మానవ జీవిత సూత్రాలు

 

మానవుడు సరియైన విధంగా ఎలా జీవించాలి?
అసలైన సిసలైన జీవిత సూత్రాలు ఏంటి?!
ఒకానొక “బుద్ధి జీవుడు” ఎలా జీవిస్తాడు?
***
ఒకానొక “బుద్ధి జీవుడి” గా మనం ఉండాలంటే తొమ్మిది సూత్రాలు ఉన్నాయి:
1) “భోజనం” విషయంలో మూడు సూత్రాలు
2) “మాట్లాడే” విధానంలో మూడు సూత్రాలు
3) “యోచనా” విధానంలో మూడు సూత్రాలు
“భోజన విధానం”లో సూత్రాలు:
1) యుక్తాహారం 2) మితాహారం 3) నిరాహారం
“యుక్తాహారం” అంటే .. శాకాహారం, సాత్త్వికాహారం
“మితాహారం” అంటే .. ఆకలి ఉన్నప్పుడే తినడం .. సగం కడుపును ఎప్పుడూ ఖాళీగా ఉంచడం
“నిరాహారం” అంటే .. వారానికి కనీసం ఒకరోజు .. మహాత్మా గాంధీజీలా .. భోజనానికి విరామం ఇవ్వడం
“మాట్లాడే విధానం”లో మూడు సూత్రాలు:
1) యుక్త భాషణం 2) మిత భాషణం 3) నిర్భాషణం
“యుక్త భాషణం” అంటే సమయం సందర్భాన్నిబట్టి మాట్లాడడం
“మితభాషణం” అంటే క్లుప్తంగా, సూటిగా మాట్లాడడం .. అధికంగా ఎప్పుడూ మాట్లాడరాదు
“నిర్భాషణం” అంటే .. కనీసం వారానికి ఒకరోజు .. మహాత్మా గాంధీజీలా .. మౌనంగా ఉండడం
“యోచనా విధానం” లో మూడు సూత్రాలు:
1) యుక్త యోచనం, 2) మిత యోచనం 3) నిర్యోచనం
“యుక్త యోచనం” అంటే ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించకపోవడం;
ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు గురించి ఆలోచించకపోవడం ..
మర్నాడు ఆలోచించవలసింది ఈ రోజు ఆలోచించకపోవడం ..
“మితయోచనం” అంటే .. ఏ సమస్య గురించీ కూడా అధికంగా ఆలోచించకపోవడం
“నిర్యోచనం” అంటే .. మనస్సును ఖాళీగా ఉంచడం .. అంటే చిత్తాన్ని అత్యధికంగా శూన్యం చేయడం ..
అంటే “ధ్యానం” చేయడం!
రోజుకు ఉన్న 24 గంటలలో కనీసం రెండు గంటలు విధిగా అందరూ “ధ్యానం”లో గడపవలసిందే!
***
వెరసి మానవుడు ఒకానొక బుద్ధి జీవుడిగా అవడం కోసం తొమ్మిది సూత్రాలు ఉన్నాయి
“యుక్తాహారం” .. “మితాహారం” .. “నిరాహారం” అంటే “ఉపవాసం”
“యుక్త భాషణం” .. “మిత భాషణం” .. “నిర్భాషణం” అంటే “మౌనం”
“యుక్త యోచనం” .. “మిత యోచనం” .. “నిర్యోచనం” అంటే “ధ్యానం”
ఇక మానవులంతా బుద్ధి జీవులు అవుదురు గాక!
ఇతి సమ్యక్ జీవన విధాన సమగ్ర శాస్త్రః!
ఓం తత్ సత్!!