మహా భాగ్యం
మనిషికి శారీరకపరం గా ఆరోగ్యమే మహాభాగ్యం.
మనిషికి మానసికపరం గా ప్రశాంతతే మహాభాగ్యం.
మనిషికి బుద్ధిపరం గా శాస్త్రీయ దృక్పథమే మహాభాగ్యం.
మనిషికి సామాజికపరం గా శాస్త్రీయ ప్రాణ మిత్రులుండటమే మహాభాగ్యం.
మనిషికి ఆధ్యాత్మికపరం గా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే మహాభాగ్యం.
మనిషికి అహారపరం గా రెండురోజుల కొకరోజు రెండుపూటలా రుచికరమైన తిండి వుండటమే మహాభాగ్యం.
అదే విధంగా రెండు రోజులకొకరోజు పూర్తి లంఖణం చేయడమే మహాభాగ్యం.
మనిషికి కుటుంబపరం గా పరస్పరానుకూల దాంపత్యం వుండటమే మహాభాగ్యం.
కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనమే మహాభాగ్యం.
మహాభాగ్యం అన్న పదానికి ఇవీ సరియైన అర్థాలు, సరియైన వివరణలు.
తనకు తాను చూసుకున్న తరువాత, ఇక ఒకరిద్దరికి ప్రతిరోజు కొంత సమయాన్నీ, కొంత శక్తినీ కేటాయించగలగడమే మహాభాగ్యం.
ఎన్ని కష్టాలూ, ఆపదలూ వచ్చినా ఎప్పటికప్పుడు సొంత కాళ్ళ మీద నిలబడ గలగడమే మహాభాగ్యం.
ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలనూ, చెట్లనూ పెంచగలగడమే మహాభాగ్యం.
రకరకాల పక్షులనూ, జంతువులనూ పోషిస్తూ, వాటిని సదా సంరక్షిస్తూ వుండగలగడమే మహాభాగ్యం.
చుట్టుప్రక్కల వున్న వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా వుంచగలగడమే మహాభాగ్యం.
మహాభాగ్యం అన్న పదానికి ఇవే సరియైన అర్థాలు – సరియైన వివరణాలు.
రోజుంతా కష్టపడిన తరువాత కొన్ని గంటలైనా సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం.
ప్రతిరోజూ ఒక క్రొత్త విద్యను, ఓ క్రొత్త కళను ఒకింతైనా అభ్యసించగలగడమే మహాభాగ్యం.
వీలైనంత ఎక్కువ సమయంలో, ప్రతిరోజూ, చక్కటి సునాదమైన సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం.
చక్కటి సంగీతానికి మైమరచి, అప్పుడప్పుడూ, నృత్యం చేయగలగడమే మహాభాగ్యం.
రోజుకో ఆట, అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం.
మహానుభావుల పుస్తకాలు చదవడమే మహా, మహాభాగ్యం.
రోజుకో గంట సజ్జనులతో గోష్ఠి చేయడమే మహాభాగ్యం.
రోజుకో గంట సేపు మౌనంగా వుండటమే మహాభాగ్యం.
నేర్చుకున్న విద్యలనూ, కళలనూ ఇతరులకూ నేర్పించటమే మహాభాగ్యం.
మహాభాగ్యం అన్న పదానికి ఇవీ సరైన అర్థాలు – ఇవీ సరియైన వివరణలు.
ఏ మనిషితోనైనా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడగలగటమే మహాభాగ్యం.
ఇంటిని పరిశుభ్రంగా వుంచుకోగలగడమే మహాభాగ్యం.
ధరించిన దేహాన్ని ప్రతిరోజు నిగనిగలాడుతూ వుంచుకో గలగడమే మహాభాగ్యం.
ప్రతి సూర్యోదయాన్నీ, ప్రతి సూర్యాస్తమయాన్నీ ప్రశాంతంగా తిలకించగలగటమే మహాభాగ్యం.
పౌర్ణమి రాత్రుల్లో ఆ యొక్క అద్భుత సౌందర్యాన్నీ, ప్రశాంతతనూ, ఏకాంతం గానూ మరి సామూహికం గానూ, అనుభవించగలగడమే మహాభాగ్యం.
నదీ స్నానాలూ, సముద్ర స్నానాలూ వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం.
నడి రాత్రుల్లో, నగర వీధుల్లో, నిశ్శబ్ధ స్థితుల్లో నిర్భయంగా సంచారం చేయగలగటమే మహాభాగ్యం.
చిన్న పిల్లలతో అన్నీ మరచిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం.
ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడమే మహాభాగ్యం.
మహాభాగ్యం అన్న పదానికి ఇవీ సరియైన అర్థాలు, ఇవీ సరియైన వివరణలు.