నం కాన్సెప్ట్

 

మానవుడి జీవితం సరళం గా, ఆరోగ్యవంతం గా, ఆనందమయం గా, అర్థవంతం గా జీవించబడాలి అంటే నాలుగు నం లు అవసరం. మొట్టమొదటిసారిగా మానవుడి జీవితం సరళం కావాలి. అంటే మహాత్మా గాంధీగారు అన్నట్లు మానవుడివి కావాలి.

మానవుడి జీవితం సరళం గా ఎలా అవుతుంది? మనం ఏం చేస్తే సరళం అవుతాం ? ఏ విధంగా అంటే – నోర్మూసుకుంటే – అంటే మౌనం పాటించాలి. ఇదే మొట్టమొదటి నం ..

విధిగా రోజుకు కొన్ని గంటలు, మరి వారానికి కొన్ని రోజులు, లేదా కనీసం వారానికి ఒక్క రోజైనా మౌనం పాటించాలి. మానవుడు తన అతి వాగుడు వల్ల లేనిపోని కష్టాల్ని విస్తారంగా కొని తెచ్చుకుంటున్నాడు.

నిరంతరం మితభాషిత్వం వల్లా అప్పుడప్పుడూ సంపూర్ణ మౌనం వల్లా మానవుడి జీవితం అద్భుతంగా సరళం అవుతుంది. కనుక, మొట్టమొదటి సూత్రం ఏమిటంటే మానవుడి జీవితం సరళం కావాలంటే మౌనసాధన అత్యవసరం.

ఇక పోతే, మానవుడి జీవితం ఆరోగ్యమయం కావాలి; మానవుడు నిత్య స్వస్థత కలిగి వుండాలి; సదా శక్తివంతుడై వుండాలి. దీనికి అవసరం రెండవ నం అంటే ధ్యానం.

ధ్యానం వల్లనే నాడీమండలశుద్ధి జరిగి పూర్వ జన్మకర్మల పాపమూలాలు ప్రక్షాళితమై వర్తమాన జీవితం ఆరోగ్యమయంగా, శక్తివంతంగా తయారవుతుంది. అన్యధా శరణం నాస్తి; కనుక, రెండవ సూత్రం ఏమిటంటే ఆరోగ్యానికీ, శక్తికీ తప్పనిసరిగా అవసరం ధ్యానం.

ఇంకా ముందుకుపోతే మనిషి జీవితం ఎప్పుడూ అర్థవంతంగా వుండాలి. ప్రతి చూపూ, ప్రతి తలపూ, ప్రతి పలుకూ,ప్రతి చేష్టా అర్థవంతంగా వుండాలి. దీనికి తప్పదు. మూడవ నం … అదే జ్ఞానం … అంటే ఆత్మజ్ఞానం. అంటే, ఆధ్యాత్మిక విజ్ఞానం .. అంటే స్పిరిచ్యువల్ సైన్స్.

అందరికీ తెలసినదే… ఏమిటంటే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారు అందరికీ అందించేదే జ్ఞా నం అని.

మూడవ సూత్రం ఏమిటంటే, మానవుడి జీవితం అర్థవంతం కావాలంటే విధిగా వుండవలసిన వస్తువే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేనివాడి ప్రతి చూపూ, ప్రతి తలపూ, ప్రతి పలుకూ, ప్రతి చేష్టా నూటికి మూడొంతులు అర్థరహితమైనవే; ఆత్మజ్ఞానం వున్నవాడి ప్రతి చూపూ,ప్రతి తలపూ, ప్రతి పలుకూ, ప్రతి చేష్టా నూటికి నూరుపాళ్ళు అద్భుత అర్ధసహితమే అయి తీరుతుంది.

ఇక పోతే, చివరిగా మానవుడి జీవితం ఆనందమయం కావాలి.

దీనికి వుంది ఒక మార్గం. అదే గా నం … మధుర గానం. వాస్తవానికి చెవులు ఎందుకున్నాయ్ ? చక్కటి సంగీతం వినడానికే; కంఠం ఎందుకు వుంది ? చక్కటి గానం చేయడానికే.

మానవుడి జీవితం ఆనందమయం కావాలంటే అనేకానేక కళలు నేర్చుకోక తప్పదు. ముఖ్యంగా సంగీత కళ నేర్చుకునే ముందు విశేషంగా వినాలి. కనుక, జీవితంలో మాటలు తగ్గించి పాటలు, సంగీతం వినడం అన్నది హెచ్చించాలి.

ఈ విధంగా మానవుడి జీవితం సరళం గా, ఆరోగ్యం గా, అర్థవంతం గా, ఆనందమయం గా కావాలంటే తప్పదు… నాలుగు నం లు. అవే…

మౌ నం ; ధ్యా నం ; జ్ఞా నం ; గా నం …

నోర్మూసుకుంటే మౌనం ;

నోరూ, కళ్ళూ మూసుకుని నాసికలోని శ్వాసను గమనిస్తే ధ్యానం ;

నాడీ మండలం ప్రక్షాళనమయిన తరువాత మెదడును వుపయోగిస్తే జ్ఞానం ;

కంఠాన్నీ, చెవుల్నీ సానబడితే గానం.