నరుడు – నారాయణుడు

 

“నేను” అంటే .. శరీరం + మనస్సు + బుద్ధి + శ్వాసల యొక్క పరిపూర్ణ కలయికకు “మూలం” అయిన శుద్ధచైతన్య స్వరూపం!

“శుద్ధ చైతన్య స్వరూపం” అయిన “నేను”కు ఈ శరీరం తల్లితండ్రుల నుంచి లభిస్తుంది; మనస్సు సమాజం నుంచి వస్తుంది; బుద్ధి పూర్వజన్మల సంస్కారాల నుంచి ప్రాప్తిస్తుంది; మరి శ్వాస ప్రకృతి నుంచి వస్తుంది.

ఇలా తల్లితండ్రుల నుంచి వచ్చిన శరీరాన్ని కాస్సేపు వదిలిపెట్టేసి .. సమాజం నుంచి వచ్చిన మనస్సును కాస్సేపు ప్రక్కకు నెట్టేసి .. మరి పూర్వజన్మల సంస్కారం నుంచి వచ్చిన బుద్ధిని కూడా కాస్సేపు వదిలిపెట్టేసి ప్రకృతి నుంచి వచ్చిన శ్వాసతో “నేను” అన్నది ఏకం కావడమే “ధ్యానం”.

ధ్యానంలో మనం .. “నేను” అంటే అనేకానేక జన్మల పరంపర నుంచి వస్తూన్న ఆత్మస్వరూపాన్ని .. “ఇది నాకు మొట్టమొదటి జన్మ ఎంత మాత్రం కాదు” అని తెలుసుకుంటాం; అలా తెలుసుకోవడమే “జ్ఞానం” .. “ఆత్మజ్ఞానం”! అందుకే మహాభారత యుద్ధంలో గీతాబోధ చేస్తున్న శ్రీకృష్ణుడిని “నువ్వెవరివయ్యా?” అని అర్జునుడు అడిగినప్పుడు “అర్జునా! నేను ఆత్మను! నువ్వూ, నేనూ అనేక జన్మలు తీసుకున్నాం. నాకు నా జన్మలు అన్నీ తెలుసు; కానీ నీకు నీ జన్మలు తెలియవు. అదే నీకూ నాకూ ఉన్న బేధం” అని చెప్పాడు.

ఈ భూలోకంలో జన్మ తీసుకున్న ప్రతి చిన్న పిల్లవాడు కూడా పెరిగి పెద్దవాడిగా అయితీరినట్లు .. తనకు తాను “శరీరం” అనుకుంటూన్న ప్రతి నరుడు కూడా .. శైశవాత్మ – బాలాత్మ – యువాత్మ – ప్రౌఢాత్మ – వృద్ధాత్మ స్థాయిలను దాటి – ముక్తాత్మ స్థాయిలో తనను తాను “ఆత్మ” తెలుసుకునే స్థితి దాటి పరమాత్మ అయిన “నారాయణుడి”గా అయితీరాలి. అంతా ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో!

అందుకుగాను అతడు మిగిలిన భువర్లోకం – సువర్లోకం – జనాలోకం – మహాలోకం – తపోలోకాలకు సంబంధించిన జ్ఞానంతో తనను తాను పరిపుష్టం చేసుకుని చివరగా “సత్యలోకం” చేరుకోవాలి. ఏ జన్మలో అయితే అతడు “సత్యలోకం” చేరి తనను తాను నారాయణుడిగా గుర్తించుకుంటాడో ఇక అప్పుడు అతనికి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు.

వేదవ్యాసులవారు మహాభారతం ద్వారా ఒక శ్రీకృష్ణుడి పాత్రను .. ఒక అర్జునుడి పాత్రను .. ఒక ధర్మరాజు పాత్రను .. ఒక దుర్యోధనుడి పాత్రను అలాగే ఒక ద్రౌపది పాత్రను .. ఇలా అనేకానేక పాత్రలను సృష్టించి వాటి ద్వారా మనకు అనేకానేక శరీరాలను గురించి, అనేకానేక ఆత్మస్థితులను గురించీ మరి అనేకానేక శరీరాలను గురించీ, అనేకానేక ఆత్మస్థితులను గురించీ మరి అనేకానేక లోకాలను గురించీ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. “థియోసోఫికల్ సొసైటీ” ద్వారా మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఆల్కాట్, అనీబిసెంట్ వంటి గొప్ప గొప్ప యోగులు మనకు ఇతర లోకాల సమాచారాన్ని విశేషంగా అందించారు.

రకరకాల ఆత్మస్థితుల ద్వారా రకరకాల లోకాలలో అనుభవ జ్ఞానాన్ని గడించి ఒకానొక పరమాత్మగా పరిణామం చెందడానికి ఈ భూలోకానికి విచ్చేసిన యాత్రికులం అయిన మనకు ఇక్కడ మనదంటూ స్వంత భూమి ఏదీ లేదు, స్వంత మనుషులు ఎవ్వరూ లేరు! ఇక్కడ ఉన్నవారితో కలసి మనం అన్నీ నేర్చుకుంటూంటాం; మరి నేర్చుకోవడం అయిపోయాక మళ్ళీ ఇక్కడి వారిని ఇక్కడే వదిలి పెట్టేసి వెళ్ళిపోతాం!

ఇక్కడ ఈ భూమండలం మీద ఇప్పటికే అహింస ఉండి ఉంటే, ఇక్కడ వున్న వాళ్ళంతా ధ్యానులు, శాకాహారులే అయి వుంటే .. మరి ఇక్కడ ఉన్న జంతువులన్నీ స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తూంటే .. మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు! ఇక్కడ మనకు అసలు పని ఉండేదే కాదు. పని ఉన్న ఇంకో గ్రహానికీ, ఇంకో పాలపుంతకూ వెళ్ళిపోయేవాళ్ళం!

ఇలా అన్ని లోకాలను గురించిన ఆధ్యాత్మిక శాస్త్ర సమాచారాన్ని ప్రపంచంలో ఉన్నప్రతి ఒక్కరికీ తెలియజేయడానికే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆవిర్భవించింది. “పిరమిడ్ మాస్టర్స్” అంతా కూడా ధ్యానం, అహింసలను గురించి నరులందరికీ తెలియజేయడానికి ఈ భూలోకానికి విచ్చేసిన “నారాయణులు”!