ఉన్నట్లే మానవులందరికీ పక్షులు, జంతువులపై ప్రేమ ఉండాలి. వాటిని ప్రేమగా చూసుకోవాలి .. వాటిపై చూపవలసింది కరుణ కాదు; ప్రేమ. సమస్యలలో ఉన్నప్పుడు సహాయం చెయ్యడం కరుణ. మిగిలిన సమయాలలో మిత్రత్వంలో ఉండాలి.”

ప్రశ్న: “పదహారు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ .. చెబుతూ ఉన్నాను. అయినా ఇంకా చెప్పాలనే ఉంది. ఈ చెప్పాలి అన్న అర్థ్రత ఎప్పుడు తీరుతుంది?”

పత్రీజీ: “అది ఎప్పటికీ తీరదు. ధ్యాన ప్రచారం చేస్తూ ఇది నా ఆరవజన్మ. ఈ లోకంలో తీరిపోయినా పై లోకాలలో మళ్ళీ ధ్యాన ప్రచారం చేస్తాం. ఎక్కడ ఉన్నా అక్కడ చేస్తాం. ఇది అంతం లేనిది. ఆరంభమే కానీ అంతం లేదు. అంతులేని వింత కథ.”

ప్రశ్న: “రెండు సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను .. ఏ అనుభవం రావటం లేదు ..”

పత్రీజీ: “ఎవరికి ఏది రావాలో అది వస్తుంది. ఏది రానవసరం లేదో అది రాదు. కొంతమంది వస్తున్నాయని విచారపడతారు. బాగా ధ్యానంచేసి మూడవ కన్ను తెరుచుకుంటే ఇతరలోక వాసులు కనిపించినప్పుడు అర్థం కాక భయపడతారు. వారు తమతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని తెలియదు. మీకు రావలసింది వస్తుంది. అక్కరలేనిది రాదు. ఎప్పుడూ సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి. కర్మ చేసే అర్హత ఉంది గాని దాని ఫలం ఆశించే అర్హత లేదు. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. స్వాధ్యాయం చేస్తే జ్ఞానం వస్తుంది. సజ్జన సాంగత్యం వల్ల అహంకార రాహిత్యం వస్తుంది; ధ్యానబోధ వల్ల మిత్రలాభం వస్తుంది. ఆధ్యాత్మికత అంటే అహంకార రాహిత్యమే. మూడు లోకాలలోనూ దుఃఖం నుంచి బయటపడ వేసేది సజ్జన సాంగత్యమే.”

ప్రశ్న: “పిరమిడ్‌లు ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు పోతాయా సార్!”

: “వస్తువులు మనల్నీ, మనం వస్తువులనూ effect చేస్తాం. ప్రతీదీ ఇంకోదాన్ని మనపై 5% ఉంటే మన ప్రభావం వస్తువులపై 95% ఉంటుంది. పిరమిడ్ ప్రభావం 5% అయితే పిరమిడ్‌లో ధ్యానం చెయ్యటం వల్ల దాని శక్తి 95% పెరుగుతుంది.”

ప్రశ్న: “నేను ధ్యానం చేస్తూ నిద్రపోతాను అలా కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి?”

పత్రీజీ: “ధ్యానస్థితిలో పోయేది మాయా నిద్రకాదు, యోగనిద్ర. అది మాయానిద్ర కంటే ఆరు రెట్లు శక్తివంతం. “ధ్యానంలో ఏది వస్తే దానిని ఆనందంగా అంగీకరించాలి. ముభావంగా కాదు. జీవితానుభవాలను కానీ, ధ్యానానుభవాలను కానీ, స్వప్నానుభవాలను కానీ గెంతులు వేస్తూ ఆనందించాలి. ‘విశ్లేషణ’ అన్నది అస్సలు కూడనే కూడదు.”

ప్రశ్న: “ధ్యానం ద్వారా మనస్సును అదుపు చేసుకోవటం ఎలా?”

పత్రీజీ: “మనస్సును ఎవ్వరూ అదుపు చేసుకోలేరు. శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు అన్నది అదే అదుపులోకి వచ్చేస్తుంది. అల్లరిచేసే పిల్లవాడు తల్లి ఒడిని చేరి అల్లరి ఆపినట్లు శ్వాస చెంత చేరగానే మనస్సు నెమ్మదిస్తుంది.”

ప్రశ్న: “కొంతమంది గురువులు ప్రజలకు అర్థం కావటానికి కథలు చెబుతారు .. మీరు సూటిగా చెబుతారు ఎందుకు?”

పత్రీజీ: “నేను సూత్రాలు చెబుతాను. నా దగ్గర సమయం లేదు. నేను ప్రపంచంలోని మనుష్యులందరినీ కలుసుకోవాలి. ఒక్కళ్ళకోసమే ఒక రోజంతా వెచ్చించే సమయం నా దగ్గర లేదు. నేను రోజుకు వెయ్యిమందిని కలుస్తాను. వెయ్యిమందికి వెయ్యి కథలు చెప్పలేను కదా!?

ప్రశ్న: “ధ్యానం చేసేటప్పుడు వెన్ను నిటారుగా పెట్టడం తప్పనిసరియా?”

పత్రీజీ: “వెన్ను నిటారుగా పెట్టనవసరం లేదు. శరీరానికి అసౌకర్యంగా కలిగించకూడదు. అసౌకర్యంతో ధ్యానం రాదు. స్థిర సుఖాసనం అన్న మౌలిక సత్యం తెలుసుకోవాలి. ఆత్మకు శరీరం నీడలాంటిది. నీడ మీద ఎందుకు ధ్యాస? మనం అంటే ఆత్మ.”

ప్రశ్న: “పంటలకు పురుగులు పడితే మందులు వేస్తాం .. మనకు ధ్యానం అటువంటిదా ..?”

పత్రీజీ: “పురుగులను చంపకూడదు. పురుగులు తినగా మిగిలినదే మనది. పురుగులను చంపి మిగుల్చుకుని తినకూడదు. పురుగుమందులు కొట్టకూడదు. కొడితే దాని ఫలతం అనుభవిస్తాం. పురుగుల మందులు వద్దు. కలుపు మొక్కలను తీయండి. కానీ వాటికోసం మందు కొట్టవద్దు. పురుగులు రాకుండా చేసుకోండి. అహింసా వ్యవసాయం చేయండి!”

ప్రశ్న: “ధ్యానం చేస్తే 100% రోగాలన్నీ నయమవుతాయా?”

పత్రీజీ: “కర్మలను బట్టి – దానికి తగినట్లు ధ్యానం చెయ్యాలి. దీని గురించి ఇందాక వివరించాను.”

ప్రశ్న: “రమణమహర్షి శరీరాన్ని పట్టించుకోలేదు!”

పత్రీజీ: “మనం కూడా అంతే. మనం భయపడితేనే రోగం వస్తుంది. లేకపోతే రాదు. శరీరం మీద ధ్యాస పెడితేనే, రోగాలు వస్తాయి.”

ప్రశ్న: “మీ నుంచి ఈ రోజు ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకున్నాము. కృతజ్ఞతలు సార్!”

పత్రీజీ: ” ‘ధ్యానమహాచక్రం – 9’ .. డిసెంబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతుంది. అందరూ తండోపతండాలుగా తరలిరండి!”