లక్ష్యాన్ని బట్టే .. జీవితగమనం

 

మానవ జీవిత సాఫల్యానికి .. “లక్ష్యం” అన్నది అత్యంత మౌలికమైన సాధనం! “చుక్కాని లేని నావ” దశ, దిశ లేకుండా కొట్టుకుపోతూ ఎప్పుడూ నడిసముద్రంలో మునిగిపోతుందో తెలియనట్లు “సుస్పష్టమైన లక్ష్యం లేని జీవితం” .. అగమ్యగోచరంగా, అస్తవ్యస్తంగా మారి నిష్ప్రయోజనకరంగా మిగిలిపోతుంది. అందుకే ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే “బాబూ! నీ లక్ష్యం ఏమిటి?” అని అడుగుతే చాలు!

లక్ష్యశుద్ధిని అలక్ష్యం చేసినప్పుడు .. ఇక జీవితమే ఉండదు. “ఏదో బ్రతికేద్దాం” అన్న నాసిరకపు లక్ష్యంతో జీవిస్తే ఆ జీవితం కూడా “ఏదో ఒకలా” చప్పగా సాగుతూ ఉంటుంది.

ఒకానొక విద్యార్థి “నేను డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడను కావాలి” అనుకుంటూ చదువు సాగిస్తే .. దానికి అనుగుణంగా అతనికి మంచి పాఠశాల, చక్కగా బోధించే ఉపాధ్యాయులు మరి పరస్పర సహకారాన్ని అందించే సహవిద్యార్థులు సమకూరుతూ ఉంటారు.

“ఆ ఏదో ఒకటి చదివి ఎలాగోలా పాస్ అవుదాం. ఏదో చిన్నదో, చితకదో ఉద్యోగం చేసుకుందాం” అనుకుంటే .. ఆ చదువు కూడా ఎలాగోలా నత్తనడకతో సాగి .. ఆ తరువాత పరంపరగా అతని జీవితం నత్తనడకగానే ఉంటుంది. మన లక్ష్యమే మన జీవితం .. మరి మన లక్ష్యాన్ని బట్టే మన జాతకం!

మన లక్ష్యాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. ఇతరుల వ్యక్తిగత లక్ష్యాలను బట్టి, మరి ఇతరుల ఆదేశాలను బట్టి, మన జీవితం ఎన్నటికీ ఉండజాలదు. బారిస్టర్ కోర్స్ చదవడానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిన గాంధీ గారు “నేను శాకాహారిగానే ఉంటాను” అన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే వారు ఇంగ్లాండ్‌లో కూడా శుద్ధ శాకాహారిగా తమ జీవితాన్ని గడిపారు.

“భారతదేశ స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసమే నేను పుట్టాను” అన్న మహాత్మాగాంధీ గారి జన్మ లక్ష్యానికి అనుగుణంగానే వారి జీవితగమనం సాగింది! చివరికి వారు తమ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుని “జాతిపిత”గా కీర్తించబడ్డారు.

లక్ష్యం స్థిరంగా ఉంటేనే .. జీవితం స్థిరంగా ఉంటుంది. “నేను ఒక బుద్ధుడిలా కావాలి” .. “నేను ఒక రమణ మహర్షిలా కావాలి” అన్న స్థిరమైన లక్ష్యంతో మనం ఉంటే .. ఆ దిశగానే మన జీవితం సజావుగా సాగుతుంది.

“నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడిని కావాలి” అన్న ఉన్నత లక్ష్యం మనకు ఉంటే .. దానికి తగినట్లుగానే సాధన మార్గాలు చేకూరతాయి. అద్భుతమైన ఆత్మవిజ్ఞానాన్ని తెలియజేసే పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి.

“ఈ భూమ్మీద ఉన్న చిట్టచివరి మనిషి కూడా శాకాహారి అయ్యేంత వరకు నేను జీవిస్తాను” అని నేను ఒక సుస్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాను. ఆ లక్ష్యానికి అనుగుణంగానే నా జీవితం సాగుతూ .. ఈ రోజు నా లక్ష్యం ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంది! గత ముప్ఫై సంవత్సరాలుగా అది తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ లోకకల్యాణ కారకంగా వెలుగుతోంది.

“మన సమయం .. ‘ధ్యానం’ చేసుకోవడానికీ .. మన బుద్ధి ‘శాకాహారి’ గా జీవించడానికీ .. మరి మన డబ్బు ‘పిరమిడ్‌లు’ కట్టుకోవడానికీ” అన్న లక్ష్యంతో సాగిన జీవితాలు .. లోకకల్యాణ కారకాలుగా నిలుస్తాయి!