“మంత్రపిండం .. పిరమిడ్ టెక్నాలజీ”
అనేకానేక నక్షత్రలోకాలకు చెందిన మనం అంతా భూలోక కల్యాణార్యార్థమై ఈ లోకానికి విచ్చేసిన దేహధారులం మరి “మాంసపిండాలం ” !
“మాంసం పిండం” అయిన ఈ దేహాన్ని మనం ఎంత శాస్త్రీయంగా ఉపయోగించుకోగలుగుతే .. అంత గొప్ప ఫలితాలను దాని వల్ల పొందగలుగుతాం ! మహాకృషి ద్వారానే గాంధీజీ మహాత్ముడయ్యాడు, గౌతముడు బుద్ధుడయ్యాడు ; కనుక మనం కూడా వారిలా ఈ మాంసపిండాన్ని సద్వినియోగపరచుకుని ఒకానొక యుగ పరిణామానికి కారణభూతం కావచ్చు ! లేదా దానికి బాగా తిండి పెట్టి అది బలిసేలా చేసి దానిని రోగాలతో మంచం పట్టేట్లుకూడా చేయవచ్చు ! ఇలా ఈ శరీరంతో మనం ఏదయినా చేసుకోవచ్చు ! అంతా మన ఎంపిక .. మన కృషి.
“శ్రీ సదానంద యోగి గారు” .. “సుభాష్ ! మాంసపిండాన్ని మంత్రపిండంగా చెయ్యాలోయ్” అన్న సందేశంతో నాకు దిశానిర్దేశం చేసారు. వారి మార్గదర్శనంలో స్థాపించబడిన ” పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్మెంట్ ” .. ధ్యానప్రచారం ద్వారా ప్రతి ఒక్కమాంసపిండాన్నీ .. ” మంత్రపిండం ” లా మారుస్తోంది. ఇది ఒక ఈ విశ్వప్రణాళికా ఉద్యమం !
నేను ఒక మంత్రపిండంలా 2095 సంవత్సరం వరకు ఇక్కడే ఈ భూమ్మీదే వుంటాను ! ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ శాకాహారులుగా, మంత్రపిండాలుగా మారేవరకూ .. ఈ భూమి అంతా పిరమిడ్శక్తితో నిండిపోయే వరకూ .. నేను ఇక్కడే వుంటాను.
ఒకప్పుడు టీవీ, రేడియో, ఫోన్ల గురించి ఇంత విస్తృతంగా తెలియదు. ఎక్కడో నూటికో, కోటికో ఏ గొప్ప వారి ఇళ్ళలోనో అవి ఉండేవి. ఇప్పుడు అలా కాదు. అతి సామాన్యుడు కూడా వీటిని ఉపయోగిస్తున్నాడు. మరి ప్రతి ఒక్కరి ఇంట్లో టీవి దర్శనం ఇస్తోంది. అలాగే ” పిరమిడ్ టెక్నాలజీ ” కూడా !
అతి త్వరలో “పిరమిడ్ టెక్నాలజీ” నీ, అందులోని శాస్త్రీయతనూ ప్రపంచమంతా గుర్తిస్తుంది ! దానిని అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి తెచ్చుకుంటుంది ! అప్పుడు ఇంతకాలంగా మనం చేస్తూ వచ్చిన పనిని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశంసిస్తారు !