జోడుగుర్రాల సవారీ
“ఈ భూమి మీద పుట్టిన మనం అంతా కూడా ఏకకాలంలోనే రెండు రకాల జీవితాలను జీవిస్తూ ఉంటాం.
ఒకటి : ‘శరీరవత్ ప్రాపంచిక జీవితం’ రెండు: ‘ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం’
“శరీరవత్ ప్రాపంచిక జీవితాన్ని హాయిగా గడపాలంటే మనకు .. భూదేవికి ఉన్నంత సహనం నిరంతరం ఉండాలి. సర్వదా సర్వత్రా సహనంతో అంటే `patience’ తో ఉండాలి .. లేకపోతే `patient’ గా మారిపోయే అవకాశాలు పొంచుకుని ఉంటాయి.
“సముద్రపు అలల వంటి మానావమానాలతో .. మరి సుఖదుఃఖాలతో .. కూడిన మన దైనందిన ప్రాపంచిక జీవితాన్ని జీవించడానికి మనం ఎంతో సహనాన్ని అలవరచుకోవాలి.
“కుటుంబంలో ఉన్న అందరితో కలిసి మెలిసి ఉంటూ .. ఉద్యోగ వ్యాపారాదులను నిర్వహించుకోవడంలో అపారమైన సహనాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం .. వాటి నుంచి అనుభవజ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుగలుగుతాం!
“అలాగే ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవించేటప్పుడు మనం ఎనలేని ‘శ్రద్ధ’ను కలిగి ఉండాలి.
“‘శ్రద్ధ’ అంటే ఏకాగ్రత! ఆధ్యాత్మిక విజ్ఞాన సముపార్జనలో, ధ్యానసాధనలో, శ్రవణంలో, స్వాధ్యాయంలో, సజ్జనసాంగత్యంలో మరి సేవలో అత్యంత శ్రద్ధను కలిగి ఉండాలి.”
“ఇదే మరి యోగేశ్వరులైన షిరిడీసాయి నాధులు మనకు ఇచ్చిన ‘శ్రద్ధ – సబూరి’ అన్న రెండు గొప్ప వరాలు! ” ‘ A Master of Meditation is a Master of Patience’ కనుక .. మనం ప్రాపంచిక జీవితం పట్ల సహనంతో మరి ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధతో ఉంటూ జోడుగుర్రాల సవారీ లాంటి మన రెండు జీవితాలనూ సరిసమానంగా జీవించాలి!