“మహా కరుణయాగం”
రాజమహేంద్రవరం లో పత్రీజీ సందేశం
“డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ & గాడ్స్ ‘మానవత’ మరి ‘ఆధ్యాత్మికం’ అన్నవి రెండూ మానవజీవితానికి రెండు కోణాలు. ‘మానవత’ అంటే ‘అహింసతో జీవించడం’ .. ‘ఆధ్యాత్మికం’ అంటే ‘ఆత్మస్వరూపులుగా జీవించడం’. ఎవరైతే ఆత్మస్వరూపులుగా జీవిస్తారో వారిలో సహజంగానే మానవత వస్తుంది.”
“పులి ఒకానొక మేకను తింటూంటే క్రూరమృగం అంటాం. పులికి అది సహజమైన ఆహారం, కానీ మానవుడికి అది అసహజమైన ఆహారం. ఈ మానవ శరీర నిర్మాణం జంతువులను తినడం కోసం కాదు. ఇది కేవలం ఆకులు, ఫలాలు తినడం కోసమే ఏర్పడింది. ఎవరైతే జంతువులను, పక్షులను తింటున్నారో .. ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారో .. దయ, కరుణ లేకుండా అమానుషంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ అంతకంత అనుభవిస్తున్నారు.”
“‘అహింసా మహాకరుణ యాగం’ అన్నది ఈ రోజు మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో మొదలు పెట్టలేదు. అది అనాదిగే వస్తున్నదే. మనం ఒక్కరమే కాదు దీని గురించి మాట్లాడింది. బుద్ధి ఉన్న ప్రతివారూ దీని గురించే మాట్లాడుతాడు. బుద్ధి లేనివాడు మాట్లాడనే మాట్లాడడు.”
“30 సంవత్సరాల క్రితం నేనొక్కడినే చెప్పేవాడిని! ఇప్పుడు నాతోపాటు చెప్పేవారు కొన్ని లక్షలమంది ఉన్నారు. మై డియర్ ఫ్ర్ండ్స్! సత్యాన్ని గట్టిగా చెప్పాలి. మహాత్మాగాంధీ సత్యాన్ని గట్టిగా చెప్పాడు కాబట్టే ‘జాతిపిత’ అయ్యారు. ఆయన బ్రిటిష్‌వాళ్ళను తరిమికొడితే మనం మాంసాహారుల్ని శాకాహారులుగా మారుస్తాం. ఆయన చేసిన పని అది, మనం చేస్తున్న పని ఇది.”
“ప్రపంచం అంతా కొత్త యుగంలోకి వస్తోంది. అదే .. ‘శాకాహారయుగం’ .. ‘ధ్యాన యుగం’ .. ‘పిరమిడ్ యుగం’ .. మరి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన యుగం’ . “కౌరవులంటే హింసతో ఉండేవారు. పాండువులంటే అహింసతో ఉండేవారు; శ్రీకృష్ణుడంటే ఆత్మతత్త్వంతో ఉండేవాడు. మొత్తం మహాభారతం అంటే ఇదే. మూడే మూడు ముక్కలు. మనం కౌరవ జాతా? పాండవ జాతా? శ్రీకృష్ణ జాతా?”
“ప్రాధమికంగా జంతువులనుంచి వచ్చిన ఆత్మ మానవరూపంలోకి వచ్చినప్పుడు అది జంతువుగానే వ్యవహరిస్తుంది. అది సహజం కానీ ఒక వంద జన్మలు ఎత్తిన తరువాత కూడా ఇంకా జంతువులా ఉంటే ఆ ఆత్మపరిణతి ఇంకా పొందలేదు కదా! “జంతువుల నుంచి వచ్చిన ఆత్మ జంతుతత్త్వంగానే ఉంటుంది. కానీ మానవశరీరంలోనికి వచ్చిన తర్వాత క్రమక్రమంగా పరిణతి చెంది మానవ ఆత్మగా తయారు కావాలి కదా! శాకాహారం ద్వారా, అహింస ద్వారా!” తరువాత “అహింసా పరమో ధర్మః” అంటూ అందరిచే 20 నిమిషాలు ధ్యానం చేయించారు.”