“ముచ్చటైన మూడుస్థితులు”

 

“మనిషి మనిషే” “A man is a man”

 

మొట్టమొదటి స్థితిలో “A man is man!” .. అంటే మానవుడు ఒక మామూలు మానవుడుగానే ఉంటాడు. మామూలు మానవుడుగా ఉంటూ పూర్తిగా మిధ్యా ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. “మిధ్యా ప్రపంచం” అని అనటంలోని అంతరార్థం ..ఇది అసంపూర్ణ జ్ఞానం వల్ల, మరి అజ్ఞానం వల్ల నిర్మితమైన సామాజిక అభిప్రాయాలతో, ఇష్టాయిష్టాలతో, ధర్మాధర్మాలతో పూర్తిగా ఆవరించబడి .. ఓ సగటు మానవుడి పాలిట కారాగారంలా .. వదిలించుకోవటానికి చాలా కష్టతరమైన బంధనంలా ఏర్పడిన ప్రపంచం మాత్రమే గనుక.

మిధ్యా ప్రపంచానికి భయం – రారాజు .. చీకటి – మంత్రి. ఈ స్థితిలోని మానవుడి ప్రతి పదాన్నీ భయం శాసిస్తుంది, బెరుకు నిర్దేశిస్తుంది. “నేను స్వతంత్ర జీవిగా నాదైన సృజనాత్మకతను పండించుకోవటానికే జన్మించాను” అన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయి ఈ దైవిక ప్రకృతి శక్తులతో నిర్మితమైన నిజమైన ప్రపంచంలో లేని భయాలనే ఆధారంగా చేసుకుని జీవిస్తూంటారు. ఈ స్థితిలో ఓ జింక, జింకలా .. ఓ పులి, పులిలా .. తమ స్వతఃసిద్ధమైన సహజ లక్షణాలతో ఎలా ప్రవర్తిస్తున్నాయో .. అలా మనం మన సహజ గుణ గణాలతో ప్రవర్తించటం లేదు.

“మన బాహ్య ప్రపంచం వైవిధ్యాలతో నిండి ఉంది, మనం ఏవిధంగా ప్రవర్తించినప్పటికీ .. ఆ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా సంతృప్తి పరచలేం” అనే కనీస జ్ఞానాన్ని విస్మరించి ఈ స్థితిలోనే మనం అహర్నిశలూ ఆ “మిధ్యా ప్రపంచం” మెప్పుకోసం శ్రమిస్తూ .. తపిస్తూ .. ఆంతరంగిక సత్యరూపమైన ప్రపంచాన్ని వదిలిపెట్టి అకారణ దుఃఖంతో అయోమయంగా కాలాన్ని గడిపేస్తున్నాం.

అంటే “మొదటి స్థితిలోని మానవుడు మానవుడే గానీ మానవ జన్మలోని ఔన్నత్యాన్నీ మానవత్వంలోని మధురిమనూ కూడా మరచిపోయి జీవిస్తున్న అసంపూర్ణ మానవుడు.”

ఇలాంటి దుఃఖభాజనమైన, అసంపూర్ణమైన మొదటి స్థితిని తన చైతన్యపు సహజ అంచుల వరకూ అనుభవించిన తరువాత మానవుడికి “అసలు ఈ ఆంతరంగిక గందరగోళం ఏమిటో, నేను ఎంత శ్రమించినా ప్రశాంతతనూ, ఆనందాన్నీ ఎందుకు పొందలేకపోతున్నానో” అంటూ .. మొత్తంగా “అసలు తానెవరో తెలుసుకోవాలి!” అనే జిజ్ఞాస మొదలవుతుంది. అప్పుడే దీక్షగా, పట్టుదలగా రెండవ స్థితిలోకి అడుగుపెడతాం.

 

“మనిషి కేవలం అణుపరమాణువులు కాదు” “A man is not mere matter”

 

ఈ రెండవ స్థితిలో “A man is no more mere matter” అంటే తన స్వస్వరూపం విశ్వరూపమై దర్శనమిచ్చిన స్థితే రెండవ స్థితి. “రకరకాల భయాలతో, అనుమానాలతో ఇంతకాలం జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చిన నేను అసలు కేవలం మానవుడినే కాదు; దివ్యచైతన్యపు శకలాన్ని; స్వయానా నేనే భగవంతుడిని” అనే సత్యం ఎరుకలోకి వచ్చిన సంభ్రమాల స్థితి ఇది. ఈతి బాధల అనుభవాలతో అలసి సొలసి ఉన్న మానవుడు “నేను ఏ పరిమితులూ, ఆంక్షలూ లేని చైతన్యాన్ని” అని తెలుసుకున్న స్వాంతనలో కొంతకాలం సేద తీరుతాడు.

అపరిమితత్త్వం, అనంతత్త్వం మాత్రమే .. సత్యాలుగా గోచరించే ఈ స్థితిలో వెలుగూ, చీకటీ కాని ఓ నిర్మలమైన కాంతి ‘రాజు’ అయితే, నిశ్చలతత్త్వం “మంత్రి”గా ఉంటుంది.

ఈ స్థితిలోని మానవుడికి బాహ్య ప్రపంచంలోని అనుభవాలన్నీ అర్థరహితంగానూ, కేవలం ఆంతరంగిక అవగాహన, ప్రశాంతత మాత్రమే ప్రధానమైనవిగానూ కనిపిస్తాయి. ఉరకలేసే సంతోషం గానీ, వివశత్వాన్ని అందించే దుఃఖం గానీ ఈ స్థితిలోని మానవుడి దరికి చేరవు. హృదయం అంతా ఆవరించిన సంతృప్తితో ఓ రకమైన నిర్మలానంద స్థితిలో ఉండిపోతూంటాడు. సృష్టి జరుగక ముందు విశ్వమంతా నిండి ఉన్న మూలచైతన్య స్వరూపానికి ఎలాంటి వ్యక్తీకరణా ఉండదు. సరిగ్గా అలాంటి భావ వ్యక్తీకరణకు దూరంగా ఆ మూల చైతన్యానికి ప్రతిబింబంలా ఉండటాన్నే ఇష్టపడుతూ ఉంటాడు.

ఈ స్థితిలో మానవుడు “మానవుడి”గా కాక “తానే భగవంతుడై” జీవిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం భగవత్ చైతన్య స్థితిలో కొనసాగిన తరువాత ఆ స్వాంతనలో .. మొదటి స్థితిలోని భేదాన్నీ, భారాన్నీ అధిగమించి శక్తివంతుడౌతాడు. తగినంత శక్తిని పొందిన తరువాత భగవంతుడినైన తాను అసలు మానవుడిగా జీవించుదామని ఎందుకు సంకల్పించుకున్నాడో స్ఫురణకు వస్తుంది. ఇక .. ఆ కార్యసాధనకు సన్నద్ధుడై మూడవ స్థితిలోకి ప్రవేశిస్తాడు.

 

“మనిషి మనిషే” “A man is again a man”

 

చిట్టచివరిదైన మూడవ స్థితిలో మళ్ళీ “A man is again a man” .. అంటే మానవుడు అచ్చంగా మానవుడిగానే జీవిస్తాడు.

రెండవ స్థితిలో ఆర్జించిన జ్ఞానంతో “నేను అపరిమిత సామర్థ్యం కలిగిన చైతన్యాన్ని” అన్న సత్యాన్ని మరచిపోకుండా తానసలు ఏ మానవీయతను అనుభవించటానికి ఇలా ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ మానవత్వంలో సంపూర్ణంగా జీవిస్తాడు. మానవుడు నిజమైన మానవుడిగా జీవిస్తాడు.

అంటే, ఓ లేడిలా .. పులి, పులిలా .. ఎలాగైతే స్వతఃసిద్ధంగా తమ తమ సహజ గుణాలతో జీవిస్తున్నాయో అలాగే మూడవ స్థితిలోని పరిణితి చెందిన మానవుడు కూడా తన సహజ సిద్ధమైన లక్షణాలతో హాయిగా జీవిస్తాడు.

ఈ మూడవ స్థితికి కోటి సూర్యప్రకాశితమైన ప్రచండ తేజస్సు “సామ్రాజ్యాధినేత”గా పరిపాలిస్తే, సునిశిత బుద్ధి “మంత్రి”గా వ్యవహరిస్తుంది.

ఈ స్థితిలోని మానవుడిలో జీవితోత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. జీవించే విధానం సాహసోపేతంగా ఉంటుంది. ఆంతరంగిక సందేశంగా ఏ అనుభవాన్ని అయితే బలంగా కోరుకుంటున్నాడో ఆ అనుభవాన్ని అందిపుచ్చుకోవడంలో ఎలాంటి భయాలకూ .. సందిగ్ధాలకూ అవకాశమియ్యడు. తాను ఎలా భగవంతుడో తన తోటివారు సైతం అలాగే భగవంతులన్న జ్ఞానంతో ఉన్నవాడు గనుక తన అనుభవాన్ని అందిపుచ్చుకోవటంలో తోటి దైవాంశల వ్యక్తిగత ప్రయోజనాలకు భంగం కలుగకుండా మాత్రం జాగ్రత్త వహిస్తాడు. మిగిలిన తప్పు, ఒప్పులకూ .. అలాగే మంచి, చెడులకూ అతీతంగా ప్రవర్తిస్తూ శరవేగంతో కొంగ్రొత్త అనుభవాలనూ అందిపుచ్చుకుంటూ నిత్యనూతనంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు.

మనం ఇలాంటి మూడవ స్థితిలో జీవించిన తర్వాతనే ఈ భూమ్మీదకు జన్మ తీసుకుని వచ్చిన అసలైన ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరుతుంది!

ఇక ఆలస్యమెందుకు ..? అసలు సిసలైన పరిపూర్ణ మానవులుగా జీవించి పుడమితల్లిని పులకరింపచేద్దాం రండి..!

(“జీవిత ధ్యేయం” పుస్తకం నుంచి)