జయహో .. మహిళా ధ్యానశక్తి
ధ్యానం = పార్వతీదేవి (1) + సరస్వతీ దేవి (4) + లక్ష్మీ దేవి (8)
“పార్వతీదేవి” అంటే “ఆదిశక్తి” అంటే “విశ్వమయ ప్రాణశక్తి”
ధ్యానం శ్రద్ధగా చేస్తూ, చేస్తూ ఉంటే మనకు అపారంగా విశ్వమయప్రాణశక్తి వస్తుంది
విశ్వమయప్రాణశక్తితో పరిపుష్టం అయిన మనం
“పార్వతీ దేవి” లా మహా శక్తి స్వరూపులం అవుతాం
“సరస్వతీ దేవి” అంటే ఆత్మజ్ఞానం
1) చదువులు 2) కళలు 3) బుద్ధి 4) పరలోక జ్ఞానం ..
ఈ “నాలుగు” కలిస్తేనే “ఆత్మజ్ఞానం”
ధ్యానంలో విశ్వమయప్రాణశక్తితో పునీతులం అయిన మనకు
అన్నిరకాల చదువులూ చక్కగా వంటబడతాయి
చతుషష్ఠి కళలల్లో నిష్ణాతులం అవుతాం
బుద్ధి అపారంగా వికసిస్తుంది .. మరి అనుభవజ్ఞానంతో పరిపుష్టమవుతాం
వెరసి మనం “సరస్వతీ దేవి”లా ఆత్మజ్ఞానవంతులమై వెలుగుతాం
అప్పుడే మన దగ్గరికి “లక్ష్మీదేవి” నడిచి వస్తుంది.
“లక్ష్మీ దేవి” : అంటే అష్టైశ్వర్యాలు .. “అష్టలక్ష్ములు”
అని కొంత ప్రాపంచికంగా
“ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి”
అనుకున్నా
మరి ఆధ్యాత్మికంగా, సరియైన విధంగా, అన్వయించుకుంటే .. “అష్టసిద్ధులు”
“అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ”
ధ్యానంలో మనం విశ్వమయప్రాణశక్తితో సంపూర్ణంగా పునీతులమై “పార్వతీ దేవి” లా వెలుగుతూ
చదువులు, కళలు, బుద్ధి మరి ఆత్మజ్ఞానాలతో పరిపుష్టమై “సరస్వతీ దేవి” లా విలసిల్లుతాం
అప్పుడిక మనకు “లక్ష్మీ దేవి” రూపంలో “అష్టసిద్ధులు” కరతలామలకం అవుతాయి
ఒక్కొక్క సిద్ధి మనకు ఒక్కొక్క ఐశ్వర్యాన్ని అందిస్తుంది:
1) “అణిమ”: చిన్నగా .. అణుమాత్రంగా అయిపోయి
సూక్ష్మరూపంలో సూక్ష్మశరీరంతో ఈ సృష్టి అంతటా తిరుగగలుగుతాం
2) “మహిమ”: సూక్ష్మశరీరం పెద్దగా .. బ్రహ్మాండంగా అయిపోయి
ఈ సకల చరాచర సృష్టి అంతా మనమే నిండి ఉండగలుగుతాం
3) “లఘిమ”: సూక్ష్మశరీరం ద్వారా తేలికగా .. దూది పింజెలా అయిపోయి
నీళ్ళ మీద కూడా హాయిగా నడిచి వెళ్ళగలుగుతాం
4) “గరిమ”: సూక్ష్మశరీరాన్ని కానీ శరీరంలోని ఏ భాగాన్నయినా మనంతట మనమే
.. ఆంజనేయస్వామి తన తోకను బరువుగా చేసుకుని
భీమసేనుడిని నిలువరించినట్లు .. బరువు చేసేసుకుంటాం
5) “ప్రాప్తి”: ఎన్నెన్నో జన్మలుగా మన ఆత్మ చేస్తోన్న ప్రయాణం వల్ల
మనం సంపాదించుకున్న పుణ్యాలన్నీ ఒక్కొక్కటిగా మన జీవితంలోకి
ఫలాల రూపంలో సజావుగా వచ్చి చేరుతూంటాయి
6) “ప్రకామ్య”: ఆత్మశక్తితో మరి ఆత్మజ్ఞానంతో పరిపుష్టులమైన మనం సర్వహిత పరంగా
ఏది కావాలని కోరుకుంటే దానిని క్షణాలలో నెరవేర్చుకోగలుగుతాం
7) “ఈశత్వ”: అందరినీ పరిపాలించడం! .. అంటే మన మాటకు విలువ పెరిగి
అది “మంత్రం” లా మారి దానిని అందరూ గౌరవిస్తారు!
8) “వశిత్వ”: అందరూ మనకు వశం అవుతారు! మనం చెప్పిన మాట వింటూ
చక్కటి లోకకళ్యాణ కార్యక్రమాలలో మనకు తమ వంతు సహాయం అందిస్తూ ఉంటారు!
ధ్యానం = పార్వతీ దేవి + సరస్వతీ దేవి + లక్ష్మీ దేవి
ధ్యానం లేకపోతే
పార్వతీ దేవీ లేదు .. పరంపరగా సరస్వతీ దేవి లేదు .. మరి లక్ష్మీ దేవి అంతకన్నా లేదు
వెరసి జీవితమంతా అగమ్య గోచరం మరి సకల దుఃఖాలమయంగా ఉంటుంది
కాబట్టి “ధ్యానం” ఇతోధికంగా చేద్దాం
“పార్వతీ దేవి” లా శక్తి స్వరూపులం అవుదాం
“సరస్వతీ దేవి” లా ఆత్మజ్ఞానంతో విలసిల్లుదాం
“లక్ష్మీ దేవి” లా అష్టసిద్ధులతో తులతూగుదాం
ఇదే మరి “మహిళా ధ్యానమహాచక్రం – I” సందర్భంగా ..
2019 మొత్తం సంవత్సరానికి సంబంధించిన PSSM యొక్క మహా సందేశం!
“జయహో ధ్యానశక్తి”
“జయహో ధ్యానమహిళాచక్రం”
జయహో పార్వతీదేవి! జయహో సరస్వతీ దేవి!! జయహో లక్ష్మీ దేవి !!!