ఓంకారంలో వివిధ ఆత్మస్ధాయిలు
ఓంకారం లో సృష్టి అంతా ఇమిడి వుందనీ, ఓంకారాన్ని అవగతం చేసుకోగలిగితే సృష్టిరహస్యమంతా ఔపోసన పట్టినట్లేననీ, అదే ప్రణవనాదమనీ, అదే సర్వదేవతా స్వరూపమనీ … మనం వింటూ వస్తున్నాం.
అయితే, వీటితో పాటుగా జన్మ – కర్మల సమగ్రత్వాన్నీ, ఆత్మపురోగతినీ వ్యక్తీకరించటంలో ఓంకారపు ప్రాశస్త్యాన్నీ మనం ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకుందాం.
మనిషి అంటే ఆత్మ మరి శరీరం అనే రెండింటి కలయిక. శరీరపు ఎదుగుదల, శరీరపు స్థాయిల గురించి మనకు మాములుగా తెలిసిన సంగతే. అయితే రహస్యాంశమైన ఆత్మస్థాయిలు అనేవి ఓంకారంలో ఎలా ఇమిడి ఉన్నాయో చూద్దాం.
ఓం లో అయిదు భాగాలు ఉన్నాయి. ఆ అయిదు భాగాలూ మానవ ఆత్మపురోగతిలో అయిదు క్రమస్థాయిలను సూచిస్తాయి.
ఓం లో మొదటి భాగం శైశవాత్మ నూ, బాలాత్మ నూ సూచిస్తుంది.
శైశవాత్మలూ మరి బాలాత్మలు కేవలం శరీరానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. తమోగుణ ప్రధానులై, పూర్తి అమాయకత్వంలో నిండి ఉంటారు. తినటం, పడుకోవటం తోనే జీవిస్తూంటారు. మనిషి అంటే శరీరం మాత్రమే అంటారు; శరీరాన్ని సౌకర్యంగా ఉంచుకోవటానికీ, సుఖపెట్టటానికీ మాత్రమే నిరంతరం ప్రయత్నిస్తూంటారు.
ఓం యొక్క రెండవ భాగం యవ్వన దశ లో ఉన్న ఆత్మస్ధాయికి సంకేతం.
వీళ్ళు రజోగుణ ప్రధానులు. మనస్సును ఆధారంగా చేసుకుని ప్రవర్తిస్తూ వుంటారు. జీవితంలో ప్రతీదీ పేరు, ప్రతిష్ట, అన్న వాటికోసమే అంటారు. సర్వవేళలా, సర్వత్రా ప్రాధాన్యత తమకే కావాలనుకుంటారు. విపరీతమైన మాయతో నిండి ఉంటారు. ఎవ్వరు ఏమైనా సరే, ఏం చేసి అయినా సరే మేము, మా పరివారం సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు. అశుభమైన అలోచనలు నిరంతరం చేస్తూ ఉంటారు.
ఓం యొక్క మూడవ భాగం ఓ ప్రౌఢ ఆత్మ కు సంకేతం. ఇది సాత్త్విక గుణప్రధానమైనది, నిరంతరం ప్రజలందరినీ ఉద్ధరిద్దాం, అందరికీ మంచి చేద్దాం అన్న ఆలోచనలతో బుద్ధి ప్రధానంగా వ్యవహరించే శుభాత్మలు వీరు. అందరినీ ఉద్ధరిద్ధాం, ఏదో చేసేద్దాం అన్న సరిక్రొత్త మాయలో పడి కొట్టుకుపోతుంటారు.
ఓం లోని నాలుగవ భాగం, అర్థ చంద్రాకారం, వృద్ధ ఆత్మలను సూచిస్తుంది ఇది ధ్యాన జీవితానికి సంకేతం. వృద్ధాత్మలు సదా శుద్ధ సాత్వికత్వం తో నిండి ఉంటారు. తాము శరీరం ఎంత మాత్రం కాదనీ, ఆత్మలమనీ గ్రహిస్తారు.
ఓం లోని అయిదవ భాగం అర్ధచంద్రాకారం మధ్యలో ఉన్న చుక్క. ఇది పూర్ణాత్మ కు సంకేతం. వీరు నిర్గుణులు. సర్వదేశకాల పరిస్థితుల్లోనూ అఖండమైన జ్ఞానమయ ఆనందమయ జీవితాలను గడుపుతూంటారు.
ఈ విధంగా మానవ ఆత్మ అమాయకత్వం నుంచి పూర్ణాత్మగా మారే వరకు గల వివిధ స్థాయిలు ఓంకారం లో ఇమిడి ఉన్నాయి.
ఈ విధంగా ఓం గురించి తెలుసుకోగలిగితే మానవ పరిణామ క్రమమంతా సంపూర్ణంగా తెలుసుకున్నట్లే.