మనం పిరమిడ్ మాస్టర్లం

 

“శాకాహారం … మన మతం”

మాంసాహారం విషతుల్యం. అది మన శరీర వ్యవస్థను పాడు చేస్తుంది. మనస్సును విపరీత ధోరణిలో నడిపిస్తుంది; బుద్ధి మాంద్యానికి గురి చేస్తుంది. ఆత్మ పురోగమనానికి మాంసం తినడం అన్నది గొడ్డలి పెట్టు. ఆధ్యాత్మిక యోగీశ్వరులుగా గుర్తింపబడిన వారందరూ శాకాహారులే. బుద్దుడు, మహావీరుడు, వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి… ఇంకా చాలామంది శాకాహారులే.

“పక్షి జాతి బట్టి పరగహింసలు బెట్టీ

కుక్షి నిండ కూడు కూరుటకును

వండి తినెడివాడు వసుధ ఛండాలుడు”

– వేమన

ధ్యానంలో ఉత్తమ స్థితి పొందాలన్నా, జీవితంలో జ్ఙానవంతులుగా ఎదగాలన్నా ప్రతి ఒక్కరూ తక్షణమే మాంసాహారాన్ని విడిచిపెట్టి శాకాహారులుగా మారాలి; ఇతరులునూ శాకాహారులుగా మార్చాలి. మన మతం నిశ్చయంగా శాకాహారమతమే.

“ధ్యానం…మన వృత్తి”

అన్ని వ్యాధులకూ మూలం మన మనోవ్యధలే; మానసిక అలజడులు, భయాలు, సంశయాలు, అహంకారం, అసూయ, ద్వేషించే తత్వం, స్వార్థం, పిరికితనం, సోమరితనం, పరిమితులు, బానిసత్వం… మొదలైన మనోదౌర్బల్యాలే మన గందరగోళ, అస్తవ్యస్త జీవితానికి కారణాలు.

మానసిక దౌర్బల్యాలను సమూలంగా వర్జించి, నిర్జించి మనోసామర్థ్యాన్ని పెంచుకోవాలంటే మన జీవితంలో ధ్యానాన్ని విధిగా చేపట్టాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా అకుంఠిత దీక్షతో అనునిత్యం విశేషంగా ధ్యానసాధన చేయాలి; అప్పుడే బొగ్గులాంటి మన జీవితాలను వజ్రాలుగా మార్చుకోవచ్చు.

“నిక్కమైన ధ్యానమొక్కటే చాలు-

తళుకుబెళుకు పూజగంధంబు తట్టెడేల?

మనస్సు స్థితపరచు ధ్యానపద్దతి చాలదా?”

– వేమన

మన అంతరంగాన్ని అనునిత్యం శాంతంగా ఉంచుకోవాలన్నా, బుద్దికుశలత పెంచుకోవాలన్నా, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలన్నా, ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానం చేయాలి.

ధ్యానం అంటే చిత్తవృత్తినిరోధం… దానికి మార్గం శ్వాస మీద ధ్యాస.

ఆనాపానసతి ధ్యానం ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. హాయిగా కూర్చుని, చేతివ్రేళ్ళను కలిపి, కళ్ళు మూసుకుని, సహజ శ్వాసను గమనించడమే ధ్యాన పద్దతి. పిరమిడ్ మాస్టర్ల జీవితం ధ్యానానికే అంకితం…అందుకే ధ్యానం మన ఏకైక వృత్తి.

“పిరమిడ్లు…మన ఆలయాలు”

పిరమిడ్స్ అన్నవి ప్రత్యేక కోణాలతో నిర్మింపబడిన కట్టడాలు. ఈ ఆకారాలతో నిర్మింపబడ్డ వాటిలోకి విశ్వమయప్రాణశక్తి ఎక్కువ మోతాదులో ప్రవహిస్తుంది.

మామూలుగా ఉన్న బహిరంగ ప్రదేశాలలో కానీ, ఇతర ఆకారాలలో ఉన్న బిల్డింగ్స్ లో కానీ చేసే ధ్యానం కంటే, పిరమిడ్స్ లో ధ్యాన సాధన చేస్తే…అదే సమయంలో మూడింతలు విశ్వమయప్రాణశక్తిని పొందగలం.

“పిరమిడ్ ధ్యానం” ద్వారా తరుణ వ్యాధులు, తీవ్రవ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక రుగ్మతలు… అన్నీ తక్కువ కాలంలో తొలగించుకుని మనం త్వరితగతిన ఆరోగ్యవంతులుగా మారవచ్చు. అంతేకాకుండా పిరమిడ్ లో ధ్యానం చేయడం ద్వారా దివ్యచక్షువు ఉత్తేజితం, సూక్ష్మశరీరయానం లాంటివి తక్కువ సమయంలో మనం పొందవచ్చు.

పిరమిడ్ హ్యాట్స్, హ్యాంగింగ్ పిరమిడ్స్, రూఫ్ టాప్ పిరమిడ్స్, గ్రౌండ్ లెవెల్ పిరమిడ్స్… ఎవరి వీలుని బట్టి వారు… ఏర్పాటు చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ధ్యానులుకు ఆలయాలే పిరమిడ్ లు… మరి పిరమిడ్లు.. నవీనయుగపు దేవాలయాలు.

“శ్వాస… మన గురువు”

సాధన అన్నది ‘గురువు’ దగ్గరి నుంచే మొదలవుతుంది. ఎక్కడ సద్గురువు లేడో… ఎక్కడ చెప్పేవాడు లేడో… అక్కడ విద్య గ్రుడ్డివిద్య అయిపోతుంది. గురువు లేని విద్య గ్రుడ్డివిద్య.

ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఏది ఎలా చేయకూడదో, ఏది ఎప్పుడు చేయకూడదో… మరి ఇవన్నీ చెప్పేవాడే గురువు.

సంగీతం నేర్చుకోవాలంటే గురువు వుండాలి. సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం గురువు కావాలి. అలాగే మరి ఆధ్యాత్మికంలో “అహం బ్రహ్మస్మి – నేనే అంతా” అని తెలుసుకోవాలంటే మరి “ఈ దేహమే దేవాలయం” అన్నది స్వంతానికి అనుభవానికి రావాలంటే ఏం చేయాలి?

“ఏం చేయాలి?” అంటే “ధ్యాన గరువు” దగ్గరికి చేరాలి… “ధ్యాన గురువు” కి సాస్టాంగ నమస్కారం చేయాలి; ధ్యాన గురువు దగ్గర పీఠం వేసుకు కూర్చోవాలి; అప్పుడు ఆ గురువు జ్ఞానాన్ని భోధిస్తాడు. మరి సర్వమూ భోదిస్తాడు. అయితే, ఈ ఆధ్యాత్మిక సాధనా ప్రకరణంలో మాత్రం ఎవరు ధ్యాన గురువు?… “ఏమిటి” ధ్యానగురువు?… అంటే “శ్వాసయే గురువు”. అసలు ఒకానొక ఆధ్యాత్మిక ముముక్షువు, ఒకానొక ఆత్మజ్ఞాన పిపాసి, ఇంకొక గురువు దగ్గరికు వెళ్ళనే అఖ్ఖర్లేదు. ఆధ్యాత్మిక సాధన అంటే మనలోకి మనం చేసే ప్రయాణమే. ఈ “అంతరంగ ప్రయాణం” అన్నది సజావుగా జరగాలంటే మనందరమూ “శ్వాస”ను తప్పకుండా పట్టుకోవాలి. మరో మార్గం లేదు గాక లేదు.

ఈ విధంగానే ఆత్మానుభవాలు మన సొంతమవుతాయి. అనుభవమే జ్ఞానం కదా. జ్ఞానియైన ఒకానొక వ్యక్తి అతనికి వున్న జ్ఞానాన్ని గురించి మాత్రమే చెప్పగలడే కానీ, ఒకానొక జ్ఞానపిపాసికి జ్ఞానం ఇవ్వగలడా? ఎవరి ఆత్మానుభవం ద్వారానే వారికి ఆత్మజ్ఞానం అంకురించేది. అందుచేత శ్వాసే మన నిజమైన గురువు.

“ఆత్మశాస్త్రం… మన జెండా”

“ఆత్మశాస్త్రం” అంటే అత్మ గురించి కూలంకుషంగా తెలుసుకునే శాస్త్రం. అంటే, “మనం ఒక్క ప్రక్క శరీరాలమైనా మరొక ప్రక్క శరీరధారులమై వున్న ఆత్మపదార్థం” అని స్వానుభవంగా తెలుసుకోవడం.

“ఆత్మ గురించి జ్ఞానం”.. అంటే సంపూర్ణంగా మన గురించి మనం తెలుసుకోవడం…”నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, శరీరధారిని కూడా” అని స్వానుభవంగా తెలుసుకోవడం. “నేను దేహమే కాదు, దేహి” అని తెలుసుకోవడం.

“నేను చైతన్య పదార్థం” అని తెలుసుకోవాలి. సదా తన చైతన్యాన్ని ధ్యానం ద్వార ఆ మూలచైతన్యంతో అనుసంధానం చేసి ఆ స్థితిలో ఎక్కువ సమయం విహరించగలిగినవాడే పిరమిడ్ మాస్టర్. ఆత్మానుభవం స్వీయ ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యం. కనుక ఆత్మశాస్త్రం… తెలుసుకోవడం అంటే ఆత్మ గురించి జ్ఞానం పొందడమే… కాబోయే పిరమిడ్ మాస్టర్ల ఎజెండా, మరి పిరమిడ్ మాస్టర్లు అయినవారి జెండా.

“బుద్ధత్వం … మన ఆకాంక్ష”

“బుద్ధత్వం” అంటే అది ఒక మతానికి కట్టుబడి ఉండటం కాదు, ఒకానొక మౌలిక బుద్ది సిద్ధాంతాన్ని సొంతం చేసుకోవడం. అంతా సదా పరివర్తనం చెందుతూ ఉండేదే అన్న సిద్ధాంతాన్ని సొంత అనుభవంగా చేసుకోవడం. వాస్తవానికి కర్తృత్వ భావనతో ఉంటే నేను అన్నది అసలు లేనే లేదు…ఉన్నదల్లా సాక్షీభూతమైన నేను… కర్మలు ఉన్నాయి.. కర్మలకు తగిన కర్మఫలాలు ఉన్నాయి.. అవి అన్నీ ప్రకృతి గుణాలుగా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి.. “బుద్ధత్వం” అంటే సరియైన ఈ జీవన మార్గదర్శకత్వాన్ని పొందగలగడం.

“బుద్ధత్వం” అంటే చెడు ఆలోచనలు, చెడు కర్మల నుంచి దూరంగా ఉండడం. రాగ, ద్వేష, హింస, మోహాలకు దూరంగా ఉంటూ జనన మరణ చక్రం నుంచి బయటపడే సరియైన ఆధ్యాత్మిక శాస్త్రవిధానమే “బుద్ధత్వం”. సత్యం గురించి తెలుసుకుంటూ, తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు భోధిస్తూ ధర్మమార్గాన్ని అనుసరించడమే “బుద్ధత్వం”. సకల ప్రాణకోటితో మైత్రీభావం కలిగి ఉండడమే “బుద్ధత్వం”. ఇటువంటి అద్భుత అంతరంగ పరివర్తన కేవలం ధ్యాన సాధన వల్ల సంప్రాప్తమవుతుంది. కనుక బుద్ధత్వ ప్రాప్తి పొందడమే మన అసలైన సిసలైన పిరమిడ్ మాస్టర్ల ఆకాంక్ష.

“ధ్యానప్రభోధం…మన ఆత్మ రంజనం”

ధ్యాన సాధన అన్నివిధాలా వ్యక్తిగత లాభాల్ని నిస్సందేహంగా సమకూరుస్తుంది. అయితే కేవలం వ్యక్తిగత సుఖం, వ్యక్తిగత సంతోషం, వ్యక్తిగత శాంతి, వ్యక్తిగత ఆనందం పొందడం అన్నది… ఒక రకంగా పరిమితమైన స్థితి… మరోరకంగా కొంచెం స్వార్థంతో కూడుకున్నది.

ఆనందాన్ని గుప్పెట్లోనే ఉంచుకుంటే అది పరిమితమై ఉంటుంది. అదే ఆనందాన్ని ఇతరులకు పంచగలిగితే అదెంత ఉన్నతమైందో తెలియవస్తుంది.

ధ్యానశాస్త్రాన్ని ఇతరులకు బోధించడం ద్వారా, వారిలో ఎంతో శారీరక, మానసిక, బుద్ధిపరమైనా, ఆత్మపరమైన పరివర్తన తీసుకుని రావడం ద్వారా వారి జీవితాల్ని ఆనందభరితంగా మార్చగలం మరి మన జ్ఞానాన్ని మరింత సువిస్తారం చేసుకోగలం. కనుక ధ్యానశాస్త్రం బోధన ద్వారా ప్రతిఒక్కరూ తప్పకుండా అపరిమితమైన ఆత్మానందం… ఆత్మరంజనం పొందగలరు. బోధన అన్నది పిరమిడ్ మాస్టర్లకు మహా, మహా ఆనందం.

“సత్యం … మన అంతరాంతరాల ఆనందానుభూతి”

“నిత్యం” ఉండేదే “సత్యం”, ఒకప్పుడు వుండి ఒకప్పుడు ఉండనిదే “అసత్యం”.

అనిత్యం అన్నది అనుకూలంగా ఉంటే ఉపరితల ఆనందానుభూతిని ప్రసాదిస్తుంది. అనిత్యం అన్నది అననుకూలంగా ఉంటే దుఃఖానుభూతిని ప్రసాదిస్తుంది. అయితే సత్యం అనేది అంతరాంతరాల అనందానుభూతి.

ఎప్పుడూ వుండేదే సత్యం. సదా సాక్షీభూతంగా వుండే నేను అన్న పదార్ధమే ఎల్లప్పుడూ వుండే పరమసత్యం. సర్వ ఉపరితల అనుకూల, అననుకూల పరిస్థితులలో సదా సాక్షీభూతంగా వుండే “నేను” అన్న సత్యపదార్ధం పేరే ఆత్మ. ఆత్మ సత్యంలో జీవించడం ద్వారా మాత్రమే అంతరంగంలో విశిష్ట ఆనందానుభూతి కలుగుతుంది.

దేహ విషయ వాసనలతో మాత్రమే జీవించడం అన్నదే అసత్యం; అదే దుఃఖానికి కారణం. దేహాన్ని బౌతిక అవసరాలకు వినియోగిస్తూ, “నేను ఆత్మను” అని సదా ఎరుకతో జీవించడమే సత్యం… అంతరాంతరాల ఆనందానుభూతికి నిదర్శనం. మన చుట్టూ వున్న సకల ప్రాణికోటీ చైతన్యస్వరూపాలే అని ఎరుక కలిగి ఉండడమే సత్యంలో జీవించడం. సర్వ కర్మల ప్రక్షాళనకు మార్గం తన దగ్గరే ఉందని తెలుసుకుని తద్వారా సాధనాక్రమంతో తనను తాను నియోగించికోవడమే సత్యంలో జీవించడం. ఈ రకంగా అన్ని కోణాల నుంచి సత్యపదార్థాన్ని తెలుసుకుంటూ సత్యం పట్ల సరియైన అవగాహన పొందడం ద్వారా అంతరాంతరాల ఆనందానుభూతికి చేరువవుతారు. ఈ స్థితి పొందడం కేవలం దీక్షాయుత ధ్యాన సాధన ద్వారానే సాధ్యం…

“ఆత్మస్థైర్యం…మన సందేశం”

ఆత్మస్థైర్యం” అంటే మన పట్ల మనం స్థిరత్వం కలిగి వుండడం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి వ్యక్తులు తారసపడినా, ఏ ప్రాంతంలో విహరించినా… మొక్కవోని అంతరంగ స్థిరత్వంతో ముందుకు సాగుతూ చేపట్టిన పనిని సాధించడమే ఆత్మస్థైర్యానికి నిదర్శనం.

తలపెట్టింది ఒకటైతే… పరిస్థితులకు, బలహీనతలకు తలవంచి కార్యాచరణ నుంచి నిష్క్రమించడం, పలాయనత్వం చేయడం “ఆత్మస్థైర్యం” అనిపించుకోదు.

ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని దుర్ఘటనలు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా…తలపెట్టిన కార్యాన్ని ముందుకు నడిపిస్తూ ఆరోహణ క్రమంలో పయనించడమే ఆత్మస్థైర్యానికి సరియైన నిదర్శనం. ఇదే మాస్టర్లందరి ఏకైక సందేశం… ఆత్మస్థైర్యం కోల్పోరాదు…దీనులుగా ఉండరాదు… భీరులుగా ఉండరాదు. “క్లైబ్యం మా స్మ గమః పార్థ… క్షుద్రం హృదయదౌర్బల్యం” అన్నాడు కదా శ్రికృష్ణుడు.

“మిత్రత్వం … మన నిజ తత్వం”

ఎవ్వరూ శాశ్వత విరోధులు కారు; ఎవ్వరూ శాశ్వత అభిమానులు కూడా కారు. సమయ సందర్భాలను బట్టి విరోధులు మిత్రులుగా మారుతారు; మిత్రులు విరోధులుగా మారవచ్చు.

కేవలం పరిస్థితులను ఆధారం చేసుకుని ఎవరితోనూ విరోధం కూడదు. ఎందుకంటే “మమాత్మా సర్వభూతాత్మా” కదా. అంటే తాను ఏ ఆత్మస్వరూపుడుగా వున్నాడో అందురూ ఆ ఆత్మస్వరూపులే. తాను ఆత్మగా వుండి మరొక ఆత్మస్వరూపుడితో విరోధం విడ్డూరం. సిద్ధార్ధుడు బుద్ధత్వ ప్రాప్తి పొంది బుద్దుడై అందరితో మైత్రీభావం కలిగి మైత్రేయ బుద్దుడు అయ్యాడు. సకల జీవుల పట్ల, పశుపక్ష్యాదుల పట్ల, వృక్షాల పట్ల మైత్రీభావం కలిగివుండడమే… మన నిజ తత్వం. ఈ అద్భుత స్థితి మనం పొందాలంటే వున్న ఏకైక మార్గం ధ్యానమార్గం.

“నిరాడంబరత … మన సహజ లక్షణం”

“నిరాడంబరత” అన్నది అహంకార రహిత జీవితానికి నిదర్శనం.

“నిరాడంబరత” అంటే పరిమితమైన దుస్తులను ధరించడం, మనుష్యులకు దూరంగ వుంటూ ఓ మూల కూర్చోవడం కాదు. మనిషి సామాజికంగా, ఆర్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా బాహ్య ఆడంబరాలవైపు మొగ్గు చూపకుండా అంతరంగంలో నిరాడంబరత కలిగి ఉండడమే నిజమైన నిరాడంబరత.

బహిరంగ ప్రలోభాలకు తలవొగ్గక అంతరంగంతో మమేకమై ఉండడమే అసలైన నిరాడంబరత. ఒక మనిషి యొక్క విజయం నిరాడంబరతతోనే సాధ్యమవుతుంది. మన బాహ్య అహంకారాన్ని వదులుకోవడం కాదు. లోపల దాగున్న అహంకారాన్ని పూర్తిగా త్యాగం చేయడం నిజమైన నిరాడంబరత. ఈ రకంగా జీవన యాత్ర సాగించడమే ప్రతివ్యక్తి సహజ లక్షణం. నిరాడంబరత పిరమిడ్ మాస్టర్లకు వెన్నతో పెట్టిన విద్య.

“వినయం … మన పురాతన సంస్కృతి”

వినయం లేని విద్య పరిమళించదు. మనిషి వినయం లేకపోతే ఎంతటి గొప్పవాడైనా ఎప్పుడో ఒకప్పుడు అభాసుపాలు అవుతాడు.

ఎన్ని భౌతిక విద్యలు అభ్యసించినా, ఎన్ని ఆధ్యాత్మిక విద్యలు అభ్యసించినా వినయం లేకపోతే గౌరవం సంతరించుకోదు.

“విద్యా దదాతి వినయం”… నిజమైన విద్య ద్వారా మాత్రమే వినయం చేకూరుతుంది. ఎక్కడ నిజమైన విద్య లేదో అక్కడ వినయఫలం వుండదు. వినయం ద్వారానే సర్వులూ ఆకర్షింప బడతారు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనా అవిధేయతతో కూడుకున్నప్పుడు అందరికీ దూరమవుతాడు. ప్రతి పిరమిడ్ మాస్టర్ సదా వినయంతో సహజంగా చరిస్తాడు. వినయమే మాస్టర్ల యొక్క నిజమైన సంస్కృతి.

“సమస్త జీవకోటి … మన సంపూర్ణ బృహత్ కుటుంబం”

ఈ సమస్త విశ్వంలో సర్వప్రాణికోటి, సమస్త విలువల్ని సంతరించుకుంది. ఏ మనిషీ మరొక మనిషికి తక్కువ కాదు. ఏ ప్రాణీ మరొక ప్రాణి కన్నా హీనమైనది కాదు. సర్వజీవరాసులు ఉద్భవిస్తూ తమ తమ చైతన్య స్థితిని పెంచుకోవాలని నిరంతరం ప్రయత్నంలో వున్నదే. ఒక్కొక్క పరిస్థితిలో… తమ తమ చైతన్య స్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చుగాక… అన్నీ కూడా చైతన్యం విస్తరింపజేసుకోవడానికి నిరంతర ప్రయత్నంతో ముందుకు సాగుతూన్నవే… కనుక పరిమితమైన అవగాహనతో కొన్నింటిని తక్కువ చేయడం సరియైన విధానం కాదు.

ప్రతిఒక్కరూ, ప్రతి ప్రాణీ నిరంతరం ఈ విశ్వంలో తిరుగాడే ప్రయాణీకులే. అందురూ ఈ విశ్వకుటుంబంలో భాగస్వాములే. మనమంతా ఈ బృహత్ విశ్వకుటుంబానికి చెందినవారం. ఇటువంటి సహజ సిద్ధమైన స్థితిలో సదా విరాజిల్లాలంటే మనకున్న ఏకైక మార్గం ధ్యాన సాధన.