నా దారి ఎడారి
“నా పేరు బికారి .. నా దారి ఎడారి ..
మనసున్న చోట మజిలీ .. కాదన్న చాలు బదిలీ “
(1) “తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను
పాట నాకు సరి జోడు .. పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు, వేసట లేనే లేదు
అసలు నా మరో పేరు ‘ ఆనందవిహారి ‘ ”
(2) “మేలుకుని, కలలు కని, మేఘాల మేడపై
మెరుపు తీగలాంటి నా ప్రేయసిని ఊహించుకుని
ఇంద్రధనస్సు పల్లకి నెక్కి కలుసుకోవాలని
ఆకాశవీధిలో పయనించు బాటసారి “
(3) “కూటికి నే పేదను, గుణములలో పెద్దను
సంకల్పమే నాకు ధనం, సాహసమే నాకు బలం
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి “
– పాలగుమ్మి పద్మరాజు
[“శ్రీ రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్” సినిమా (1973)]
అద్భుతమైన పాట ఇది,
ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ వికాసం మొత్తం నిండి వుంది ఈ పాటలో
“నా దారి ఎడారి ” అంటే ” బయటంతా శూన్యం ”
“నా పేరు బికారి ” అంటే ” లోపలంతా శూన్యం ”
ఈ అవగాహనలో ఎప్పుడూ స్థితమయి ఉన్నవాడే ఒకానొక ‘ జ్ఞాని ‘
అతనికొక ప్రత్యేక స్థావరం అంటూ ఏదీ లేదు
అన్ని స్థావరాలూ అతనివే .. అన్ని స్థానాలూ అతని కోసమే
మనసైన చోట మజిలీ చేస్తూ వుంటాడు
ప్రయోజనం తీరగానే బదిలీ అవుతూ వుంటాడు.
(1) ” తోట ” అంటే ” వృక్ష సామ్రాజ్యం ”
“తోటకు తోబుట్టువును ” అంటే
” చెట్లు చేమలే సహయాత్రికులుగా ” ఉన్నవాడన్నమాట
” ఏరు ” అనేది ” ఖనిజ సామ్రాజ్యాన్ని ” సూచిస్తుంది
” ఏటికి నే బిడ్డను ” అంటే
” ఆ ఖనిజసామ్రాజ్యం నుంచి నేను వచ్చానన్న సంగతి తెలుసుకున్నవాడిని “
” పాట నాకు సరిజోడు ” అంటే ” తన గానమే, తనకు తోడు ” అని
” తనకు తానే తోడు ” అని
” వేరే మనుష్యుల సాంగత్యమే అవసరం లేని వాడు ” అని
” పక్షి ” అన్నది “జంతు సామ్రాజ్యాన్ని ” గుర్తుచేస్తుంది
” పక్షి నాకు తోడు ” అంటే
” జంతువులతో చక్కగా సహజీవనం చేస్తున్నవాడు ” అని అర్థం
ఈ విధంగా ప్రకృతి జీవరాసులతో కలిసి మెలసి వుంటాడు కనుక
ఒకానొక జ్ఞానికి ఎప్పుడూ విసుగు రాదు
అతడు సదా ఖుషీగా వుంటాడు
అతడు అలసట అనేదే ఎప్పుడూ ఎరుగని వాడు
యదార్ధానికి అతను ” ఆనందవిహారి “
(2) “మేలుకుని కలలు కని ” అంటే
ధ్యానంలో సూక్ష్మశరీర యాత్రలు చేయడం
“మేఘాల మేడలో అంటే ” పైన ఉన్న ఊర్థ్వ లోకాలలో ” వున్న
“మెరుపు తీగ లాంటి నాప్రేయసి ” అంటే మిరుమిట్లు గొలిపే
అత్యంత ప్రియాతిప్రియమైన సర్వశక్తివంతమైన
తన “పూర్ణాత్మ (overself) ” అన్నమాట,
“ఊహించుకుని” అంటే “ముందుగా సిద్ధాంతపరంగా తెలుసుకోవడం”
* * *
“ఇంద్రధనస్సు ” పల్లకి ” అంటే
” గురువును పల్లకీగా చేసుకుని ” అన్నమాట
ఇంద్రధనస్సులో ఏడు రంగులు వుంటాయి
అంటే ఓ గురువు అయినవాడు .. ఓ ఆత్మజ్ఞాని అయినవాడు
తన ఏడు శరీరాలను క్రియాశీలం చేసుకోవడాన్నే ఆ పోలిక సూచిస్తుంది
“ఎక్కి” అంటే “ఆ యోగి సహాయంతో”
“కలుసుకోవాలి ” అంటే “పూర్ణాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవాలి “
“ఆకాశవీధిలో పయనించు బాటసారి” అంటే
“విశ్వసూక్ష్మ లోకాల యాత్రికుడు కావడం” అన్నమాట
గురూపదేశం పొంది ధ్యాన ప్రక్రియ ద్వారా పూర్ణాత్మ జ్ఞానం పొంది
“ఊర్థ్వలోకాలలో యానం చేసే యోగి అతడు”అని
* * *
(3) అతను “కూటికి పేద” అయినా గుణాలన్నింటినీ సంతరించుకున్నవాడు
సంకల్పశక్తి అతని “ధనం” .. సాహసమే అతని “బలం”
“గరీబు” అంటే ‘ క్రింద ’ వున్న ఆత్మ “
“నవాబు” అంటే “పూర్ణాత్మ లేక సహ విధాత (co-creator) “
” కాకపోడు ఏనాటికో ” అంటే
“తాను కూడా ఎప్పటికైనా ఆ పూర్ణాత్మ స్థాయికి చేరుకోగలను” అనీ
” ఒకనాటికి సహవిధాతగా కాగలను ” అనీ తెలుసుకున్నవాడు
ప్రతి చిన్న పిల్లవాడూ పెరిగి సహజంగా పెద్ద అయినట్లే ..
ప్రతి మొక్కా పెరిగి వృక్షమైనట్లే ..
“తాను కూడా ఆ విధంగా ఎప్పటికైనా, ఎలాగైనా “బ్రహ్మర్షి” గా
తప్పక అవుతాను అని “ఎరిగినవాడు
“అంతవరకు” అంటే “నవాబు అయ్యేంతవరకు”
“నిరంతర సంచారి” అంటే నిరంతరం సంచరిస్తూ
అందరికీ బోధిస్తూ, అందరినీ ఉత్తేజపరుస్తూ వుంటాడు” అని
“నా దారి ఎడారి .. నా పేరు బికారి “
ఎప్పుడూ లోపలి శూన్యతనూ, బయటి శూన్యతనూ మరిచిపోనివాడు
* అతడే “ఆనంద విహారి”
* అతడే “ఆకాశవీధిలో పయనించే బాటసారి”
* అతడే కాబోయే “నవాబు” .. అతడే ” తథాగతుడు “