మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం

 

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన మౌలిక సిద్ధాంతం ..
ఆత్మవత్ జీవితాన్ని జీవించడం

ధ్యానం ద్వారా ఆత్మ జాగృతిని పొందిన మరుక్షణం నుంచీ .. మనం చేపట్టవలసిన ముఖ్యకార్యక్రమం .. ఆత్మశాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చెయ్యడం! ఆత్మశక్తి గురించిన పరిశోధనలు చేస్తూ .. ఆ అనుభవ జ్ఞానంతో ఆత్మవత్ జీవితాన్ని అత్యంత ఎరుకతో జీవించడం.

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన మౌలిక ప్రకృతి .. శాస్త్రీయ దృక్పధాన్నే సదా కలిగివుండడం

ఆత్మశక్తిస్వరూపులుగా జీవించే మనం .. నిజజీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన పట్ల, వ్యక్తి పట్ల ఆధ్యాత్మిక దృక్పథాన్ని కలిగివుండాలి. కర్మసిద్ధాంత అవగాహనతో ప్రతిక్షణం సాక్షీతత్వంతో అత్యంత నిశ్చలంగా జీవించాలి.

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన అంతర్గత శక్తి .. ధ్యానశక్తి

నిరంతర ధ్యానస్థితి వల్ల మనం పొందే అనంతమైన విశ్వశక్తి ఆవాహన ద్వారా మనం .. శక్తిస్వరూపుల్లా వెలగాలి! విశ్వశక్తి లోపమే సర్వ అనర్ధాలకూ మూలం కనుక ధ్యానం ద్వారా ఆ లోటును ఎప్పటికప్పుడు భర్తీచేసుకుంటూ ప్రాపంచిక, ఆధ్యాత్మిక పనులన్నింటినీ చక్కబెట్టుకోవాలి. జీవితాన్ని ప్రతిక్షణం ఒక పండుగలా సంబరాలు జరుపుకోవాలి!

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన గాఢమైన ఆశ ..

అంతర్ ప్రపంచాన్ని పరిశోధించడం

బాహ్య ప్రపంచానికి సంబంధించిన పనులను ఎరుకతో నిర్వహించుకుంటూనే .. సమయం దొరికినప్పుడల్లా ధ్యానసాధనలో మునిగిపోవాలి. అంతరంగ ప్రపంచాన్ని మరింత మరింతగా పరిశోధించుకుంటూ .. అనేకానేక సమాంతరలోకాల్లో విహరిస్తూ .. అక్కడి జ్ఞానాన్ని సేకరించుకుంటూ వుండాలి.

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మనలో దాగివున్న సామర్థ్యం .. సహజావబోధ

మన బాహ్య మరి అంతర ప్రపంచాల్లో మనకు ఎక్కడ ఎలాంటి సందర్భం ఎదురైనా .. ఆత్మశక్తి స్వరూపులం అయిన మనం .. మన సహజ అవబోధను అనుసరించి .. నిర్ణయాలు తీసుకుంటూ .. విజయపథంలో సాగిపోతూ ఉండాలి.

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన ప్రగాఢమైన కోరిక ..
యావత్ మానవజాతి యొక్క ప్రశాంతత

స్వీయ ఆత్మస్పృహతో జీవించే వారికే సకల ప్రాణికోటిలో ఉన్న సర్వాత్మ తత్త్వం అవగాహనకు వస్తుంది. అందుకుగాను మనం చేపడుతూన్న విస్తృత ధ్యాన జ్ఞాన శాకాహార ప్రచార తరంగాలు ఈ భూమండలాన్ని సర్వ మానవ సౌభ్రాతృత్వంలో నింపివేస్తాయి. అప్పుడే సకల మానవజాతి అంతా కూడా పరస్పర శ్రేయోకామనతో ప్రశాంత జీవనం గడుపగలుగుతుంది.

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”

మన ఉదాత్త ఆశయం ..
శాకాహార సదాచారాన్ని విశ్వవ్యాప్తం చెయ్యడం

మనలాగే ఈ సృష్టిలో ప్రతిఒక్క జీవి కూడా తన స్వంత కళ్యాణం కోసమే జన్మ తీసుకుంటుంది. ఈ మౌలిక సత్యానికి అనుగుణంగా సోదర జంతుజాల పరిరక్షణ బాధ్యతను చేపట్టిన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ .. శాకాహర ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన అతిముఖ్యమైన లక్ష్యం .. 
మనతో పాటు అందరి ఆత్మజ్ఞానప్రకాశం

సకల విశ్వానికే ప్రయోగశాలలాంటి ఈ భూమ్మీద ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క ప్రయోగం! ఈ ప్రయోగాల ద్వారా మనతో విజ్ఞానానికి అర్థం పరమార్థం దక్కుతుంది. అలాగే “వివిధ రకాలుగా వున్న ఆరోగ్య శాస్త్రాల ప్రయోగ ఫలితాలు కూడా సామాన్యులందరికీ చేరితీరాలి” అన్నలక్ష్యంతో విరివిగా ధ్యాన ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోంది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్!

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన అందరి ఐక్యవేదిక .. IFSS

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లోని అతి ముఖ్య విభాగం భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమ్మేళనం, IFSS. భావసారూప్యత కలిగిన వివిధ ఆధ్యాత్మిక సంస్థలనూ, ఆధ్యాత్మిక గురువులనూ, అధ్యాత్మిక శాస్త్ర బోధకులనూ, ఆధ్యాత్మికశాస్త్ర పరిశోధకులనూ దేశవ్యాప్తంగా గుర్తించి .. వారందరినీ ఒక ఐక్యవేదికపైకి తీసుకుని వచ్చి వారందరూ పరస్పరం ఎదగడానికి విశేషంగా కృషిచేస్తోంది IFSS. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనేక సమావేశాలను నిర్వహిస్తూ అద్భుతమైన జ్ఞానసంపదను అందరికీ అందజేస్తూన్న “PSSM – IFSS మాస్టర్ల బృందం” ఎంతైనా అభినందనీయమైనది!

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
మన అంతిమ స్వప్నం ..
ప్రపంచ ఆధ్యాతిక ప్రభుత్వ స్థాపన

ప్రజల కోసం .. ప్రజల ద్వారా .. ప్రజల నుంచి .. ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం .. “యథా ప్రజా .. తథా రాజా” అన్నట్లు సహజంగానే ప్రజాశక్తి సమూహాల యొక్క ఆత్మ ఎదుగుదలను బట్టి వుంటుంది. అందుకే జాగృత పరచబడిన ఆత్మలు .. ఉన్నత విలువలను కలిగిన ప్రభుత్వాలను ఎన్నుకుంటాయి కనుక .. ధ్యాన జ్ఞాన ప్రచారాల ద్వారా ఆత్మలను జాగృత పరచడమే మన పని!