చీకటి బ్రతుకు – వెలుతురు బ్రతుకు
“మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం” అని తెలియనివాళ్ళు ఎన్‌లైటెన్‌మెంట్ లేనివాళ్ళు, చీకటి మనుషులు. “తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు” అని తేలుసుకున్నవాళ్ళే ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్.
మనం పుట్టే ముందు మన పుట్టుకను మనమే ఎన్నుకుని వచ్చాం. మన లైఫ్ యొక్క ఛాలెంజెస్‌నూ మనయొక్క సమస్యలనూ, మన జీవిత సమస్యలను మనమే ఎన్నుకుని వచ్చాం. మన జీవిత వాస్తవాలకు మరెవ్వరూ కారకులు కారు. మన జీవిత వాస్తవాలకు మనమే కారకులం. మన స్వంత ఇచ్ఛతో మనం ఈ జన్మలోకి చేరాం. కనుక అలాగే పుట్టిన తరువాత కూడానూ.
మనం ఏ ఏ విధాలుగా ఎవరెవరితో వ్యవహరిస్తూంటామో ఆ యా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుతూ వుంటాం. కనుక మన వాస్తవానికి, క్షణక్షణం, మనమే కర్తలం, మనమే సృష్టికర్తలం. కనుక, “వాస్తవం ఇలా వుంది; అలా వుంది, అతను నన్ను పాడు చేశాడు, నా వాస్తవానికి అతను కారకుడు”. అని అన్యుల మీద నింద మోపడం అనేది ఎన్‌లైటెన్‌మెంట్ లేని వారి స్థితి. తమ స్థితిగతులకు తామే కారకులం అని తెలుసుకుని ఎప్పటికప్పుడు నిందని గానీ, స్తుతిని గానీ తమ మీద తామే మోప్కునేవారే ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్.
తమకు కలిగిన హానికి వేరొకడిని నిందించేవారు, తమకు కలిగిన లాభాలకి వేరొకరిని స్తుతించేవాళ్ళు ఎన్‌లైటెన్డ్ కానే కాదు. ఎవరి కర్మలను వాళ్ళే అనుభవిస్తుంటారు. కనుక ” మనం అనుభవించే ఫలితాలు మన కర్మఫలితాలు” అనే ఒక్కగానొక్క అవగాహన కలిగి వుండి ఆ విధంగా సదా ఉన్నవాళ్ళే ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్. అంతేకానీ ప్రతిదానికి కూడానూ ఇతరుల మీద నింద మోపుతూ ఉండేవారు, ఎంతమాత్రం కూడా ఎన్‌లైటెన్‌మెంట్ లేనివాళ్ళు.
ప్రపంచంలో తిరుగులాడుతున్నాకూడానూ ప్రపంచానికి అంటకుండా ఉండేవాళ్ళే ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్.”ప్రపంచంలో తిరుగుతూన్నాం కదా” అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడానూ అంటబడి వుండటం అనేది ఎన్‌లైటెన్‌మెంట్ కాదు.
“తామరాకు మీద నీటిబొట్టు” లాగా ఎవరితో వున్నా కూడా”, ‘వున్నాం’ కానీ ‘అంటి వుండ’ లేదు” అన్న పరిస్థితి కలిగి వున్నవాళ్ళే ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్. బంధాలలో ఇరుక్కుని కనబడిన ప్రతిదానితో, వున్న ప్రతిదానితో విడదీయలేని ముడి కలిగి వుండడం అనేది వెలుగుకూ, దివ్యజ్ఞానానికి, దివ్యప్రకాశానికీ, ఎన్‌లైటెన్‌మెంట్‌కూ పూర్తి విరుద్ధం.
ఎందులో అయిన ఉండవచ్చు కానీ దేనితోనూ ముడిపడి ఉండరాదు; ముడిపడిపోతే ఆ ముడి తీయడం చాలా కష్టం. సరిగ్గా ముడి తీయడం చేతకాకపోతే ఆ ముడి గట్టి పడిపోతుంది.అంతేకానీ అది, ఆ ముడి విడివడదు.
ప్రతిదానితో ఓ అనుబంధం కలిగి వున్నామే కానీ ముడిపడి ఉండవద్దు. ఆ ముడిపడి ఉండడమే ‘చీకటి బ్రతుకు’ అంటే. దేనితోనూ ముడిపడి ఉండకుండా ఉండడమే ‘వెలుతురు బ్రతుకు’ అంటే.