మన దేశాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి

 

ఎందరో మహానుభావుల కలల సాకారమే “పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా”! మంచివాళ్ళు అందరూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కనుకనే అవినీతి, బంధుప్రీతి, అన్యాయం మరి హింసాప్రవృత్తులు ఈ రోజు విశృంఖలంగా రాజ్యం ఏలుతున్నాయి.

ఒకానొక ఆత్మజ్ఞాని .. ఒకానొక ఇంటి లోపలికి ప్రవేశిస్తే, మెల్లి మెల్లిగా ఆ ఇల్లంతా శక్తివంతం అయినట్లే .. ఒకానొక ఆత్మజ్ఞాని కూడా ఆసెంబ్లీలోకి కానీ, పార్లమెంటులోకి కానీ ప్రవేశిస్తే .. అవి కూడా దేవాలయాల్లాగా మారి శక్తివంతం అవుతాయి. క్రొత్త నీరు వస్తే .. పాత చెత్త నీరు బయటకు పోతుంది. ప్రపంచం అంతా ధర్మం పరిఢవిల్లాలి!

“అహింసా పరమో ధర్మః”: మగవాడు ఆడవాళ్ళనూ, తల్లిదండ్రులు పిల్లలనూ, మానవాళి అంతా జంతువులనూ హింసిస్తున్నారు. “అహింసే పరమధర్మం” అని ప్రతిఒక్కరూ ఎప్పుడు తెలుసుకుంటారో .. అప్పుడే ధర్మసంస్థాపన అన్నది జరుగుతుంది. ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.

“ఎదురు చూడడం” అంటే చేతులు ముడుచుకుని కూర్చోం! చేతులు కలిపి ధ్యానం చేస్తాం. ధ్యానం నుంచే అన్నీ వస్తాయి. “మహాత్మా గాంధీజీ” లాంటివారే ముఖ్యమంత్రిగా, ‘MP’ గా ‘MLA’ గా రావాలి! అదే మన తీర్మానం. దానికి మన ధ్యానశక్తిని తోడు వుంచుదాం. యోగుల మనస్సులో ఏదైతే మెదులుతుందో అది ఆస్ట్రల్‌గా నిర్మాణం జరిగి భౌతికంగా అవతరించి సామాన్య ప్రజలకు వాస్తవంగా ఆవిర్భవిస్తుంది.

ఎక్కడా హింస అనేది వుండకూడదు! ఎవ్వరూ హింసకు పాల్పడరాదు. మానవుడు ఏ ప్రాణినీ చంపకూడదు. మానవులంతా అమానువత్వంతో వున్నారు. అమానుషత్వం పోయి ” మానవత్వం ” సిద్ధించాలి. అమానుషత్వాన్ని చెరిపే శక్తి ఒక్క ధ్యానానికే వుంది. ధర్మవర్తనులు మరి అహింసాత్మకులు అయిన వారే రాజ్యపాలన చెయ్యాలి. ధ్యానం చేయకపోతే హింసా ప్రవృత్తి .. ధ్యానం చేస్తే అహింసా ప్రవృత్తి!

సమస్త మానవాళీ జంతువుల్ను హింసించి, పీడించి తింటున్నారు .. అది లేకపోతే పిరమిడ్ పార్టీ ఆవిర్భావించేది కాదు, పిరమిడ్ మాస్టర్ పుట్టి వుండేవాడే కాదు ; మానవులను భగవంతులుగా చేయడానికే పిరమిడ్ మాస్టర్లు పుట్టారు. పిరమిడ్ మాస్టర్ల సంఘటిత రాజకీయ ఏకీకృతమే “పిరమిడ్ పార్టీ”!

ప్రపంచం అంతా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వైపు చూసే రోజు త్వరలో వస్తుంది. అనాదిగా ఆధ్యాత్మిక వేత్తలు రాజకీయ రంగప్రవేశం చేసి దేశసేవలో విస్తృతంగా పాలుపంచుకున్నట్లు చరిత్ర చెపుతోంది. మనం మన దేహాన్ని ఎలా కాపాడుకుంటున్నామో .. అలాగే మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉంది. మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా తీర్చిదిద్దుకుంటున్నామో అలాగే మంచితో ఈ దేశాన్ని కూడా మనం తీర్చిదిద్దుకోవాలి.

మాంసాహారం తినేవాడు ఎవ్వరూ రాజకీయ పదవులు చేపట్టరాదు. రాక్షసప్రవృత్తితో కూడుకుని వున్న ఇలాంటి హింసాత్మకులు ప్రజలను ఏలడానికి సుతరామూ పనికిరారు. ఒక జీవిని రక్షించలేని వాడు దేశాన్ని ఏ రకంగా రక్షించ గలుగుతాడు? మూగ జీవుల్ని భక్షించేవాడు, మనల్నీ మన దేశాన్నీ కూడా చక్కగా భక్షించివేస్తాడు. కాబట్టి ఐదేళ్ళపాటు దేశాన్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునేటప్పుడు మనం ఎన్నో రకాలుగా ఆలోచించాలి!

వందల యేళ్ళుగా సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, అరబిందో, వీరబ్రహ్మేంద్రస్వామి లాంటి మహానుభావుల కన్న కలలు నిజంకావాలి అంటే ఆత్మజ్ఞానులు తప్పనిసరిగా రాజకీయాల్లోనికి రావాలి .. హింసలేని పాలన తేవాలి .. ప్రజలంతా తక్షణం ధ్యానాత్ములుగా ధర్మాత్ములుగా మారాలి!