జీవుడు/దేవుడు .. మనమే
“బొమ్మ-బొరుసు” అన్నవి ఒకానొక నాణేనికి రెండు ముఖాలు! అలాగే “జీవుడు-దేవుడు” అన్నవి ఒకే ఒక జీవితానికి రెండు కోణాలు. “బొమ్మ-బొరుసు” కలిసినప్పుడే నాణేనికి విలువ ఉన్నట్లు .. “జీవుడు-దేవుడు” కలిసినప్పుడే మన జీవితానికి పూర్ణత్వం అనే విలువ సిద్ధిస్తుంది. ఈ పరమసత్యాన్ని ముండకోపనిషత్తు తెలియజేస్తుంది.
ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్యానాన్ని అన్యో
అభిచాకశీతి
“ఒకే చోట పుట్టిన రెండు బంగారు పక్షులు .. ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. అందులో క్రింది కొమ్మల్లో ఉన్నపక్షి .. తీపి – చేదు, పులుపు-వగరు, పండు-పచ్చి పళ్ళను తింటూ రకరకాల విన్యాసాలను చేస్తూంటే .. పై కొమ్మల్లోని పక్షి వాటన్నింటినీ ఒక సాక్షిలా చూస్తూ ఉంది.
“ప్రవర్తనలో తనకు భిన్నంగా ఉన్న ఆ పక్షి సంగతి తేల్చుకుందామని పై కొమ్మలకు వెళ్ళిన క్రింది కొమ్మల పక్షి .. ‘అక్కడ ఉన్నది నా ప్రతిరూపమే కానీ వేరొక పక్షి కాదు’” అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది!
అలాగే ఒకే పూర్ణాత్మ నుంచి జన్మ తీసుకుని .. జీవితం అనే వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్న “జీవుడు/దేవుడు” అన్న మనం కూడా జీవుడిగా దేహస్థితిలో రకరకాల కర్మవిన్యాసాలను చేస్తూ .. దేవుడుగా ఆత్మస్థితిలో వాటిని ఒక సాక్షిలా చూస్తూ ఉంటాం!
ఇలా ఏక కాలంలో ఒకే మనంగా జీవిస్తూన్న మన రెండు జీవితాలలోని “జీవవత్ కర్మపూరిత కోణం” బయటికి కనపడితే .. “సాక్షివత్ కర్మాతీత కోణం” మాత్రం బయటికి కనబడకుండా ఉంటుంది. మనం మాట్లాడే మాటలను మనమే వింటూన్నట్లు .. దేహస్థితిలోని జీవుడిలా మనం ఎలా జీవిస్తున్నామో .. ఏ పరమార్థం కోసం కర్మలను చేస్తున్నామో .. ఆత్మస్థితిలోని దేవుడిలాంటి మనకే తెలుస్తుంది.
ఈ సంగతిని మరచిపోయిన మనం .. జీవుడిలా మానవ జీవిత అనుభవాలను పొందే క్రమంలో ఒక్కోసారి అరిషడ్వర్గాలతో సమన్వయం పొందలేక చతికిలబడిపోయి .. మనలోని దైవత్వాన్ని మరిచిపోయి .. “దేవుడెక్కడ? .. దేవుడెక్కడ?” అంటూ పుణ్యతీర్థాలకు పోయి అక్కడ మన గురించి మనమే వెతుక్కుంటూ ఉంటాం!
ఈ గందరగోళం నుంచి బయటపడాలి అంటే .. ప్రతిక్షణం మనం ధ్యానసాధనలో ఉంటూ మనలోని దైవత్వంతో మమేకం కావాలి.
నిరంతర విద్యార్థిలాగా జీవన విధాన శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేస్తూ .. జీవితాన్ని హాయిగా అనుభవించాలి. ప్రాపంచికంగా “నేను అదీ”, “నేను ఇదీ” అన్న అజ్ఞానపు గుర్తింపులను ఒకింత వదులుకుని .. కళ్ళు రెండూ మూసుకుని ధ్యానం ద్వారా అంతరంగంలోకి ప్రయాణం చెయ్యాలి!
అక్కడ అజ్ఞాతవాసం చేసి స్వీయ ఆత్మయొక్క విరాట్ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ప్రతి క్షణం ప్రతి ఒక్కరి దగ్గరినుంచీ నేర్చుకుంటూ మన లెక్కప్రకారం మరి మన ఇష్టప్రకారం మనం జీవించాలి.
మన వల్ల అందరికీ మేలు జరిగే పనులు చేస్తూ ఒక మాస్టర్‌లా నడుచుకోవాలి!