`సమస్యల భావనా రహిత’ – ప్రజ్ఞ

“ `NO PROBLEMS’ – CONSCIOUSNESS”

 

“మనస్సు” అన్నది “సమస్యలను సృష్టించే ఒకానొక యంత్రం’!

అది దేని నుంచి అయినా సరే .. ఏ సందర్భంగా అయినా సరే .. సమస్యలను సృష్టించగలుగుతుంది. మనం సమస్యాభావన లేకుండా ఉండడానికి సిద్ధపడేంతవరకూ అది ఒకదాని తరువాత మరొక సమస్యను సృష్టిస్తూనే ఉంటుంది.

ఎప్పుడయితే మనం “ `సమస్యల భావనా రహిత’ ప్రజ్ఞ” .. “ `No Problems’ Consiousness” ను అలవరచుకుంటామో .. అప్పుడు మనం ఒక నూతన ప్రపంచాన్ని మన జీవితంలో ఆవిష్కరించుకోగలుగుతాం.

దీనికోసం మనం జీవితంలో ఏదైనా ఒక అనుభవానికి లోనయినప్పుడు .. “సమస్య ఉంది” అని మన మనస్సు ప్రలోభపెట్టినా సరే పట్టించుకోకుండా .. అలా నిశ్చలంగా ఆత్మయుత ఎరుకతో ధ్యానంలో కూర్చోవాలి!

మనస్సుకు .. సమస్యకోసం ఎదురుచూసే సమయం ఉండదు కనుక .. మన ధ్యాన సమయం ప్రగాఢం అయ్యేకొద్దీ సమస్య నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది! అప్పుడిక “నా మనస్సుకే సమస్య ఉంది కానీ .. నాకు కాదు” అని మనకు తెలిసిపోతుంది.

ధ్యానం వలన కలిగే ఇటువంటి స్వేచ్ఛానుభూతితో మనం అంతవరకూ ఊహించుకుంటూ వచ్చిన మనో పరిమితులను అధిగమించి .. విస్తారమైన ఆత్మచైతన్య క్షేత్రంలోకి ప్రవేశిస్తాం!

అక్కడ ఇక “సమస్యలు” అన్నవి “చాలా చిన్న విషయాలు”గా అనుభూతి చెందుతూ మనం మన సహజ అభివృద్ధితో కూడిన ఆత్మ పరిణితిని హాయిగా సాధించగలుగుతాం! “బుద్ధత్వ సాధన” అంటే ఇదే!

“బుద్ధత్వం” అంటే మానసికంగా “ఎప్పుడూ సమస్య లేదు” అనే తత్వంలో ఉండటమే! ఒకానొక సమస్య మన మనస్సును పీడించుకుని తింటూ ఉందంటే మనకు నిశ్చయంగా బుద్ధత్వం లేనట్లే. ఏ చిన్న విషయం గానీ, పెద్ద విషయం గానీ మనకు సమస్య కాకూడదు.

ఏదేని ఒక విషయం మన మనస్సుకు సమస్యగా అయ్యిందంటే “మనం ఇంకా బుద్ధళ్ళుం కాలేదు” అని అర్థం. బుద్ధుళ్ళకు స్వంతంగా ఏ సమస్యలూ ఉండవు. అందువల్లనే వారు లోక కళ్యాణ కార్యక్రమాలలో సదా నిమగ్నమై ఉంటారు.

ఒకానొకసారి బుద్ధుడు `పూర్ణుడు’ అనే తన శిష్యునికి “నిన్ను ధ్యాన ప్రచారానికి సింహళ దేశం పంపిస్తాను. వాళ్ళు దుర్మార్గులు. నిన్ను దూషణ చెయ్యవచ్చు .. నువ్వు వెళతావా?” అని ఒక ప్రశ్న వేశాడు.

అందుకు పూర్ణుడు “దూషణలే చేస్తారు కదా .. పట్టి హింసించరు కదా” అన్నాడు. “ఒక్కోసారి అది కూడా చేస్తారు” అన్నాడు బుద్ధుడు. “అంతే కదా! చంపరు కదా!” అన్నాడు పూర్ణుడు.

“చంపినా చంపుతారు” అన్నాడు బుద్ధుడు. “ఓస్! అంతేకదా! అప్పుడు తిన్నగా మీ వద్దకు వచ్చేస్తాను” అన్నాడు పూర్ణుడు!

పిరమిడ్ మాస్టర్లందరూ కూడా బుద్ధత్వం సంపూర్ణంగా మూర్తీభవించనవారే!