మోక్షం

 

ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.

మూలాధార లోకం, స్వాధిష్టాన లోకం, మణిపూరక లోకం … ఈ మూడు లోకాలకు శాంతిః, శాంతిః, శాంతిః కావాలి. అది ఓం శాంతిః శాంతిః శాంతిః అనే మంత్రం యొక్క అర్థం. అందుకే మూడుసార్లు చెప్తాం. ఎందుకంటే మూడు లోకాలకూ శాంతి అవసరం. ఈ క్రింది మూడు లోకాలనూ ‘ అథో లోకాలు’ అంటారు.

పైనున్న లోకాలు అనాహత లోకం, విశుద్ధ లోకం, ఆజ్ఞా లోకం, సహస్రార లోకం. వీటన్నింటికీ శాంతి వుంది. అనాహత లోకానికి శాంతి వుంది కానీ మోక్షం లేదు. విశుద్ధ లోకానికి మహాశాంతి వుంది కానీ మోక్షం లేదు. ఆజ్ఞా లోకానికి ఆత్మజ్ఞానం వుంది కానీ మోక్షం లోనికి ప్రవేశం మాత్రమే వుంటుంది. సహస్రార లోకానికి విశాలమైన, విస్తారమైన మోక్షం వుంది.

అఖండమోక్ష సామ్రాజ్యాన్ని ఏలేవారే సహస్రారులు. వారే పిరమిడ్ మాస్టర్స్.

మై డియర్ ఫ్రెండ్స్ … ఆ శిఖరాగ్రానికి చేరాలంటే నాసికాగ్రానికి చేరాలి. నాసికే మన శరీరంలోని ప్రధాన పిరమిడ్. నాశికాగ్రం అంటే మొట్టమొదటి అగ్రస్థానం. నాసికాగ్రమే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞా లోకం అంటే త్రినేత్రం … ఈ రెండు కళ్ళతో కనిపించేది కాకుండా ఆవల వుండేదాన్ని చూపించేది. ఈ రెండు కళ్ళకీ కనపడేదానిమీద ఆధారపడి వున్న విశుద్ధచక్రం కూడానూ మోక్షాన్ని ఇవ్వదు. నాసికాగ్రస్థితికి చేరుకున్న ఆ యొక్క శ్వాసధార తాకిడికి మాత్రమే మోక్షద్వారం తెరుచుకుంటుంది.

కనుక ఆనాపానసతి ధ్యానం ద్వారా అందరూ మోక్ష సామ్రాజ్యాన్ని తమ స్వంతం చేసుకోవాలి.