జీవితం మనకు .. ఒక అద్భుత అవకాశం

 

ప్రతి ఒక్కరికీ వారి వారి జీవితం ఒక అద్భుత అవకాశం!

ప్రతి రోజూ మంచిపనులు చేయడం ఒక అవకాశం .. ప్రతి వ్యక్తికీ ధ్యానం చెప్పడం ఒక అవకాశం! ఒకవేళ ఆ వ్యక్తికి ధ్యానం తెలుసు .. మరి మనకంటే ఎక్కువ జ్ఞానం కూడా వుందనుకుందాం .. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకోవడం మనకు ఒక మంచి అవకాశం.

ఇలా ఏ మనిషి నుంచి అయినా ఏదో ఒక అవకాశం మనకు వస్తుంది! అది నేర్పించే అవకాశమైనా కావచ్చు .. లేదా నేర్చుకునే అవకాశమైనా కావచ్చు.

మీరందరూ నా దగ్గర నేర్చుకునే అవకాశం కోసం వచ్చారు .. మరి నేను మీకు నేర్పించే అవకాశం కోసం వచ్చాను. మీ అందరికీ ధ్యానం నేర్పించే అవకాశం వలన నాకు `పుణ్యం’ వస్తుంది .. మరి నేర్చుకునే అవకాశం వలన మన మన `జ్ఞానం’ రెట్టింపు అవుతుంది. మన దగ్గర ఉన్నది ఇతరులతో మనం పంచుకుంటే .. అది “పుణ్యం”! మన దగ్గర లేనిది మనం సముపార్జించుకుంటే .. అది “జ్ఞానం”! ఇలా ఎవరి అవకాశాన్ని వారు ఉపయోగించుకోవాలి.

సాధారణంగా .. మన కంటికి కనిపించే ఇతర వ్యక్తులు మనకన్నా తక్కువగానైనా వుంటారు, లేదా మనకన్నా ఎక్కువగానైనా వుంటారు, లేదా మనకన్నా తక్కువుగా వుంటే ఆ వ్యక్తికి మనం “ధ్యాన భిక్ష” పెట్టాలి.

మనకంటే ఎక్కువగా వున్న వ్యక్తి నుంచి మనం “జ్ఞాన భిక్ష” తీసుకోవాలి. ఇలా జీవితమంతా కూడా పుణ్యం సంపాదించడానికీ, జ్ఞానం పొందడానికీ ఉన్న గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ .. పుణ్యాన్ని సంపాదించుకుంటూ మరెంతో జ్ఞానాన్ని పొందేవారే .. “పిరమిడ్ మాస్టర్స్”!

మనం ఇతరుల నుంచి జ్ఞానాన్ని నిర్భయంగా నేర్చుకోవాలి .. మరి అలాగే మనం ఇతరులకు ధ్యానం నేర్పించేటప్పుడు ఎంతో వినయంతో నేర్పించాలి. మనం ఇరవై సంవత్సరాలు ధ్యానం చేసివుంటే, మన ప్రక్కవాడు రెండు వందల సంవత్సరాలు ధ్యానం చేసినవాడు అయివుండవచ్చు. అందుకే మనం ఇతరులకు ధ్యానం నేర్పించేటప్పుడు “వినయం”గా నేర్పించాలి .. మరి ఇతరుల నుంచి జ్ఞానం నేర్చుకునేటప్పుడు “వినయం”గా నేర్చుకోవాలి!

“నేర్చుకున్నది ఇసుక రేణువు అంత .. నేర్చుకోవలసింది కొండంత” అన్న పరమ సత్యాన్ని ప్రతి క్షణం ఎరుకలో ఉంచుకోవాలి!

ఒకానొకసారి బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళి “స్వామీ! మీరు అన్నీ చెప్పేసారు ఇంకా .. ఇక చెప్పడానికి ఏమీలేదు కదా?” అని కొనియాడాడు.

అప్పుడు బుద్ధుడు “ఆ చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకురా!” అన్నాడు.

ఆ శిష్యుడు కొన్ని ఆకులు తీసుకుని వచ్చాక .. “నీకు నేను చెప్పింది ఈ ఆకులంతే .. చెప్పాల్సింది ఇంకా ఆ చెట్టంత వుంది. అలాగే నాకు తెలిసింది కూడా ఇంతే.. మరి నాకు తెలియాల్సింది కూడా ఇంకా ఆ చెట్టంత వుంది!” అని చెప్పాడు.

ఇలాంటి మాటలనే “బుద్ధత్వపు మాటలు” అంటారు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా బుద్ధుళ్ళే! వారి నుంచి సదా బుద్ధత్వపు మాటలే వస్తాయి!