“ॐ కార ‘పిరమిడ్’ పురాణం”
ఈ సకల చరాచర సృష్టిలోనే “ఆదిమంత్రం”గా పిలువ బడుతూన్న “ॐ” అన్న సంస్కృత బీజాక్షరం .. అనంతమైన విశ్వశక్తితో నిండి ఉన్న “ప్రణవ మంత్రం”గా చెప్పబడుతోంది!
“ॐ” అన్న ఈ “ప్రణవ మంత్రం” గురించి తెలుసుకుంటే మనకు మన గురించీ, మన జన్మ ప్రణాళిక గురించీ, మరి ఈ విశ్వసృష్టిలో మనయొక్క భాగస్వామ్యం గురించీ క్షుణ్ణంగా తెలుస్తుంది.
లేకుంటే ఒకానొక ఏనుగు యొక్క తోకనో, తొండాన్నో స్పర్శించి “అదే మొత్తం ఏనుగు” అని నిర్ధారణకు వచ్చే గ్రుడ్డివాళ్ళ సమూహంలా ఉంటుంది మన వ్యవహారం.
“అయిదు విభాగాలు”
“ॐ” అన్న ఈ మూలమంత్రంలో మొత్తం అయిదు విభాగాలు ఉన్నాయి.
1. ఇందులో మొట్టమొదటి విభాగం అయిన “)” అనే అర్థవృత్తం.. నఖశిఖ పర్యంతంగా ఉన్న మన శరీరాన్ని గురించి తెలియజేస్తుంది.
ఈ అన్నమయ కోశాన్నే “మనం” అనుకుంటూ మనం .. దానితో “తల్లి-తండ్రి .. భార్యా-పిల్లలూ .. స్నేహితులూ-బంధువులూ” అన్న అనేకానేక బంధాలూ మరి బంధనాలూ ఏర్పరచుకుంటూ ఉంటాం! జీవితమంతా ఆ బంధాలను నిలుపుకోవడానికే కష్టపడతాం!
అయితే రాత్రంతా నిద్రపోయి ఉదయం లేవగానే కల చెదిరి పోయినట్లు .. శరీరం వదిలెయ్యగానే అంతకు ముందున్న ఈ “అమ్మా-నాన్న .. భార్య-భర్త .. కొడుకు-కోడలు .. నా బంధువులు .. నా వాళ్ళు” అన్న బంధాలన్నీ కూడా “మాయతో కూడుకున్నవే” అని అర్థం అవుతుంది.
అది ఒక “డెడ్ ఎండ్”. అప్పుడు మొదలవుతుంది మనలో మనస్సును గురించిన ఆలోచన!
2. ప్రణవమంత్రంలోని రెండవ విభాగం అయిన “)”అంటే “మనస్సు” ను గురించి తెలుసుకుంటేనే మనకు మనస్సు ద్వారా ఏర్పడిన సమాజం గురించి అర్థం అవుతుంది.
ఈ సమాజంలో “నేను ఒక హిందువు” ని .. అందులోనూ “నేను ఒక వైష్ణవుడిని .. ఒక శైవుడిని .. ఒక బ్రాహ్మణుడిని .. ఒక క్షత్రియుడిని” అంటూ చిలువలు పలువలుగా మనల్ని మనం గుర్తించుకుంటూ సతమతమవుతూ ఉంటాం.
“నేను క్రిస్టియన్‌ని .. నేను మహ్మదీయుడిని .. నేను జోరాస్ట్రియన్‌ని” అంటూ రకరకాల మతాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. ” నేను ఫలానా మంత్రిని ..ఫలానా రాష్ట్రానికి అధికారిని ..ఫలానా కళాకారుడిని” అనుకుంటూ డబ్బూ-దస్కం..కీర్తి-ప్రతిష్టలూ కూడేసుకుంటూ ఉంటాం. అయినా కూడా మన గురించి మనకు సంపూర్ణంగా అర్థం కాదు!
ఇక్కడకూడా నిద్రపోయి లేవగానే కల చెదిరిపోయినట్లు చనిపోయి శరీరం వదిలేయగానే “ఇవేవీ మనం కాదు .. అంతా మాయే” అని అర్థం అయిపోతుంది. అదొక “డెడ్ ఎండ్!”
3. ఇక అక్కడ “~” అన్న మూడవ విభాగం దగ్గర మనలో “సత్యాన్వేషణ” మొదలవుతుంది.
“అసలు నేనెవరు?” .. “ఈ శరీరమా? ..కాదు!” మరి “మనస్సా ..కాదు!” .. “మరి ఇంతకీ నేనెవరు?” అనే మిలియన్ డాలర్ల ప్రశ్నలు మన ముందుకు వస్తాయి! ఇలా “నా శరీరం నేను కాదు .. నా కుటుంబం నేను కాదు .. నా మనస్సు నేను కాదు .. నా సమాజం నేను కాదు” అన్న స్పష్టత మనలో వచ్చాక .. అప్పుడు వస్తారు మన దగ్గరికి “గురువులు” పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాలు పుచ్చుకుని .. “నువ్వెవరో తెలుసుకో” అంటూ!
గురువులు చెప్పినవన్నీ వింటాం .. గ్రంథాలన్నీ చక్కగా చదివేస్తాం! అయినా మన ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఒక గురువు బోధలు మనల్ని పైకి తీసుకెళితే .. ఇంకొక గురువు బోధలు మనల్ని జర్రున క్రిందికి జార్చేసి బాధలకు గురి చేస్తాయి!
కొన్ని సరియైన గ్రంథాలు కొంతమేర మనకు స్పష్టతను ఇస్తే మరికొన్ని సరికాని గ్రంథాలు మనల్ని అయోమయంలోకి నెట్టివేస్తాయి.
అది కూడా ఒక డెడ్ ఎండ్!
కాకపోతే “ఈ శరీరమూ మరి మనస్సూ అంతా కూడా మాయే .. అన్నీ తాత్కాలికాలే; శాశ్వతమైంది ఇంకేదో ఉంది” అన్న స్పష్టత మాత్రం మనకు ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది!
4. అలాంటీ స్పష్టత వచ్చాక మనలో అదేమిటో తెలుసుకోవాలన్న గట్టి పట్టుదల వస్తుంది. “అందుకోసం చచ్చినా ఫరవాలేదు” అంటూ పట్టిన పట్టు విడవకుండా ఆ శాశ్వతమైన దానికోసం అన్వేషణ మొదలుపెడాతాం! అప్పుడే మనకు “U”అర్థమాత్రరూపంలో ఉన్న “జీవాత్మ” గోచరం అవుతుంది.
అయితే ఇక్కడివరకూ “ॐ” ఆకారంలోని శరీరం, మనస్సు, గురువులు, పుస్తకాలు మరి సమాజం అన్న విభాగాలు కూడా దేనికదే ఒక్కొక్క డెడ్ ఎండ్‌ని కలిగి ఉన్నా కూడా .. అన్నీ కలిసి ఉండడంవల్ల అక్కడ ఏదో ఒక ఆధారంతో ఒక విభాగం నుంచి ఇంకొక విభాగంలోకి చక్కగా వెళ్ళే వెసులుబాటు మనకు ఉంటుంది.
కానీ వీటన్నింటికీ పైన ఏ ఆధారమూ లేకుండా నిరాధారంగా గాలిలో నిలుచుని ఉన్న అర్థచంద్రకారపు “ఆత్మ” ను పట్టుకోవాలంటే మాత్రం మన దగ్గర ఏదో ఒక “బలమైన ఆధారం” ఉండి తీరాలి!
ఆ ఆధారమే మరి “శ్వాస మీద ధ్యాస” ధ్యాన సాధనా విధానం!
ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన నిచ్చెన మెట్లలాంటి ధ్యానం ద్వారా మనం .. అంతవరకూ శరీరం ద్వారా, మనస్సు ద్వారా .. గురువులు ద్వారా మరి పుస్తకాల ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో పరిణామక్రమంలో పైపైకి ఎక్కుతూ .. శాశ్వతమైన ఆత్మను పట్టుకోగలుగుతాం!
అక్కడ “మనం అంటే ఈ కేవల శరీరం, కేవల మనస్సూ మరి కేవల గురుబోధలూ, కేవల శాస్త్ర పఠనాలూ మాత్రమే కావు; మనం అంటే వీటన్నింటికీ అతీతమైన మరి అత్యంత శక్తివంతమైన ఆత్మస్వరూపులం” అని తెలుసుకుని ఆత్మయొక్క సర్వవ్యాపకత్వానికి ఆనందపడిపోతాం!
అయితే అది కూడా అసంపూర్ణమే!
5. ఇంకా ఆ పైన ఉన్న “ం” పూర్ణాత్మను చేరుకునే వరకూ మన ఈ ప్రయాణం ఎంతమాత్రం ఆగదు! ఏ ఆధారం లేకుండా అలా శూన్యంలో ఉన్న ఆ “పూర్ణ బిందువు” అంటే పరమాత్మను చేరుకోవాలంటే మన దగ్గర మరింత బలమైన ఆధారం ఉండాలి. ఆ బలమైన ఆధారం మరి అత్యంత విశిష్ఠమైన సాధనమే .. “సేవ”.
“సేవ” అంటే ఏదో అన్నదానమో, వస్త్రదానమో, గోదానమో, భూదానమో, ధనదానమో చేసేసి చేతులు దులుపుకోవడం ఎంత మాత్రం కాదు. “ధ్యాన ప్రచారం” ద్వారా ప్రతి ఒక్కరిలోనూ నిద్రాణంగా ఉన్న ఆత్మలను తట్టిలేపి .. వారు కూడా తమలో ఉన్న ఆత్మతత్వాన్ని దర్శించుకునేలా “ధ్యానసేవ” చెయ్యాలి! కేవలం ఇలాంటి “సరియైన ఆధ్యాత్మిక సేవ” మాత్రమే మనల్ని పూర్ణబిందువు రూపంలో ఉన్న అత్యంత ఉన్నతమైన పరమాత్మ స్థాయికి చేర్చగలుగుతుంది.
“ధ్యానసేవ” ద్వారా మనమంతా పరమాత్మల్లా విలసిల్లుదాం .. మరి ‘పునర్జన్మ’ అన్నది లేకుండా చేసుకుందాం!